Pages

Tuesday, September 11, 2012

స్వార్థంలో నిస్వార్థం


పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు స్వార్థం కోసం ఇలా కష్టపడుతున్నావో, లేక నిస్వార్థ చింతనతో ఇంతగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు.
 
అయితే, లోక వ్యవహారాలను నిశితంగా పరిశీలించి చూసినట్టయితే స్వార్థం కేంద్రబిందువు గానే మానవులందరూ ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. నిస్వార్థం, పరార్థం, పరులహితం ఇవన్నీ పైపై తొడుగులుగా, అమాయకులను మభ్యపెట్టడానికి నయవంచకులు వాడే మాట లుగా మాత్రమే కనిపిస్తాయి.

ఇందుకు ఉదాహరణగా సజీవుడనే వైద్యుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,'' అంటూ ఇలా చెప్పసాగాడు: విరూపదేశంలోని రసపురమనే చిన్న పట్టణంలో ఉండే రత్నాంగుడనే వ్యాపారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళిళై్ళ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. చివరివాడు సజీవుడికి ఇరవై ఏళ్ళొచ్చినా వ్యాపారమంటే ఆసక్తిలేదు సరికదా-అడిగినవారికి లేదనకుండా ధనసాయం చేసేదయూ గుణం ఉంది.
 
పిన్నలూ, పెద్దలూ అందరూ అతడితో స్నేహంచేసి నాలుగు మంచి మాటలు చెప్పి డబ్బడిగి తీసుకువెళ్ళేవారు. అది ఇంట్లో ఎవరికీ నచ్చేదికాదు. కొడుకునెలా మార్చాలా అని రత్నాంగుడు దిగులు పడితే, పెళ్ళి చేస్తే మార్పురావచ్చునని భార్య చెప్పింది. విషయం తెలిసిన రత్నాంగుడి స్నేహితుడొకడు, ‘‘సజీవుడిది జాలిగుండే కాని లోకజ్ఞానం లేదు.
 
నా కూతురు మనోరమకు జాలిగుండె, లోకజ్ఞానంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి. ఆమెతో పెళ్ళి జరిపిస్తే మీవాణ్ణి దారిలో పెడుతుంది,'' అన్నాడు. ఆ విధంగా త్వరలోనే మనోరమ సజీవుడి భార్య అయింది. తండ్రి మాటలు నిజం చేస్తూ ఆమెపెళ్ళయిన కొన్ని రోజులకే భర్తను కొంగున ముడేసుకుంది. ఒక రోజున భర్తతో, ‘‘నువ్వు మంచి మనసుతో దానాలు చేస్తున్నా, అవి పుచ్చుకున్నవారిలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని ఇంట్లో అంతా అంటున్నారు.
 
అది నిజం కాదని రుజువు చెయ్యి. లేదా నీ పద్ధతి మార్చుకుని ఇంట్లోవారిని సంతోషపరుచు,'' అన్నదామె. సజీవుడది సవాలుగా తీసుకుని, ముందుగా సంజయుడింటికి వెళ్ళాడు. అప్పుడు సంజయుడు తన ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు. సజీవుణ్ణి చూడగానే, ‘‘నువ్విచ్చిన డబ్బుతో చాలా కాలం తరవాత నిన్ననే మా ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం.
 
మేమంతా బావున్నాం కాని మితిమీరి తిన్న మా నాన్నకూ, నా చిన్న కొడుక్కూ అజీర్ణం చేసింది. వైద్యుడు మందిస్తే అబ్బాయికి నయమయింది కాని, నాన్నకింకా తగ్గలేదని మూడు రోజులు కటికలంఖణాలు చేయమన్నాడు వైద్యుడు.

నాన్న ఉక్రోషంతో డబ్బిచ్చిన నిన్నూ, పిండి వంటలు చేయించిన న్నూ నోటి కొచ్చినట్టు తిడుతున్నాడు,'' అన్నాడు దీనంగా. ఇంట్లో వాళ్ళ మాట నిజమయిందని నిరుత్సాహపడినా, అందరి విషయంలోనూ అలాగే జరగదన్న నమ్మకంతో, సజీవుడు అక్కడి నుంచి సుగ్రీవుడింటికి బయలుదేరాడు. గుమ్మంలోనే ఆ ఇంటివాళ్ళ తిట్లు వినిపించాయి.
 
జరిగిందేమిటంటే-కూతురికీవేళ పెళ్ళిచూపులని నిన్ననే సుగ్రీవుడతణ్ణి నూరు వరహాలడిగి పట్టుకెళ్ళాడు. ఈ రోజు అతడి కూతురికి ఒళ్ళెరుగని జ్వరం వచ్చింది. చూడ్డానికి వచ్చిన మగపెళ్ళివారు పిల్లరోగిష్టిదని చిరాకు పడి వెళ్ళిపోయూరు. సంబంధం మంచిదనీ, సజీవుడి డబ్బు అందిన వేళ అచ్చిరాకనే అది తమకు కాకుండా పోయిందనీ ఇంట్లోవాళ్ళు తిట్టుకుంటున్నారు.
 
వెనక్కు తిరిగిన సజీవుడు మరో నాలుగిళ్ళకు వెళితే అన్ని చోట్లా అదే పరిస్థితి. ఏకారణంవల్లనైతేనేం, తన సాయం పొందినవారెవ్వరూ సంతోషంగా లేరని గ్రహించి సజీవుడు ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పి, ‘‘స్నేహితులను సంతోషంగా ఉంచడానికి నాది సరైన పద్ధతి కాకపోతేనేం? నావల్ల వారి అవసరాలు తీరుతున్నాయి. అంతకంటే మంచి పద్ధతి ఉంటే చెప్పమను. తప్పక అనుసరిస్తాను,'' అన్నాడు. మనోరమ వెంటనే, ‘‘అయితే నేను చెప్పినట్టు చెయ్‌.
 
మనిషికి నిజమైన సంతోషాన్నిచ్చేది ఆరోగ్యం. ఆరోగ్యం లేనివాడికి ఎన్ని సంపదలున్నా సంతోషముండదు. నీ స్నేహితులకూ, తెలిసినవారికీ నిజమైన సుఖసంతోషాలివ్వాలనుకుంటే నువ్వు వైద్యం నేర్చుకో. ఉన్నవారివద్ద డబ్బు తీసుకో. లేనివారికి ఉచితంగా వైద్యం చెయ్‌,'' అన్నది. ‘‘వైద్యం నేర్చుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుందికదా?'' అన్నాడు సజీవుడు.
 
‘‘బృహదరణ్యంలో ఆసవుడనే తపస్వి అర్హతగల శిష్యుడికి ఒక్క సంవత్సరంలో వైద్యం నేర్పగలడట. నువ్వు అక్కడికి వెళితే తొందరగా వైద్యుడివికాగలవు,'' అన్నది మనోరమ. సజీవుడు అప్పటికప్పుడే బయలుదేరి బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుణ్ణి కలుసుకున్నాడు. ఆయన అతణ్ణి శిష్యుడిగా స్వీకరించి ఏడాదిలో వైద్యశాస్ర్త పారంగతుణ్ణి చేశాడు.

విద్యాభ్యాసం పూర్తయ్యూక ఆసవుడతడితో, ‘‘వైద్యశాస్ర్తంలో ప్రపంచంలో ఏ వైద్యుడికీ తెలియని చికిత్సావిధానాలు నీకు నేర్పాను. కానీ, మందులకులొంగని జబ్బులింకా కొన్ని ఉన్నాయి. వాటిని నయం చేయగల మంత్రాలను రూపొందించి గ్రంథస్థం చేశాను. సేవాదీక్షతో నిస్వార్థంగా వైద్యం చేసేవాడికే ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉంటుంది. నీకా గ్రంథం పొందే అర్హత ఉన్నదని నా నమ్మకం.
 
అది రుజువైనప్పుడు నీకు ఎవరో ఒకరు నా పిలుపు అందజేస్తారు. అప్పుడు వచ్చావంటే ఆ గ్రంథాన్ని ఇస్తాను,'' అన్నాడు. సజీవుడు గురువుకు పాదాభివందనం చేసి, రసపురానికి తిరిగి వచ్చి జరిగింది భార్యకు చెప్పాడు. ఆమె చెప్పిన ప్రకారం పేదలకు ఉచితంగానూ, కలిగినవారికి హెచ్చుమొత్తం తీసుకుంటూనూ వైద్యం చేయసాగాడు. ఒకసారి ఒక సాధువు సజీవుడి ఇంటి ముందు, ‘‘భిక్షాందేహి'', అనబోయి సజీవుడొక పేదరోగిని శ్రద్ధగా పరీక్షించడం గమనించి ఆగాడు.
 
అంతలో ఆ ఇంటి ముందు ఆగిన గురప్రు బగ్గీలోంచి దిగిన ఒక భాగ్యవంతుడు సజీవుడి వద్దకు వెళ్ళి, ‘‘వైద్యోత్తమా, తమరు కోరిన ధనమిస్తాను. ముందు నన్ను పరీక్షించండి,'' అన్నాడు దర్పంగా. సజీవుడాయన్ను ఒకసారి తేరిపారజూసి, ‘‘కోరిన ధనమివ్వగలిగితే తప్పక తీసుకుంటానుగానీ, చికిత్సకు ముందు వెనకలు డబ్బుతో కాక, రోగాన్ని బట్టి నిర్ణయించాలి. నీదంత ప్రమాదకరమైన జబ్బు కాదని చూడగానే తెలిసింది.
 
నీవంతు రాగానే నిన్ను నేనే పిలుస్తాను. అంతవరకు ఆ పక్కనే కూర్చో,'' అన్నాడు. భాగ్యవంతుడు వెళ్ళి అరుగు మీద కూర్చుంటూండగా, సజీవుడి దృష్టి ఇంటి ముందు నిలబడ్డ సాధువు మీద పడింది. అతడు సాధువుకు నమస్కరించి, ‘‘తమరీపూట మా ఇంట భోజనం చేసి మమ్మల్ని అనుగ్రహించండి,'' అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, ‘‘పనిముగించుకుని లోపలకురా. ఇద్దరం కలిసి భోంచేద్దాం,'' అంటూ ఇంట్లోకి వెళ్ళాడు.
 
సజీవుడు అక్కడున్న రోగులను పరీక్షించి, మందిచ్చి పంపి లోపలకు వెళ్ళేసరికి బాగా ఆలస్యమయింది. అతడు క్షమాపణ కోరితే సాధువు, ‘‘నీలా రోగులపట్ల శ్రద్ధ, డబ్బుకు లొంగని నిస్వార్థం, సాధుజనుల పట్ల ఔదార్యంగల వైద్యులు అరుదు.

ఆసవుడి వైద్యమంత్ర గ్రంథం అందుకునే అర్హత నీకున్నది. వెంటనే బృహదరణ్యానికి వెళ్ళు,'' అన్నాడు. ఆయన్ను ఆసవుడే పంపాడని గ్రహించిన సజీవుడు భార్యకు విషయం చెప్పాడు. ఆమె, ‘‘బృహదరణ్యానికి వెళ్ళిరావడానికి పట్టే వారం రోజులూ రసపురంలో నీ మీద ఆధారపడ్డ రోగులకు ఇబ్బంది అవుతుంది. రోగులు లేని సమయంలో గురువర్యులను కలుసుకోవడం మంచిది,'' అన్నది. ఆ మాటలే సజీవుడు సాధువుకు చెప్పాడు.
 
ఆయన సరేనని భోజనం చేసి వెళ్ళిపోయూడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజు భీమసేనుడి తల్లికి భరించలేని తలనొప్పి వస్తే రాజవైద్యుడి మందులేమీ పనిచేయలేదు. రాజమాతకు నయం చేస్తే కనకాభిషేకం చేస్తానంటూ సజీవుడి కోసం దూతను పంపాడు రాజు. భార్య సలహా మీద సజీవుడా దూతతో వినయంగా, ‘‘నేను కదిలితే ఇక్కడ ఎందరో రోగులకు ఇబ్బంది. ప్రజాహితం కోరే మన రాజది హర్షించరు. చికిత్సకు రాజమాతే ఇక్కడికి రావడం మంచిది,'' అని చెప్పిపంపాడు.
 
ఆ మరునాడు సాధువతణ్ణి కలుసుకుని అతడి ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ మెచ్చుకుని బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుడి వైద్యమంత్ర గ్రంథాన్ని తెచ్చుకోమన్నాడు. కాని సజీవుడు పూర్వంలాగే బదులిచ్చాడు. మరికొన్నాళ్ళకు రసపురంలోకెల్లా భాగ్యవంతుడైన మహేంద్రుడికి పెద్ద జబ్బు చేసింది. సజీవుడికా రోగలక్షణాలు అంతుబట్టక తికమక పడుతున్న సమయంలో సాధువు మనోరమను కలుసుకుని, ‘‘మహేంద్రుడి జబ్బుకు మంత్రాలే పనిచేస్తాయి.
 
ఇకనైనా నీ భర్తను బృహదరణ్యానికి పంపు,'' అన్నాడు. మనోరమ సరేనని భర్తను వెంటనే బృహదరణ్యానికి వెళ్ళి రమ్మన్నది. కాని సజీవుడు అందుకు అంగీకరించలేదు. అప్పుడు మనోరమ సాధువు సలహాపై, తనకూ ఏదో వింత జబ్బు వచ్చినట్టు నటించింది. తనే మందిచ్చినా భార్యకు పనిచేయడం లేదన్న దిగులుతో సజీవుడు తన వద్దకు వచ్చే రోగులకు రోగనిదానం సరిగ్గా చేయలేక పోతుంటే సాధువతణ్ణి కలుసుకుని, ‘‘ఇకనైనా వెళ్ళి ఆసవుడి వైద్యమంత్రగ్రంథం తెచ్చుకో. లేకుంటే నీ భార్య నీకు దక్కదు,'' అని హెచ్చరించాడు.

మనోరమ కూడా వెళ్ళిరమ్మని కోరడంతో సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుడి వైద్య మంత్ర గ్రంథాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు. మహేంద్రుడితో పాటు ఎందరికో వైద్యసేవలు అందించి కృతార్థుడయ్యూడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా, సాధువు ఎంత చెప్పినా వెళ్ళడానికి నిరాకరించిన సజీవుడు భార్యకు జబ్బు చేయగానే ఆసవుడి వద్దకు వెళ్ళడం స్వార్థం కాదా? తమ వద్ద వైద్యమంత్రగ్రంథం వుంటే మహేంద్రుడు వంటి భాగ్యవంతులకు వైద్యం చేసి ధనం ఆర్జించవచ్చన్న ఆశతో వింత జబ్బు వచ్చినట్టు నటించి భర్తను బృహదరణ్యానికి వెళ్ళిరమ్మని భర్తను ప్రోత్సహించడం మనోరమ స్వార్థంకాక మరేమిటి?
 
ఇలారెండు రకాల స్వార్థంతో వచ్చిన సజీవుడికి ఆసవుడు నిస్వార్థ పరులకు మాత్రమే ఇస్తానన్న వైద్యమంత్ర గ్రంథాన్ని ఇవ్వడం నియమభంగం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయూవో నీ తల పగిలిపోతుంది,'' అన్నాడు. దానికి విక్రమార్కుడు, ‘‘అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యను కాపాడవలసిన బాధ్యత భర్తగా సజీవుడికి ఉన్నది. ఆమె వైద్యంకోసం అతడు బృహదరణ్యానికి వెళ్ళడం స్వార్థం అనిపించుకోదు.
 
సజీవుడు పేదసాదలకు వైద్యసేవలు అందించడానికి కారణం మనోరమ. అలాంటి ఆదర్శపత్నికి ధనాశ అనే స్వార్థం అంటగట్టడం సమంజసం కాదు. ఆమె అనారోగ్యం పాలయిందని తెలియగానే, ఇతర రోగులకు సరైన వైద్యం చేయలేక సజీవుడు అవస్థపడ్డాడు. అలాంటిది భార్య జబ్బుముదిరి మంచం పడితే, తట్టుకోలేక వైద్య వృత్తినే మానేసే అపాయం లేకపోలేదు. భార్యకోసమని తెచ్చిన వైద్యగ్రంథం మరెందరికో మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఉపయోగపడింది.
 
అందువల్ల సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళడం నిస్వార్థమే తప్ప, స్వార్థం అనిపించుకోదు. అతనికి వైద్యగ్రంథం ఇచ్చి ఆసవుడు నియమభంగం చేశాడనడానికి ఏమాత్రం తావు లేదు,'' అన్నాడు. రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మా…ుమై, తిరిగి చెటె్టక్కాడు.    

No comments:

Post a Comment