Pages

Saturday, September 15, 2012

అద్భుతమైన చిన్న పళ్ళు


కొన్ని సంవత్సరాల క్రితం, ఇద్దరు విజ్ఞానవేత్తలు కేరళలోని అగస్త్య కొండల మీది అడవిలో తిరుగుతున్నారు. అరుదైన మొక్కలను వెతికి కనుగొనడానికి బయలుదేరిన వారికి స్థానికుడైన మల్లన్‌ కణి దారి చూపుతున్నాడు. కొండకు దాపుల గూడెంలో నివసించే కణి అనే గిరిజన తెగకు చెందినవాడు మల్లన్‌ కణి. అక్కడే పుట్టి పెరగడం వల్ల అతనికి ఆ అడవుల గురించి క్షుణ్ణంగా తెలుసు.
 
ఎండ తీవ్రంగా కాయడం వల్ల విజ్ఞానవేత్తలు తొందరగా అలిసిపోయూరు. అయితే, మల్లన్‌ మాత్రం ఏమాత్రం అలిసిపోకుండా ముందుకు నడవసాగాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించిన చిన్న పళ్ళు కోసుకోవడానికి మాత్రం ఆగుతున్నాడు. అతడి ఉత్సాహాన్ని చూసి విజ్ఞానవేత్తలు ఆశ్చర్యపోయూరు. ‘‘అతడి జీవన విధానం వల్ల అలా ఉన్నాడా? లేక అప్పుడప్పుడు నోట్లో వేసుకుని నములుతూన్న చిన్నపళ్ళ కారణంగా అంత ఉత్సాహంగా కనిపిస్తున్నాడా?'' అని వాళ్ళకు అనుమానం కలిగింది.
 
ఆత్రుతకొద్దీ వెంటనే వాళ్ళు మల్లన్‌ నుంచి రెండు పళ్ళు తీసుకుని నోట్లో వేసుకుని నమిలి మింగారు. నిమిషాల్లో వారికి బలం, నూతనోత్తేజం కలగడంతో మరింత విస్తుపోయూరు. వాళ్ళ మనసు ఆనందంతో ఉప్పొంగింది. మెదడులో రకరకాల ఆలోచనలు సుడులు తిరగసాగాయి.
 
ఈ పళ్ళను నగర ప్రజలకు అందజేస్తే ఎంత బావుంటుంది? ఈ పళ్ళ నుంచి ఔషధాలు తయూరు చేసి అమ్మితే దానివల్ల మరింత మంది ప్రయోజనం పొందగలరు కదా? విజ్ఞానవేత్తలు ఆ పళ్ళను కాచే చెట్టును చూపమని మల్లన్‌ కణిని అడిగారు. అయితే అతడు దానిని చూపడానికి వెనుకాడాడు.

అలాంటి మొక్కలు చాలా పవిత్రమైనవనీ, వాటిని గురించి కొత్తవారితో అసలు మాట్లాడకూడదనీ చెప్పాడు. ఇలాంటి విషయూలను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పెద్దలు వారికి చెబుతారు. అందువల్ల తాను ఈ విషయూన్ని తమ గూడెంలోని పెద్దలకు చెబుతాననీ, వాళ్ళే తగిన నిర్ణయం తీసుకుంటారనీ మల్లన్‌ కణి చెప్పాడు.
 
ఆ తరవాత విజ్ఞానవేత్తలిద్దరినీ గూడెం పెద్దల వద్దకు వెంటబెట్టుకుని వెళ్ళాడు. సంగతి తెలియగానే గూడెం పెద్దలందరూ ఒక చోట సమావేశమయ్యూరు. విషయూన్ని చర్చించారు. ఆ మొక్కపేరు చెబితే తమ తెగకు అరిష్టమని పలువురు పెద్దలు అభిప్రాయపడ్డారు. ఆ సమాచారాన్ని తమకు చెప్పడం వల్ల కణిలకు ఎలాంటి హానీ కలగదని పెద్దలను నమ్మించడానికి విజ్ఞానవేత్తలు ఎంతగానో ప్రయత్నించారు.
 
పైగా ఆ మొక్కలకే గనక ఔషధగుణాలు ఉన్నట్టయితే, దానిని మందుల తయూరీకి ఉపయోగిస్తామనీ, ఆ విధంగా వారికి డబ్బు వచ్చే అవకాశం ఉందనీ వివరించారు. చాలాసేపు చర్చలు, తర్జన భర్జనలు జరిగాక ఆ మొక్క పేరునూ, అవి ఉన్న చోటునూ చెప్పడానికి గూడెం పెద్దలు నిర్ణయించారు. ఆ మొక్కలుండే చోటికి విజ్ఞానవేత్తలను వెంటబెట్టుకుని వెళ్ళి చూపమని మల్లన్‌కణిని ఆదేశించారు.
 
వాళ్ళను అడవిలోకి తీసుకువెళ్ళిన మల్లన్‌ కణి ఆ మొక్కలను చూపాడు. వాటిని తాము ‘ఆరోగ్యప్పచ్చ' అని పిలుస్తామని చెప్పాడు. ఆరోజే, విజ్ఞానవేత్తలు ఆ మొక్కలు కొన్నింటిని తమతో తీసుకువెళ్ళి ప్రయోగశాలలో వాటి రసాయనిక గుణాలను అధ్యయనం చేశారు. అలసటను పోగొట్టే కొన్ని రసాయనిక పదార్థాలు ఆ మొక్కలో ఉన్నట్టు అధ్యయనాల ద్వారా తెలియవచ్చింది.
 
ఆ మొక్కను ఫలానా అని గుర్తించారు. దాని వృక్షశాస్ర్త నామం ట్రైకోపస్‌ జీలానికస్‌ ట్రావాన్‌కోరికస్‌. ఈ రకం మొక్కలు కేరళలోని ఆ ప్రాంతంలోనూ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నట్టూ, ప్రపంచంలో మరెక్కడా లేవనీ పరిశోధనల ద్వారా తెలియవచ్చింది. ఆ తరవాత కొన్ని సంవత్సరాలపాటు జరిగిన విస్తృత పరిశోధనల ఫలితంగా, ఆ మొక్క నుంచి ఒక ఔషధం తయూరుచేయబడింది. విజ్ఞాన వేత్తలు కన్న కల నిజమయింది. అలసటను పోగొట్టే మందుగా దాన్ని అమ్మడం ప్రారంభించారు.
 

అదిసరే, కణి గిరిజనుల పరిస్థితి, విజ్ఞానవేత్తలు వాళ్ళకిచ్చిన మాట ఏమయిందని మీరు ఆలోచిస్తున్నారు కదూ. విజ్ఞానవేత్తలు వాళ్ళకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజనుల అనుమతితోనే ఔషధం తయూరుచేయబడింది. ఆ ఔషధం అమ్మగా వచ్చే ఆదాయంలో కొంత వారికి ఇచ్చారు.
 
కణీలే తమ సంక్షేమం కోసమూ, తమకు తెలిసినవాటిని తెలియజేయడానికీ ఒక ట్రస్‌‌టను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఔషధ మొక్కలు పెరిగే ప్రదేశాలు అటవీశాఖ యూజమాన్యంలో ఉంటున్నాయి. చట్టప్రకారం గిరిజనులు ఈ పళ్ళను వ్యాపారం కోసం కోసుకోకూడదు. పైగా, వాటిని అదే పనిగా కోసుకువెళితే అడవులు నశించి పోయే అపాయం ఉందని అటవీశాఖ అధికారులు మొదట భావించడం వల్ల, ఈ చిరుపళ్ళను కోసుకోవాలంటే గిరిజనులు అటవీశాఖ అధికారుల అనుమతిని పొందవలసి వచ్చింది.
 
ఆఖరికి అటవీ భూములలో ఈ మొక్కలను పెంచుకోవడానికి కణీలకు అనుమతి ఇచ్చారు. మనదేశంలోని పలు ఇతర గిరిజన జాతులకు ఉన్నట్టే కణీల వద్ద కూడా ఎంతో జ్ఞానం ఉన్నది. ఆరోగ్యప్పచ్చతో తమకు ఏర్పడిన అనుభవంతో తమ సాంప్రదాయిక జ్ఞానం ఎంతటి విలువైనదో, దానిని సక్రమంగా ఉపయోగించుకుంటే ఎలా ప్రయోజనకారి కాగలదో అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు.
 
తమ జ్ఞానాన్ని పదిలంగా పరిరక్షించుకోవలసిన ప్రాముఖ్యతను, దానిని తమ సొంత ప్రయోజనాలకు, అభివృద్ధికి వినియోగించుకోవలసిన ఆవశ్యకతనూ వాళ్ళకు అది నేర్పింది. ఇతరులు తమను దోపిడీ చేయకుండా ఎలా కాపాడుకోవాలో కూడా అది వాళ్ళకు తెలియజేసింది.    

No comments:

Post a Comment