కొత్వాలు సంగమేశ్వరుడు ఒకనాడు సాయంకాలం గుర్రం మీద నగర వీధిలో వెళుతూ,
నలుగురు కలిసి ఒక యువకుణ్ణి కొట్టడం గమనించి, ‘‘ఎందుకు అతణ్ణి
కొడుతున్నారు?'' అని అడిగాడు. ‘‘వీడు గురవయ్యదుకాణంలో బియ్యం మూట
దొంగిలించాడు. అందుకే కొడుతున్నాం,'' అన్నాడు ఆ నలుగురిలో ఒకడు. ‘‘వాడు
దొంగతనం చేస్తే కొట్టడానికి మీరెవ్వరు?'' అని అడిగాడు కొత్వాలు కోపంగా.
‘‘దొంగతనం నేరం కదా? అందుకే కొట్టాం,'' అన్నారు వాళ్ళు కాస్త
బెరుగ్గా. ‘‘నేరం చేసినవాణ్ణి రక్షకభటులకు అప్పగించాలి. విచారణ జరగాలి.
నేరం రుజువైతే శిక్షపడుతుంది. అంతేగాని, న్యాయూధికారి చేయవలసిన పనిని
మీరెలా చేస్తారు?'' అంటూ కొత్వాలు రక్షకభటులను పిలిచి, దొంగతనం ఆరోపించబడిన
యువకుడితో పాటు, అతణ్ణి కొట్టిన నలుగురినీ ఠాణాకు తరలించాడు.
మరునాడు వాళ్ళందరినీ న్యాయూధికారి ముందు హాజరు పరిచాడు కొత్వాలు. ‘‘నీ
పేరేమిటి?'' అని ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు న్యాయూధికారి. ‘‘వీరయ్య,''
అన్నాడు యువకుడు. ‘‘నువ్వు గురవయ్య దుకాణంలో బియ్యం మూట దొంగిలించావని
ఆరోపిస్తున్నారు, నిజమేనా?'' అని అడిగాడు న్యాయూధికారి. ‘‘అయ్యూ, నేను వారం
రోజులుగా గురవయ్య ఇంటి ప్రహరీగోడ కట్టే పనిచేశాను.
వారానికి కూలీ బియ్యంమూట ఇస్తానని ఆయన చెబితేనే నేను పని
మొదలుపెట్టాను. పనిపూర్తి చేశాను. అంతలో, ‘పెరట్లో ఉన్న నీళ్ళ బావి చుట్టూ
వున్న గోడ దెబ్బతిన్నది. పాతగోడ పడగొట్టి కొత్త గోడ కట్టు,' అన్నాడు
గురవయ్య.
దానికి రెండు రోజులు పడు తుంది. నేను ఊరెళ్ళి మళ్ళీ వస్తాననీ, మొదట
చేసిన పనికి కూలీ కింద మాట్లాడుకున్న మూట బియ్యం ఇవ్వమనీ అడిగాను. అందుకు
గురవయ్య ఒప్పుకోలేదు. దాంతో నాకు కోపం వచ్చి దుకాణంలో వున్న బియ్యం మూట
ఎత్తుకుని పోతూంటే గురవయ్య, ‘దొంగ, దొంగ' అని కేకలు పెట్టాడు.
ఈ నలుగురూ వచ్చి నన్ను పట్టుకుని కొడుతూంటే కొత్వాలుగారు చూసి
విడిపించారు,'' అని వీరయ్య జరిగినదంతా వివరంగా చెప్పాడు. ‘‘గురవయ్యూ,
వీరయ్య చెప్పినది నిజమేనా?'' అని అడిగాడు న్యాయూధికారి. ‘‘నా దుకాణం నుంచి
వీరయ్య దౌర్జన్యంతో బియ్యం మూటను దొంగిలించడం నిజం!'' అన్నాడు గురవయ్య
ఆవేశంగా. ‘‘మరి, వాడు వారం రోజులు చేసిన పనికి మాట్లాడుకున్న కూలీ ఇవ్వక
పోవడం నీ తప్పుకాదా?'' అని అడిగాడు న్యాయూధికారి.
‘‘ఇవ్వనని నేను చెప్పలేదు. పని పూర్తిచేస్తే ఇస్తానన్నాను, అంతే,''
అన్నాడు గురవయ్య. ‘‘మొదట మాట్లాడుకున్న పనిచేశాక కూడా ఇస్తానన్న బియ్యంమూట
ఇవ్వకుండా అదనపు పని పురమాయించడం నీది నేరమే. అందుకు పది వరహాలు జరిమానా
విధిస్తున్నాను,'' అన్న న్యాయూధికారి, వీరయ్య కేసి తిరిగి, ‘‘గురవయ్య
ఇస్తానన్న కూలీ ఇవ్వకపోతే అధికారులకు చెప్పుకోవాలే తప్ప, దౌర్జన్యంతో
బియ్యం మూటను ఎత్తుకెళ్ళడం నీ నేరం.
అందుకు శిక్షగా నువ్వు ఊరెళ్ళి తిరిగి వచ్చి, ఆ బావిగోడ కట్టి పూర్తి
చేయూలి. అప్పుడు మూట బియ్యం, గురవయ్య చెల్లించే పదివరహాలు నువ్వు
తీసుకోవచ్చు,'' అన్నాడు. వీరయ్య సరేనన్నట్టు తలాడించాడు. ఆ తరవాత
న్యాయూధికారి, ‘‘గురవయ్య దొంగ అని అరవగానే నిజానిజాలు తెలుసుకోకుండా
వీరయ్యను కొట్టినందుకు ఈ నలుగురికీ వారం రోజులు కారాగార శిక్ష
విధిస్తున్నాను.
ఇలా ఎవరికి వారు తొందరపడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే మళ్ళీ
నేరాలు పెరిగిపోయి, న్యాయవ్యవస్థ అస్తవ్యస్తమై పోయే అపాయం ఉంది. దాన్ని
మొదటే అరికట్టాలి,'' అన్నాడు. న్యాయూధికారి తీర్పు విని అందరూ చప్పట్లు
కొట్టారు.
No comments:
Post a Comment