Pages

Saturday, September 15, 2012

చందమామలో కుందేలు

చాలా కాలానికి పూర్వం ఒక అడవిలో నాలుగు తెలివైన జంతువులు-ఒక కుందేలు, ఒక నక్క, ఒక నీటికుక్క, ఒక కోతి ఉండేవి. ఆ నాలుగు జంతువులూ చాలా స్నేహంగా ఉండేవి. రోజూ సాయంకాలం ఒక చోట కూర్చుని ఆ రోజు తమకు ఎదురైన అనుభవాల గురించి ముచ్చ టించుకునేవి. పరస్పరం సలహాలు ఇచ్చిపుచ్చుకునేవి. మంచి మంచి నిర్ణయూలు తీసుకునేవి. ఆ నాలుగు జంతువులలో కుందేలు చాలా వివేకం, ఉత్తమ స్వభావం కలిగినది.

అది స్ర్తీపురుషుల ఔన్నత్యాన్ని గౌరవిస్తూ, మానవులలోని మంచితనం గురించీ, విద్యావివేకాల గురించీ తమ మిత్రులకు ఎల్లప్పుడూ గొప్పగా చెబుతూ ఉండేది. ఒకనాటి సాయంకాలం చంద్రోదయం అవుతూండగా-(ఆరోజుల్లో చందమామలో ఎలాంటి గుర్తూ ఉండేది కాదు) నిండు చందమామను తదేకంగా చూస్తూ కుందేలు, ‘‘రేపు ఒక ముఖ్యమైన రోజు. సజ్జనులైన మానవులు రోజంతా ఉపవాసం ఉంటారు. సూర్యుడస్తమించేంత వరకు భోజనం చేయరు. ఇంటికి వచ్చే భిక్షువులకు, సాధువులకు దానధర్మాలు చేస్తారు. మనం కూడా రేపు ఉపవాసం చేసి మానవుల మంచితనానికీ, వివేకానికీ దగ్గర వుదాం. ఏమంటారు?'' అని అడిగింది. అందుకు తక్కిన మూడు జంతువులూ అంగీకరించి, రోజంతా ఉపవాసం చేయూలని ప్రతినబూని తమ తమ నివాసాలకు వెళ్ళి పోయూయి.

మరునాడు తెల్లవారగానే నీటికుక్క లేచి ఒళ్ళు విరుచుకుని ఆహార సంపాదనకోసం బయలుదేరబోతూ, మిత్రులతో కలిసి తీసుకున్న నిర్ణయం జ్ఞాపకం రావడంతో ఆగిపోయింది. అయినా కొంత సేపటికల్లా, ‘‘మిత్రులతో కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం రోజంతా ఉపవాసం చేస్తే, సాయంకాలానికి ఆకలి మరీ ఎక్కువై పోతుంది.


ఉపవాసదీక్ష ముగియగానే తినడానికి ఏదైనా సంపాదించి ఉంచడం మంచిది,'' అనుకుంటూ వెల్లగా నదీ తీరం కేసి బయలుదేరింది. అప్పుడనగా రాత్రంతా పెద్దపెద్ద చేపలు పట్టిన బెస్తవాడొకడు, వాటిని ఇసుకలో పూడ్చి తరవాత వచ్చి తీసుకువెళదామని మరేదో పనిమీద వెళ్ళాడు. నీటికుక్క అటుకేసి వెళుతూ ఇసుకలో నుంచి చేపలవాసన రావడం పసిగట్టి పట్టరాని సంతోషంతో, ‘‘ఆహా! రాత్రి భోజనం సిద్ధంగా ఉంది!'' అనుకున్నది. మరు క్షణమే, ‘‘ఈరోజు పుణ్యదినం గనక నేను దొంగతనం చేయకూడదు,'' అనుకుని, ‘‘ఈ చేపలు ఎవరివి? వీటి సొంతదారు ఎవరైనా ఉన్నారా?'' అని గట్టిగా అడిగింది.
 
సమాధానం రాకపోయేసరికి, సంతోషంగా చేపను తీసుకెళ్ళి తన నివాసంలో రాత్రి ఆహారం కోసం భద్రపరిచింది. తలుపుమూసుకుని భిక్షకోసం వచ్చే బిచ్చగాళ్ళ, సాధువుల బెడద లేకుండా రోజంతా నిద్రపోయింది. కోతి, నక్క కూడా పొద్దున లేవగానే అదే ధోరణిలో ఆలోచించాయి. మిత్రులతో కలిసి చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకున్నాయి. రోజంతా ఉపవాసం చేయూలి. అయితే, ఉపవాసం ముగిశాక రాత్రికి ఏదైనా తినాలి.
 
అందుకు దాన్ని ఇప్పుడే సంపాదించి పెట్టుకోవాలి అనుకున్నాయి. నక్క ఎవరి పెరట్లోనో ఉన్న ఎండు మాంసాన్ని తెచ్చి రాత్రికి తిందామని తన బొరియలో భద్రపరచుకున్నది. కోతి ఒక మామిడి చెట్టెక్కి, ఒక మామడిగెలను కోసి తెచ్చి తను ఉన్న చోట భద్రపరచింది. ఆ తరవాత ఆ రెండూ కూడా నీటికుక్కలాగే నిశ్చింతగా నిద్రకు ఉపక్రమించాయి.

కుందేలు తెల్లవారక ముందే నిద్రలేచింది. పొడవాటి చెవులను విదిలించుకుంటూ బొరియ నుంచి వెలుపలికి వచ్చి, మంచు తడిసిన పచ్చికను వాసన చూసింది. ‘‘సాయంకాలానికి ఈ పచ్చగడ్డిని తినవచ్చు. అయితే, ఏ భిక్షువో సాధువో వస్తే ఇవ్వడానికి నాదగ్గర ఈ పచ్చగడ్డి తప్ప మరేదీ లేదే. ఈ గడ్డిని ఎలా ఇవ్వగలను? నన్ను నేనే సమర్పించుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నది.
 
చాలా మంది మనుషులు కుందేలు మాంసం ఇష్టంగా తింటారనుకుంటాను. కుందేలు మాంసం చాలా రుచిగా ఉంటుందని వాళ్ళు చెప్పుకోవడం కూడా లోగడ చాలా సార్లు విన్నాను,'' అంటూ తన సమస్యకు పరిష్కారం లభించినందుకు సంతోషంతో అటూ ఇటూ గెంతసాగింది. కుందేలు మాటలను మేఘాలలో విశ్రాంతి తీసుకుంటూన్న సక్కాదేవుడు విన్నాడు. ‘‘ఇది నిజంగానే అంత నిస్వార్థమైన త్యాగబుద్ధిగల కుందేలేనా అని పరీక్షించాలి,'' అనుకున్నాడు.
 
సాయంకాలమవుతూండగా సక్కా దేవుడు ఒక వృద్ధపూజారి రూపంలో మేఘం నుంచి దిగి వచ్చి కుందేలు బొరియ ముందు కూర్చున్నాడు. కుందేలు తిరిగి రాగానే, ‘‘నమస్కారం కుందేలు మిత్రమా! ఏదైనా తినడానికి ఇవ్వగలవా? రోజంతా ఉపవాసం చేయడంవల్ల ప్రార్థించడానికి కూడా శక్తిలేకుండా నీరసంగా ఉన్నాను,'' అన్నాడు. ‘‘మనుషులు కుందేలు మాంసం ఇష్ట పడి తింటారు కదా?'' అని అడిగింది కుందేలు. ‘‘అవును, తింటారు,'' అన్నాడు పూజారి. ‘‘అలా అయితే చాలా మంచిది.
 
నా దగ్గర మరే ఆహారమూ లేదు. నువ్వు నన్నే హాయిగా తినవచ్చు,'' అన్నది కుందేలు. ‘‘బాగానే వుంది. అయినా, నేను పూజారిని. పైగా, ఈ రోజు పుణ్యదినం. నా చేతులతో ఏ ప్రాణినీ చంపజాలను,'' అన్నాడు వృద్ధుడు విచారంగా. ‘‘అలా అయితే కొన్ని ఎండు పుల్లలను ఏరి మంట ఏర్పాటు చెయ్‌.

నేను మంటల్లోకి దూకేస్తాను. కాలాక నన్ను వెలుపలికి తీసి నా మాంసం తినవచ్చు,'' అన్నది కుందేలు. ఆ మాటలకు ముగ్థుడైన సక్కాదేవుడు దానిని ఇంకా పరీక్షించడానికి, అది చెప్పినట్టే చితుకులను ఏరి మంట రాజిల చేశాడు. కుందేలు ఏమాత్రం వెనుకాడకుండా మంటల మధ్యకు ఉరికేసింది. కొంతసేపటికి, ‘‘ఇక్కడ ఏం జరుగుతున్నది? నా చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్నాయి.
 
అయినా, ఒంటి మీది ఒక్క రోమం కూడా కాలిపోలేదేమిటి? చాలా చల్లగా ఉందే!'' అన్నది కుందేలు. అంతలోనే మంటలు చల్లారిపోయూయి. కుందేలు మెత్తటి పచ్చికమైదానం మధ్య కూర్చుని ఉన్నది. పూజారి స్థానంలో సక్కాదేవుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కనిపించాడు. ‘‘కుందేలు మిత్రమా! నేను సక్కాదేవుణ్ణి. నీ ప్రతిజ్ఞ విని, నీ చిత్తశుద్ధిని పరీక్షించడానికి వచ్చాను. నీలాంటి నిస్వార్థ త్యాగజీవికి అమరత్వం ప్రసాదించాలి. నీ నిస్వార్థ త్యాగగుణం యావత్‌ ప్రపంచానికి తెలియాలి,'' అంటూ సక్కాదేవుడు కుందేలును ఆశీర్వదించి, తన చేతులను పర్వతాలకేసి సాచాడు.
 
అందులో నుంచి ఒక మంత్రదండాన్ని స్వీకరించాడు. దానిని ఉదయిస్తూన్న నిండు చందమామ కేసి విసిరాడు. చందమామలో కుందేలు బొమ్మ ఏర్పడింది. ఆ తరవాత కుందేలుతో, ‘‘బుల్లి కుందేలు పిల్లా! నువ్వు చందమామ నుంచి ఎల్లప్పుడూ భూమిని చూస్తూ, ‘మీరు ఇతరులకు ఇవ్వండి. దేవతలు మీకు ఇస్తారు,' అన్న సనాతన సత్యాన్ని మానవులకు గుర్తు చేస్తూ ఉంటావు!'' అని చెప్పి అదృశ్యమయ్యాడు

No comments:

Post a Comment