Pages

Saturday, September 15, 2012

బెత్తం స్వాములు


పాటలాద్రి బెత్తం స్వాముల చేత బెత్తం దెబ్బలు తిన్నవారిని అదృష్టం వరిస్తుందని ప్రతీతి. ఇందులోని రహస్యమేమిటో తెలుసుకోవాలని నాగరాజు అనే యువకుడు స్వాముల ఆశ్రమంలో చేరి ఆయన చెప్పిన పనులన్నీ ఓపిగ్గా చేయసాగాడు. కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు నాగరాజు కిందికి వాలుగా ఉన్న మామిడి చెట్టు నుంచి పళ్ళు కోస్తుండగా వీపు మీద ఠఫీమని బెత్తం దెబ్బ తగిలింది.
 
భరించరాని నొప్పి. నాగరాజు తిరిగి చూశాడు. కొట్టిన గురువు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. మూడు రోజులు గడిచాక నాగరాజు కూరగాయల పాదుల్లో పని చేస్తూండగా ఎవరో వస్తున్నట్టు గమనించి తిరిగి చూసేలోపల స్వాములు బెత్తంతో కొట్టి వెళ్ళిపోయూడు. ఐదో రోజు పువ్వులు సేకరిస్తూండగా అక్కడికి వచ్చిన స్వాములు కొట్టడానికి బెత్తాన్ని ఎత్తగానే, నాగరాజు తిరిగి చూడ్డంతో కొట్టకుండానే వెళ్ళిపోయూడు.
 
ఆ తరవాత స్వాములు కొట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా నాగరాజు చూసి నమస్కరించడంతో, ఒక్క దెబ్బకూడా పడలేదు. సంతసించిన స్వాములు, ‘‘నాయనా, నువ్వు పట్టిందల్లా బంగారమవుతుంది. ఇక నువ్వు వెళ్ళవచ్చు,'' అన్నాడు. ‘‘అదెలా సాధ్యం?'' అన్నట్టు చూసిన నాగరాజు అనుమానాన్ని గ్రహించిన స్వాములు, ‘‘మెలకువ ఉన్న మనిషికి లోటు అన్నది రాదు.
 
అది ఇప్పుడు నీలో పరిపూర్ణంగా అభివృద్ధి చెందింది. తనను తాను అర్థం చేసుకుని, పరిసరాల స్పృహతో రానున్న కాలం ఎలా ఉండగలదో గమనించగల వ్యక్తి దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటాడు. అందువల్ల కాలం అతనికి విజయఫలాలనే అందిస్తుంది,'' అని ఆశీర్వదించాడు మందహాసంతో.    

No comments:

Post a Comment