రెండవ తరగతి చదువుతూన్న వంశీ చాలా తెలివైనవాడు. మంచి మార్కులు
తెచ్చుకుంటూ ఉపాధ్యాయుల మెప్పు పొందేవాడు. తల్లిదండ్రులకు సంతోషం
కలిగించేవాడు. ప్రకృతి అంటే వంశీకి చాలా ఇష్టం. ఆకాశంలో కదిలిపోయే మేఘాలు,
మెరిసే నక్షత్రాలు, చుట్టుపక్కల చెట్టుచేమలు అన్నిటినీ అమితాసక్తితో
పరిశీలించి చూసేవాడు. వాటన్నిటికీ మించి జంతువులన్నా పక్షులన్నా వంశీకి
చెప్పలేనంత ప్రేమ. పక్షులు చేసే రకరకాల శబ్దాలు విని పులకించి పోయేవాడు.
వాటిని అనుకరిస్తూ పక్షులతో స్నేహం చేసినంతగా సంబరపడిపోయేవాడు. ఒకనాడు
వంశీ, ‘‘అమ్మా, మనుషులకు మాట్లాడే శక్తినిచ్చిన దేవుడు జంతువులకూ,
పక్షులకూ ఎందుకు ఇవ్వలేదు?'' అని అడిగాడు తల్లిని. ‘‘దేవుడు ప్రతి జీవికీ
నోరునిచ్చాడు వంశీ. రకరకాల అరుపులతో, కూతలతో అవి తమలో తాము
మాట్లాడుకుంటాయి. భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయి.
అంతెందుకు? కొన్ని జంతువులయితే మనిషి భాషను అర్థం చేసుకుంటాయి.
నేర్పితే కొన్ని మాటలు కూడా నేర్చుకోగలవు,'' అన్నది తల్లి కొడుకును
ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ.ఒక రోజు సాయంకాలం బడి నుంచి తిరిగివస్తూన్న
వంశీకి దారి పక్కన కాలువిరిగి పడివున్న చిలుక కనిపించింది. జాలిపడ్డ వంశీ
దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకోబోయూడు. అంత బాధలోనూ అది
వంశీని చూసి వెనక్కు జరిగింది.
‘‘భయపడకు.
నాతో వస్తే విరిగిన కాలికి కట్టుకట్టి, బాగు చేస్తాను. తియ్యటి
పళ్ళిస్తాను.నువ్వు శక్తిని పుంజుకుని మామూలు స్థితికి రాగానే, నిన్ను
స్వేచ్ఛగా వదిలి పెడతాను,'' అంటూ వంశీ దాన్ని మెల్లగా తన చేతుల్లోకి
తీసుకుని ఇల్లు చేరాడు. శుభ్రమైన నీళ్ళతో చిలుకగాయూన్ని కడిగి,
తల్లిదండ్రుల సాయంతో మందువేసి కట్టు కట్టాడు. పళ్ళు తినిపించాడు.
మరునాడు తండ్రి తెచ్చిన పంజరంలో చిలుకను ఉంచి, పంజరాన్ని పెద్ద తాడుతో
వాకిట్లో ఉన్న దానిమ్మ కొమ్మకు వేలాడ దీశాడు. ఇతర జంతువులు, పక్షులు
పంజరాన్ని సమీపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. వంశీ చూపిన శ్రద్ధ
కారణంగా చిలుక వారం రోజుల్లోనే కోలుకున్నది. హాయిగా లేచి గంతులు వేయడం
మొదలుపెట్టింది. దాన్ని చూసి ఎంతో ఆనందించిన వంశీ, దానికి చిన్న చిన్న
మాటలు నేర్పడం మొదలుపెట్టాడు.
అంతేగాని, గాయం మానాక, చిలుకను స్వేచ్ఛగా వదిలి పెడతానని చెప్పిన
మాటను మరిచిపోయూడు. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. చిలుకను ఇంటికి తీసుకు
వచ్చిన రోజు సందర్భంగా దానికి పుట్టిన రోజు పండుగ జరిపితే బావుంటుందని వంశీ
తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు సరే ననడంతో పంజరాన్ని రంగురంగుల
కాగితాలతో అలంకరించాడు. ఆ రోజు ఆదివారం గనక స్నేహితులందరినీ పిలిచాడు.
అయినా, చిలుకలో ఏమాత్రం ఉత్సాహం లేక పోగా, చాలా విచారంగా కనిపించింది.
వంశీ దానికి పుట్టిన రోజు గురించీ, తాను దాని కోసం తెప్పించిన రకరకాల పళ్ళ
గురించీ, రానున్న స్నేహితుల గురించీ చెప్పాడు. చిలుక అంతా వింటూ
ఊరుకున్నదేగాని, నోరువిప్పలేదు. అంతవరకున్న సంతోషం కూడా కనిపించలేదు. కారణం
అంతుబట్టక, వంశీ మధ్యాహ్న భోజనం తరవాత, దాన్ని గురించి ఆలోచిస్తూ, అలాగే
నిద్రపోయూడు.
‘‘వంశీ, పుట్టిన రోజు పండుగను ఎవరికి ఏర్పాటు చేస్తున్నావు?'' అని
అడిగింది చిలుక. ఆ మాట వినగానే తడబడ్డ వంశీ, ‘‘నీకే చిలకమ్మా,'' అన్నాడు.
‘‘అంటే, నాకు పండుగ గనక, ఈ రోజు నేను సంతోషంగా గడపాలి. పండుగరోజు అంటే
బంధుమిత్రులతో హాయిగా గడపాలి.
మరి నా మాటేమిటి? నన్ను పంజరంలో బంధించావు. స్వేచ్ఛ లేకుండా చేశావు.
నా బంధుమిత్రులకు దూరం చేశావు. గాయం మానాక వదిలి పెడతానని ఇచ్చిన మాట
మరిచావు. నేనెలా సంతోషంగా ఉండగలను?'' అన్నది చిలుక. వంశీ ఉలిక్కిపడి కళ్ళు
తెరిచాడు. లేచి పంజరం వద్దకు మెల్లగా నడిచాడు. వణుకుతూన్న చేతులతో పంజరం
తలుపుతీశాడు.
చిలుక వెలుపలికి గెంతి, తృప్తిగా రెక్కలల్లార్చింది. దాని కళ్ళల్లో
అమితమైన ఆనందం కనిపించింది. రివ్వున ఎగిరి దాపులనున్న జామచెట్టు మీదికి
వెళ్ళింది. ఊరంతా వినిపించేలా కిలకిలారావం చేసింది. దాని స్వరంలో ధ్వనించిన
స్వేచ్ఛను గమనించిన మరికొన్ని చిలుకలు కిలకిలారావాలతో వచ్చి జామ చెట్టు
మీద వాలాయి. చెట్టు వింత శోభను సంతరించుకున్నది. ఆ దృశ్యాన్ని చూసి వంశీ,
అతడి తల్లిదండ్రులు, మిత్రులు ఎంతో సంతోషించారు. అప్పుడు వంశీ తల్లి,
‘‘చూశావా వంశీ! స్వేచ్ఛ కలగగానే చిలుక ఎంత సంతోషంగా ఉందో.
స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మనుషులకే కాదు. సకల జీవరాశులకూ అవసరం. మన
భారతీయ సంస్కృతీ సంప్రదాయూలు చెప్పేది కూడా అదే. దేవుడు సర్వవ్యాపి
అనడంలోని అంతరార్థం అదే. పావురం కోసం తన ప్రాణాలనే ఇవ్వడానికి సంసిద్ధుడైన
శిబి చక్రవర్తి కథ నీకు తెలుసు కదా?'' అన్నది. తల్లి మాటలు వింటూంటే వంశీ
మనసు మరింత ఆనందంతో ఉప్పొంగింది.
No comments:
Post a Comment