Pages

Tuesday, September 11, 2012

కూర్మన్న తెలివి


 
తాడిపర్రు గ్రామంలోని ఒక భూస్వామి దగ్గర, కూర్మన్న అనేవాడు వ్యవసాయప్పనులతో పాటు, పట్నానికి వెళ్ళి ఆయన ఇంటికి అవసరం అయిన సరుకులు కొని తెస్తూండేవాడు. కూర్మన్న మంచి మాటకారి అనీ, చాలా తెలివైనవాడనీ గ్రామస్థులు మెచ్చుకుంటూండేవాళ్ళు. ఐతే, వాడు మాత్రం దిగులుగా ముఖంపెట్టి, ‘‘మీరు మెచ్చుకునేంత తెలివిగలవాణ్ణవునో కాదో నేనెరగను.
 
ఒక వేళ మీరనేదే నిజమైతే, ఆ మాటకారితనం, తెలివీ నన్ను బతుకుబాటలో ఒక్క మెట్టయినా పైకెక్కించడంలేదు. భూస్వామి ఇచ్చే చాలీచాలని బత్తెంతో బతుకీడిస్తున్నాను. ఎండనక, వాననక కష్టపడే కూలీ నాలీ బతుకు!'' అని వాపోతూండేవాడు. ఇలా వుండగా, భూస్వామికి వున్న నాలుగు ఎడ్ల జతలలో, ఒక జత ఎడ్లు వయసు పైబడడంతో బండిలాగడం, పొలం దున్నడంలాంటి పనుల్లో మిగతావాటికి వెనకబడుతూండేవి.
 
అందువల్ల మరొక జత గిత్తలను కొనడం అవసరం అనుకుని భూస్వామి తన పద్ధెనిమిదేళ్ళ కొడుకు రంగయ్యనూ, కూర్మన్ననూ వెంటబెట్టుకుని, పక్క గ్రామంలో ప్రతి మంగళవారం జరిగే పశువుల సంతకు వెళ్ళాడు. సంత జరుగుతున్న మైదానమంతా ఆవులూ, ఎద్దులతో పాటు, అందంగా బలంగా వున్న గిత్తలతో చాలా సందడిగా వున్నది.
 
భూస్వామి తన కొడుకూ, కూర్మన్నను కూడా సలహా అడిగి రెండు గిత్తలను బేరమాడి కొని ఇంటికి తోలుకువచ్చాడు. ఇంకా తొలకరి వానలకు రెండు, మూడు వారాల వ్యవధి వున్నదనగా రంగయ్య గిత్తలను బండిలాగడానికీ, ఇతర వ్యవసాయప్పనులకూ తయూరుచేయడానికి పూనుకున్నాడు. కూర్మన్న రంగయ్యను హెచ్చరిస్తూ, ‘‘చిన్నదొరా! గిత్తలు రెండూ మాంచి చురుకైనవి.

మీరూ వ… యసుకు వస్తున్నవాళ్ళు గనక, వాటికి దీటైన చురుకుదనం కలవాళ్ళు. కనక బహు జాగ్రత్తగా వుండాలి!'' అని చెప్పాడు. రెండు వారాలు గడిచినై. ఒకనాటి ఉదయం రంగయ్య గిత్తలను కట్టిన బండితో పొలం దారిన వస్తూండగా, హఠాత్తుగా ఒక దారిమలుపులో అవి బెదిరి, ఎదురుగా వస్తున్న కూర్మన్న మీదికి బండిని లాగినై. ఆ సమయంలో కూర్మన్నకు తగిలింది చిన్న దెబ్బ అయినా, వాడు కాళ్ళూ చేతులూ చాచి గిలగిల తన్నుకోవడం ప్రారంభించాడు.
 
ఇది చూసిన గ్రామస్థులు, రంగయ్యను గట్టిగా కోప్పడి, కూర్మన్నను ఇంటికి చేర్చారు. ఇల్లు చేరినా వాడు వెర్రిచూపులు చూస్తూ పెద్దగా మూలగ సాగాడు. ఇది చూసి, గ్రామస్థులు, వాడు ఇప్పట్లో ఏపని చేయడానికీ పనికిరాడని తేల్చుకుని, భూస్వామి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి, ‘‘మిమ్మల్నే నమ్ముకున్న కూర్మన్నకు దురదృష్టవశాత్తు ఈ గతి పట్టింది. అతన్ని ఆదుకోవడం మీ బాధ్యత,'' అన్నారు.
 
గ్రామప్రజల మధ్య తనకు చెడ్డపేరు వస్తుందన్న భయంతో భూస్వామి కూర్మన్న ఇంటికి వచ్చి వాణ్ణి పరామర్శించి, కూర్మన్న భార్యకు రెండు వేలిచ్చి, ‘‘ఇది నా కొడుకు తనకు చేతకాని పనికిపూనుకోవడం వల్ల జరిగింది. కూర్మన్న తిరిగి మామూలుగా అయ్యూక శ్రమతో కూడిన పనులేం చేయనవసరంలేదు. కర్ర పట్టుకుని అలా చేనుగట్టు మీద నిలబడి పనివాళ్ళ మీద కాస్త పెత్తనం చెలాయిస్తే చాలు!'' అన్నాడు. భూస్వామి దయకు కళ్ళు చెమ్మగిల్లిన కూర్మన్న భార్య, వాడితో, ‘‘చూశావా పెద్ద దొర ఎంత జాలికలవాడో.
 
ఇకనైనా కాళ్ళు దెబ్బ తిన్నవనే కపటనాటకం మాని పనిలోకిపో,'' అన్నది. దానికి కూర్మన్న చిన్నగా నవ్వుతూ, ‘‘ఇప్పుడే లేచి నడవడం ప్రారంభిస్తే, గ్రామస్థులు నన్ను మోసకారికింద జమకట్టేస్తారు. కనీసం ఒక నెల రోజుల పాటు సుఖంగా నన్ను ఇంట్లో పడుకోనియ్యి. ఇన్నాళ్ళు చాలీ చాలని బత్తెం ఇస్తూ పిసినారితనంతో మనల్ని వేధించిన భూస్వామి నుంచి ఇప్పుడైనా వడ్డీతో సహా వసూలు చేయగలిగాం. అందుకు సంతోషించు,'' అన్నాడు.
  

No comments:

Post a Comment