Pages

Tuesday, September 11, 2012

వీరయ్యదయ్యం


ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. కష్టజీవులైన వాళ్ళకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తులా తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య ముఖ్యమైన పనులున్నాయని, చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి నలుగురు మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాముకరిచింది.
 
ఇంటి దగ్గిర ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి, సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగతనిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై, వికృతంగా నవ్వుతూ, గుడ్లగూబలా అరుస్తూ, శ్మశానం దగ్గిర ఉన్న మర్రిచెట్టు మీదికి ఎగిరిపోయినట్టు ఆమె కలగని, కెవ్వున అరిచి, లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ‘‘ఏమయింది, మంగమ్మా? పీడ కలగానీ వచ్చిందా?'' అని అడిగారు. ‘‘నా మొగుడు దయ్యం అయ్యూడు!''
 
అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్ళకు చెప్పింది. వీరయ్య పోయిన మూడో రోజున, శ్మశానం దగ్గిర మర్రిచెట్టు కింద మూర్ఛపోయి పడి ఉన్న ఒక వ్యాపారిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి, ఉపచారాలు చేసి, తెలివి తెప్పించారు. వ్యాపారి మొదట పిచ్చిచూపులు చూసి, తరవాత తేరుకుని, క్రితం రాత్రి తనకు జరిగినది చెప్పాడు. ఆ వ్యాపారిది సమీపంలో ఉన్న మరొక గ్రామం.
 
అతను తన దుకాణానికి కావలిసిన సరుకులన్నీ ఎప్పుడూ ఈ వూరినుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను మూడో ఝామున లేచి, ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. తను శ్మశానం దగ్గిరికి వచ్చేసరికి నక్కలూ, గుడ్లగూబలూ అరవటం వినిపించి భయం పుట్టింది.

మర్రి ఆకులు గలగల మన్నాయి. లాల్చీవేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది. అసలే ఆ వ్యాపారికి దయ్యూల భయం! దానికి తగ్గట్టుగా ఆ దయ్యం, ‘‘ఒరే వ్యాపారీ, నీ దగ్గిర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో! నా పెళ్ళాంబిడ్డలకు జరుగుబాటు కావద్దా? నేనెవరో తెలుసా? వీరయ్యను! ఇవ్వక పోతే చంపేస్తా,'' అన్నది. వెంటనే వ్యాపారికి స్పృహ తప్పింది.
 
వ్యాపారి మాటలలో నమ్మకం కుదిరి ఊరివాళ్ళు, వ్యాపారి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు. కాని వాళ్ళకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి, వెక్కి ఏడ్చింది. అకాలమరణం పాలైన గంగిగోవు లాటి తన భర్త దయ్యం కావటమేగాక, బాటసారులను బాధించి దోచుకోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళోవాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది.
 
వాళ్ళు ఆమెను పలకరించటం మానేశారు. ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగూరు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం దోచేసి, ‘‘ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది!'' అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి, మంగమ్మ ఇంటిని సోదాచేసి, ఏమీ దొరక్కపోయినా, ‘‘నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పీడ అయి కూర్చున్నాడు. వాణ్ణి మర్యాదగా ఊరువదిలి వెళ్ళమను. లేకపోతే నీ మర్యాద దక్కదు!''
 
అని గట్టిగా బెదిరించి వెళ్ళిపోయూరు. మంగమ్మకు ఏమీ పాలుపోలేదు. తనకూ, చచ్చిపోయిన తన భర్తకూ ఇంకా సంబంధం ఉన్నదనే ఊరివాళ్ళు అనుకుంటున్నారు! వరసగా మరి ముగ్గురికి దయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవరూ శ్మశానం చాయలకు పోవటం లేదు, అటు నుంచి రావటమూ లేదు.
 
ఊళ్ళోవాళ్ళు మాత్రం తమలో తాము సుదీర్ఘంగా చర్చించుకుని, మంగమ్మతో, ‘‘నువ్వూ, నీ కొడుకూ ఈ ఊరు విడిచిపోతే గాని మాకు వీరయ్య దయ్యం బెడద వదలదు. రేపు లోపల మీరు వెళ్ళిపోకపోతే, మేమే మిమ్మల్ని సాగనంపగలం!'' అని హెచ్చరిక చేశారు.

ఇల్లూ, వాకిలీ వదిలేసి ఎక్కడికి వెళ్ళేట్టు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళి పొమ్మని చెప్పటానికి గుండె రాయిచేసుకుని, చీకటి పడ్డాక శ్మశానం కేసి వెళ్ళింది. ఆమెకు నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే, చెట్టు కొమ్మల్లో నుంచి, ‘‘ఆగవే, ఆగు! నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా? నీ దగ్గిర ఉన్నదంతా అక్కడ పెట్టు! నే నెవరనుకున్నావు? వీరయ్యని!'' అన్నమాటలు వినిపించాయి.
 
మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వీరయ్యది కాదు. ఆమె వెనక్కు తిరిగి ఊరివైపు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి, జరిగినదంతా రాజయ్యకు చెప్పి, ‘‘ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు. వాణ్ణి నలుగురికీ పట్టియ్యూలి,'' అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి, దాన్ని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరివాళ్ళతో, ‘‘రేపు ఊరు విడిచి పోతున్నాం,'' అని చెప్పేసింది.
 
ఆ రాత్రి తల్లీ కొడుకు లిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు తెల్లరంగు పూసుకుంటే రాజయ్య అచ్చగా వీరయ్య లాగే ఉన్నాడు. ఇద్దరూ శ్మశానం చేరారు. రాజయ్య తెల్లధోవతీ, తెల్లలాల్చీ తొడుక్కుని మర్రిచెట్టు తొరల్రో దాక్కున్నాడు. మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది. కొంచెం సేపటికి ఊరివైపు నుంచి ఒక మనిషి తెల్లపంచే, తెల్లలాల్చీ ధరించి వచ్చి, మర్రిచెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చు న్నాడు.

తరవాత వాడు గుడ్లగూబలు కూసినట్టు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ తొరక్రేసే చూస్తున్నది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి, చెట్టు మీద ఉన్న మనిషితో, ‘‘దొంగ వెధవా! నా పేరు పాడు చేస్తావా? చూడు, నిన్నేం చేస్తానో! నే నెవరనుకున్నావు? వీరయ్యని!'' అన్నాడు. ఆ మాటలకు చెట్టు మీది మనిషి కిందపడ్డాడు. వాడు భయంతో వణికి పోతూ, ‘‘తప్పయిపోయింది! క్షమించు, వీరయ్యూ!'' అని బతిమాలుకున్నాడు.
 
‘‘నిన్నేమీ చెయ్యను. ఇన్నాళ్లూ దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు!'' అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈలోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, ‘‘నా మొగుడి పేరు పాడుచేస్తున్న దొంగవెధవని చూద్దురు గాని రండి!'' అని నలుగురినీ వెంట బెట్టుకుని శ్మశానానికి వచ్చింది. నకిలీదయ్యంమనిషి, దీపాలతో వచ్చే, మనుషులను చూసి బిత్తరపోయూడు. వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే ఒక్కొక్కటిగా పైకి తీశాడు.
 
‘‘దొంగ వెధవా! ఇదా నువ్వు చేసే పని?'' అంటూ ఊరివాళ్ళు వాడి మీద పడి చితకతన్నారు. అప్పుడు చెట్టు తొరల్రోనుంచి రాజయ్య తొంగి చూసి, ‘‘ఏమిటీ గొడవ? ఏం జరిగింది? నాకు కాస్త కునుకు పట్టిందిలే!'' అన్నాడు. మంగమ్మ నిర్ఘాంత పోయింది. ఈ నాటకం ఆడినది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసినదంతా చెప్పిన మీదట, వీరయ్య దయ్యమే నకిలీదయ్యూన్ని పట్టి ఇచ్చినట్టు ఊళ్ళోవాళ్ళకు అర్థమయింది.
 
పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడానూ. ఊళ్ళోవాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకుని, ఊళ్ళోనే ఉండమని బతిమాలారు. దయ్యంలాగా నటించినవాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే, తెల్లవారే లోపల ఊరు విడిచి వెళ్ళిపోయూడు. అటుతరవాత వీరయ్య దయ్యూన్ని చూసినవాళ్ళు లేరు.

No comments:

Post a Comment