పూర్వకాలంలో, ప్రతిష్ఠాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకొని తిరుగుతున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా, పట్టు తప్పి ఆ కుండ నేల మీద పడింది. ఆ వెంటనే తేనెచుక్కను తాగడానికి ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని మింగడానికి ఒక సాలీడు దాపురించింది. సాలీణ్ణి కబళించడానికి బల్లి అక్కడ సిద్ధమైంది.
బల్లిని గుటుక్కున మ్రింగడానికి, పిల్లి రానేవచ్చింది. దాంతో రాజ
సేవకుడి పెంపుడు కుక్క వచ్చి పిల్లిని భయపెట్టింది. ఆ దాపులనున్న వర్తకుడి
పెంపుడు పిల్లే ఆ పిల్లి. ఒక వేళ తన పెంపుడు పిల్లిని కాపాడుకునేందుకు
వర్తకుడు, తన పెంపుడు కుక్కను చంపితే, అతని తల నరకడం కోసం, రాజసేవకుడు
కత్తినెత్తాడు. ఇంతలో సాలీడు, తేనెటీగను మింగేసింది. తరువాత బల్లి,
సాలీడును తినేసింది. పిల్లి, బల్లిని గుటకాయ స్వాహా అంది.
కుక్క, పిల్లి గొంతు కొరికింది. వర్తకుడు కోపంతో ఊగిపోతూ కరన్రెత్తి
కుక్కను చంపాడు. అది చూసి రాజసేవకుడు ఉగ్రుడైపోయి కత్తినెత్తి వర్తకుడిని
యమపురికి పంపించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీతివంతుడైన
వర్తకుణ్ణి చూసి, ప్రజలందరూ కలిసి రాజసేవకుణ్ణి మట్టుబెట్టారు. ప్రజల కింత
పొగరా? అని రాజుకళ్ళెర్ర చేసి, ప్రజలపైకి సైన్యాన్ని పంపబోయూడు. అప్పుడు
మంత్రి, ‘‘మహారాజా! ఇప్పటికే జరగకూడని ఎంతో రక్తపాతం జరిగిపోయింది.
తేనెచుక్కపై తేనెటీగ వాలడం, దాన్ని సాలీడు మింగడం, సాలీడును బల్లి,
బల్లిని పిల్లి మింగడం-అంతా ప్రకృతి సహజం. అయితే, తన పిల్లిని చంపిందన్న
ఆగ్రహంతో వర్తకుడు కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న కోపం కొద్దీ తమ
సేవకుడు, వర్తకుణ్ణి వధించాడు. ప్రజలు వర్తకుడి మీది అభిమానం కొద్దీ, తమ
సేవకుడి మీద పగ సాధించారు.
ఇప్పుడు తమరు అదే ఆవేశంలో, ప్రజలందరి మీదికీ సైన్యాన్ని పంపడం ఎంతవరకు
సమంజసమో ప్రశాంతంగా ఆలోచించండి. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయిన మితిమీరిన
ఆగ్రహావేశాలే, అన్ని అరిష్టాలకూ మూలం అన్న సంగతి, తమకు తెలియంది కాదు!''
అన్నాడు. రాజుకు, మంత్రి మాటల్లోని విజ్ఞత అర్థమైంది. దాంతో జరుగనున్న
మరింత వినాశం ఆగిపోయింది.
No comments:
Post a Comment