Pages

Saturday, September 15, 2012

తాతయ్య-బామ్మ చెప్పిన కథ


అదొక అడవి. దానికి ఆవల విశాలమైన ఇసుక ప్రదేశం. ఎడారిలా ఎండిపోయిన నది ఇసుక మేటలు. ఎండ తీవ్రంగా కాస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఒక తల్లి, తండ్రి. తల్లి చేతిలో పుట్టి కొన్నాళ్ళే అయిన చంటిబిడ్డ. వాళ్ళా వేడి ఇసుక ప్రాంతాన్ని దాటాలని కష్టపడి నడుస్తున్నారు. హఠాత్తుగా ఎటు నుంచో వచ్చిన ఒక కొండడేగ వాళ్ళ మీదుగా ఎగరసాగింది. ఆకాశాన్ని నల్లటి మేఘాలు ఆవరించాయి. క్షణంలో డేగ కిందికి వాలి తల్లి చేతిలోని బిడ్డను తన్నుకు పోయింది.
 
తల్లి ఆకాశం కేసి చూస్తూ, ‘‘అయ్యో! నా బిడ్డ,'' అని విలపిస్తూ ఇసుకలో కుప్పకూలిపోయింది. దీనిని చూసి తండ్రి అరుస్తూ కొంత దూరం డేగవెంట పరిగెత్తి నేలపై తూలిపడ్డాడు. ఏడుస్తూన్న శిశువును పదునైన గోళ్ళతో పట్టుకుని డేగ ఆకాశానికి ఎగిరిపోయింది.

_____________

దాపులనున్న మరొక అడవి. అక్కడ వేటాడుతూన్న వేటగాళ్ళకు ఆకాశంలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. తలెత్తి చూసిన వేటగాళ్ళు, ఒక డేగ బిడ్డను తన్నుకుపోతూండడం చూసి ఆశ్చర్యపోయూరు. వేటగాళ్ళ నాయకుడు డేగ మెడకు గురి చూసి బాణం వదిలాడు. బాణం దెబ్బ తగలగానే డేగ చచ్చింది. దాని వేళ్ళ గోళ్ళ నుంచి కిందికి జారిన బిడ్డను వేటగాళ్ళ నాయకుడు రెండు చేతులతో పట్టుకున్నాడు. పిల్లలు లేని వేటగాళ్ళ నాయకుడు అందమైన మగ బిడ్డను చూసి పరమానందం చెందాడు. బిడ్డను ఇంటికి తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు. వేటగాడూ, భార్యా బిడ్డ అందాన్ని చూసి మురిసిపోయూరు. బిడ్డ ముఖంలో దివ్యతేజస్సు కనిపించింది. రక్షకుడని పేరుపెట్టి రాజకుమారుడిలా పెంచసాగారు. రక్షకుడు గొప్ప విలుకాడుగా పెరిగి యుక్తవయస్కుడయ్యూడు. అతణ్ణి చూసి మనసులో ఎంతో గర్వ పడిన వేటగాళ్ళ నాయకుడు, ‘‘నాయనా! నిన్ను కన్న వాళ్ళెవరో నాకు తెలియదు.

 నీ ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతున్నది. నా తరవాత నువ్వే మన తెగకు నాయకత్వం వహించాలి. మన జీవితం కేవలం వేటకు మాత్రమే పరిమితంకాదు. ఒక్కొక్కసారి దారి దోపిడీ చేయవలసి ఉంటుంది. దొంగతనాలకు వెళ్ళవలసి ఉంటుంది. అది తరతరాలుగా వస్తూన్న మన వృత్తి. విలువిద్యలో నువ్వు ఆరితేరావు. ఇకపై చోరకళను కూడా నేర్చుకోవాలి. అది మన సంప్రదాయ వృత్తి. అయితే, నువ్వు ఎలాంటి పరిస్థితులలోనూ అబద్ధం అన్నది చెప్పకూడదు. అబద్ధ మాడడం ఏ ధర్మానికీ ఆమోదయోగ్యం కాదు,'' అన్నాడు. 

 ‘‘దొంగతనం మన సంప్రదాయవృత్తి గనక, దాన్ని నేను తప్పక చేపడతాను,'' అంటూ తండ్రి మాటను అంగీకరించిన రక్షకుడు, ‘‘నేనెప్పుడూ అబద్ధం చెప్పను,'' అని కూడా తండ్రికి మాట ఇచ్చాడు. కొన్నాళ్ళకు రక్షకుడు భయంకరమైన బంది పోటుగా తయూరయ్యూడు. వాడి పేరు వినగానే ప్రజలు గడగడలాడసాగారు.

________________________

అర్ధరాత్రి సమయం. గాలి వాన. రక్షకుడు దొంగతనం చేయడానికి నగరానికి వెళుతూ, వాన ఉధృతం కావడంతో దాపులనున్న పాత ుండపంలోకి వెళ్ళాడు. మారువేషంలో నగరసంచారం చేస్తూన్న ఆ దేశాన్నేలే రాజు కూడా వాన కారణంగా అదే మండపంలోకి చేరాడు. మారువేషంలో ఉన్న రాజు దొంగను, ‘‘నువ్వెవరు బాబూ?'' అని అడిగాడు.
 
‘‘నేనెవరన్నది నువ్వు అడుగుతున్నావు. మరి, నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా?'' అని ఎదురు ప్రశ్న వేశాడు దొంగ. నగర పరిస్థితులను రహస్యంగా తెలుసుకోవడానికి రాజు మారువేషంలో వచ్చాడు. కాబట్టి తన గురించి నిజం చెప్పే స్థితిలో ఆయనలేడు. అందువల్ల, ‘‘నాది ఈ ఊరు కాదు. జీవనోపాధి వెతుక్కుంటూ నగరానికి వెళుతున్నాను,'' అని అబద్ధం చెప్పాడు. అబద్ధాలు చెప్పలేని రక్షకుడు, ‘‘నేనొక దొంగను.
 
నా పేరు రక్షకుడు. వానకు తల దాచుకోవడానికి నీలాగే ఈ మంటపంలోకి వచ్చాను,'' అన్నాడు. ఆ మాట వినగానే రాజుకు తను అబద్ధం చెప్పవలసి వచ్చింది కదా అన్న బాధ కలిగింది. రక్షకుడు పేరుమోసిన దొంగ అయినప్పటికీ సత్యమే మాట్లాడగల అతడి ఉన్నత గుణాన్ని లోలోపల మెచ్చుకున్నాడు. దొంగ కేదైనా సాయం చేయూలనుకున్నాడు. ‘‘నువ్వు దొంగవైనప్పటికీ సత్యసంధుడివి. నీకోసాయం చేస్తాను.
 
నిధి ఉండే చోటు నీకు చెబుతాను. నువ్వు అక్కడికి వెళితే నీకు విలువైన వస్తువులు దొరుకుతాయి. నీకు దొరికే వాటిలో సగం నాకు ఇవ్వాలి,'' అంటూ రాజు దొంగతో ఒక ఒప్పందానికి వచ్చాడు. ఆ తరవాత నిధి ఉండే చోటును వివరించాడు. కాపలా కట్టుదిట్టంగా ఉంటుందనీ, కాపలా భటులు కడు సమర్థులనీ హెచ్చరించాడు. ‘‘ఆ విచారం నీకు వద్దు. ఈ రక్షకుడు వాటన్నిటినీ చూసుకోగలడు.
 
నువ్వు ఇక్కడే ఉండు. నీ వాటా పుచ్చుకుందువుగాని,'' అంటూ దొంగ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయూడు. రాజు అక్కడే కాచుకుని కూర్చున్నాడు. 

________________

సూర్యోదయం కాబోతోంది. వెలుతురును చూడడానికి రాజుకు భయంగా ఉంది. మారు వేషంలో వున్న రాజు తెల్లవారే సరికి రాజభవనం చేరుకోవాలి. దొంగ ఎప్పుడు వస్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తూండగా రక్షకుడు వచ్చాడు.

కాపలా భటులతో పోరాడ్డం వల్ల ఒళ్ళంతా గాయపడి నెత్తుటి మరకలు కనిపించాయి. ‘‘ఆ కాపలా భటులు కూడా చాలా ధైర్యవంతులు. వాళ్ళను మట్టుపెట్టడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. అందుకే ఆలస్యమయింది,'' అంటూ దొంగ రాజు ముందు మిలమిల మెరిసే రెండు విలువైన వజ్రాలను ఉంచాడు. ‘‘ఇలాంటి వజ్రాలు ఆ పెట్టెలో మూడు కనిపించాయి. నేను దొంగిలించిన దానిలో నీకు సగం వాటా ఇవ్వాలి కదా? అందువల్ల రెండు వజ్రాలు మాత్రం తీసుకుని మూడో వజ్రాన్ని పెట్టెలోనే వదిలి వచ్చాను. వజ్రాన్ని రెండుగా పగలగొడితే ఎందుకూ పనికి రాకుండా వృధా అయిపోతుంది. ఇరువురికీ ఉపయోగ పడదు కదా,'' అన్నాడు దొంగ. తెల్లవారే లోపల రాజభవనం చేరుకోవాలన్న ఆదుర్దాలో, రాజు ఆ రెండు వజ్రాల్లో ఒక దాన్ని తనవాటాగా తీసుకుని, రాజభవనానికి హడావుడిగా తిరిగి వెళ్ళాడు. దొంగ కూడా అడవికి వెళ్ళిపోయూడు.

_____________ 

రాజు నిండు సభలో కొలువుదీరాడు. మంత్రి లేచి సింహాసనంలో ఉన్న రాజును చూసి, ‘‘ప్రభూ! తమరెందుకు అత్యవసరంగా సభ ఏర్పాటు చేశారో తెలుసుకోవచ్చా?'' అని అడిగాడు. ‘‘ఖజానా నుంచి వజ్రాలు దొంగిలించబడినట్టు నాకు రాత్రి కలవచ్చింది,'' అన్నాడు. ఆ మాట విన్న మంత్రి నవ్వుతూ, ‘‘ఖజానా కాపలాకు సమర్థులైన సైనిక భటులను నియమించి ఉన్నాం కదా ప్రభూ. ప్రపంచంలో ఎవ్వరూ వారిని ఓడించి ఖజానాలోపల అడుగుపెట్టలేరు.
 
మీ కల కేవలం కల మాత్రమే. విచారించకండి ప్రభూ!'' అన్నాడు. ‘‘నాకు విచారంగానే ఉన్నది. ఆ వజ్రాలు దాచిన రహస్య ప్రదేశం నీకూ, నాకూ మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి వజ్రాలు ఇంకా అక్కడ భద్రంగా ఉన్నాయేమో చూసిరా,'' అని ఆజ్ఞాపించాడు రాజు. మంత్రి, ‘‘చిత్తం ప్రభూ!'' అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.

______________

ఖజానా భవనం కాపలాకాస్తున్న సైనికులు చచ్చి పడి ఉన్నారు.లోపలి గదిలోకి వెళ్ళిన మంత్రి వజ్రాలు భద్రపరచిన పెట్టెను తెరిచి చూశాడు. దొంగ ఒక వజ్రాన్నయినా వదిలి పెట్టాడుకదా అని సంతోషించిన మంత్రి, దాన్ని తీసి భద్రంగా దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు.
 
____________________________
‘‘అవును ప్రభూ! మీరు కన్న కల నిజమయింది! విలువైన వజ్రాలు దొంగిలించబడ్డాయి. కాపలాకాస్తున్న సైనికులు కూడా చంపబడ్డారు,'' అన్నాడు సభకు తిరిగివచ్చిన మంత్రి.
 
దొంగలను ఎలాగైనా బంధించి సభకు తీసుకురమ్మని భటులకు ఆజ్ఞను కూడా జారీ చేశాడు. మంత్రి మాటలు విన్న రాజు సింహాసనం నుంచి లేచి నిలబడి, ‘‘సభాసదులారా! ఆ వజ్రాలను దొంగిలించిన వారిలో నేను ఒకణ్ణి. కొల్లగొట్టబడిన దానిలో నా వాటా ఇది,'' అంటూ తన వద్ద ఉన్న వజ్రాన్ని తీసి సభ ముందు ఉంచాడు. ఆ తరవాత రాజు, ‘‘రెండవ వజ్రాన్ని దొంగిలించిన వాడు పేరుమోసిన గజదొంగ రక్షకుడు.
 
మూడవ వజ్రాన్ని దొంగిలించిన వాడు అందరి లోకీ పెద్ద దొంగ. వాణ్ణే మనం పట్టుకోవాలి,'' అని చెప్పగానే మంత్రి అవమానంతో తలదించుకున్నాడు... ఇక్కడితో కథ ఆగిపోయింది... ‘‘గౌరవనీయమైన దొంగ కథ ఆ తరవాత ఏమయింది? మూడో వజ్రం ఏమయింది?'' అంటూ పిల్లలు బామ్మను ప్రశ్నలతో ముంచెత్తారు.
 
‘‘అది చాలా చాలా పెద్ద కథర్రా... ఆ తరవాత చాలా రోజులకు ఆ గౌరవనీయమైన దొంగ తపస్విగా మారి వాల్మీకి మహర్షియై రామాయణం రచించాడు,'' అంటూ బామ్మ ఆ పెద్ద కథను ఒక్క వాక్యంలో పూర్తి చేసేసింది. తక్కిన కథను ఏ తాతయ్యనుంచో, బామ్మ నుంచో మీరు వినవచ్చు. 


No comments:

Post a Comment