అవంతీ నగర సమీపంలోని అరణ్య ప్రాంతం లోగల ఒక గ్రామంలో రంగయ్య, మాధవయ్య
అనే ఇద్దరు మిత్రులు ఇరుగుపొరుగు ఇళ్ళల్లో నివసిస్తూండేవాళ్ళు. ఇద్దరూ
అడవికి వెళ్ళి, మూలికలను సేకరించి, నగరానికి తీసుకుపోయి వైద్యులకు అమ్మి,
వాళ్ళిచ్చే సొమ్ముతో తమ కుటుంబాలను నెట్టుకు రాసాగారు.
ఇద్దరూ కష్టపడి శ్రమించే స్వభావం కలవారు. మాధవయ్యకు మితిమించిన
దైవభక్తి. ఎప్పటికైనా దేవుడి కరుణతో తమ కష్టాలు తొలగిపోయి, చీకూ చింతా లేని
జీవితం గడపగలమని కలలు కంటూ ఉండేవాడు. రంగయ్యకు దైవభక్తి లేకపోలేదు గాని,
అంతకు మించిన పరోపకారబుద్ధి కలవాడు. అడవికీ, గ్రామానికీ మధ్య చిన్న వాగు
పారుతోంది. దాని గట్టున వేపచెట్టు కింద అమ్మవారి గుడి ఉంది. మిత్రులు
ఇద్దరూ అడవిలోకి వెళ్ళే ముందు అమ్మవారికి మొక్కుకుని వెళ్ళేవారు. తిరిగి
వచ్చేప్పుడు, అడవిలో దొరికిన ఒకటి రెండు పళ్ళను, అమ్మవారి విగ్రహం ముందుంచి
వెళ్ళేవారు. అలా రోజులు గడిచేవి.
ఒకనాడు
వాళ్ళు అడవినుంచి తిరిగి వస్తుండగా, గుడి ముందు కంటిచూపు సరిగా లేని ఒక
ముసలివాడు కనిపించాడు. మితిమించిన నీరసం కారణంగా లేచి నిలబడలేక పోయూడు.
రంగయ్య ముసలివాణ్ణి చూడగానే, వాగు నుంచి నీళ్ళు తెచ్చి తాగడానికి ఇచ్చి,
దప్పిక తీర్చాడు. ఆ తరవాత చేతిలోని పళ్ళనిచ్చి, నగరానికి బయలుదేరాడు.
అయితే, మాధవయ్య, ముసలివాణ్ణి ఏమాత్రం పట్టించుకోలేదు. అమ్మవారికి భక్తితో
మొక్కుకుని, సేకరించిన మూలికలతో నగరం కేసి బయలుదేరాడు.
మరునాడు కూడా ముసలివాడు అక్కడే ఉన్నాడు. రంగయ్య, తెచ్చుకున్న
రొట్టెల్లో రెండు అతనికిచ్చి తినమన్నాడు. తిరిగి వచ్చేప్పుడు అడవి నుంచి
తెచ్చిన పళ్ళను కొన్ని ముసలివాడికిచ్చి బయలుదేరాడు. ఇలాగే మూడు రోజులు
గడిచాయి.
మూడో రోజు సాయం కాలం, రంగయ్య ఇంటి ెనక కొట్టంలో ఆవును కట్టేసిన గుంజ
పైకి రావడంతో, దాన్ని మళ్ళీ నాటడానికి అతడు పక్కనే గోతిని తవ్వసాగాడు.
అప్పుడు గునపానికి ఏదో గట్టిగా తగిలింది. తీసి చూస్తే, చిన్న రాగి పాత్ర.
దాన్నిండా బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూడగానే, తన దరిద్రం
తీరిపోయిందని రంగయ్య ఎంతగానో సంతోషించాడు.
మరునాడు తెల్లవారగానే, ఈ సంతోష విషయూన్ని ముసలివాడికి చెబుదామని,
మరిన్ని రొట్టెలు తీసుకుని రంగయ్య గుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే, అక్కడ
ముసలివాడు కనిపించలేదు. రంగయ్య అమ్మవారికి మొక్కుకుని ఇంటికి
తిరిగివచ్చాడు. దొరికిన ధనంతో కొద్దిగా పొలం కొనుక్కుని వ్యవసాయం
ప్రారంభించాడు. తీరిక దొరికినపుడల్లా అడవికి వెళ్ళి, మునుపటిలాగే మూలికలు
సేకరించుకు వచ్చి అమ్ముకుంటూ, హాయిగా భార్యాపిల్లలతో కాలం గడపసాగాడు.
ఇదంతా చూసి మాధవయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఒకనాడు అడవి నుంచి
తిరిగి వచ్చి, మిట్టమధ్యాహ్నం కావడంతో, వాగులో కాళ్ళుచేతులు కడుక్కుని,
అమ్మవారి గుడి ముందు కూర్చుని, ‘‘తల్లీ, నేను నిన్ను ఎంత భక్తితో
కొలుస్తున్నాను? అయినా, నా మీద నీకు దయ కలగడం లేదు! నా బ్రతుకు ఇంతేనా?''
అనుకుంటూ చెట్టు బోదెకు ఆనుకుని అలాగే నిద్రపోయూడు. అప్పుడతనికి ఒక
కలవచ్చింది. ‘‘నా మీద భక్తి చూపుతున్నావు, సంతోషం.
అయితే, సాటి మనుషుల మీద కనికరం అన్నది నీలో కరువయింది కదా? కంటిచూపు
లేక కదలలేని ముసలివాడికి సాయం చేయకుండా నన్ను మొక్కి ప్రయోజనం ఏమిటి?
నీలాంటి వాడికి సంపదలు కలిగితే, పొరుగువారికి ఒరిగేదేమిటి? నీ మిత్రుడు
రంగయ్య వంటి వాడికి సంపదలు కలిగితే, చుట్టూ ఉన్న పదిమందికీ సాయపడగలడు.
సంపదల వల్ల ప్రయోజనమే అది కదా. సాటి మనిషికి సాయపడాలనే దయూగుణమే
అతడికి సిరిసంపదలను తెచ్చిపెట్టింది?'' అన్న మాటలు వినిపించాయి. మాధవయ్య
ఉలిక్కిపడి లేచాడు. ‘‘తల్లీ, నా కళ్ళు తెరిపించావు. ఇకపై నాలాగే అందరినీ
భావించి, చేయ తగిన సాయం చేయగలను,'' అంటూ అమ్మవారికి మొక్కుకుని ఇంటిదారి
పట్టాడు.
No comments:
Post a Comment