జనార్దనం తండ్రి వ్యాపారరీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు. ఆయన
పుట్టిపెరిగిన గ్రామం వదిలి కట్టుబట్టలతో ఆ పట్నం వచ్చాడు. మొదట ఒక
దుకాణంలో పనివాడుగా చేరి వ్యాపారంలోని మెళకువలను ఆకళింపు చేసుకున్నాడు.
జీతం రూపంలో వచ్చిన మొత్తాన్ని కూడబెట్టి దాన్నే పెట్టుబడిగా పెట్టి సొంత
వ్యాపారం ప్రారంభించాడు. రేయింబవళ్ళు కష్టపడి పనిచేశాడు.
కాలం కలిసిరావడంతో కొన్నేళ్ళలోనే బాగా ధనం సంపాదించాడు. ఆయన
జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇవ్వడమే కాక, పోయేటప్పుడు, ‘‘నాయనా,
జనార్దనం, నేను పోయూక నువ్వీ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని
స్థిరపడు. నేను సంపాదించినది, నువ్వూ, నీ పిల్లలూ పదికాలాల పాటు
కష్టపడకుండా తినగలిగినంతవుంది,'' అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయూక
జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు.
స్వంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించే వారు చాలామంది ఉన్నారు. అయితే, ఆ
ఊరు ఆట్టే మంచిది కాదు. సకాలంలో వర్షాలు కురవక పోవడం వల్ల నీటి సౌకర్యం
సరిగా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం! జనార్దనం ఆస్తి
కొంత బంగారంగానూ, కొంత నగదుగానూ మార్చుకుని, మంచి చోటు వెతుక్కుంటూ
బయలుదేరాడు. పక్షం రోజుల తరువాత వాడి కొక చక్కని ప్రదేశం నచ్చింది.
అది సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు! ఎటు చూసినా సరుగుడు తోటలు. ఇసుక
దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది.
వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని, అక్కడే స్థిరపడ్డాడు. రోజూ
సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో కొంతసేపు హాయిగా సముద్ర విహారానికి
వెళ్ళేవాడు.
ఆ పల్లెటూళ్ళో ప్రజలందరి ముఖ్యవృత్తి చేపలు పట్టటం. వాళ్ళకు ఏమీ
కష్టపడకుండా తిని కూర్చునే, ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా
ఉండేది. ఒక్కరూ అతనితో మాట్లాడేవారు కాదు. ఒక రోజు ఎండవేళ జనార్దనం, ఇంటి
ముందున్న సరుగుడుచెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు
చెరుగుతున్నా, ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది.
ఎవరో పిలిచినట్టయి, జనార్దనానికి మెలుకువ వచ్చింది. మంచం దగ్గిర ఒక
మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి రాగి రంగు గడ్డమూ, నున్నని గుండూ-వాడు ఎర్ర
రంగు పొడుగు చేతుల అంగీ, నల్లని పంచే ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకిఈకల
దండ ఉంది. వాడి కళ్ళు ఎరగ్రా ఉన్నాయి. వాడు, ‘‘కుర్రాడా, చెంబెడు మంచి
నీళ్ళు పట్రా! దాహంగా వుంది. ఎండలు మాడ్చేస్తున్నాయి,'' అన్నాడు
జనార్దనంతో.
జనార్దనం
మంచినీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళబోయూడు. ‘‘ఆగు, కుర్రాడా! చిక్కటి
మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా! నా నోరు పిడచగట్టుకు పోయింది,''
అన్నాడా మనిషి. జనార్దనం, ‘‘అలాగే,'' అని వెళ్ళబోయూడు. ‘‘దాంట్లో ఒక
నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది,'' అని కేకపెట్టాడా గడ్డపుమనిషి.
జనార్దనం ఆ మనిషి అడిగినట్లు గానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయరసమూ
వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆపాటికి, ఆ మనిషి, జనార్దనం వేసుకున్న మంచం
మీద దర్జాగా కూర్చుని తాపీగా కూనిరాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటగుట
మజ్జిగ తాగేసి, ‘‘గిన్నె నిక్షేపంలా ఉంది. ఎవరయినా కాజేయగలరు, లోపల
దాచిరా!'' అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చే సరికి, ఆ మనిషి మంచం
మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు.
‘‘మంచి ఎండ వేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది. ఒక కునుకు తీసి
లేస్తాను,'' అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేక
పోయూడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని, సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు.
చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, ‘‘అప్పుడే చీకటి పడిపోయింది. ఒంటరి
జీవితమై పోయింది. ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు,'' అంటూ తిన్నగా
పాకలో కెళ్ళి, గూట్లో దీపం వెలిగించాడు.
వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది. ‘‘బాగా చీకటి
పడిపోయింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు,'' అని కోపాన్ని దిగిమింగుతూ అన్నాడు. ఆ
మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ‘‘ఎవడివయ్యూ, నువ్వు? నా ఇంటికి వచ్చి
నన్నే దబాయిస్తావా? వెళ్ళు, వెళ్ళు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి
తెల్సిందా?'' అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి, తలుపు మూసుకున్నాడు. ఆ
రాత్రంతా జనార్దనం, తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు.
ఆ మనిషి, ‘‘నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వే డబ్బు లిచ్చుకోవాలి,''
అనేసి నిద్రపోయూడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకు
బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ కేకవేసి పిలిచి, ‘‘ఈ అన్యాయం చూడండి,''
అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, ‘‘వాడెవడో
పిచ్చివాడిలా ఉన్నాడు. నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే
రచ్చ!'' అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, ‘‘మీరే చెప్పండి. ఈ ఇల్లు
నాదా, వాడిదా? మీరంతా రోజూ వస్తూ పోతూ నన్ను చూడటంలేదూ? ఈ దొంగపీనుగకి
బుద్ధి చెప్పండి,'' అన్నాడు కోపంగా.
ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరిపార చూసి, ‘‘ఎవడవిరా
నువ్వు? చూస్తే దొంగవిలా ఉన్నావు. ఈ ఇల్లు ఈ గడ్డపాయనదే! మేం రోజూ ఇతన్నే
చూస్తున్నాం. మేం ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపానపోలేదు. మర్యాదగా నీ దారిన
నువ్వుపో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం!'' అని జనార్దనాన్ని దబాయించారు.
జనార్దనం నిర్ఘాంత పోయూడు.
ఊరి వారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయూలనే దురుద్దేశంతో ఈ నాటకం
ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు రెండు సార్లు గట్టిగా తల విదిలించి,
వెర్రి చూపులు చూస్తూ, ‘‘మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళూ ఈ ఇల్లు
నాదనుకున్నాను. అయితే, నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాదికాదా?''
అని అమాయకంగా వాళ్ళను అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయూడని రూఢి
పరుచుకుని, ‘‘నీది కాదు.
ఆ బంగారం అంతా మాది. అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు!'' అంటూ ఆత్రుతగా
వాణ్ణి అడిగారు. జనార్దనం దూరంగా వున్న ఎత్తయిన ఇసుక దిబ్బను చూపించి,
‘‘పెట్టెడు బంగారం ఆ ఇసుకదిబ్బలోనే ఉంది,'' అన్నాడు. అంతా ఎవరికి వారే
కాలిసత్తువ కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం
చేసుకోవాలని ఆత్రం.
గడ్డంమనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తి పోగానే, జనార్దనం తేలిగ్గా
నిట్టూర్చి, సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను
తీసుకుని, అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా
వెళ్ళిపోయూడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులున్న
చోటని జనార్దనం తెలుసుకుని, తమ సొంత ఊరు వెళ్ళిపోయి, తనని ఆదరించే వారి
మధ్య ఆనందప్రదం అయిన జీవితం గడిపాడు.
No comments:
Post a Comment