మదన్‌పూర్ మహారాజుకు ఇద్దరు కుమారులు. జిత్తు, వీర్ అనే ఆ
ఇద్దరు చాలా అందమైన వాళ్ళేగాక తెలివైనవాళ్ళని కూడా పేరు తెచ్చుకున్నారు.
హఠాత్తుగా రాణికి జబ్బు చేసింది. ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు
చేసినప్పటికీ ఆమె జబ్బును నయం చేయలేకపోయూరు. ఒకనాడు ఆమె భర్తను దగ్గరికి
పిలిచి, ‘‘మన పిల్లల క్షేమం ముఖ్యం.
వారికోసం దయచేసి మళ్ళీ వివాహం చేసుకోకండి,'' అన్నది. రాజు ఆమె చేతులు
పట్టుకుని, ‘‘నీ కోరిక ప్రకారమే జరుగుతుంది,'' అన్నాడు. రాణి ఆ మాట విని
ప్రశాంతంగా కన్నుమూసింది. మహారాణి ప్రజాక్షేమం పట్ల శ్రద్ధగల కరుణా మయి
గనక, ఆమె మరణానికి మహారాజు మాత్రమే కాకుండా రాజ్య ప్రజలందరూ విషాదం
చెందారు.
కొన్నాళ్ళు గడిచింది. మహారాణి లేకుండా మహారాజు మాత్రమే సింహాసనంపై
ఆసీనుడు కావడం ప్రజలకు బాధ కలిగించింది. రాజు ద్వితీయ వివాహం చేసుకోవడం
అన్ని విధాలా శ్రేయస్కరమని భావించ సాగారు. ఒకనాడు ప్రధానమంత్రి రాజుతో,
‘‘తమరు ద్వితీయ వివాహం చేసుకోవాలి. రాజ్యానికి మహారాణి కావాలని ప్రజలు
కోరుకుంటున్నారు,'' అన్నాడు. ఆ మాట విని రాజు ఆలోచనలో పడ్డాడు.
మొదటి
రాణికి ఇచ్చిన మాట; పిల్లల భవిష్యత్తు తలుచుకుని కొంతసేపు ఒక నిర్ణయూనికి
రాలేకపోయూడు. కొంతసేపు ఏమీ మాట్లాడ లేక పోయూడు. ఆ తరవాత తలపంకిస్తూ, ‘‘సరే,
ప్రజాభీష్టం నెరవేర్చడం రాజుగా నా బాధ్యత. మళ్ళీ వివాహ మాడతాను,''
అన్నాడు. రాజును వివాహమాడిన కొత్త రాణి, తన అదృష్టానికి ఎంతగానో
పొంగిపోయింది. రాజును చాలా ప్రేమతో చూసుకుంటూ ఆయన కనుసన్నలలో మెలగసాగింది.
అయితే, రోజులు గడిచే కొద్దీ, రాజు తన కుమారుల పట్ల చూపు తూన్న
ఆప్యాయతను చూసి సహించలేక పోయింది. దానికి తోడు రాజుకు తరవాత ఆ ఇద్దరిలో
ఒకరే సింహాసనాన్ని అధిష్ఠించగలరుగనక, తనకు కలగబోయే సంతానానికి రాజ్యార్హత
ఉండదని ఆలోచించడంతో ఆమెకు రాజ కుమారుల పట్ల ఎనలేని ద్వేషభావం
పుట్టుకువచ్చింది. తన భవిష్యత్తు బావుండాలంటే ఆ ఇద్దరి అడ్డు ఉండకూడదని
భావించి ఒక నిర్ణయూనికి వచ్చింది. ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు.
రాణి, ఇద్దరు రాజకుమారులు మాత్రమే భవనంలో ఉన్నారు. రాణి తీవ్రంగా
ఆలోచించింది. వంటవాడు లేని సమయం చూసి, వంటగదిలోకి వెళ్ళి, మండుతూన్న
కొరివిని తీసి నుదుటి మీద, చేతుల మీద గాయపరచుకున్నది. రాజు తిరిగి రాగానే,
‘‘చూశారా, మీ ముద్దుల కుమారులు చేసిన అఘాయిత్యం! నా ప్రాణానికే ముప్పు
వచ్చి పడింది. వాళ్ళు సమీపంలో ఉంటే నా ప్రాణానికి రక్షణ ఉండదు. ఇక్కడి
నుంచి వాళ్ళయినా వెళ్ళాలి. లేకుంటే నేనైనా వెళ్ళిపోవాలి!'' అంటూ జుట్టు
విరబోసుకుని నానా రాద్ధాంతం చేసింది.
రాజు ఆమె మాటలు నమ్మాడు. సవతి తల్లి పట్ల అయిష్టం కారణంగా పసిపిల్లలు ఆ
పని చేసి వుండవచ్చని ఆయన భావించాడు. అయితే, ఆ విషయం గురించి వారిని ఏమీ
అడగలేదు. అలాంటి అఘాయిత్యం మరెప్పుడూ చేయకుండా పిల్లలకు సరైన గుణపాఠం
నేర్పాలని నిర్ణయించాడు. అప్పటికప్పుడే కొడుకులిద్దరనీ రథంలో ఎక్కించుకుని
అడవిని సమీపించిన రాజు, వాళ్ళను అక్కడ దించి, ‘‘మీరిద్దరూ ఇక్కడే
కూర్చోండి. నేను ఆవలివైపుకు వెళ్ళివస్తాను,'' అన్నాడు.
ఒక రాత్రంతా పిల్లలను అక్కడ ఉంచి, తెల్లవారాక వచ్చి తీసుకువెళితే,
వాళ్ళకూ బుద్ధి వస్తుంది; అంతలో రాణి కోపం కూడా చల్లారి, శాంతిస్తుందని
రాజు ఆశించాడు. అడవిలో కూర్చున్న జిత్తు, వీర్ ఎంతసేపటికీ తండ్రి తిరిగి
రాకపోయేసరికి, అక్కడి నుంచి లేచి చుట్టుపక్కల వెతికారు. ఆయన జాడ
కనిపించలేదు. సూర్యుడు అస్తమించి చీకటి కమ్ముకోసాగింది. అన్నదమ్ములు
రాత్రిని అడవిలోనే గడపాలనుకున్నారు. ఒక చెట్టుకింద ఒకరు
నిదురబోతున్నప్పుడు, మరొకరు మేలుకుని కాపలా ఉండాలని నిర్ణయించారు. చుట్టు
పక్కల ఉన్న చితుకులను ఏరి చలిమంట వేశారు.
చెట్టుకొమ్మ మీది చిలుకాగోరింకలు రాజకుమారుల చర్యలను ఎంతో ఆసక్తిగా
గమనించ సాగాయి. ‘‘పాపం పసిపిల్లలు. ఏమీ తినలేదు. ఆకలితో ఉన్నట్టున్నారు,''
అన్నది చిలుక. ‘‘మనం వెళ్ళి వెతికినా ఈ అపరాత్రి వేళ వాళ్ళకు ఎలాంటి ఆహారం
తీసుకురాగలం? నేనొకటి చెప్పనా?'' అని బదులు పలికింది గోరింక. ‘‘నీ మనసులో
ఏమున్నదో చెప్పుమరి. కేవలం సానుభూతి చూపడం వల్ల ప్రయోజనం ఉండదు కదా!''
అన్నది చిలుక.
‘‘ఆ పిల్లల ఆకలి తీర్చాలంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తున్నది.
మండుతున్న చలిమంటల్లోకి మనం దూకేద్దాం. మనల్ని కాల్చుకుని తిని వాళ్ళు ఆకలి
తీర్చుకుంటారు. ఏమంటావు?'' అన్నది గోరింక. ‘‘బావుంది. ఇతరుల ఆకలి
తీర్చడానికి మించిన ఉపకారం ఏముంటుంది? పైగా వాళ్ళు మన అతిథుల్లాంటివారు.
మరో విషయం. నా మాంసం తిన్నవాడు భవిష్యత్తులో రాజూ, నీ మాంసం తిన్నవాడు
మంత్రీ కాగలడు,'' అన్నది చిలుక. భవిష్యత్తును చూడగల శక్తి వున్న ఆ పక్షులు
కూడబలుక్కుని, మొదట చిలుక, దాన్ని అనుసరించి గోరింక చలిమంటల్లోకి
దూకేశాయి. ఆ సమయంలో జిత్తు నిదురపోతున్నాడు. మేలుకుని వున్న వీర్ పక్షులు
చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయి అన్నను తట్టి లేపి, ‘‘అన్నయ్యూ, మనం ఆకలితో
బాధపడనవసరం లేదు. రెండు పక్షులు మంటల్లోకి దూకేశాయి. వాటిని కాల్చి
తిందాం,'' అన్నాడు. ‘‘అలాగే తమ్ముడూ. నువ్వు పెద్ద దాన్ని తిను.
నేను
చిన్నదాన్ని తింటాను,'' అన్నాడు జిత్తు. ‘‘నువ్వు పెద్దవాడివి గనక,
పెద్దదాన్నీ, నేను చిన్నవాణ్ణి గనక, చిన్నపక్షినీ తిందాం,'' అన్నాడు వీర్.
ఆ సూచనకు జిత్తు అంగీకరించడంతో, అదే విధంగా వాళ్ళు పక్షులను కాల్చుకు తిని
ఆకలి తీర్చుకుని పడుకుని హాయిగా నిద్రపోయూరు. తెల్లవారాక కూడా చాలా
సేపటివరకు తండ్రి రాకపోయేసరికి, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చున్నారు.
హఠాత్తుగా ఒక అందమైన జింక అటుకేసి పరిగెత్తడం చూసిన జిత్తు, ‘‘తమ్ముడూ రా. ఆ
జింకను పట్టుకుందాం,''అంటూ జింక వెంట పరిగెత్తాడు.
అలా చాలా దూరం పరిగెత్తాక, జింక దూరంలో ఉన్న పొదల చాటుకు వెళ్ళి,
కనుమరుగై పోయింది. అక్కడ ఆగిన జిత్తు తమ్ముడి కోసం వెనుదిరిగి చూశాడు.
వీర్ కనిపించలేదు. అక్కడే ఒక చెట్టుకింద బండ మీద కూర్చున్నాడు. ఎంతసేపటికీ
తమ్ముడు రాకపోయేసరికి, లేచి ముందుకు నడిచాడు. అడవి ఆవలి ప్రాంతాన్ని
చేరుకున్నాడు. అది వేరొక రాజ్యం అక్కడి ప్రజలందరూ విచారగ్రస్తులై ఉండడం
చూసి ఆశ్చర్యపోయూడు.
కారణం అడిగితే రాజు మరణించాడనీ, ఆయన అంతిమ యూత్రను చూడడానికి ప్రజలు
అక్కడ చేరారనీ చెప్పారు. జిత్తు కూడా బాటకు ఒకవైపున జనం మధ్యకు వెళ్ళి
నిలబడ్డాడు. కొంతసేపటికి ఊరేగింపు అటుగా రాసాగింది. అలంకరించబడిన పల్లకిలో
రాజుగారి భౌతిక కాయూన్ని మోసుకువస్తున్నారు. ఊరేగింపుకు ముందు రాజగురువు
నడుస్తున్నాడు. ఆయన దృష్టి జనం మధ్య నిలబడివున్న జిత్తు మీద పడింది.
భటుణ్ణి పంపి అతణ్ణి దగ్గరికి పిలిచి, ‘‘ మా రాజుగారు మరణించారు.
ఆయనకు సంతానం లేదు. నీలో రాచఠీవి ఉట్టిపడుతున్నది. నువ్వు తప్పక
రాజవంశానికి చెందిన వాడివై ఉండాలి. మా రాజుగారి అంత్యక్రియలు నీ చేతుల
మీదుగా నిర్వహించు. యుక్త వయస్కుడివయ్యూక రాజ్యసింహాసనాన్ని
అధిష్ఠించవచ్చు,'' అన్నాడు. రాజగురువు మాటలు జిత్తుకు పూర్తిగా అర్థంకాక
పోయినప్పటికీ, తాను ఆ రాజ్యానికి మునుముందు రాజునయ్యే అవకాశం ఉందన్న విషయం
మాత్రం అర్థమయింది.
తననూ తన తమ్ముణ్ణీ అడవిపాలు చేసివెళ్ళిన తన తండ్రిని తలుచుకున్నాడు.
వెంటనే మరణించిన రాజుకు అంత్యక్రియలు నిర్వహించడానికి, ఊరేగింపుతో పాటు
రాజగురువు వెంట నడిచాడు. రాజగురువు పర్యవేక్షణలో జిత్తు చేతుల మీదుగా
రాజుగారి అంత్యక్రియలు జరిగిపోయూయి. జిత్తును రాజభవనానికి తీసుకువెళ్ళారు.
మరునాడు రాజగురువు సభను సమావేశ పరచి, ‘‘మన మహారాజుకు వారసుడు లభించాడు,''
అని ప్రకటించాడు. ఆ తరవాత మహారాణి కేసి చూశాడు. ‘‘ఈ రాజకుమారుడు,
మహారాజుగారికి తగిన వారసుడని భావిస్తున్నాను.
రాజగురువు అభిప్రాయూన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను,'' అన్నది
మహారాణి. రాజకుమారుడు జిత్తు, జితేంద్రుడు అనే పేరుతో ఆ రాజ్యానికి
యౌవరాజుగా అభిషిక్తుడయ్యూడు. అదే సమయంలో జింకను పట్టడానికి పరిగెత్తిన అన్న
వెంట చాలా దూరం పరిగెత్తిన వీర్ అలిసిపోయి ఒక బండమీద కూర్చున్నాడు.
ఆ తరవాత పరిగెత్తలేక, అన్నను కలుసుకోగలనో, లేదో అని విచారపడసాగాడు.
అప్పుడు ఆదారిలోవచ్చిన ఒక వృద్ధుడు, ‘‘నువ్వెవరు? ఇక్కెడెందుకు ఒంటరిగా
కూర్చున్నావు?'' అని అడిగాడు. ‘‘మా అన్ననూ, నన్నూ మా తండ్రి రాత్రి అడవిలో
వదిలివెళ్ళాడు. రాత్రంతా అడవిలో గడిపాము. తెల్లవారాక ఒక జింక కనిపించడంతో
దాన్ని పట్టుకోవడానికి మా అన్న వెళ్ళాడు. నేను అతని వెంట కొంత దూరం
పరిగెత్తి ఆ తరవాత పరిగెత్తలేక ఆగిపోయూను.
మా అన్నను చూడగలనో లేదో తెలియడం లేదు,'' అన్నాడు వీర్ విచారంగా. ‘‘మీ
అన్నను గురించి విచారించకు. పొద్దు పోయి చీకటి పడుతున్నది. రేపు
వెతుకుదాం. ఇప్పుడు నా వెంటరా, వెళదాం,'' అన్నాడు ఆ వృద్ధుడు. వీర్
వృద్ధుడి వెంట బయలుదేరాడు. మార్గమధ్యంలో తాను ఎవరైనదీ వీర్‌త ఆయనకు
చెప్పాడు. కొంత సేపటికి వాళ్ళొక పెద్ద భవనాన్ని సమీపించారు. అది ఆ వృద్ధుడి
ఇల్లే. ‘‘మీ అన్న కనిపించేంతవరకు నువ్వు ఇక్కడే ఉండవచ్చు.
నీకు ఎలాంటి కొరతా లేకుండా నేను చూసుకుంటాను,'' అన్నాడు వృద్ధుడు.
వీర్ అందుకు సమ్మతించడంతో, ఆ ప్రాంతానికి జమీందారయిన ఆ వృద్ధుడు అతనికి
ఆహార పానీయూలూ సకల సదుపాయూలూ సమకూర్చడమే కాకుండా విద్యాబోధనకు కూడా ఏర్పాటు
చేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయూయి.
ఒకనాడు
పొరుగురాజ్యంలో యుక్తవయస్కుడైన యువరాజుకు పట్టాభిషేకం జరుగనున్నదని వృద్ధ
జమీందారుకు తెలిసింది. సంతానం లేని ఆ రాజు మరణించడంతో అంత్యక్రియలు
నిర్వహించిన పొరుగుదేశపు రాకుమారుణ్ణి రాజగురువు సింహాసనానికి వారసుడిగా
ఎంపిక చేశాడన్న సంగతి కూడా జమీందారుకు తెలియవచ్చింది.
దాంతో ఆ యువరాజు జితేంద్రుడు, వీర్ అన్న జిత్తు అయివుండవచ్చునన్న
అనుమానం ఆయనకు కలిగింది. జమీందారు తన అనుమానాన్ని బయట పెట్టకుండా వీర్‌ను
వెంటబెట్టుకుని యువరాజు పట్టాభిషేక మహోత్సవం చూడడానికి బయలుదేరాడు.
పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఆ తరవాత రాజును దర్శించడానికి వెళ్ళిన
జమీందారు, ‘‘అడవిలో జింకను పట్టడానికి వెళ్ళిన అన్న వెంట పరిగెత్తలేక
వెనకబడి ఆగిపోయిన తమ్ముడు తమకు గుర్తున్నాడా ప్రభూ!'' అని అడిగాడు.
వృద్ధ జమీందారు పక్కనే నిలబడ్డ యువకుణ్ణి ఒక క్షణం పరిశీలనగా చూసిన
రాజు జితేంద్రుడు, తటాలున సింహాసనం నుంచి లేచి, ‘‘తమ్ముడూ, వీర్!'' అంటూ
వచ్చి అతణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ‘‘తప్పిపోయిన నా తమ్ముడు మళ్ళీ
నావద్దకు రావడం నాకెంతో సంతోషం కలిగిస్తున్నది. పట్టాభిషేకానికన్నా
మహదానందం కలిగించిన రోజు ఇది!'' అంటూ సభికుల కేసి తిరిగి, ‘‘వీర్, నా
సహోదరుడు.
దురదృష్టవశాత్తు చిన్నప్పుడు విడిపోయిన మేము ఇప్పుడు అదృష్టవశాత్తు
చాలా సంవత్సరాల తరవాత కలుసుకుంటున్నాం. వీర్‌ను వీరేంద్రుడనే పేరుతో నా
ప్రధాన మంత్రిగా నియమిస్తున్నాను!'' అన్నాడు. ఆ విధంగా సంవత్సరాల క్రితం
చిలుకచెప్పిన మాట నిజమయింది.
No comments:
Post a Comment