హేలాపురి నివాసి మాధవుడు సామాన్య కుటుంబీకుడు. అతడి భార్య నీరజ
నలుగురికీ ఆడంబరంగా కనబడాలనే మనస్తత్వంకలది. సుగంధపురిలో వుండే నీరజ
బంధువుల ఇంట జరగబోయే పెళ్ళికి పిలుపు వచ్చింది, మాధవుడికి. నీరజకు మెడలో
బంగారు ఆభరణాలంటూ ఏమీ లేవు. పక్కింటి రమణి మెడలో పచ్చగా మెరిసిపోతున్న
గొలుసును చూసి, నీరజ ముచ్చట పడుతూంటే - పెళ్ళికి పెట్టుకుని వెళ్ళి, తిరిగి
రాగానే ఇవ్వమని రమణి, గొలుసును నీరజ కిచ్చింది.
నీరజ ఆనందంగా మెడలో గొలుసు వేసుకుని పెళ్ళికి వెళ్ళింది. తిరిగి
వచ్చాక వారం రోజులు గడిచినా నీరజ, రమణికి గొలుసు తిరిగియివ్వలేదు. రమణి
కూడా తొందరపడి, నా గొలుసు ఇవ్వమని ఆమెను అడగలేదు. పదిరోజుల తర్వాత నీరజ
ధుమధుమలాడుతున్న ముఖంతో గొలుసు తీసుకుపోయి విసురుగా రమణి చేతిలో పెడుతూ,
‘‘లోకంలో ఇంత పచ్చి మోసం చేసేవాళ్ళుంటారనుకో లేదు.
బంగారం గొలుసని చెప్పి నకిలీ గొలుసు ఇస్తావా పెట్టుకోమని?'' అని
చీదరించు కున్నట్టు మాట్లాడింది. ఐనా, రమణి శాంతంగా, ‘‘అది బంగారు గొలుసని
నీకు చెప్పలేదే! నువ్వే మోజు పడి అడిగితే, సరేనని ఇచ్చాను. కానీ, అసలది
బంగారు గొలుసు కాదని, నకిలీదని నీకెలా తెలిసింది?'' అని అడిగింది.
దానికి నీరజ కోపంగా, ‘‘కాస్త డబ్బు అవసరమై గొలుసు తాకట్టు పెడదామని
షావుకారు దగ్గరకు వెళితే-అతగాడు దాన్ని రాయి మీద గీసి పరీక్షించి, బంగారు
పూత పూయబడిన నకిలీదని చెప్పాడు,'' అన్నది. ఆ జవాబు విని రమణి
నిర్ఘాంతపోయింది.
No comments:
Post a Comment