Pages

Saturday, September 15, 2012

తప్పించుకున్న వృషభరాజు!


చాలా కాలం క్రితం ఒక వర్తకపు ఓడ సరుకులతో స్వదేశానికి తిరిగి వెళుతున్నది. మితంగా వీచే సముద్రపుగాలులతో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉన్నది. హఠాత్తుగా వందలాది చిన్న పడవలు ఓడను చుట్టుముట్టాయి. నావికులు విస్మయం చెందారు. వాళ్ళు ఏం జరుగుతున్నదీ గ్రహించేలోపలే పడవలలోని వాళ్ళు బిలబిలా ఓడలోకి ఎక్కివచ్చి అందిన వాటిని అందినట్టు దోచుకుని పడవలలోకి దూకి రెప్ప పాటులో కనుమరుగై పోయూరు.
 
‘‘ఏం జరిగింది!'' అంటూ దిక్కు తోచక చూస్తూ వ్యాపారులు విస్తుపోయూరు! ప్రాచీన కాలంలో కళింగరాజ్యంగా ప్రసిద్ధిగాంచిన ఈనాటి ఒరిస్సా ప్రాంతంలో బ్రిటిష్‌ వాళ్ళు 17వ శతాబ్దంలో వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పారు. అయితే, తీరప్రాంతంలోని ఒక చిన్న రాజ్యాన్ని పాలించే రాజుకు పరాయి వ్యాపారులు వచ్చి తమ రాజ్యంలోని విలువైన వస్తు వులను, నిధులను పట్టుకు పోవడం ఏమాత్రం నచ్చలేదు.
 
ఒక మారు కాదు; రెండు మార్లు కాదు; అనేక పర్యాయూలు బ్రిటిష్‌ ఈస్‌‌ట ఇండియూ కంపెనీ వర్తక ఓడలను ఆయన అనుచరులు పడవల్లో వచ్చి దోచుకువెళ్ళారు. ఇది ఇంగ్లీషు వర్తకులకు కంటక ప్రాయమయింది. సంపన్నమైన భారతదేశంలోని ఈ భూభాగంలో వర్తక వ్యాపారాలు నెలకొల్పాలన్న తమ ప్రయత్నాలకు తరచూ అవరోధాలు ఏర్పడడం భరించలేకపోయూరు.
 
ఈ అవరోధాలను అధిగమించాలంటే వాటిని కల్పిస్తూన్న ఆ పాలకుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ పాలకుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎవరికీ ఇదమిత్థంగా తెలియదు! సముద్ర తీరంలో రకరకాల జంతువులతో నిండిన దట్టమైన అడవులతో పరివేష్ఠించబడిన అందమైన పారాదీప్‌ అనే చిన్న ద్వీపం ఉండేది.
 
కుజాంగ్‌ అనే చిన్న రాజ్యానికి రాజధాని అది. ఒక వైపున బంగాళాఖాతం, మిగిలినవైపుల మహానది, దాని ఉపనది దానికి హద్దులుగా ఉండేవి. ప్రకృతి సౌందర్యం నిండిన ఈ ప్రశాంత ప్రదేశంలో చంద్రధ్వజ రాజుగారి భవనం ఉండేది. ఆ రాజే సాహసవంతులైన పడవవీరులకు యుద్ధ విద్యలలో శిక్షణనిచ్చేవాడు.

వాళ్ళే ఆ ద్వీపం సమీపంలో వెళ్ళే బ్రిటిష్‌ వర్తక ఓడలను దోచుకుని నానా బీభత్సం సృష్టించేవారు. చంద్రధ్వజుడికి షాంధారాజా (వృషభరాజు) అనే మరో వింత బిరుదనామం కూడా ఉండేది. ఆయనకా బిరుదు రావడానికి ఒక ఉదంతాన్ని చెబుతారు. ఒకప్పుడు కుజాంగ్‌ రాజు పవిత్ర పూరీ నగరానికి వెళ్ళాడట.
 
నగర వీధిలో నడిచి వెళుతూండగా, ఆయన ధరించిన రంగుల దుస్తులను చూసి ఒక ఆబోతు ఆయన మీదికి ఉరకబోయింది. రాజు చుట్టూవున్న పరివారంలోని ప్రముఖలూ, భటులూ బెదిరిపోయి పక్కకు పారిపోయూరట. అయితే, వారిలో రాజవంశానికి చెందిన ఒక యువకుడు మాత్రం రాజును తన తండ్రిలా భావించి-ఉరుకుతూన్న ఆబోతు ఖడ్గంలాంటి కొమ్ములను ఒడిసి పట్టుకుని, దానితో భీకరంగా పోరాడి దాపులనున్న పల్లంలోకి దాన్ని తోశాడట.
 
శివుడి బసవన్న కావడంతో ఆ ఆబోతును చూసి ప్రతి ఒక్కరూ జడుసుకునే వారు. చేతులెత్తి మొక్కేవారు. రాజుగారికి ఆతిథ్యం ఇచ్చిన పూరీ మహారాజా తన భవన ఉపరితలం నుంచి ఈ సంచలనాత్మకమైన సంఘటనను కళ్ళారా చూశాడు. అద్భుతమైన బలపరాక్రమాలు కనబరచిన ఆ యువకుణ్ణి షాంధా (ఆబోతు కన్నా బలవంతుడు) బిరుదంతో సత్కరించాడు.
 
కుజాంగ్‌ రాజుకు సంతానం లేదు. ఆపద సమయంలో తన ప్రాణాలు కాపాడిన సాహస యువకుణ్ణి పుత్రుడిగా స్వీకరించి, సింహాసనానికి వారసుణ్ణి చేశాడు. ఆ యువకుడితోనే వృషభరాజుల వంశం ప్రారంభమయింది. వృషభవంశానికి చెందిన చంద్రధ్వజుణ్ణి ఎవరూ అణచలేకపోయూరు గనక, ఆయనకు ‘అడవి ఆబోతు' అనే బిరుదు ఉండేది. పట్టు బడని చంద్రధ్వజుడి ఆచూకీ తెలుసుకోవడానికి బ్రిటిష్‌ వాళ్ళు గూఢచారులను నియమించారు.
 
చంద్రధ్వజుడికి అద్భుతమైన భుజబలంతో పాటు, అపారమైన ఆధ్యాత్మిక చింతన, ధ్యానం పట్ల ఆసక్తి ఉండేవి. సూర్యోదయూనికి ముందూ, అస్తమయూనంతరం ఎక్కడ ఉన్నప్పటికీ ధ్యానంలో కూర్చునేవాడు. అరణ్య మధ్యంలో అతడున్న చోటు విశ్వాసపాత్రులైన అతి సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఒకనాటి వేకువజామున ఆయన ధ్యాననిమగ్నుడై వున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన బ్రిటిష్‌ సైనికులు ఆయన్ను పట్టుకుని బందీచేశారు.
 
ఆయన ఉన్న రహస్య ప్రదేశం శత్రువులకు ఎలా తెలిసింది? వాళ్ళు చూపిన ధనాశవలలో పడ్డ రాజుకు సన్నిహితుడైన ఒక నమ్మకద్రోహి కుట్ర ఫలితమే అది! సాహసవీరుడైన ఈ కుజాంగ్‌ రాజును గురించి ‘‘ఎ స్కెచ్‌ ఆఫ్‌ హిస్టరీ ఆఫ్‌ ఒరిస్సా'' అనే గ్రంథంలో బ్రిటిష్‌ చరిత్రకారుడు జి.టాయిన్‌బీ ఇలా రాశాడు: ‘‘ఈ పరగణాలోని మూడు ప్రధాన పట్టణాలు తమ హస్తగతం కాగానే, మొదటి పథకం ప్రకారం కొంత సైన్యం మేజర్‌ ఫోర్‌‌బ్స నాయకత్వంలో బార్ముల్‌ కనుమకు పంపబడింది. కల్నల్‌ హార్‌కోర్‌‌ట నాయకత్వంలో మరికొంత సైన్యం కుజాంగ్‌ మీద దాడికి బయలుదేరింది. ఆ ప్రాంతంరాజు బ్రిటిష్‌ అధికారానికి వ్యతిరేకంగా-తమను రక్షించుకోవడానికి దానిని దెబ్బతీయడానికి ఖుర్దా, కనికా రాజులతో లేఖలద్వారా చర్చలు జరుపుతున్నట్టు కనుగొనబడింది. ‘‘కుజాంగ్‌ రాజు పారిపోయూడు... త్వరలోనే ఆయన్ను పట్టుకుని కటక్‌ కోటలో బంధించారు.
 
అతని కోట ధ్వంసం చేయబడింది. అక్కడొక ఫిరంగి కనిపించడంతో, దాన్ని కటక్‌కు తరలించారు. అందులో ఈస్టిండియూ కంపెనీ ముద్రలు గల రెండు కొత్త ఇత్తడి తుపాకులు కనిపించాయి. అవి రాజాకు ఎలా లభించాయో తెలియలేదు. బహుశా ఏదైనా ఓడ మునిగిపోయినప్పుడో లేదా సముద్రపుదొంగల ద్వారానో అవి లభించి ఉండవచ్చు...'' రాజును మహానది తీరంలోని చారిత్రాత్మకమైన కటక్‌లోని బరాబతి కోటలో బంధించారు.
 
ఆ తొమ్మిది అంతస్థుల భవనం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. దానికి బ్రహ్మాండమైన ముఖద్వారం, చుట్టూ ఇరవై గజాల అగడ్త ఉన్నాయి. అందులో చాలా వరకు నాశపరచిన ఈస్టిండియూ కంపెనీ, దానిని ఆ ప్రాంతానికి రాజధానిగా చేసుకున్నది. శత్రువుల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని తెలిసినప్పటికీ బందీ అయిన చంద్రధ్వజరాజు చాలా ప్రశాంతంగా కనిపించాడు.
 
యువకుడైన ఆ రాజు ఉత్సాహం, స్నేహస్వభావం బ్రిటిష్‌ అధికారుల హృదయూలను దోచుకున్నాయి. మన దేశానికి చెందిన మల్ల యుద్ధం, ఇతర యుద్ధ కళలను ఆయన్నుంచి వాళ్ళు నేర్చుకోసాగారు. క్రమక్రమంగా ఆయన్ను ఒక శత్రువుగా కాకుండా తమ శిబిరంలోని ఒక గౌరవనీయుడైన మిత్రుడిగా భావించసాగారు.
 
అయినా, సదా సర్వవేళలా ఆయన మీద నిఘా ఉంచడం మాత్రం మానలేదు. అలాగే ఒక సంవత్సరం గడిచిపోయింది. బ్రిటిష్‌ ఓడల మీద దాడి కూడా తగ్గిపోయింది. ఒకనాటి సాయంకాలం బ్రిటిష్‌ అధికారులు ఒక అద్భుత దృశ్యం చూశారు. నెమలి ఆకారంలోని ఒక పెద్ద పడవ మెల్లగా నదీ తీరం కేసి రాసాగింది.

రంగు రంగుల ఆ పడవ హంసలా తేలుతూ వచ్చింది. సాయం సంధ్య వెలుగులో అది అత్యంత మనోహరంగా కనిపించింది. బ్రిటిష్‌ అధికారులు తమ కళ్ళను తామే నమ్మలేక, కళ్ళు నులుముకుని మరీ చూశారు. ఇరవై నాలుగు మంది పడవ నడిపేవాళ్ళ మధ్య హుందాగా ఒక పెద్దమనిషి కనిపించాడు. ‘‘ఈ పడవ నీదేనా?'' అని ఆయన్ను అడిగారు అధికారులు. ‘‘కాదు. ఈ అందాల పడవ ఒక రాజకుటుంబానికి చెందినది.
 
దురదృష్టవశాత్తు ఆ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నది. దీన్ని అమ్మి పెట్టమని నాకు అప్పగించారు,'' అన్నాడా పెద్దమనిషి ఎంతో గంభీరంగా. ‘‘ధర ఎంతేమిటి?'' అని అడిగారు అధికారులు ఆత్రుతగా. పెద్దమనిషి చెప్పిన ధర విని వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు. వాళ్ళ ఆశ్చర్యాన్ని గమనించిన పెద్దమనిషి, ‘‘మిత్రులారా! ఇలాంటి పడవలను రాజులు, రాణులు మాత్రమే ఉపయోగిస్తారు.
 
అలాంటి వ్యక్తి మీ ఎరుకలో ఎవరైనా ఉంటే తీసుకువచ్చి చూపించండి. ఆయన చెప్పే ధర పుచ్చుకుంటాను,'' అన్నాడు. ఆ ప్రతిపాదన అధికారులకు సవ్యంగానే కనిపించింది. అయినా అలాంటి వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకురావడం? ఉన్నట్టుండి వారికి బందీగా ఉన్న చంద్రధ్వజుడు గుర్తురావడంతో, క్షణాల్లో ఆయన్ను తీసుకు వచ్చి విషయం చెప్పారు.
 
రాజు నదీ తీరం నుంచి పడవనూ, నమస్కరించిన పెద్దమనిషినీ ఒక సారి తేరిపార చూశాడు. ఆయన పెదవులపై కదిలిన చిరునవ్వును ఆ పెద్దమనిషి మాత్రమే గమనించాడు. రాజు ఆ పడవను పరిశీలిస్తూ పెద్దమనిషిని ఏవేవో ప్రశ్నలడుగుతూ ఆయన్ను సమీపించాడు. రాజు ఆమోదకరమైన ధరను నిర్ణయించగలడని బ్రిటిష్‌ అధికారులు సంబరపడ్డారు.
 
అప్పటికే సూర్యుడు అస్తమించాడు. బేరమాడుతూ రాజు, పడవలోపలి భాగాలను పరిశీలించే వాడిలా అందులోకి అడుగు పెట్టాడు. రెప్పపాటులో ఇరవై నాలుగు మంది పడవ నడిపే వాళ్ళు తెడ్లను అందుకుని కార్యాచరణకు దిగారు. ఏం జరుగుతున్నదో అధికారులు గ్రహించేలోగా మెరుపు వేగంతో రాజుతో సహా కలల పడవ నది మలుపు తిరిగి కనుమరుగై పోయింది! పడవలో వచ్చిన పెద్దమనిషి వేరెవరో కాదు; బందీ అయిన రాజుకు విశ్వాసపాత్రుడైన మంత్రి పట్టాజోషి! తమ రాజు చెరనుంచి తప్పించుకోవడానికి అద్భుత వ్యూహాన్ని తెలివిగా రూపొందించి విజయవంతంగా నెరవేర్చాడు.

No comments:

Post a Comment