Pages

Tuesday, September 11, 2012

స్వర్గం - నరకం


ఒకానొక ముని ఒక శిథిలాలయం ముందున్న మంటపంలో కూర్చుని ధ్యాన నిమగ్నుడై ఉండగా, అక్కడికి వచ్చిన ఒక సైనిక యోధుడు గుర్రందిగి ఆయన ఎదుట నిలబడ్డాడు. కొంత సేపటికి ముని కళ్ళు తెరవగానే యోధుడు ఆయనకు వినయంగా నమస్కరించి, ‘‘కొన్నాళ్ళుగా నాకో సందేహం,'' అన్నాడు.
 
‘‘ఏమిటి? అడుగు,'' అన్నట్టు మందహాసం చేశాడు ముని. ‘‘మనవాళ్ళు చెప్పుకునే స్వర్గం, నరకం నిజంగానే ఉన్నాయూ? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి?'' అని అడిగాడు యోధుడు. ‘‘నువ్వెవరివి? ఏం చేస్తూంటావు నాయనా?'' అని అడిగాడు ముని. ‘‘నేనీ దేశానికి సేనాధిపతిని!'' అన్నాడు యోధుడు గర్వంగా. ‘‘నీలాంటి మూర్ఖుణ్ణి సేనాధిపతిని చేసిందెవరు?'' అన్నాడు ముని. ఆ మాటకు భగ్గుమన్న సేనాధిపతి, పట్టరాని ఆవేశంతో కత్తి దూశాడు.
 
‘‘ఇప్పుడే నీలో నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి,'' అన్నాడు ముని మందహాసంతో. ఆ మాటతో సేనాధిపతి ఒక్క క్షణం వెనక్కు తగ్గి, కత్తిని ఒరలో వేసి, ‘‘క్షమించండి, ముని వర్యా!'' అన్నాడు చేతులు జోడిస్తూ. ‘‘ఇదిగో ఇప్పుడే నీలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మనలో చెలరేగే క్రోధం, లోభం, మోహం మొదలైన దుర్గుణాలే నరకకూపాలు. మనకూ, మనసాటివారికీ సుఖసంతోషాలు సమకూర్చే శాంతి, కరుణ, దయ, ఓర్పు మొదలైన సద్గుణాలు వెల్లివిరిసే మనసే స్వర్గం.
 
స్వర్గ నరకాలు మరెక్కడో లేవు. మన మనసుల్లోనే ఉన్నాయి!'' అన్నాడు ముని ప్రశాంత వదనంతో. ‘‘తెలిసింది, మునివర్యా! కృతజ్ఞతలు!'' అంటూ మునికి మరొక్కసారి నమస్కరించి అక్కణ్ణించి సంతోషంగా బయలుదేరాడు సేనాధిపతి.

No comments:

Post a Comment