Pages

Saturday, September 15, 2012

పాప్తం


భానుచంద్రుడి గురుకులంలో విజయదశమినాడు నూతన విద్యార్థులను చేర్చు కోవడంతో పాటు, ఎక్కడెక్కడి నుంచో పూర్వ విద్యార్థులు వచ్చి, విద్యాజ్యోతిని ప్రసాదించిన గురువుకు కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళడం సంప్రదాయం. ఒకనాడు అలా వచ్చిన వారిలో కొందరు ఎంతో ఉత్సాహంగానూ, మరికొందరు నిరుత్సాహంగానూ ఉండడం గమనించిన గురువు, ‘‘జీవితం అన్నది ఒక విజయూనికీ, మరో విజయూనికీ మధ్య ప్రయూణం. అవకాశాలు సోపానాల్లాంటివి.
 
అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిని సద్వినియోగ పరచుకోవడం అందరివల్లా సాధ్యంకాదు. అలా వినియోగించుకోక పోవడానికి వారి వారి మనోభావాలే కారణం. దీనినే మన పెద్దలు ప్రారబ్ధం, ప్రాప్తం అన్నారు. అవసరాలకు అనుగుణంగా మన మనోభావాలను మార్చుకోగలిగితే మాత్రం అభ్యుదయం, ఆనందం కరతలామలకాలే. ఏ రంగంలో వున్నా, ఏ వృత్తిని చేపట్టినా విజయం తప్పక సిద్ధిస్తుంది.
 
ఈ విషయం తేటతెల్లం కావడానికి ఒక చిన్న కథ చెబుతాను, వినండి, అంటూ ఇలా చెప్పసాగాడు: కృష్ణపట్నానికి చెందిన భక్తులు కొందరికి హంసలదీవికి ఆవలనున్న పగడాలదీవి లోని పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలాకాలం కోరికగా ఉండేది. ఒకనాడు వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలు సిద్ధంచేసుకుని పడవలో బయలుదేరారు.ఆ రోజంతా ప్రయూణం సాఫీగానే సాగింది. సూర్యుడు అస్తమిస్తూండగా, హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై గాలివాన ఆరంభమయింది.

అర్ధరాత్రి దాటే సరికి అది తుఫా ుగా మారడంతో భక్తుల హాహాకారాల మధ్య పడవ తల్లకిందులయింది. ఆ పడవలోని ముగ్గురు మాత్రం తెల్లవారుతూండగా సముద్ర మధ్యంలోవున్న ఒకానొక దీవి ఒడ్డున ప్రాణాలతో బయటపడ్డారు. పూజారి నారాయణ, చిల్లర వ్యాపారి భూషయ్య, బిచ్చగాడు రమణయ్య అనే ఆ ముగ్గురికి బతికి ఉన్నందుకు ఆనందం కలిగిందిగాని, నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఏం చెయ్యూలో, ఎలా ఉండాలో తెలియలేదు.
 
దీవిలో కొబ్బరి, ఖర్జూర చెట్లు, ఎరట్రి రామాఫలాలు పుష్కలంగా దొరకడంతో కొద్ది రోజుల పాటు ఆకలి బాధ తీర్చుకోవచ్చునని అనుకున్నారు. ‘‘తిండి సంగతి సరే. ఉండేందుకు గూడు, కట్టేందుకు గుడ్డ లేకపోతే ఎలా? జగన్మాత దర్శనానికి వచ్చిన మన గతి ఇలా అయిపోయిందే. మన ఆచూకీ కూడా మనవాళ్ళకు తెలిసే అవకాశం లేదు కదా! మానవ మాత్రులం. మనం ఏం చేయగలం? ఆ జగదంబ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది,'' అన్నాడు నారాయణ నిట్టూరుస్తూ.
 
‘‘ఇన్ని కొబ్బరికాయలు, ఖర్జూర కాయలు వృథాగా పండి ఎండి పోతున్నవి. వీటితో వ్యాపారం చేస్తే లక్షలు ఆర్జించవచ్చు. కానీ కొనే నాధుడేడీ? సముద్రం మీద నావలు కనిపిస్తాయేమో మీరూ గమనిస్తూండండి,'' అన్నాడు భూషయ్య ఆశగా. ‘‘కావలసినంత తిండి దొరుకుతోంది. తోటివాళ్ళతో గొడవలు పడకుండా కడుపునిండా తిని, ఒళ్ళు అలవకుండా విశ్రాంతి తీసుకోక ఎందుకీ ఆలోచనలు?'' అన్నాడు రమణయ్య తేలిగ్గా. రోజులు గడుస్తున్న కొద్దీ భూషయ్యకూ, నారాయణకూ ఇంటిబెంగ పట్టుకున్నది.
 
ఒకనాడు తీరం వెంబడి తిరుగుతున్న నారాయణకు సముద్రం నుంచి కొట్టుకు వచ్చిన ఒక శిలలో దేవతారూపం కనిపించింది. దాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చి, దీవి మధ్యలో వున్న గుట్ట మీద ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టాడు. తనకు వచ్చిన స్తోత్రాలూ, శ్లోకాలూ వల్లిస్తూ ఒంటరిగా ఉన్నానన్న భావనను దూరం చేసుకోసాగాడు. భూషయ్య ధ్యాసంతా వ్యాపారం మీదే ఉన్నప్పటికీ, విగ్రహానికి రోజుకోసారి భక్తితో దణ్ణం పెట్టుకునేవాడు.

‘‘ఇదే విగ్రహం మన ఊరిగుళ్ళో ఉంటే, వచ్చే పోయే భక్తులు వేసే నాణాలతో నా బతుకు వెళ్ళిపోయేది. ఇక్కడ దేవతకే దిక్కులేదు. నాకెవరు బిచ్చం వేస్తారు?'' అనుకునే వాడు రమణయ్య విరక్తిగా. అయితే, నిజంగానే దివ్యత్వం గల ఆ విగ్రహానికి వీరి ముగ్గురిపైనా జాలికలిగింది. ఒకనాటి రాత్రి దేవత నారాయణ కలలో కనిపించి, ‘‘నువ్వు పూజించే దేవతను నేనే. త్వరలో మీ ముగ్గురికీ ఈ ఒంటరి జీవితం ముగిసి పోయేలా చేస్తాను.
 
నాకు ఇదే చోట పూజలు ఆగకుండా గుడి కట్టిస్తావా?'' అని అడిగింది. ‘‘ఎంత మాట తల్లీ! నా జన్మాంతం నీకు సేవచేస్తాను. నా కుటుంబంతో నన్ను కలుపు,'' అన్నాడు నారాయణ భక్తిగా. ‘‘అయితే రేపు తెల్లవారుతూనే జాలర్లు కొందరు ఈ దీవికి వస్తారు. వాళ్ళ ద్వారా మీ సమాచారాన్ని మీ కుటుంబాలకు పంపండి. వారం తరవాత మళ్ళీ మీకు దర్శనమిస్తాను,'' అంటూ అంతర్థాన మయింది దేవత.
 
నారాయణ మాటలను భూషయ్య, రమణయ్య నమ్మలేదు. కానీ, మరునాడు మిట్ట మధ్యాహ్న సమయంలో దూరాన ఉన్న జాలరి గూడానికి చెందిన జాలర్లు కొందరు దారితప్పి పడవలతో సహా ఈ దీవికి రావడంతో, నారాయణ కల నిజమయిందని నమ్మక తప్పలేదు. జాలర్లు వీరి ముగ్గురినీ అక్కడ చూసి ఆశ్చర్యపోయూరు. గుట్ట మీది దేవతకు మొక్కుకుని, తిరిగి తమ గూడానికి చేరి, కృష్ణపట్నానికి వాళ్ళ ముగ్గురి గురించి సమాచారం అందించారు.

నారాయణ, భూషయ్య భార్యాపిల్లలు, బంధువులు, రమణయ్య తోటిబిచ్చగాళ్ళు బిలబిలా దీవికి చేరారు. పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు మొదలయ్యూయి. అన్నట్టుగానే ఏడో రోజున అమ్మవారు ముగ్గురికీ కలలో కనిపించి, ‘‘మీ భక్తికి సంతోషం. మనిషికొక వరం ఇస్తాను. కోరుకోండి,'' అన్నది. ‘‘ఎప్పుడూ నీ సేవచేసుకుంటూ జీవించేట్టు వరమివ్వు, తల్లీ,'' అన్నాడు నారాయణ.
 
‘‘నిన్ను నమ్ముకున్న వాణ్ణి, నాకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగి గొప్ప ధనవంతుణ్ణయి, భార్యాపిల్లలతో హాయిగా ఉంటూ కృష్ణపట్నంలో నీకు వేరొక దేవాలయం కట్టేలా ఆశీర్వదించు,'' అన్నాడు భూషయ్య. ‘‘తల్లీ! నాకో వెండి భిక్షాపాత్ర ప్రసాదించమ్మా! నీ పేరు చెప్పుకుని బిచ్చమెత్తుకుంటాను,'' అన్నాడు రమణయ్య. ‘‘తథాస్తు!'' అని దీవించింది దేవత. భక్తులు వచ్చిన రోజున, తనకు దక్షిణ ఇచ్చిన రోజున మాత్రమే కడుపునిండా తింటూ, లేని రోజున పస్తులుంటూ, సదాసర్వవేళలా అంబను ధ్యానిస్తూ తృప్తిగా జీవించాడు నారాయణ. దీవిలోని కొబ్బరి, ఖర్జూర కాయలతో ఎగుమతి వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే లక్షలకు లక్షలు గడించాడు భూషయ్య.
 
‘‘వెండి బొచ్చెతో బిచ్చం ఎత్తుకునే వాడివి, నీది ఒళ్ళు బద్ధకం తప్ప పేదరికం, నిస్సహాయత కాదు,'' అంటూ అక్కడికి వచ్చేవారెవ్వరూ దమ్మిడీ వేయక పోవడంతో మరో చోటు వెతుక్కున్నాడు రమణయ్య.
 
ఈ కథ విన్న శిష్యులు గలగలా నవ్వారు. అప్పుడు గురువు, ‘‘చూశారా, ముగ్గురూ వైభవాన్ని అడిగివుంటే దేవత తప్పక ఇచ్చి ఉండేది. కాని ఎవరి ప్రాప్తాలను బట్టి వారి బుద్ధులు పనిచేశాయి. వాటిని బట్టి జీవితాలు మారాయి. కాబట్టి జీవితాలు మారాలంటే మొదట మన బుద్ధులు మారాలి. అప్పుడే ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలం,'' అన్నాడు.

No comments:

Post a Comment