Pages

Tuesday, September 11, 2012

బతుకుబాట


ప్రత్తిపాడులో నివసించే కనకమ్మకు, సత్తెయ్య ఏకైక సంతానం. లేకలేక పుట్టిన కొడుకని అపురూపంగా పెంచింది. వాడికి అయిదేళ్ళు తిరగకుండానే తండ్రి హఠాత్తుగా కాలం చేయడంతో, తల్లివాణ్ణి మరింత గారాబంగా చూసుకోసాగింది. సత్తెయ్య స్వతహాగా మంచివాడేకానీ, చుట్టూ చేరిన దుర్వ్యసనపరులైన స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు పెడుతూ, ఉన్న కాస్త ఆస్తిని కర్పూరంలా కరిగించసాగాడు.
 
తల్లి హితబోధలు వాడి తలకెక్కేవి కావు. వాడికి ఇరవయ్యేళ్ళు వచ్చే సరికి, కొడుకు ఎలా బ్రతుకుతాడో అన్న దిగులుతో కనకమ్మ కూడా కన్నుమూసింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఉన్న ఆస్తి, ఇల్లు మొత్తం దుబారాగా ఖర్చు పెట్టి కట్టు బట్టలతో మిగిలాడు సత్తెయ్య. వాడికి ఎలా బతకాలో తోచిందికాదు. ఉన్న ఊరిలో అడుక్కు తినలేక పుట్టెడు దిగులుతో పొరుగూరు బయల్దేరాడు.
 
అక్కడ కూడా వాడికి ఆకలి తీరేంతగా మెతుకు పుట్టలేదు. ఆకలితో, నీరసంతో ఊరొదిలి బయల్దేరాడు. ఇలా బతికేకన్నా చనిపోవడమే మంచిదన్న ఆలోచన వచ్చింది వాడికి. దారిలో ఒక చింతచెట్టు కింద కూర్చుని చిల్లర లెక్క పెట్టుకుంటున్న ముసలి అవ్వ, సత్తెయ్యను చూసి చెట్టు నీడకు రమ్మన్న ట్టుగా చేయి ఊపింది. వాడు, ఆమెను సమీపించగానే అవ్వ, ‘‘ఏమిటి, నాయనా!
 
మిట్ట మధ్యాహ్నం పూట ఎరట్రి ఎండలో తిరుగుతున్నావు?'' అంటూ వాడిపోయిన వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, ‘‘ఇవిగో, ఈ రెండు సీతాఫలాలు తిను,'' అంటూ పక్కనవున్న బుట్టలోంచి పళ్ళు తీసి ఇచ్చింది ఆప్యాయంగా. సత్తెయ్య పళ్ళు తీసుకోవడానికి సంశ యిస్తూ, ‘‘నా దగ్గర అణా డబ్బులు కూడా లేవే!'' అన్నాడు నీరసంగా.

‘‘పోనీలే నాయనా! డబ్బులు వద్దు. నా మనవడివంటి వాడివి, తీసుకో!'' అన్నది అవ్వ. సత్తెయ్య రెండు పళ్ళూ తిని, అవ్వ ఇచ్చిన మంచి నీళ్ళు తాగాడు. అవ్వ కాసేపు తనలో తను ఏదో గొణుక్కుని, ‘‘చూడు నాయనా, నాకు ఎనభై ఏళ్ళు నిండాయి. కొడుకులూ, మనవలూ అందరూ నా ముందే, ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయూరు. నాక్కూడా పిలుపు వచ్చేవరకూ బతకాలిగదా! అందుకే ఈ పళ్ళ మ్ముకునే బతుకుబాట పట్టాను!'' అంటూ బుట్ట నెత్తిన పెట్టుకుని, కర్ర ఊతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
 
సత్తెయ్య, ఆ ముసలవ్వకు బతుకు మీద వున్న ఆశకు ఆశ్చర్యపడుతూ ముందుకు సాగి, ఒక చిట్టడవిలో నడవసాగాడు. కొంత దూరం నడిచాక హఠాత్తుగా ఒక చెట్టు మీది నుంచి విరిగిన కొమ్మలు నేలమీద పడడం చూసి, వాడు తల పైకెత్తి చూశాడు. ఒక పన్నెండేళ్ళ కురవ్రాడు కొమ్మలు నరుకుతూ కనిపించాడు. వాణ్ణి చూసి జాలిపడిన సత్తెయ్య, ‘‘ఏరా, అబ్బీ! ఇంత చిన్న వయసులో ఇంత బండ చాకిరీ ఎందుకురా, నీడపట్టున ఇంటి దగ్గర వుండక,'' అన్నాడు.
 
కురవ్రాడు కొమ్మల్లోంచి తలవంచి సత్తెయ్య కేసి చూస్తూ, ‘‘అయ్యూ! ఇంటి దగ్గర కూర్చుంటే తిండి ఎవరు పెడతారు. ఈ కట్టెలమ్ముకున్న పైసలతోనే, నాకు ఇంత తిండి దొరుకుతుంది. అమ్మా, అయ్యూ లేరు. కష్టపడి నా పొట్ట నేనే పోషించుకోవాలి,'' అన్నాడు. ఆ జవాబు సత్తెయ్య మనసును ఎంత గానో కలవరపరిచింది. కడుపు నింపుకోవడం కోసం కష్టపడుతూన్న మూడుకాళ్ళ ముస లవ్వ, అనాధ బాలుణ్ణి గురించి ఆలోచన రాగానే, తన దీనస్థితికి తనే కారణమన్న నిజం వాడికి తెలిసివచ్చింది.

వెంటనే వాడు వెనక్కు తిరిగి తన ఊరు దారిపట్టి, తిన్నగా ఊరుపెద్ద పరాంకుశం ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంటి వసారాలో కూర్చుని వున్న పరాంకుశం, సత్తెయ్యను చూస్తూనే, ‘‘ఏరా, సత్తెయ్యూ, ఏమిటి సంగతి?'' అని అడిగాడు. సత్తెయ్య, ఆయనకు రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టి, ‘‘అయ్యూ, మీరు మా అయ్య నెరుగుదురు.
 
ఆయన ఇచ్చిపోయిన కొద్ది ఆస్తినీ, బుద్ధిమాలిన వ్యసనాలకు ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు పొట్టపోసుకునేందుకు, మీరు ఏ కూలీనాలీ పనులిప్పించినా శ్రమపడి చేస్తాను,'' అన్నాడు. వాడి మాటలకు పరాంకుశం చిన్నగా నవ్వి, ‘‘ఆ కూలీనాలీ పనులు కావాలను కున్నప్పుడల్లా దొరకవురా, సత్తెయ్యూ! నీలో ఇలాంటి మంచి మార్పు కోసం, మీ అమ్మ ఎంతగానో ఆశపడింది. నీకు నిజంగా సొంతాన కష్టపడి బతకాలన్న ఆలోచనవచ్చినప్పుడు, నీ పరం చెయ్యమని కొంత డబ్బూ, రెండెకరాల పొలం, నా స్వాధీనంలో వుంచింది. కొంచెం ఆగు!''
 
అంటూ ఇంటిలోపలికి పోయి, డబ్బు సంచీ, పొలానికి సంబంధించిన కాయితాలూ తెచ్చి, సత్తెయ్యకిచ్చాడు. సత్తెయ్య దాన్ని తీసుకుని గ్రామ పెద్దకు దణ్ణం పెట్టాడు. అప్పుడు గ్రామపెద్ద, ‘‘సత్తెయ్యూ, నీలో మంచి మార్పు రాగలదనే మీ అమ్మ ఆశ, ఈ రోజు నిజమయింది. పదిమందిలో పరువుగా బతకాలన్న పట్టుద లతో మంచిమార్గంలో కష్టపడి పనిచేశావంటే మీ అమ్మ ఇచ్చిన ఈ ఆస్తిని పదింతలు చేయగలవు.
 
నువ్వే నలుగురికి బతుకు తెరువు చూపగలవు. మొదట కష్టపడి బత కడం నేర్చుకో,'' అన్నాడు. సత్తెయ్య గ్రామపెద్దకు మరొకసారి దణ్ణం పెట్టి, తల్లి ముందుజాగ్రత్తకు సంతోషిస్తూ, ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పు కుంటూ, కష్టపడి పనిచేస్తూ పదిమందిలో మంచి పేరుతో బతకాలన్న దృఢనిర్ణయంతో అక్కడినుంచి ఇంటిదారి పట్టాడు.

No comments:

Post a Comment