Pages

Saturday, September 15, 2012

మృత్యువు కోరలమధ్య నుంచి...


ఒకనాడు ఔరంగజేబు, మహారాజా జస్వంత్‌ సింగ్‌తో కలిసి విశాలమైన రాజోద్యానంలో పచార్లు చేస్తూ, ‘‘ఇంత పెద్ద భయంకరమైన పులిని తమరెప్పుడైనా చూశారా?'' అంటూ ఒకవైపు బోనులో అసహనంగా తిరుగుతున్న పెద్దపులిని చూపాడు. ‘‘మా వీరభూమిలో పసిపిల్లలు సైతం ఇలాంటి పులులతో ఆటలాడుకుంటారు, ప్రభూ!'' అంటూ రాజాజస్వంత్‌సింగ్‌, దూరంగా నిలబడ్డ తన కుమారుడు పృథ్వీసింగ్‌ను చేయి ఊపి దగ్గరికి పిలిచి, పులితో పోరాడమని పురమాయించాడు.
 
పదహారేళ్ళ యువప్రాయంలో ఉన్న పృథ్వీసింగ్‌ అమితోత్సాహంతో పులి బోనులోకి వెళ్ళి పులితో కలియబడ్డాడు. కొంతసేపు దానితో పెనుగులాడి భీకరంగా పోరాడి మొలలోని బాకు తీసి దానిగుండెల్లోకి పొడిచాడు. పులి చివరి సారిగా గాండ్రించి ప్రాణాలు విడిచింది. తన కళ్ళను తనే నమ్మలేక గుడ్లప్పగించి చూసిన ఔరంగజేబు లోలోపల భయభ్రాంతుడయ్యూడు.
 
కొడుకే ఇంతటి సాహసవీరుడైతే, తండ్రి ఎలాంటివాడై ఉంటాడు? అన్న ఆలోచన అతడి మనసును కలచివేసింది. జస్వంత్‌ సింగ్‌, మార్వార్‌ (ప్రస్తుత జోధ్‌పూర్‌) రాజు. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిని ఆనుకుని వున్న ‘మార్వార్‌' అంటే ‘మరణ భూమి' అని అర్థం. మానవ నివాసానికి అనువుగాని వాతావరణం. విపరీతమైన నీటి ఎద్దడి.
 
ఇసుక నేల స్వరూపాన్నే మార్చివేసే ఇసుక తుపానులు. కరువు కాటకాలు. అయినప్పటికీ మాతృభూమి మీది మమకారం కొద్దీ, భూమి మీది అధికారం కోసం ఎన్నో యుద్ధాలు చేశారు అక్కడి వీరపాలకులు.
 
మార్వార్‌ పాలకుడు జస్వంత్‌సింగ్‌ అసమాన పరాక్రమశాలి అయినప్పటికీ, స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి నియమాలు పాటించకుండా మిత్రులను సైతం హతమార్చగలడన్న పేరు తెచ్చుకున్నాడు. అది ఔరంగజేబుకు మరింత కంటక ప్రాయంగా తయూరయింది. ఆ రాజపుత్ర రాజు అంతం చూడడానికి మొగలు చక్రవర్తి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు.

అయినా, జస్వంత్‌సింగ్‌ ఆఖరి క్షణంలో అద్భుతమైన ఎత్తుగడలతో శత్రువుల కళ్ళల్లో కారంచల్లి సురక్షిత ప్రాంతానికి ప్రాణాలతో తప్పించుకుని పారిపోయేవాడు. మార్వార్‌ రాజును హతమార్చాలన్న మొగల్‌ చక్రవర్తి పథకాలను, కుతంత్రాలను భగ్న పరచినవారిలో రాజుకు విశ్వాసపాత్రుడైన ముకుంద్‌ దాస్‌ మున్నెన్న తగినవాడు. అతడు కుంపావత్‌ వంశానికి చెందిన నాయకుడు.
 
అతడు ఒకసారి ఔరంగజేబు పంపిన సందేశానికి దురుసుగా సమాధానం ఇచ్చి అతడి ఆగ్రహానికి గురయ్యూడు. అతడిపై పగసాధించడానికి చక్రవర్తికి మంచి అవకాశం లభించింది. అతన్ని శిక్షించే నెపంతో ఆకలిగొన్న పులి నివాసంలోకి నిరాయుధపాణిగా ప్రవేశించి పోట్లాడమని ఆజ్ఞాపించాడు. ముకుంద్‌ దాస్‌ నిర్భయంగా అందులోకి ప్రవేశించాడు. పులి అతణ్ణి చూస్తుండగా, ‘‘ఓ మియూన్‌ పులీ! ఈ జస్వంత్‌ పులిని ఎదుర్కో!'' అంటూ ఆగ్రహంతో దాని కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు.
 
ఆ వింత ఆగంతకుడి విచిత్ర ప్రవర్తనకు విస్తుపోయిన పులి తలవంచుకుని వెనుదిరిగి వెళ్ళిపోయింది. ‘‘దానికి నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఎదిరించని శత్రువు మీదికి కాలుదువ్వడం రాజపుత్ర వీరుల లక్షణం కాదు,'' అంటూ వెలుపలికి వచ్చాడు ముకుంద్‌దాస్‌. అతడి సాహసకృత్యానికి ఆశ్చర్యపోయిన ఔరంగజేబు విలువైన కానుకలతో అతణ్ణి సత్కరించి పంపాడని చెబుతారు.
 
అప్పటి నుంచి ముకుంద్‌దాస్‌కు నహర్‌ఖాన్‌ (పులి రాజు) అనే పేరు వచ్చింది. అలాంటి అసమాన వీరుల రక్షణ, కవచంగా ఉండడం వల్లే ఔరంగజేబు ఎంత ప్రయత్నించినా జస్వంత్‌సింగ్‌ను హతమార్చలేక పోయూడు. అతడి దుష్ట పథకాలన్నీ నిష్ర్పయోజనమై పోయూయి. అందువల్ల స్నేహహస్తం సాచక తప్పలేదు. జస్వంత్‌సింగ్‌కు కొన్ని ఆశలు చూపి తన సేనకు అధిపతిగా చేసి, తిరుగుబాటుదారుల నణచడానికి కాబూలుకు పంపాడు. అది చక్రవర్తి ఆజ్ఞకావడంతో జస్వంత్‌సింగ్‌ కాదనలేక పోయూడు.
 
తన రాజ్య పాలనాబాధ్యతలు పెద్ద కుమారుడైన పృథ్వీసింగ్‌కు అప్పగించి, కొందరు కుటుంబ సభ్యులతో, విశ్వాసపాత్రులైన మిత్రులతో కాబూల్‌కు బయలుదేరాడు. త్వరలోనే అతడు ఆ ప్రాంతానికి గవర్నర్‌గా నియమించబడ్డాడు. ఔరంగజేబు ఒకనాడు మార్వార్‌ యువవారసుడు పృథ్వీసింగ్‌ను సభకు పిలిపించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ యువకుడు భీకరమైన పులితో ఒంటరిగా పోరాడి చంపిన విషయం అతడు మరిచిపోలేదు. అందుకు ఇప్పుడతణ్ణి గొప్పగా మెచ్చుకున్నాడు.


 అతడు ఆజ్ఞాపించగానే గౌరవసూచకంగా ఆకర్షణీయమైన దుశ్శాలువను ఇద్దరు భటులు తీసుకువచ్చి పృథ్వీసింగ్‌కు కప్పారు. యువరాజు పృథ్వీసింగ్‌ పరమానందంతో అక్కడినుంచి బయలుదేరాడు. అయితే, అతని ఆనందం ఎంతో సేపు నిలువలేదు. కొంతసేపటికే ఒళ్ళంతా బొబ్బలతో మంటలు పుట్టి గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయూడు! ప్రత్యక్షంగా ఎదుర్కొనే చేవలేక, దుర్మార్గుడైన చక్రవర్తి కానుకగా ఇచ్చిన బట్టలకు ప్రాణాంతకమైన విషం రాసి యువరాజు ప్రాణాలు అపహరించాడు! కుమారుడు హతుడయ్యూడన్న దుర్వార్త విని జస్వంత్‌సింగ్‌ దిగ్భ్రాంతికి లోనయ్యూడు.
 
అప్పటికే ఆయన చిన్న కుమారులిద్దరూ అనారోగ్యంపాలై కాబూల్లోనే చనిపోయూరు. వారసులు లేని మార్వార్‌రాజు జస్వంత్‌ సింగ్‌ స్వస్థలానికి దూరంగా 1678లో మరణించాడు. శత్రువును దుంపనాశం చేసినందుకు ఔరంగజేబు పొంగిపోయి, మార్వార్‌ను వశపరచుకున్నాడు. అక్కడి ఆలయూలను ధ్వసం చేశాడు. రాజభవనంలోని నిధులను దోచుకున్నాడు.
 
అయితే, అచిరకాలంలోనే మరో ఆశ్చర్యకరమైన వార్త చక్రవర్తిని కలవరపెట్టింది. జస్వంత్‌సింగ్‌తో పాటు కాబూల్‌ వెళ్ళిన రాజపుత్రయోధులు తిరిగివస్తున్నారన్నదే అది. వారితో పాటు గర్భిణిగా వున్న కారణంచేత సహగమనం చేయలేక, ఆ తరవాత మగశిశువును ప్రసవించిన జస్వంత్‌సింగ్‌ రాణి కూడా ఉన్నది. చంటి బిడ్డ అజిత్‌సింగ్‌ను రాజపుత్రులు తమ రాజుగాభావించి తల్లితోపాటు తీసుకువస్తున్నారు.ఔరంగజేబు దానిని గురించి తీవ్రంగా ఆలోచించి ఒక పథకం రూపొందించాడు. శిశువుగా ఉన్న అజిత్‌ సింగ్‌తో పాటు రాజపుత్రులకు ఘనంగా స్వాగతం పలికి ఢిల్లీ దర్బారుకు ఆహ్వానించాడు.
 
యువరాజు అజిత్‌సింగ్‌ను తన రక్షణలో వదిలే పక్షంలో వారికి మార్వార్‌ రాజ్యాన్ని అప్పగించడంలో తనకెలాంటి ఆక్షేపణా లేదని తెలియజేశాడు.రాజపుత్రులు అతడి నిబంధనను తిరస్కరించడంతో అందరినీ ఖైదుచేసి మొగల్‌ సేనలను కాపలా ఉంచాడు. చిక్కులో పడ్డ రాజపుత్ర సైనికులు, తమ రాజ్యానికి మిగిలిన ఏకైక వారసుడైన యువరాజు అజిత్‌సింగ్‌ను కాపాడడమే ధ్యేయంగా భావించారు.

గోరాదాయ్‌ అనే దాది, పాములాడించేవాడి వేషంలో బయలుదేరిన ముకుంద్‌దాస్‌ సాయంతో శిశువుగా వున్న యువరాజును చీకటి తెరమాటున రహస్యంగా తీసుకువెళ్ళింది. అలా వెళ్ళేప్పుడు మొగల్‌ సైనికులకు అనుమానం రాకుండా, ఆమె తన కన్నబిడ్డను అక్కడవదిలి వెళ్ళింది. రాజపుత్రయోధుడు దుర్గాదాస్‌ రాథోడ్‌ తక్షణ యుద్ధానికి సన్నద్ధుడయ్యూడు.
 
వెనకటి రాజపరివారంలోని స్ర్తీలందరూ భారీగా తుపాకీ మందు నిలువచేసిన గదిలోకి చేరారు. దానికి నిప్పంటించడంతో భయంకరమైన శబ్దంతో అది పేలిపోయింది. ఒక్క రాజమాత తప్ప తక్కినవారందరూ మానసంరక్షణకోసం ప్రాణాలను అగ్నికి ఆహుతి చేశారు. మండుతూన్న భవనం నుంచి వెలుపలికి వచ్చిన దుర్గాదాస్‌ రాథోడ్‌ తమ అనుచరులతో కలిసి మొగలు సేనలను ఎదుర్కొన్నాడు.
 
అంతలో శిశువుయువరాజును కొందరు తీసుకువెళుతూన్న విషయం శత్రువులు పసిగట్టి వారివెంట బడ్డారు. అయితే, వారిని రాజపుత్ర వీరుల ఖడ్గాలు అడ్డుకోవడంతో గోరాదాయ్‌ శత్రువుల చేజిక్కకుండా పారిపోగలిగింది. ఆఖరికి మొగలుసేనల నెదుర్కొన్న మూడు వందల రాజపుత్రసైనికులలో ఏడుగురు మాత్రమే మిగిలారు. శత్రుసేనలు వేగంగా చొచ్చుకురాసాగాయి. యువరాజు అజిత్‌సింగ్‌ మాతను రక్షించడం ఎలాగో తెలియలేదు. దుర్గాదాస్‌ తన చేతిలోని ఖడ్గాన్ని రాజమాతకు అందించాడు.
 
శత్రువుల చేజిక్కకూడదన్న ఏకైక లక్ష్యంతో ఏమాత్రం వెనుకాడకుండా ఖడ్గంతో పొడుచుకుని ప్రాణత్యాగం చేసింది మార్వార్‌ రాణి. తీవ్రంగా గాయపడ్డ దుర్గాదాస్‌, మిగిలిన తన అనుచరులతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అదే సమయంలో మారుమూల కొండలలో సురక్షిత ప్రాంతాన్ని చేరిన యువరాజు అజిత్‌ విశ్వాసపాత్రుల మధ్య ‘కుండలోని దీపం'లా పెరగసాగాడు. అతడెక్కడో పెరుగుతున్నాడన్న వార్త రాజపుత్రుల మధ్య వ్యాపించింది.
 
ఎనిమిదేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖులు వెళ్ళి అజిత్‌ సింగ్‌ను కలుసుకున్నారు. మొగలుల అధికార బంధనం నుంచి బయట పడే పోరాటాన్ని ఉధృత పరచాలని నిర్ణయించారు. అచిరకాలంలోనే అనేక ప్రాంతాలను వశపరచుకున్నారు. ఔరంగజేబు వృద్ధుడయ్యేసరికి రాజపుత్ర వీరులు బలపడడం చూశాడు. శక్తివంతుడైన ఆఖరి మొగలు పాలకుడుగా పేరుగాంచిన అతడు 1707 మార్‌‌చలో మరణించాడు. అజిత్‌ సింగ్‌, దుర్గాదాస్‌ రాథోడ్‌ ఆక్రమణదారులను మాతృభూమినుంచి తరుమగొట్టారు. యువరాజు అజిత్‌ సింగ్‌ మార్వార్‌ మహారాజాగా కొలువుదీరాడు. 

No comments:

Post a Comment