Pages

Tuesday, September 11, 2012

పోయిన ఉంగరం


ఒక శబరరాజు దగ్గిర ఇల్లుడూ, పులిదొరా అనే ఇద్దరు కొలువు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ నమ్మకమైన వాళ్ళే. కాని రాజుకు ఇల్లుడంటే అభిమానమూ, పులిదొర అంటే ద్వేషమూ ఉండేది. ఒకరోజు రాజు ఆ ఇద్దరినీ పిలిచి, ‘‘మీ రిద్దరూ సెలవు తీసుకుని ఇళ్ళకు పొండి. మూడు రోజుల అవతల సంబరం జరుగుతుంది.
 
దానికి రండి. ఇవిగో మీ బహుమానాలు,'' అంటూ పులిదొరకు పెద్ద కందదుంపా, ఇల్లుడికి చిన్న రాయీ ఇచ్చాడు. తనకు రాజు పనికిమాలిన రాయి ఇచ్చాడని ఇల్లుడికి లోపల కాస్త గునుపుగా ఉండి, ‘‘ఈ వెధవ రాయిని పనికట్టుకుని ఇంటికి మోసుకుపోవటం కూడా దేనికి, ఇక్కడే ఏ పొదలోనో పారేస్తాను,'' అన్నాడు. ‘‘వద్దు, వద్దు. ఈ కందదుంపను మొయ్యలేక చస్తున్నాను. మనం వస్తువులు మార్చుకుందాం,'' అన్నాడు పులిదొర.
 
ఇద్దరూ తమ తమ బహుమానాలు మార్చుకుని తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయూరు. ఇల్లుడు తన భార్య చేత కంద వండించుకు తిన్నాడు. పులిదొరకు రాయి మాట ఆ రాత్రిదాకా జ్ఞాపకం రాలేదు. అతను ఇంటి బయట వెన్నెలలో కూర్చుని, ఆ రాయి తీసి పరీక్షిస్తూ ఉండగా, దాని పగులులో ఏదో తళుక్కున మెరిసింది. అతను ఆ రాతిని పగలగొట్టేసరికి దానిలోపల నేర్పుగా దాచి ఉన్న బంగారు నగలు బయటపడ్డాయి.
 
రాజు పక్షపాతబుద్ధి పులిదొరకు అర్థమయింది. ఆ నగలు ఇల్లుడి కోసం ఉద్దేశించినవి. అయినా వాటిని తానే ఉంచుకోవటానికి పులిదొర నిశ్చయించాడు. బహుమతులు మార్చుకోవటం జరిగింది గద. మూడు రోజుల అనంతరం రాజుగారి ఇంటి వద్ద సంబరమూ, విందూ జరిగాయి. ఎంతోమంది వచ్చారు. భోజనాలు చేసే సావిడి పాక కిటకిటలాడి పోయింది.

రాజు అందరినీ పలకరిస్తూ, పులిదొర ధరించిన ఆభరణాలు చూసి, ‘‘ఇవి నీకు ఎక్కడివి?'' అని అడిగాడు ఆశ్చర్యంగా. తాము బహుమానాలు మార్చుకున్న సంగతి ఇల్లుడూ, పులిదొరా రాజుకు తెలిపారు. రాయి విలువ తెలియక దాన్ని పులిదొరకు ఇచ్చినందుకు ఇల్లుడు రాజుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. రాజు ఇల్లుణ్ణి క్షమించాడు. కాని పులిదొరను హతమార్చటానికి నిశ్చయించాడు. పులిదొర రాజుతో, ‘‘ఈ నగలు నేను ఉంచుకు న్నందుకు ఏలినవారు క్షమించాలి.
 
తమరిచ్చిన బహుమానాలను మేము న్యాయంగా మార్చుకున్నాం. కందగడ్డను ఇల్లుడూ, భార్యా భోంచేశారు,'' అన్నాడు. ‘‘నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. అందుకు నిదర్శనంగా నీకు నా ఉంగరం బహుమానంగా ఇస్తున్నాను. దీన్ని పోగొట్టుకున్నావంటే మటుకు నీకు మరణశిక్ష విధిస్తాను. గుర్తుంచుకో!'' అన్నాడు రాజు, పులిదొరకు తన వేలిఉంగరం ఇస్తూ. రాజు తన మీద పగపట్టినట్టు పులిదొర గ్రహించి, ఆ ఉంగరాన్ని ప్రాణప్రదంగా కాపాడాలనుకున్నాడు.
 
అతని గుడిసెలో ఉంగరాన్ని దాచే చోటే లేదు. ఆ రాత్రి తన భార్యా, కొడుకూ నిద్రపోయేటప్పుడు అతను తన ఇంటి మట్టిగోడలో రంధ్రం తొలిచి, అందులో ఉంగరాన్ని పెట్టి, తడిమట్టితో రంధ్రాన్ని కప్పి, గుర్తు తెలియరాకుండ ఆ మట్టిని గోడతో సమంగా చదునుచేసేశాడు. రెండు రోజులు గడవనిచ్చి రాజు పులిదొర భార్యను పిలిపించి, ‘‘నీ మొగుడు ఉంగరం ఎక్కడ దాచాడో కనుక్కుని తీసుకువచ్చి నా కియ్యి.
 
నీకు బోలెడంత బంగారం ఇస్తాను. ఈ మాట నీ మొగుడితో ముందుగా అనకు; బంగారం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు,'' అన్నాడు. రాజు తన భర్త ప్రాణం తీయదలచి ఉంగరం అడిగాడని పులిదొర భార్య ఎరగదు. ఆమె ఉంగరం కోసం ఇల్లంతా గాలించింది. ఉంగరం కనిపించలేదు. ఆ సాయంకాలం ఆమె, తన భర్త ఇంటికి రాగానే, ‘‘నీ దగ్గిర ఏదో ఉంగరం ఉండెనే, అది ఏమయింది?'' అని అడిగింది. ఉంగరం తన భార్య కళ్ళ పడనేపడిందనుకుని పులిదొర, ‘‘గోడలో దాచాలే,'' అన్నాడు.

మర్నాడు భర్త బయటికి వెళ్ళిన సమయంలో పులిదొర భార్య గోడలన్నీ శ్రద్ధగా పరిశీలించింది; అనుమానంగా ఉన్న చోటనల్లా గోడలో గీరింది. చిట్టచివరకు ఆమెకు ఉంగరం దొరకనే దొరికింది. ఆమె చప్పున ఆ రంధ్రాన్ని మట్టితో పూడ్చి, ఉంగరం తీసుకుని రాజుగారి ఇంటికి పరిగెత్తింది. రాజు ఉంగరం తీసుకుని, ఆమెకు సంచీలో బంగారం ఇచ్చాడు. ఆమె పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి, ఆ సంచీని ఇంటి వెనక పూడ్చిపెట్టింది.
 
వారం పూర్తి అయిన రోజున పులిదొర దగ్గిరికి రాజుగారి మనిషి వచ్చి, ‘‘ఉంగరం తీసుకుని రాజుగారు రమ్మంటున్నారు,'' అని చెప్పాడు. పులిదొర తాను ఉంగరం దాచిన చోట వెతికి, ఉంగరం పోయినట్టు తెలుసుకుని, ‘‘నా ఆయువు మూడింది!'' అనుకున్నాడు. అతను తన భార్యను పిలిచి, ‘‘ఉంగరం చూశావా?'' అని అడిగాడు. నిజం చెబితే భర్త కొడతాడని గ్రహించి ఆమె ఉంగరం చూడలేదన్నది.
 
పులిదొర కాళ్ళీడ్చుకుంటూ రాజు వద్దకు వెళ్ళి, ఉంగరం చూపలేనన్నాడు. ‘‘అయితే నీకు మరణదండన తప్పదు,'' అన్నాడు రాజు. ‘‘శిక్ష రేపటిదాకా వాయిదా వెయ్యండి. ఈ లోపల నా వ్యవహారాలు చక్కబెట్టుకుంటాను,'' అన్నాడు పులిదొర. ‘‘సరే, రేపు ఉదయం కసాయీలను నీ ఇంటికి పంపుతాను,'' అన్నాడు రాజు. పులిదొర కాళ్ళీడ్చుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు. కాని మధ్య దారిలో అతనికి ఒక వాగు ఒడ్డున కాస్సేపు కూర్చోవాలని పించింది.

‘రేపు ఎలాగూ చస్తున్నాను గనక, ఇవాళ ఒక్క సుఖమైనా అనుభవిస్తాను. వాగులో పెద్ద చేపను పట్టి, నాకు కావలిసినట్టు భార్య చేత వండించుకు తింటాను,'' అనుకుని పులిదొర బొడ్డులో నుంచి చేపలు పట్టే గాలం పైకి తీసి, నీటిలో వేశాడు. కొంతసేపటికి చేప పడింది. పైకి తీసి చూస్తే అది ఒక పెద్ద తెల్ల చేప. పులిదొర దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి, ఇంటి వద్ద అతని భార్య లేదు. ఆమె వచ్చే లోపుగా తానే చేపను శుభ్రం చేతామనుకుని అతను దాన్ని కత్తితో కోసి, ఆనందంతో, ‘‘ఉంగరం! రాజుగారి ఉంగరం!'' అని కేకపెట్టాడు.
 
అతను అప్పటికప్పుడే రాజుగారి ఇంటికి పరుగుతీస్తూ, దారిలో కనిపించిన ప్రతి మిత్రుడితోనూ, ‘‘నా ఆయువు మూడిందే అనుకున్నాను, కాని బతికిపోయూను!'' అని గట్టిగా అరిచి చెప్పాడు. అతను రాజుగారి ఇంటికి చేరేసరికి అతని వెంట ఒక పెద్ద మూక తయూరయింది. ‘‘బయట ఏమిటా కోలాహలం?'' అని రాజు తన నౌకర్లను అడిగాడు. అంతలోనే పులిదొర తన మిత్రులతో సహా లోపలికి వచ్చి, రాజుతో, ‘‘ఇదుగో మీ ఉంగరం.
 
నా మరణదండనను మీరు రద్దుచెయ్యవచ్చు,'' అన్నాడు. రాజు మరణదండనను రద్దు చెయ్యక తప్పలేదు. అదీగాక, తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరం మళ్ళీ పులిదొర వద్దకు ఎలా వెళ్ళిందో, ఏ మాయశక్తులు పులిదొరకు సహాయపడుతున్నాయో రాజు ఊహించలేకపోయూడు. ఆయన తిరిగి పులిదొరకు అపకారం చేసే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. నిజానికి జరిగినదేమంటే, పులిదొర భార్య తనకు ఉంగరం తెచ్చి ఇయ్యగానే రాజు దాన్ని తన తల దగ్గిర ఉండే పీట మీద ఉంచాడు.
 
ఆ రాత్రి ఒక ఎలుక పీట మీదుగా పరిగెట్టుతూ, ఉంగరాన్ని నీళ్ళ కుండలోకి తోసింది. మర్నాడు రాజుగారి నౌకరు అలవాటు ప్రకారం ఆ కుండలోని నీళ్ళు వాగులో పారబోసి కొత్త నీరు పట్టుకుపోయూడు. రాజుకు ఇవేమీ తెలియనందున, తన ఉంగరం తిరిగి పులిదొరకు ఎలా దొరికినదీ ఊహించలేక పోయూడు.

No comments:

Post a Comment