రామాపురంలో రంగనాధుడనే వైద్యుడుండేవాడు. ఆయుర్వేదం ఆయనకు
కొట్టినపిండి. ఎవరెవరి శరీర తత్వాన్ని బట్టి, జీవనశైలిని బట్టి, వారికి ఏయే
వయసులో, ఏయే రుగ్మతలు వచ్చే అవకాశముందో ఇట్టే చెప్పేసేవాడు. తన దగ్గరకు
వచ్చే రోగుల వాలకాన్ని బట్టి, వారు చెప్పక ముందే వారి బాధేమిటో, దానికి
మూలకారణమేమిటో కూడా చెప్పి, వారిని ఆశ్చర్యపరిచేవాడు. ఆ కారణంగా అతడికి
వైద్యం బాగా ఎరిగినవాడనే పేరొచ్చిందికానీ, రోగులు మాత్రం అంతగా
వచ్చేవారుకాదు.
ఒకనాడు, దూర ప్రాంతానవుంటున్న చరకాచార్యుడనే గురువు, రంగనాధుణ్ణి
చూడడానికి వచ్చాడు. ఆ సమయంలో ఒక స్ర్తీ రంగనాధుడి దగ్గిరకు వచ్చి, ‘‘అయ్యూ!
నా వయసు ఇరవై ఏళ్ళు. ఇంత చిన్న వయసులోనే, వచ్చిన రోగమేమిటో
అంతుబట్టకుండావుంది...'' అని ఇంకా ఏదో చెప్పబోతూండగానే, రంగనాధుడు
ఆశ్చర్యపోతూ, ‘‘నీ వయసు ఇరవై ఏళ్ళేమిటమ్మా? ఎంతలేదన్నా ఇరవై ఎనిమిదేళ్ళకు
తక్కువుండదు,''అన్నాడు.
ఆ మాట వింటూనే వచ్చిన స్ర్తీ ముఖం మటమటలాడించుకుంటూ గిరుక్కున
వెనుదిరిగి వెళ్ళిపోయింది. రంగనాధుడు, తన గురువు చరకాచార్యుడి కేసి తిరిగి,
‘‘ఏమిటో, గురువర్యా! వచ్చిన రోగుల్లో కొందరు మధ్యలో చిరాగ్గా తిరిగి
వెళ్ళిపోతున్నారు,'' అన్నాడు.
దానికి చరకాచార్యుడు నవ్వి, ‘‘తెలుస్తూనే వుందిగదా, రంగనాధా! నీకు
శాస్ర్తజ్ఞానమైతే వుంది కానీ; లోకజ్ఞానం కొరవడింది. వచ్చిన వాళ్ళతో నిజం
చెప్పినా వాళ్ళు బాధపడేలా కాకుండా లౌక్యంగా చెప్పడం అవసరం కదా!'' అన్నాడు.
No comments:
Post a Comment