Pages

Saturday, September 15, 2012

దేవుడికి అవకాశం!


రామాపురం కామయ్య తన తోటలో పండించిన కూరగాయలను బస్తాలకు నింపి బండిలో వేసుకుని అమ్మడానికి పట్నం సంతకు బయలుదేరాడు. అడవి కనుమ ప్రాంతంలో బాట మలుపు తిరుగుతూండగా బండి చక్రం ఒకటి పక్కకు వాలిపోయింది. ‘‘దేవుడా! కాపాడు,'' అంటూ బండి నుంచి కిందికి దూకిన కామయ్య తలపై చేతులు పెట్టుకుని కూర్చున్నాడు.
 
దేవుళ్ళందరినీ పేరు పేరునా ప్రార్థించాడు. అయినా ఒక్క దేవుడూ పలకలేదు. ఆఖరికి లేచి నడుం బిగించి ఎడ్లను అదిలిస్తూ తనే స్వయంగా వాలిపోయిన బండి చక్రాన్ని పైకెత్తడానికి పూనుకున్నాడు. కామయ్య తాను అనుకున్న దాని కన్నా బండి చక్రం సులభంగా బాటమీదికి చేరడంతో ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూశాడు. వెనక ఒక దృఢకాయుడు తనతో భుజం కలిపి చక్రాన్ని పైకెత్తడం వల్లే అది సాధ్యమయిందని గ్రహించి కామయ్య అతడికి దణ్ణం పెట్టి, ‘‘దేవుడు చేయనిసాయం సమయూనికి నువ్వు వచ్చి చేశావు.
 
చల్లగా ఉండాలి బాబూ,'' అన్నాడు. ‘‘దేవుడా కాపాడు అంటూ డీలాపడి కూర్చుంటే దేవుడు మాత్రం ఏంచేస్తాడు? నువ్వు ప్రయత్నిస్తేనే దేవుడిక్కూడా సాయపడే అవకాశం కలుగుతుంది,'' అని నవ్వుతూ చెట్టుకు ఆనించిన కట్టెల మోపును తలపైకెత్తుకుని తన దారిన వెళ్ళిపోయూడా మనిషి.

No comments:

Post a Comment