కృష్ణాపురం జమీందారు దివాణంలో గుమాస్తాగా పని చేస్తూన్న రామచంద్రయ్యకు
భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు జానకి. పదేళ్ళ కొడుకు పేరు
మురళి. కూతురు లక్ష్మికి ఏడేళ్ళు. రామచంద్రయ్యకు పిల్లలంటే మహా ప్రీతి.
రోజూ పని నుంచి తిరిగి వచ్చేప్పుడు పిల్లలకు ఏదైనా తినుబండారాలు గాని,
ఆటవస్తువులు గాని కొని తెచ్చేవాడు.
ఒకనాడు రామచంద్రయ్య, భార్యాపిల్లలను వెంటబెట్టుకుని అత్తగారి ఊరైన
నీలకంఠాపురంలో జరిగే తిరునాళ్ళకు బయలుదేరాడు. వాళ్ళు మార్గమధ్యంలో ఒక
మామిడితోటలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఆ తోటలోని పక్షులు,
ముఖ్యంగా చిలుకల కిలికిలారావాలు పిల్లలను ఎంతగానో ఆనంద పరిచాయి. మరునాడు
సాయంకాలం, తిరునాళ్ళు చూడడానికి తండ్రి వెంట వెళ్ళిన మురళికి చిలుకజోస్యం
చెప్పేవాడొకడు కనిపించాడు.
ప్రత్యేకంగా తయూరు చేసిన గూటిలో నుంచి, జోస్యుడు చెప్పగానే-పంచవన్నెల
రామచిలుక బుల్లి బుల్లి నడకలతో బయటికి వచ్చి, ఒక చీటీ తీసి అతని చేతికి
ఇచ్చి, అతడిచ్చే సెనగగింజను అందుకుని లోపలికి వెళ్ళడం చూసిన మురళి ఎంతగానో
మురిసి పోయూడు. తనకూ అలాంటి చిలుక ఒకటి కావాలని తండ్రిని అడిగాడు.
‘‘స్వేచ్ఛగా తిరిగే చిలుకను పట్టి బంధించడం చాలా తప్పు.
అది దాని స్వేచ్ఛను హరించినట్టవుతుంది,'' అని తండ్రి ఎంత చెప్పినా
వాడు వినిపించుకోలేదు. తెచ్చితీరాలని పట్టుబట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన
మరునాడు సాయంకాలం తండ్రి తెచ్చి ఇచ్చిన చిలుకను చూసి ఎంతో సంబర పడిపోయూడు.
రోజంతా దానితోనే గడపసాగాడు. ఇలా ఉండగా మురళికి ఉన్నట్టుండి జ్వరం వచ్చి,
మూడు రోజులు లేవలేక పోయూడు.
తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి చూపారు. వైద్య పరీక్షలు
చేసిన వైద్యుడు ఇది ఒకరకమైన విషజ్వరమనీ, మందులు వాడ్డంతో పాటు, రెండు
వారాలు మంచం నుంచి కిందికి దిగకూడదనీ, ఒకవేళ బయట తిరిగితే, జ్వరం
తిరగబెట్టే అపాయం ఉందనీ హెచ్చరించి మందులిచ్చి పంపాడు. ఆ కారణంగా మురళి
రెండు వారాల పాటు పడక నుంచి కిందికి దిగలేదు. మందులు మింగడం, మంచం మీద కదలా
మెదలక పడుకుని ఉండడం వాడికి మహా కష్టమనిపించింది.
కాళ్ళు చేతులు కట్టి పడేసినట్టయింది. జ్వరం తగ్గినా ఎందుకు బయటకు
వెళ్ళవద్దంటున్నారో వాడికి అంతుబట్టలేదు. కిటికీ నుంచి బయటకు చూస్తూ,
వీధిలో ఆడుకునే పిల్లల్ని చూసి, తను ఎప్పుడెప్పుడు వెళ్ళి వాళ్ళతో కలిసి
ఆడుకుంటానా అని ఎదురు చూస్తూ, క్షణం ఒక యుగంగా గడపసాగాడు. ఇంటి వసారాలో
వేలాడగట్టిన పంజరం లోని చిలుక తన తల్లి అందించే గింజలను తింటూ, లోపలే అటూ
ఇటూ తిరగడం- మురళి దిగులుగా గమనించసాగాడు.
ఆ రోజుతో వైద్యులు చెప్పిన గడువు ముగిసింది. మరునాడు తెల్లవారగానే,
తల్లి మురళికి వేడినీళ్ళ స్నానం చేయించి, ‘‘ఇక నువ్వు వెళ్ళి హాయిగా
ఆడుకోవచ్చు,'' అన్నది. మురళి పంజరంతో సహా చిలుకను తీసుకుని వాకిట్లోకి
వచ్చి, పంజరం తలుపు తీసి, ‘‘పదిహేను రోజులు ఒక గదిలో పడుకుని ఉండడమే
బందిఖానాలా అనిపించింది. అది ఎంతటి కష్టమో తెలియవచ్చింది. నిన్ను పంజరంలో
బంధించి, హింసించను. వెళ్ళి హాయిగా, స్వేచ్ఛగా తిరుగు!'' అంటూ చిలుకను
వదిలిపెట్టాడు. చిలుక కిలకిలమంటూ ఎగిరి పోయింది. మురళి ముఖం ఆనందంతో
ప్రకాశించింది!
No comments:
Post a Comment