Pages

Friday, September 14, 2012

గుండ్రాయి కథ


విజయపురికి విద్యానందస్వామి విచ్చేశారు. ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమవైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది. విద్యానందస్వామికి తన భవనంలో ఆతిథ్యమివ్వడమే కాకుండా, ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధనసహాయం చేసిన జమీందారు జగపతిరాయుడి కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది. అయితే, జగపతిరాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు.
 
దీనిని గమనించిన విద్యానందస్వామి, ఎంతో సంతోషించి, ‘‘మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది. అది ఉంటే ఓర్పు, సహనంలాంటి తక్కిన సుగుణాలు వాటంతట అవే అలవడుతాయి. మానవులకు సంప్రాప్తమయ్యే సిరిసంపదలు, భవనాలు, భార్యా పిల్లలు ఇలా సర్వం పూర్వజన్మ సుకృతాల ఫలితాలని పెద్దలు చెబుతారు. అలా అని వాటినే నమ్ముకుని ఏ పనీ చేయకుండా కూర్చోవడం వివేకంకాదు. ఇహపర సౌఖ్యాల సాధనకు నిరంతర ప్రయత్నం కావాలి. అన్నిటికీ మించి భగవత్‌ కృప ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. అంతవరకు ఓర్పూ, సహనం పాటించాలి. ఈ రెండింటికీ ఆధారమైనది వినయం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి. మిడిసిపాటు పనికిరాదు. ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెబుతాను, వినండి,'' అంటూ ఇలా చెప్పసాగాడు:
 
గోదావరి నదీ తీరానగల సుందరమైన ప్రాంతాల్లో మామిడి, పనస, కొబ్బరి, అరటివంటి రకరకాల ఫలవృక్షాలు వున్నాయి. ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాళ్ళు కూడా కొట్టుకువచ్చాయి.

అలా కొట్టుకువచ్చిన రాళ్ళలో ఒక గుండ్రటి రాయి, నది ప్రక్కనే వున్న కొబ్బరి చెట్ల మధ్యకు వచ్చి నిలిచి పోయింది. గుండ్రంగా, అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి, కొబ్బరి చెట్ల వేళ్ళకు తగులుకుని కదలలేకపోయింది. క్రమంగా వరద ప్రవాహం తగ్గింది. కొబ్బరిచెట్టు మీదవున్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయూయి.
 
ఒక పండు కొబ్బరికాయ రాయిని, ‘‘ఏయ్‌! ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నిలచి పోయూవేం?'' అంటూ గద్దిస్తూ ప్రశ్నించింది. రాయి ఉలకలేదు, పలకలేదు. అప్పుడు మరో చెట్టు మీద వున్న పండుకొబ్బరి హేళనగా, ‘‘దీని కథ నాకు తెలుసు! ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలవుతాయి. వాటిలో ఇదొకటి. ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ, దొర్లుకుంటూ దెబ్బలు తినీ తినీ ఇలా గుండ్రాయిగా మారింది. పాపం! మొన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకుని ఆగి పోయిందిగానీ, లేకపోతే ఇంకా ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులుగా మారి, ఈ పాటికి సముద్రంలోకి చేరివుండేది,'' అన్నది.
 
‘‘అయ్యో పాపం! అయినా, ఓ గుండ్రాయీ! సహనానికి కూడా ఒక హద్దంటూ వుండాలిగదా! మేము చూడు, ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తూన్నామో!'' అన్నది మరొక పండుకొబ్బరి.

గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు. కొంతకాలం గడిచింది. నదికి సమీపానగల గ్రామంలోని శివాలయంలో పూజారి, ఒక పళ్ళెంలో కొబ్బరికాయ, పువ్వులు అగరువత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ తన మూడు కళ్ళూ తెరిచి దేవుడికేసి చూసింది. ఎత్తయిన పీఠంపై నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి. వెంటనే దానికి, గోదావరి తీరాన తానుండిన చెట్టు వేళ్ళకు తగులుకొని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకు వచ్చింది. ‘‘ఓహో! అదే ఇదా?'' అనుకుంటూండగానే, గుండ్రాయి, కొబ్బరికాయతో, ‘‘ఏం, మిత్రమా! ఆనాటి నీ ఉన్నత స్థితి, స్వాభిమానం ఇప్పుడేమయ్యూయి? ఓర్పుకు హద్దులు వుండాలనీ, నాకలాంటి హద్దులు తెలియక, స్వాభిమానం లేక అవమానాలు పడీ పడీ, పతనమై పోయూననీ, ఆనాడు జాలిపడ్డావు కదూ. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?'' అన్నది.
 
అంతలో పూజారి గంటలు మోగుతూండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకుని కత్తితో పెడీ పెడీ మని కొడుతూ, రెండు చెక్కలు చేసి, ఆ నీళ్ళతో శివలింగాన్ని అభిషేకించటానికి ప్రయత్నిస్తుండగా కొబ్బరికాయ, ‘‘మిత్రమా! నన్ను మన్నించు. ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో వుండగా, కన్నూమిన్నూకానక నిన్ను అధిక్షేపించాను. అందుకు ఇప్పుడీ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి, పవిత్రమైన గోదావరిలో వుంటూ, ఒరిపిడి పెట్టబడి, పూజార్హతను పొందావు. ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు,'' అన్నది.
 
ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది, ఆలయూనికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది. ఇంత వరకు చెప్పిన విద్యానందస్వామి, ‘‘నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికిలాగే మనుషులకు జీవితంలో ఆటు పోట్లు తప్పవు. అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితిని అందుకోగలడు,'' అని కథను పూర్తి చేశాడు.

No comments:

Post a Comment