విశాలదేశంలోని శంఖవరం, పంఖవరం ఇరుగుపొరుగు నగరాలే అయినా, పౌరుల ఆచార
వ్యవహారాల్లోనూ, ఆహారపుటలవాట్లలోనూ చాలా తేడాలున్నాయి. శంఖవరం పౌరులు కారం
ఎక్కువ తింటారు. పంఖవరం పౌరులు తీపి, చప్పిడి పదార్థాలు తింటారు. శంఖవరంలో
వుండే పద్మకు, పంఖవరంలోని చంద్రంతో పెళ్ళయింది. భర్త, అత్తమామలు మంచివారే
కానీ, అత్తవారింట ఎవరూ కారం నోట బెట్టరనీ, చప్పిడికూడు తినలేక పోతున్నాననీ,
పద్మ తల్లిదండ్రులను కలిసినపుడల్లా గోలపెడుతూండేది.
అందువల్ల వీలు కుదిరినపుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలూ, పచ్చళ్ళూ
అందజేస్తూండేది. ఇలా ఉండగా శంఖవరానికి చాలా దూరంలో వున్న మయూరిపురికి,
చంద్రం ఉద్యోగరీత్యా రాజప్రతినిధి వెంట వెళ్ళి తన కుటుంబంతో సహా కొన్నాళ్ళు
గడపవలసి వచ్చింది. పంఖవరం తిరిగిరావడానికి నాలుగేళ్ళు పట్టింది. ఆ
నాలుగేళ్ళ పాటు పద్మ తల్లిదండ్రులు, కూతురును చూడలేక పోయూరు. అప్పటికి
పద్మకో కూతురుపుట్టి మూడేళ్ళ వయసుదయింది. కూతురూ, అల్లుడూ తిరిగివచ్చారని
తెలియగానే, పద్మ తల్లిదండ్రులు వాళ్ళను చూడబోతూ, పద్మకు ఇష్టమని బాగా
కారంగా ఉండే పచ్చళ్ళు, ఊరగాయలు వెంట తీసుకు వెళ్ళారు.
ఐతే వాటిని చూసిన పద్మ తల్లిదండ్రులతో, ‘‘నా కూతురు కారం బొత్తిగా
తినలేదు. దాని కోసమని నేనూ చప్పిడికూడు అలవాటు చేసుకున్నాను. మీరు తెచ్చిన
ఊరగాయలూ అవీ మునుపటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. అలాంటివి తిన్నారంటే ఈ
వయసులో మీ ఆరోగ్యం ఏం కావాలి?'' అన్నది. ‘‘ఆ ఊరగాయలూ, పచ్చళ్ళల్లో వున్నది
కారంకాదు. కడుపు తీపి! నువ్వు నీ కూతురుకు చేసినట్టే, మీ అమ్మ తన
కూతురికోసం ప్రేమతో వీటినలా తయూరు చేసిందంతే,'' అన్నాడు పద్మతండ్రి..
No comments:
Post a Comment