గంగాపురంలోని భూషయ్య, పార్వతమ్మల ఏకైక సంతానం శారద. ఏలోటూ లేని పెద్ద
రైతు కుటుంబం వారిది. ఉన్నంతలో పదిమందికీ సాయపడే గుణం ఆ కుటుంబానిది.
పెళ్ళీడుకొచ్చిన శారద చాలా తెలివిగల అమ్మాయి. గ్రామంలో ఎవరికైనా ఏదైనా
సమస్య ఎదురయితే, శారద చిటికెలో పరిష్కరించేది. ఆమెను చూసి తల్లిదండ్రులు
ఎంతో సంతోషించారు. శారద పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభమయ్యూయి. భూషయ్య
పెళ్ళిళ్ళ పేరయ్యకు కబురు చేయగానే అతడు వచ్చాడు.
సంచీలో నుంచి రెండు ఛాయూచిత్రాలు తీసి భూషయ్య ముందుంచాడు. అందులోని
మొదటి చిత్రాన్ని చూపుతూ, ‘‘అయ్యూ, ఈ అబ్బాయి పేరు చంద్రం. రామాపురం
ఇతనిది. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. పేరుకు తగ్గట్టు, స్వచ్ఛమైన,
మచ్చలేని చందమామ వంటివాడు. ఇక ఆస్తులంటారా. తిండికీ, బట్టకూ లోటు ఉండదు.
వీరింటివాకిలి ఎప్పుడూ పదిమందితో కళకళలాడుతూ ఉంటుంది,'' అన్నాడు పేరయ్య. ఆ
తరవాత రెండవ చిత్రాన్ని చూపుతూ, ‘‘ఇతడి పేరు భాస్కరం. ఊరు శంఖవరం.
మేఘాలతో ఆకాశం ముసురుకున్నా అందరికీ కనిపించే మధ్యాహ్నం
సూర్యుడులాంటివాడు. సూర్యుడైనా పడమర అస్తమిస్తాడుగాని, ఇతగాడు అస్తమించని
సూర్యుడంటే నమ్మండి. ఇక ఆస్తుల విషయూనికి వస్తే చంద్రంకన్నా నాలుగు రెట్లు
ఎక్కువ. ఇతడూ ఇంటికి ఒక్కడే వారసుడు,'' అన్నాడు. నాలుగు రోజుల తరవాత తమ
నిర్ణయం చెబుతామని, పేరయ్యను పంపేసి, ఆ రాత్రే శారద అభిప్రాయం అడిగాడు
భూషయ్య.
శారద
కొంతసేపు ఆలోచించి, ‘‘నేను చంద్రంనే పెళ్ళిచేసుకుంటాను,'' అన్నది.
‘‘అదేంటి తల్లీ, ఆస్తిపాస్తులలో చంద్రంకంటే నాలుగు రెట్లు అధికంగా ఉన్న
భాస్కరంతోనే నువ్వు సుఖపడగలవనుకుంటాను,'' అన్నది తల్లి పార్వతమ్మ. భూషయ్య
కూడా భార్యను సమర్థించాడు. ‘‘మీరు ఆస్తిపాస్తులే చూశారు గాని, పేరయ్య
మాటలను అసలు విన్నట్టు లేదు,'' అన్నది శారద.
‘‘ఏమోమరి. పేరయ్య మాటల్లోని తిరకాసు నీకే తెలియూలి, ఇంతకూ అదేంటి?''
అని అడిగాడు భూషయ్య. ‘‘ఎన్నడూ అస్తమించని సూర్యుడులాంటివాడు భాస్కరం అని
పేరయ్య అన్నారు కదా? అంటే, అతడు పరమ కోపిష్ఠి అని భావం. అందరి మీదా పెత్తనం
చెలాయించాలని చూస్తాడు. మబ్బులు ముసిరినా వెలిగేఘటం అంటే, భాస్కరం ఎవరి
మాటా వినడని అర్థం, అలాంటి వ్యక్తితో ఎలా కాపురం చేయడం?'' అన్నది శారద.
‘‘మరి చంద్రం సంగతేమిటి?'' అని అడిగాడు భూషయ్య. ‘‘చంద్రుడికి స్వయం
ప్రకాశం లేదు. సూర్యుడి కాంతిని స్వీకరించి చల్లని వెలుగులు విరజిమ్మేవాడే.
అంటే, చంద్రం తల్లిదండ్రుల, పెద్దల సలహాలు తీసుకుని, బాగా ఆలోచించి
ముందడుగు వేస్తాడన్న మాట. అతన్ని నేను పెళ్ళి చేసుకుంటే, నా సలహాలు కూడా
తీసుకుంటాడు. కాపురంలో ఎలాంటి పొరపొచ్చాలకూ, గొడవలకూ తావుండదు. అందుకే
చంద్రం గురించి స్వచ్ఛమైన మచ్చలేని చందమామలాంటివాడని పేరయ్య చెప్పారు.
ఆ ఇంటి వాళ్ళందరూ కలుపుగోలుగా ఉంటారుగనకే, ఇంటివాకిలి ఎప్పుడూ
పదిమందితో కళకళలాడుతూ ఉంటుంది. ఎంత ఆస్తిపాస్తులున్నా తినేది ముద్దన్నమే.
మనింటి వాతావరణమే చంద్రం కుటుంబంలో ఉంది. మానవీయ లక్షణాలున్న చంద్రం ఇంట్లో
గంజయినా నాకు అమృతమే,'' అన్నది శారద దృఢంగా. కూతురువంక మెచ్చుకోలుగా
చూశాడు భూషయ్య. కూతురి తెలివికి పార్వతమ్మ పొంగిపోయింది. శారద ఇష్టానుసారం
చంద్రంతో వివాహం జరిపించారు.
No comments:
Post a Comment