వల్లభాపురంలో నివసించే ధనాచారి పేరున్న వైద్యుడు. చుట్టుపక్కల
గ్రామాల్లో, ఆయనకు మించిన వైద్యుడు లేడని ప్రతీతి. ధనాచారికి పిల్లల్లేరు.
ఎవరికైనా వైద్యవృత్తి నేర్పుదామనివున్నా ఏ విద్య అయినా స్వతహాగా కొంత
ఆసక్తీ, అభిలాషా వుంటే తప్ప, కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం.
ఇలావుండగా-ధనాచారికి దూరపు బంధువైన తిరుమలాచారి, తన కొడుకు లిద్దరితో కలిసి
వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు.
అతడికి నగరంలో నగల వ్యాపారం వున్నది. కొంత కాలంగా అతడు నారిపుండు
వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరూ ధనాచారి
చేస్తున్న వైద్యవృత్తి పట్ల ఆకర్షితులయ్యూరు. ధనాచారి వైద్యంతో రెండు
వారాల్లో తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది. ఆయన తిరిగి నగరానికి
ప్రయూణమవుతూ ధనాచారితో, ‘‘అన్నగారూ, తమరు అపర ధన్వంతరులు. అయితే, ఇంత
విద్వత్తు, హస్తవాసి అన్నీ మీతోనే ఆగిపోవడం, నాకెందుకో నచ్చడంలేదు,''
అన్నాడు.
అందుకు ధనాచారి, ‘‘నే చేయగలిగిందేమీలేదు కదా! కొంతయినా ఈ విద్యపట్ల
సహజంగా ఆసక్తి, అనురక్తి వుంటే తప్ప, ఇతరులకు నేర్పలేం,'' అన్నాడు. ‘‘నా
కొడుకులు రమణుడూ, రాఘవుడూ ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తివుంది. వాళ్ళను మీ
శిష్యులుగా చేసుకోండి,'' అని కోరాడు తిరుమలాచారి. తగిన పరీక్ష పెట్టిన
తర్వాతే వాళ్ళను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు, ధనాచారి.
ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్ళిపోయూడు.
ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు. తొందరగా ఆకళింపు చేసుకునేవాడు. రాఘవుడు
నెమ్మదస్థుడు. విషయూన్ని ఒకటి రెండు సార్లు విని నిర్థారించుకునేవాడు. పది
రోజుల పాటు ఇద్దరికీ పలురకాల ఆకులు, మూలికలు మొదలైనవాటిని పరిచయం చేశాడు,
ధనాచారి.తను వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు. ఇలావుండగా, పక్క
ఊరు భూస్వామిగారికి బొత్తిగా అన్నహితవు పోయిందనీ, కనిపించని రోగమేదో ఆయనను
కృంగదీస్తోందనీ, ధనాచారి వచ్చి వైద్యం చేయూలనీ కబురువచ్చింది. ధనాచారి
కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర మరికొంత సమాచారం రాబట్టాడు. భూస్వామిగారి
అజీర్ణవ్యాధికి మందేం వాడాలో చెప్పి, రమణుణ్ణి పంపాడు. రమణుడు వారం రోజుల
పాటు గురువుగారు చెప్పిన మూలికలూ, ఆకులూ నూరి గుళికలు చేసి భూస్వామికి
ఇవ్వసాగాడు.
ఆయనకు తగ్గినట్లే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది. రమణుడి కేమీ
పాలుపోలేదు. ఈసారి రాఘవుడు, భూస్వామి వద్దకు వెళ్ళి తాను వైద్యం
చేస్తానన్నాడు. సరేనన్నాడు ధనాచారి. ముందుగా ఆయన ప్రతి రోజూ భుజించే
ఆహారాన్ని తెప్పించి, పరీక్షించాడు రాఘవుడు. ఆయన భోజనంనిండా నెయ్యి, నూనెలు
గుప్పించబడివున్నాయి. బలవర్థకమైన అనేక రకాల పదార్థాలు అవసరమైన వాటికన్నా
అధికంగావున్నాయి. అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవుడికి.
‘‘అయ్యూ! మీరు పత్యం చేయవలసివుంటుంది. పది రోజుల పాటు చింతపండు రసం,
చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చేయూలి. అప్పుడే నేను, మా గురువుగారి
ఆజ్ఞగా ఇచ్చే ద్రావకం తమకు ఉపకరిస్తుంది,'' అన్నాడు రాఘవుడు వినయంగా.
అలాగేనన్నాడు భూస్వామి. వారం రోజులలోపుననే, ఆయన అజీర్ణవ్యాధి తగ్గు ముఖం
పట్టింది. భూస్వామి ఎంతో సంతోషించి రాఘవుడికి ఘనంగా సంభావనలు ఇచ్చి
సాగనంపాడు.
రాఘవుడు తిరిగి వచ్చిన సమయంలో ధనాచారి ఇంటలేదు. రమణుడు, అతణ్ణి అడిగి
జరినదంతా తెలుసుకున్నాడు. సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే, రమణుడు ఆయనతో,
‘‘గురుదేవా! రాఘవుడు, భూస్వామికి చేసిన వైద్యమేమిటో తెలుసుకున్నాను.
శొంఠిపొడి, జీలకర్ర, కాస్త మిరియం, మరికొంత బెల్లం కలిపి కాచిన కషాయం
మాత్రమే! కానీ, నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను. అయినా ఫలితం
కనిపించలేదెందుకని?'' అని అడిగాడు.
‘‘అలాగా!'' అంటూ ధనాచారి చిరునవ్వు నవ్వి, ‘‘రమణా! వైద్యుడు రోగిని
మాత్రమే కాదు, రోగాన్ని కూడా పరీక్షించాలి. రోగానికి మూలకారణ మేమిటో
తెలుసుకోగలగాలి. భూస్వామిగారికి అతిగా భోజనం చేయడం వల్ల వచ్చిన వ్యాధి.
దానికి మందులకన్నా, లంఖణమే బాగా పనిచేస్తుంది. అందుకే రాఘవుడి వైద్యం
ఫలించింది,'' అన్నాడు. మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతూండగా రమణుడు,
రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడివుండడం కనిపించింది.
చిరిగిన దుస్తులతో బక్కచిక్కివున్న అతణ్ణి చూసి, ‘‘ఎవడో బిచ్చగాడు.
తిండి లేక సొమ్మసిల్లినట్టున్నాడు. పద, మనం వచ్చినపని చూద్దాం,'' అంటూ
కదలబోయూడు రమణుడు. ‘‘వచ్చిన పని సరే! ఆపదలో వున్న ఇతణ్ణి ఇక్కడ ఎలా
వదిలిపెట్టి పోగలం,'' అంటూ రాఘవుడు అతడి ముఖం మీద నీరు చల్లి, స్పృహ
రాగానే, ‘‘రమణా! ఇతణ్ణి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం.
ఇలా పడివుండడానికి కారణం తిండిలేక పోవడంతో పాటు, మరేదైనా వ్యాధి కూడా
వున్నదేమో గురువుగారి చేత పరీక్ష చేయిద్దాం,'' అని, ఆ వ్యక్తిని ధనాచారి
వద్దకు తీసుకువచ్చాడు. జరిగింది విన్న ధనాచారి, రమణుడితో, ‘‘నిస్సహాయ
స్థితిలో వున్నవాళ్ళ పట్లా, రోగుల పట్లా వైద్యుడికి సానుభూతి వుండాలి. అతడి
ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి డబ్బు తీసుకోవాలి. వైద్యుడు, రోగికి మంచి
మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా మసలుకోగలిగితే, వృత్తిలో రాణించగలడు,''
అన్నాడు.
ధనాచారి మాట ముగించగానే, రమణుడు వెల వెల పోతూ, ‘‘క్షమించండి,
గురుదేవా! వైద్య వృత్తి ద్వారా, వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే
ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను. మా తండ్రిగారి నగల దుకాణంలో ఒక నగ అమ్మితే
వచ్చే లాభం, పదిమందికి వైద్యం చేసినారానట్లు కనబడుతున్నది. ఈ వైద్య వృత్తి
నా మనస్తత్వానికి సరిపోదు, క్షమించండి!'' అని సెలవు తీసుకున్నాడు. రాఘవుడు,
ధనాచారి అడుగుజాడల్లో నడిచి, కొంత కాలానికి ఉత్తమ వైద్యుడిగా, గురువును
మించిన శిష్యుడుగా పేరు తెచ్చుకున్నాడు.
No comments:
Post a Comment