Pages

Friday, September 14, 2012

మితిమించి తిన్న దేవుడు!


రాజప్రాసాదం వెనక ఒక చిన్న కొండా, ఆ కొండ మీద రాజ్యాధిదేవుడి ప్రధాన ఆలయమూ ఉండేవి. ఆ దేవాలయంలోని దేవుణ్ణి రాజ్య ప్రజలు సజీవుడిగా భావించి కొలిచేవారు. నైవేద్యం పెట్టే ఫలహారాలను దేవుడు సుష్టుగా భోంచేసేవాడని కూడా భక్తులు విశ్వసించేవారు. తనకు పెట్టే వంటకాలను పదిమంది ఎదుట తినడానికి దేవుడు సంకోచిస్తున్నాడని ఆలయ ప్రధాన పూజారి రాజుకు చెప్పాడు.
 
అందువల్ల రోజూ సాయంకాలం పూజాది కార్యక్రమాలు పూర్తయ్యూక విగ్రహం ఎదుట రుచికరమైన వంటకాలు ఉంచేవారు. ఆ తరవాత పూజారి తలుపులు మూసి తాళం వేసేవాడు. ఉదయం, రాజకుటుంబంతో పాటు భక్తజన సందోహం వచ్చి చూసే సరికి, రాత్రి పెట్టిన వంటకాలు లేకుండా సూర్య కిరణాలలో ఖాళీ పాత్రలు, పళ్ళాలు తళతళలాడుతూ కనిపించేవి.
 
మరో విశేషం ఏమంటే దేవుడు రుచికరమైన వంటకాలను మాత్రమే తినేవాడు. అంతగా రుచిలేని వాటిని ముట్టుకుని వదిలి పెట్టేవాడు. దేవుడి రుచికరమైన వంటకాల ప్రీతిని ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు. దేవుడికని ప్రత్యేకంగా వంటలు చేయడానికి రాజుగారి వంటశాలలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడింది. దేవుడికి నైవేద్యంగా పెట్టే ఫలహారాలు చాలా వరకు ఇక్కడి నుంచే వెళ్ళేవి.
 
మిగిలినవి నగర ప్రముఖులు పంపేవారు. ఇరుగుపొరుగు రాజ్యాల నుంచి వచ్చే రాజబంధువులు, రాజప్రతినిధులు ఈ అద్భుతాన్ని చూసి అబ్బుర పడేవారు. ‘‘తన పక్కనే అలా సజీవుడైన దేవుణ్ణి కలిగిన రాజు ఎంతటి అదృష్టవంతుడో కదా!'' అని చెప్పుకునేవారు. ఆలయ పూజారి అప్పుడప్పుడు వచ్చి, దేవుడు ప్రత్యేక వంటకాలు కావాలన్నాడని రాజుకు చెప్పేవాడు.
 
రాజు పరమానందంతో, తన వంటవాళ్ళ చేత దేవుడు కోరిన వంటలు, ఎంతో జాగ్రత్తగా చేయించి పంపేవాడు. ఒకనాడు రాజు అనేక విషయూలు తెలిసిన విజ్ఞుడూ, వివేకీ అయిన డేనియల్‌ అనే మిత్రు డితో మాట్లాడుతూండగా, ఆలయ పూజారి అక్కడికి వచ్చి రాజుకు ఏదో రహస్యంగా చెప్పాలన్నాడు.


రాజు డేనియల్‌తో ఆసక్తిగా మాట్లాడుతూండడం వల్ల మధ్యలో ఆపి, రహస్య మందిరానికి వెళ్ళడానికి సుముఖత చూపలేదు. ‘‘ఏం చెప్పాలనుకున్నావో ఇక్కడే చెప్పు. ఈ పెద్ద మనిషి చాలా మంచివాడు. నువ్వు చెప్పే విషయం మరెక్కడా పొక్కనివ్వడు,'' అన్నాడు పూజారితో. అయితే, పూజారి అందుకు అంగీకరించలేదు. రహస్యంగానే చెప్పాలని పట్టుపట్టాడు.
 
దాంతో రాజు ఇబ్బంది కరంగా లేచి, పూజారిని వెంటబెట్టుకుని రహస్య మందిరానికి వెళ్ళి, వెంటనే డేనియల్‌ వద్దకు తిరిగి వచ్చి ఆయన ఎదుట కూర్చుంటూ, ‘‘పూజారి చెప్పవచ్చింది అంత ప్రత్యేక విషయమేమీ కాదు. అనవసరంగా మన సంభాషణకు అంతరాయం కలిగించాడు,'' అన్నాడు. ‘‘ప్రభూ, మరీ ప్రత్యేకమైనది కాకుంటే ఆయన చెప్పిన సంగతి నాతో చెప్పవచ్చు కదా?'' అని అడిగాడు డేనియల్‌.
 
‘‘ఈ రోజు రాత్రికి మరిన్ని ప్రత్యేక వంటకాలతో, మామూలు కన్నా రెండింతలు పంపమన్నాడట దేవుడు, అంతే,'' అన్నాడు రాజు. ‘‘నిజానికి, ఆయన అదే చెప్పి ఉంటాడని నేను ఊహించాను,'' అన్నాడు డేనియల్‌. ‘‘అది నీకెలా తెలుసు?'' అని అడిగాడు రాజు విస్తుపోతూ. పూజారి మనసులోని ఆలోచనను సైతం డేనియల్‌ అంత సులభంగా పసిగట్టగలడని రాజు నమ్మలేకపోయూడు.
 
‘‘ప్రభూ, తమనూ, వేలాది మంది భక్తులనూ ఇబ్బందిపెట్టే ఆ సత్యాన్ని ఇప్పుడు చెప్పనందుకు నన్ను క్షమించండి,'' అన్నాడు డేనియల్‌. ఈ మాట రాజులో మరింత ఉత్కంఠను రేకెత్తించింది. అయితే, ఆయన ప్రశ్నకు రేపు ఉదయం సంతృప్తికరమైన సమాధానం చెప్పగలనని డేనియల్‌ రాజుకు నచ్చజెప్పి ఒప్పించాడు.
 
అందుకు వీలుగా, ఆనాటి రాత్రి ఆలయం తలుపులు మూసేముందు దేవాలయంలోని విగ్రహం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయడానికి తనను అనుమతించాలని విన్నవించుకున్నాడు. అందుకు అభ్యంతరం చెప్పడానికి రాజుకు ఎలాంటి కారణమూ కనిపించలేదు. డేనియల్‌ చీకటిలో దేవుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం పూజారికి నచ్చలేదు.
 
అయితే, రాజే అందుకు అనుమతించాక తను ఏమీ చేయలేడు గనక, ఊరుకున్నాడు. ఆరోజు సాయంకాలం రాజు, డేనియల్‌ సమక్షంలో ఆలయం తలుపులు మూశాడు పూజారి. ‘‘కోరిన వంటకాలను దేవుడు సంతోషంగా ఆరగించగలడని ఆశిస్తున్నాను.

ఆ వంట కాలను, నా కోసం ప్రత్యేకంగా ఉన్న వంటవాడే తయూరు చేశాడు. వాణ్ణి మించిన వంటవాడు ఇవాళ ప్రపంచంలోనే లేడు. వాడు ఈ పూటంతా దేవుడి కోసం నిర్దేశించిన వంటశాలలోనే ఉండిపోవడం వల్ల, నిజానికి, నేను నాకు ఇష్టమైన వంటలను తయూరు చేయించుకోలేక పోయూను,'' అన్నాడు రాజు.
 
‘‘పూజారీ, ఆయన అతిథుల కోసం తమరు తమకు ఇష్టమైన వంటలను త్యాగం చేయడం, చాలా దయనీయమైన విషయం, ప్రభూ,'' అన్నాడు డేనియల్‌. ‘‘వివేకవంతులకు సైతం అప్పుడప్పుడు నా మాటలు అర్థం కావడం లేదనిపిస్తోంది. నేను నా వంటవాణ్ణి వేరొక వంటశాలకు అనుమతించింది పూజారి కోసం కాదు, సాక్షాత్తు దేవుడి కోసం,'' అన్నాడు రాజు.
 
డేనియల్‌ చిన్నగా నవ్వాడు. రాజు కనుబొమలు ముడివడ్డాయి. మరునాడు తెల్లవారగానే ఆలయం ముందు గుమిగూడిన రాజు, ఆయన పరివారం, డేనియల్‌ సమక్షంలో ఆలయం తలుపులు తెరిచాడు పూజారి. అనుకున్న విధంగానే రాజుగారి వంటశాలలో తయూరైన ప్రత్యేక వంటలేవీ అక్కడ కనిపించలేదు. ఇతర భక్తులు పంపిన వంటలు మాత్రం సగానికి పైగా అలాగే ఉన్నాయి.
 
వాటిని పంపిన భక్తులు, ‘‘మేము పంపిన వాటిని దేవుడు ముట్టుకోలేదు. మేము దుర దృష్టవంతులం,'' అన్నారు విచారంగా. డేనియల్‌ మళ్ళీ నవ్వాడు. ‘‘మిత్రమా, నువ్వు చెప్పిన మాటకూ, హేళనాపూర్వకమైన నీ ప్రవర్తనకూ వివరణ కావాలి. లేకుంటే నీకు శిక్ష తప్పదు,'' అని హెచ్చరించాడు రాజు. ‘‘ప్రభూ, ఈ వంటలన్నిటినీ ఈ రాతి దేవుడే మింగేశాడని మీరు విశ్వసిస్తున్నారా?
 
నిజంగానే ఈ రాతి విగ్రహంలో దేవుడే ఉన్నట్టయితే, భక్తులు భక్తితో సమర్పించిన వాటితో సంతృప్తి చెందకుండా, దురాశాపరులూ, తిండి పోతులూ అయిన మనుషుల్లా నాకు ‘ఇంకా ఇంకా కావాలి' అని అడగగలడని భావిస్తున్నారా?'' అని అడిగాడు డేనియల్‌. ‘‘మిత్రమా, నువ్వేమైనా గుడ్డివాడివా? బావున్న వాటినంతా దేవుడు భుజించి వుండడం నీకు కనిపించడం లేదా? దేవుణ్ణి అవమానించడానికి నీకెన్ని గుండెలు?'' అన్నాడు కోపంగా.

‘‘ప్రభువులు మన్నించాలి. నేను దేవుణ్ణి అవమానించడంలేదు. దేవుడి పేరుతో మోసం చేస్తున్న వారిని చూపడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి, ఈ కాగడాను తీసుకుని నావెంటరండి. విగ్రహం వెనక ఇంకా మసక చీకటిగానే ఉన్నది,'' అంటూ రాజుకు వెలుగుతూన్న కాగడా నిచ్చి డేనియల్‌ గుడిలోపలికి నడిచాడు. విగ్రహం వెనక వైపుకు చేరాక, అక్కడ నేల మీద పలుచటి బూడిద పొరమీద కనిపించిన పాదాల గుర్తులను రాజును జాగ్రత్తగా పరిశీలించమన్నాడు.
 
ఆ అడుగుజాడలను అనుసరించి వెళ్ళడంతో వారికి కటికచీకటిగా ఉన్న ఒకమూలలో, పలుచటి రాతి పలకతో మూయబడిన రహస్య ద్వారం కనిపించింది. దాని వెనక పూజారి గృహం ఉంది. ‘‘ఇవన్నీ ఏమిటి?'' అని అడిగాడు రాజు అయోమయంగా. ‘‘ప్రభూ, ఒక్కొక్క రాత్రీ, పూజారీ ఆయన కుటుంబీకులూ ఈ రహస్యద్వారం గుండా ఆలయంలో ప్రవేశించి, నైవేద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తినేస్తున్నారు.
 
నిన్న పూజారి ఇంటికి ముఖ్యమైన బంధువులు అంటే, ఆయన కోడలి తల్లిదండ్రులు వచ్చారని నాకు తెలుసు. వారికి ప్రత్యేక వంటలతో విందు భోజనం పెట్టాలి కదా! నిన్న సాయంకాలం దేవుడి విగ్రహాన్ని ప్రదక్షిణ చేసినప్పుడు నేను నేలమీద బూడిద చల్లాను. మనం చూసిన అడుగు జాడలు పూజారివీ, ఆయన కుటుంబీకులవీ, బంధువులవీనూ,'' అని వివరించాడు డేనియల్‌.
 
రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. ఆ తరవాత తేరుకుని, పూజారికి కారాగార శిక్ష విధించాడు. ‘‘ఓరి దేవుడా! దేవుడి పేరుతోనే ఇలాంటి మోసాలు ఎలా జరుతాయి!'' అని ఆశ్చర్య పోయూడు రాజు. ‘‘ప్రభూ, మనుషులమైన మనకన్నా ఎక్కువగానే దేవుడు కూడా మూర్ఖులు, దుర్మార్గుల దురాగతాలను అనంతంగా భరిస్తూనే ఉంటాడు. అందుకు గల కారణాలు మనకు అవగతం కావు. ఏది ఏమైనప్పటికీ నిజం వెలుగు చూసే తరుణం తప్పక వచ్చి తీరుతుంది!'' అన్నాడు డేనియల్‌.... 

No comments:

Post a Comment