ఒకప్పుడు కొరియూ దేశాన్నేలే రాజుకు ఇద్దరు కుమారులు. రెండవ
కుమారుణ్ణి, తనకు పిల్లలు లేరని అతడి మేనమామ దత్తు తీసుకున్నాడు. అయితే,
పదేళ్ళ తరవాత, రాజుగారి పెద్ద కుమారుడు ప్రపంచాన్ని త్యజించి, సన్యాసం
స్వీకరించి ఇల్లువిడిచి వెళ్ళిపోయూడు. రెండవ కుమారుణ్ణి దత్తు తీసుకున్న
మేనమామకు కొడుకు పుట్టాడు. దాంతో, దత్త కుమారుడి పట్ల ప్రేమ తగ్గడంతో, అతడు
సొంత తండ్రి అయిన రాజు వద్దకు తిరిగి వచ్చేశాడు.
దత్తత పేరుతో తనను ఇంటి నుంచి వేరు చేయడం; ఆ తరవాత అక్కడ వద్దనుకుని
సొంత ఇంటికి పంపడం ఇదంతా రాజుగారి రెండవ కుమారుడికి సుతరామూ నచ్చినట్టు
లేదు. అందువల్ల అతడు ఎప్పుడూ విచారంగా కనిపించేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు
కాడు. చివరకు చదువు సంధ్యల పట్ల కూడా శ్రద్ధాసక్తులు కనబరచేవాడు కాడు.
అతణ్ణి విద్యావంతుణ్ణి చేయడానికి రాజు ఎందరో పండితులను నియమించాడు.
అయినా
ఒక్కరూ అతనికి అక్షరం ముక్క నేర్పలేక పోయూరు. ఇది రాజుకు ఎంతో విచారం
కలిగించింది. దీనినంతా గమనించిన మంత్రి ఒకనాడు రాజుతో, ‘‘యువరాజునేదో
దుష్టశక్తి ఆవహించినట్టున్నది ప్రభూ,'' అన్నాడు. ‘‘మరి, దానిని తరమ గొట్టడం
ఎలా?'' అని అడిగాడు రాజు. ‘‘ఒక సాధు పుంగ వుడు మన పట్టణానికి సమీపంలో
ప్రవహించే నదీ తీరంలోని కొండ పాదతలం వద్ద ఉంటు న్నాడు.
మీరు స్వయంగా వెళ్ళి దర్శిస్తే, యువరాజును ఆవహించిన దుష్టశక్తిని
వదలగొట్టే మార్గం ఆయన చూపగల డనుకుంటాను,'' అన్నాడు మంత్రి. రాజు గుర్రం మీద
ఒంటరిగా సాధువు కుటీరం వద్దకు వెళ్ళి, ఆయనకు శిరసువంచి నమస్కరించి, తను
ఎవరైనదీ విన్నవించాడు. ‘‘నాలాంటి పేద ప్రజలకు రాజు ఏదైనా సాయపడగలడుగాని,
రాజుకు నేనేం చేయగలను?'' అని అడిగాడు సాధువు.
‘‘మహాత్మా! నేనిప్పుడు నిరుపేదగా, దీనుడిగా తమ ముందు మోకరిల్లి
వేడుకుంటున్నాను,'' అంటూ రాజు తన సమస్యను సాధువుకు వివరించాడు. సాధువు
తలపంకించి కళ్ళు మూసుకున్నాడు. కాస్సేపటికి కళ్ళు తెరిచి, ‘‘సరే, నీ
కుమారుణ్ణి విద్యావంతుణ్ణి చేయడానికి నేను సాయపడగలను. అయితే, అంతకు ముందు
నువ్వు ఒక పనిచెయ్యూలి,'' అన్నాడు. ‘‘ఏమిటి మహాత్మా, ఆజ్ఞాపించండి,''
అన్నాడు రాజు ఆతృతగా.
‘‘పులి మెలకువతో ఉన్నప్పుడు నువ్వే స్వయంగా వెళ్ళి, దాని మీసాలు
కత్తిరించి తీసుకువచ్చి నాకివ్వాలి,'' అన్నాడు సాధువు. ‘‘పులి మీసాలా? మానవ
మాత్రులకు ఇది అసాధ్యం అన్న సంగతి తమకు తెలియనిదా, మహాత్మా,'' అన్నాడు
రాజు దీనస్వరంతో. ‘‘మానవ స్వభావాన్ని మార్చడం కన్నా అసాధ్యమైనదేమీ కాదు,''
అన్న సాధువు మందహాసం చేస్తూ, ‘‘వెళ్ళు నాయనా! వెళ్ళి ప్రయత్నించు.
సాధనతో సాధించలేనిది ఏదీ లేదు,'' అంటూ లేచి వాహ్యాళికి బయలుదేరాడు.
రాజు బరువెక్కిన మనసుతో తీవ్రంగా ఆలోచిస్తూ, రాజభవనానికి తిరిగి వచ్చాడు.
రాజోద్యానంలో పక్షులూ, జంతువులతో పాటు, బోనులో ఒక పులిని కూడా
పెంచుతున్నారు. పులి రక్షణను చూసే భటుణ్ణి, దాన్ని తాకడానికి వీలవుతుందా
అని అడిగాడు రాజు. ‘‘ప్రభూ, ఆ పులి చాలా దుర్మార్గమైనది. బయటినుంచే
ఆహారాన్ని బోనులోకి విసుతాను తప్ప, దాన్ని సమీపించడానికి ఇంత వరకు
సాహసించలేదు,'' అన్నాడు భటుడు.
అయినా సాధువు చెప్పిన మాటలు రాజు మనసులో మళ్ళీ మళ్ళీ కదలాడ సాగాయి.
తెగువతో ఆయన ముందడుగు వేశాడు. ఆ రోజు సాయంకాలం రాజేస్వయంగా పులికి ఆహారం
తీసుకుని బోనులోపలికి విసిరి, పక్కనే నిలబడ్డాడు. పులి కళ్ళురుముతూ, మాంసం
ముక్కలను తిని, తర్వాత రాజు కేసి మెచ్చుకోలుగా చూసింది. రాజు రెండు వారాల
పాటు అలాగే చేస్తూ వచ్చాడు. ఆ తరవాత, మాంసాన్ని బోనులోకి విసరకుండా, చేత్తో
పట్టుకుని పులి కోసం అలాగే నిలబడ్డాడు.
పులి తొలుత ఆయన కేసి అనుమానంగా చూసినప్పటికీ, రాజు పళ్ళెంలో పట్టుకుని
ఉన్న మాంసం ముక్కలను, బోనులోవున్న చిన్న కన్నం గుండా తీసుకుని తినసాగింది.
రాజు ఇలాగే కొన్ని రోజులు కొనసాగించాడు. ఒకనాడు తినడం ముగించిన పులి ,
రాజు చేతిని నాలుకతో తాకింది. అది తన పట్ల ఆప్యాయత కనబరుస్తున్నదని రాజు
గ్రహించాడు.
ఒకనాడు రాజు తన చేత్తో పులి తలను నెమ్మదిగా నిమిరాడు. తన పట్ల రాజు
కనబరుస్తూన్న శ్రద్ధకు పులి సంతోషించినట్టు ఆయన గ్రహించాడు. ఇలా మరో
నెలరోజులు గడిచాయి. ఇలా పులిని ఆప్యాయంగా నిమురుతున్నప్పుడు రాజు, దాంతో
ప్రీతిగా మాట్లాడేవాడు. అది ఆయన పట్ల ఎంతో విశ్వాసాన్నీ, ఆప్యాయతనూ
కనబరచసాగింది. ఒకనాడు రాజు అలా ఆప్యాయంగా మాట్లాడుతూ, పులి తల నిమురుతూ,
చిన్న కత్తెరతో దాని మీసాలలో రెండు కేశాలు కత్తిరించాడు.
పులి దాన్నేమాత్రం పట్టించుకోలేదు. రాజు పరమానందం చెందాడు. పట్టరాని
ఉత్సాహంతో గురమ్రెక్కి, సాధువు వద్దకు వెళ్ళి పులి మీసాలను ఆయన చేతిలో
ఉంచాడు. సాధువు సంతోషంతో తల పంకించాడు. కాని, ఆయన పులి మీసాలను మండుతూన్న
మంటలో పడవేయడం చూసి రాజు విస్తుపోయూడు. ‘‘రాజా, నీ కుమారుణ్ణి ఎలా మచ్చిక
చేసి పెంచాలో నీకిప్పుడు తెలిసింది కదా? పులి కన్న భయంకరుడూ, అపాయకరమైన
మానవ కుమారుడు ఉండడు కదా?
నీ కుమారుణ్ణి ఏ ఉపాధ్యాయుడికో అప్పగించే ముందు, నువ్వు అతినితో
ప్రేమతో మాట్లాడు. కథలు వినిపించు. మొదట పులిని ఎలా మచ్చిక చేసుకున్నావో,
నీ కుమారుణ్ణీ అలా మచ్చిక చేసుకో. ఆ తరవాతే అతన్ని గురువుల సాయం అర్థించేలా
ప్రేరేపించి ప్రోత్సహించు. పులి మీసాల కోసం అచంచలమైన విశ్వాసంతో, దృఢ
నిర్ణయంతో ఎలా ప్రయత్నించావో ఇప్పుడూ అలాగే ప్రయత్నించు. తప్పక విజయం
సాధించగలవు,'' అంటూ సాధువు ఎప్పటిలాగే వాహ్యాళికి బయలుదేరాడు.
రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు, తన నూతన అనుభవజ్ఞానాన్ని ఆచరణలో
పెట్టాడు. రాజు కుమారుడి పట్ల చూపిన ప్రేమాదరాలకారణంగా, అతడిలో క్రమంగా
మార్పు రాసాగింది. తన మనసును అర్థం చేసుకుని, తన మీద అపార ప్రేమను కనబరచే
శ్రేయోభిలాషిగా తండ్రిని అతడు గుర్తించాడు.
ఎలాంటి
విద్యనైనా నేర్చుకోవడానికి సిద్ధమైన వివేక సంపన్నుడైన యువకుడిగా తయూరైన తన
కుమారుణ్ణి చూసి రాజు పుత్రోత్సాహంతో పొంగిపోయూడు. ‘‘నేను మొదట
నేర్చుకోవలసింది నేర్చుకున్నాకే, బిడ్డకు కావలసింది నేర్ప గలిగాను,''
అన్నాడు రాజు తనలాగే ఆనందిస్తూన్న మంత్రితో ఎంతో ఆనందంగా.
No comments:
Post a Comment