Pages

Friday, September 14, 2012

గజరాజు


అరుణానదీ తీరంలో గురుకుల విద్యాలయూన్ని నడుపుతూన్న కృష్ణచైతన్యుడు, విద్య పూర్తి చేసి స్వస్థలాలకు వెళుతూన్న ఐదుగురు విద్యార్థులనుద్దేశించి, ‘‘మీరు గురుకులానికి వచ్చినప్పుడు మీకు ఓనమాలు కూడా రావు. ఈనాడు అమరకోశంతో సహా అనేక గ్రంథాలను అవలీలగా ఔపోశన పట్టారు.
 
ఇదెలా సాధ్యమయింది? నిరంతర అభ్యాసం. వికసించిన బుద్ధిబలం. మీరు ఇప్పుడు బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. జీవితం అంటే, పూలబాట కాదు; నిరంతర పోరాటం అన్నది మరిచి పోకండి. ఆత్మవిశ్వాసం, నిరంతర ప్రయత్నం మనిషికి చాలా అవసరం. అవి ఉన్నప్పుడే భవిష్యత్తు బంగారం కాగలదు. గజరాజుకు కొండంత బలం ఉన్నప్పటికీ, దాన్ని గ్రహించి ఉపయోగించకపోతే ఇసుమంత ప్రయోజనం కూడా ఒరగదు.
 
ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, వినండి,'' అంటూ ఇలా చెప్పసాగాడు: జంతువులతో, పక్షులతో గారడీ ఆటలు ప్రదర్శించి, పొట్టపోసుకునే వీరేశం ఒకనాడు అడవి ప్రాంతంలో తిరుగుతూండగా గుంతలో పడ్డ ఏనుగుపిల్ల ఒకటి కనిపించింది. దాన్ని పైకిలాగి, తనతోపాటు పట్టణానికి తీసుకువచ్చాడు. దాన్నొక చిన్న తాడుతో గుంజకు కట్టేసి, మేత వేయసాగాడు. ఏనుగు పిల్లకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు.
 
అడవి మీదికి మనసుపోయింది. దాంతో అది తనకు కట్టిన తాడును తెంచుకోవడానికి ప్రయత్నించింది. అయితే, ఆ తాడును తెంచుకోవడానికి దానికి బలం చాలలేదు. అయినా, కొన్నాళ్ళు ప్రయత్నించింది. కాని ప్రయోజనం లేకపోయింది. పోరాడి, పోరాడి అలిసి పోయింది. ఆఖరికి ఆ తాడును తెంచుకుని వెళ్ళడం తనకు సాధ్యమయ్యే పని కాదని భావించి, అడవి పట్ల తల్లిదండ్రుల పట్ల ఆశను వదులుకుని వీరేశం చెప్పినట్టు నడుచుకోసాగింది. వీరేశం తన గారడీ ప్రదర్శ నలో ఆ ఏనుగు పిల్ల చేత రకరకాల విన్యాసాలు చేయించేవాడు.

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయూయి. ఏనుగు పిల్ల ఇప్పుడు యౌవనంలోకి వచ్చింది. చాలా చక్కగా బలంగా తయూరయింది. యజమాని చెప్పినట్టు నడుచుకోసాగింది. ఇలా ఉండగా వీరేశం ఒకనాడు అడవినుంచి ఒక ఎలుగుబంటును పట్టుకు వచ్చాడు. దాన్ని బలమైన తాడుతో గుంజకు కట్టివేశాడు. ఎలుగుబంటు తప్పించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. కాని తప్పించుకోలేక పోయింది.
 
వీరేశం దానికి కూడా కొన్ని గారడీ ఆటలు నేర్పడానికి ప్రయత్నించాడు. సరిగ్గా చెయ్యకపోతే కొరడాతో కొట్టేవాడు. సరిగ్గా చేస్తే తినడానికి ఏదైనా అందించేవాడు. రోజూ ఇదే తంతు కొనసాగింది. ఒకరోజు ఆ ఎలుగుబంటు వీరేశం చేతిలో చావుదెబ్బలు తిని, రాత్రంతా మూలుగుతూ పడుకున్నది. ఏనుగుకు దానిని చూడగానే జాలి కలగడంతో, ‘‘మిత్రమా, ఎందుకు దెబ్బలు తింటావు? యజమాని చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా! అలా వింటే నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది.
 
సుఖంగా రోజులు గడిచిపోతాయి!'' అన్నది. ‘‘గజరాజా, ఏమిటి నువ్వంటున్నది? వాడిచ్చే ఆహారం నాకు రుచించడం లేదు. అడవిలో స్వేచ్ఛగా సంచరించే నన్ను బంధించి తీసుకువచ్చాడు. వాడు నాలుగు డబ్బులు సంపాయించడం కోసం నన్ను నానా హింసలు పెడుతున్నాడు. నేను వాడినుంచి తప్పించుకుంటే తప్ప నాకు సుఖం లేదు,'' అన్నది ఎలుగుబంటు విచారంగా. ‘‘అది నీ తరం కాదు. నేనూ ఒకప్పుడు నీలాగే ప్రయత్నించాను. ఎంత ప్రయత్నిం చినా తాడును తెంచుకోలేక పోయూను,'' అన్నది ఏనుగు.

ఆ మాటకు ఎలుగుబంటు వికవికా నవ్వింది. ‘‘ఎందుకలా నవ్వుతావు? నా కథ నీకు పరిహాసంగా ఉందా?'' అని అడిగింది ఏనుగు కోపంగా. ‘‘గజరాజా, నీ బలం గురించి నీకు తెలియడం లేదు. ఈ నీచమానవుడితో చేరి నీచంగా ఆలోచిస్తున్నావు. నువ్వు తలుచుకుంటే, ఈ తాడు, గుంజ, గుడారం ఒకలెక్కా?'' అని అడిగింది ఎలుగుబంటు. ‘‘ఎంతో ప్రయత్నించి ఓడిపోయూనని చెప్పాను కదా?'' అన్నది ఏనుగు సిగ్గుతో.
 
‘‘నువ్వు ప్రయత్నించిందెప్పుడు? పసిపిల్లగా ఉన్నప్పుడు! అప్పుడు నీకు బలం చాలలేదు. ఇప్పుడు కొండల్ని పిండిచేయగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు,'' అని ప్రోత్సహించింది ఎలుగుబంటు. ఆ మాటలతో ఉప్పొంగిపోయిన ఏనుగు ఒక్కసారిగా తిరగబడి, తనను కట్టిన తాడును తెంచుకుంది. అంతటితో ఆగకుండా, ఎలుగుబంటును కట్టిన తాడును కూడా తెంచింది. రెండూ కలిసి అడవికేసి పరిగెత్త సాగాయి.
 
అడవిని సమీపిస్తూ, ‘‘మిత్రమా, నేనెంత అమాయకుణ్ణి. గడ్డి పోచను చూసి భయపడి పోయూను. నువ్వు చెప్పకపోతే నా బలం నాకు తెలిసేది కాదు,'' అన్నది ఏనుగు సిగ్గుతో. ‘‘నువ్వే కాదు. చాలామంది అంతే. తమబలం తమకు తెలియదు. సంకోచంతో అసలు ప్రయత్నమే చేయరు. ప్రయత్నం చేయని వారికి విజయం ఎలా సమకూరుతుంది?'' అన్నది ఎలుగుబంటు.
 
ఆ తరవాత ఏనుగూ, ఎలుగుబంటూ తమ వారిని కలుసుకుని స్వేచ్ఛగా బతికాయి. కృష్ణచైతన్యుడు ఈ కథ చెప్పి, ‘‘మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలను మరిచి పోకుండా, నిరంతర ప్రయత్నంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ, మీరూ హాయిగా జీవిస్తూ, పదిమందినీ జీవించేలా చేయూలి,'' అంటూ ఆశీర్వదించాడు. ఐదుగురు శిష్యులూ గురువుకు భక్తితో నమస్కరించి, కృతజ్ఞతతో అక్కడి నుంచి బయలుదేరారు.


No comments:

Post a Comment