వల్లభశ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు. నగరంలోని ధనిక
కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడూ
చేతినిండా పనీ, ఇనప్పెట్టె నిండా కాసులూ ఉంటూండేవి. అతనికి రామదేవుడు,
వాసుదేవుడు కవల పిల్లలు. లేక లేక పుట్టిన వారవడంతో అతిగారాబం చేసింది
తల్లి. దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది. తండ్రి వ్యాపారం పట్ల
కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళ
నిత్యకృత్యంగా మారింది.
వల్లభశ్రేష్ఠికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించ సాగింది. ‘‘వీళ్ళిద్దరూ
ఇలా బాధ్యతా రహితంగా తయూరుకావడానికి నీ అతిగారాబమే కారణం. మనం వెళ్ళిపోయూక,
వీళ్ళెలా బతుకుతారు?'' అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి భార్యతో.
‘‘నాలుగుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిమనది. అల్లారుముద్దుగా
పెరిగిన పిల్లలు. కష్టపడి పని చేసి సంపాదించవలసిన అవసరం ఏముంది?'' అని
ఎదురు ప్రశ్నవేసింది ఆయన భార్య. ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న
శ్రేష్ఠి అంతటితో ఆ విషయూన్ని వదిలిపెట్టాడు.
రెండు రోజుల తరవాత శ్రేష్ఠి కొడుకులను చేరపిలిచి, ‘‘విజయనగరంలో ఉన్న
నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చిరావాలి. ఆ పని చాలా గోప్యంగా
జరగాలి. అందుకే మీ ఇద్దరినీ పంపాలనుకుంటున్నాను. ఈ లేఖను తీసుకు వెళ్ళి
ఆయన చేతికివ్వండి. విజయనగరం అద్భుతమైన చారిత్రక నగరం. అక్కడి వింతలన్నీ
చూసి నెమ్మదిగా తిరిగిరండి,'' అన్నాడు. అన్నదమ్ములు అందుకు సంతోషంగా
అంగీకరించి, అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్ళారు. లేఖ అందుకుని
చదివిన వరదయ్య, మౌనంగా తలపంకించాడు.
ఆ తరవాత మిత్రుడి కొడుకులిద్దరికీ ఆతిథ్యమిచ్చి, నగరంలోని వింతలూ,
విశేషాలు చూడడానికి ఏర్పాటు చేశాడు. వరదయ్య భార్య వారిని ప్రేమతో
ఆదరించింది. వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ట, శ్వేత చూడ చక్కనివారు. మంచి
గుణవంతులు. వాసుదేవ, రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది. వారం రోజుల
తరవాత, వల్లభశ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు.
‘‘నాయనలారా, అనుకోని ప్రమాదం వచ్చిపడింది. నాలుగు రోజుల క్రితం మన
దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది. రాత్రికిరాత్రే మన ఆస్తి అంతా దొంగల
పాలయింది. ఊళ్ళో వాళ్ళు కుదువ పెట్టిన బంగారం కూడా పోవడంతో, ఇవ్వమని
నిర్బంధిస్తున్నారు. నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు
చేస్తున్నారు.ఈ అవమానం భరించలేని నేను, మీ అమ్మ ఊరొదిలి వెళుతున్నాం.
రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాం.''
ఉత్తరం చదివిన కొడుకులిద్దరికీ గుండె జారినంత పనయింది. భవిష్యత్తు
పట్ల భయం పట్టుకున్నది. సంగతివిన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది.
‘‘ఊరికే కూర్చుని తినేవాళ్ళని పోషించడానికి నేను మీనాన్నలాంటి
కోటీశ్వరుణ్ణి కాను. ఇక మీ దారి మీరు చూసుకోండి,'' అన్నాడు అన్నదమ్ములతో.
ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుంచించుకుపోయూరు. అయినా, ఏపనీ చేతగాని
తమకు భుక్తి గడవడం ఎలా? అందువల్ల అభిమానం చంపుకుని వరదయ్యనే తమకు ఏదైనా పని
ఇప్పించమన్నారు అన్నదమ్ములు. సరేనని వరదయ్య, రామదేవుడికి బట్టలకొట్టులో
లెక్కలు రాసే పనినీ, వాసుదేవుడికి తనతోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకుని
వచ్చే పనినీ అప్పగించాడు. మొదట్లో అసలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు
పనిచెయ్యలేక చాలా అవస్థపడ్డారు.
‘‘చూశావా, తమ్ముడూ, ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో! నిన్న లెక్కల్లో
పదిరూపాయలు తక్కువయిందని నాకు తిండి కూడా పెట్టలేదు,'' బాధగా అన్నాడు
రామదేవుడు వాసుదేవుడితో. ‘‘అవునన్నయ్యూ! గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు
పొమ్మంటాడే తప్ప, ఒక్క బండి కూడా కట్టించడు. రోజూ నాలుగు కోసులదూరం బరువులు
మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు,'' అని తన గోడు చెప్పుకున్నాడు
వాసుదేవుడు.
‘‘పోనీలే. నాన్నగారన్నట్టు కష్టపడ్డవాడికెప్పుడూ ఫలితం దక్కకుండా
పోదు. మనకూ మంచి రోజులు వస్తాయి,'' అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు.
రోజులు గడుస్తున్న కొద్దీ, అన్నదమ్ములిద్దరికీ పని మీద శ్రద్ధ కలగసాగింది.
వ్యాపారంలోని మెలుకువలు అర్థంకాసాగాయి. వరదయ్య కూతుళ్ళు శ్రేష్ట
రామదేవుణ్ణీ, శ్వేత వాసుదేవుణ్ణీ అభిమానంగా చూసుకోసాగారు. వరదయ్య నెలజీతం
కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు.
ఆరు నెలల తరవాత వల్లభశ్రేష్ఠి, భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు.
తల్లిదండ్రుల్ని చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యం తమయ్యూరు.
ప్రయోజకులైన కొడుకులను చూసి తండ్రి కూడా సంతోషించాడు. ‘‘మిత్రమా! పోయిన
సొమ్ముదొరికింది. కష్టార్జితం ఎక్కడికీ పోదని అర్థమయింది. ఇక మా ఊరెళతాం.
నీకు వేనవేల కృతజ్ఞతలు,'' అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో నర్మగర్భంగా.
‘‘మీ కొడుకులతో పాటు కోడళ్ళను కూడా తీసుకువెళ్ళు, మిత్రమా! నా
కూతుళ్ళకు ప్రయోజకులైన భర్తలు దొరికారు,'' అన్నాడు వరదయ్య నవ్వుతూ.
శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు. పెళ్ళి జరిగిన మరునాడు, ‘‘నా బట్టల
వ్యాపారం కన్నా, నీ బంగారం వ్యాపారం విలువైనది కదా? నా కన్నా నువ్వే మంచి
వ్యాపారవేత్తవి. నువ్వే నీ కొడుకులను దారిలో పెట్టవచ్చుకదా? దొంగతనం
జరిగిందన్న నెపం మీద, నా దగ్గర పనివాళ్ళను చేశావెందుకు?'' అని అడిగాడు
వరదయ్య వియ్యంకుణ్ణి రహస్యంగా.
‘‘పెరటిమొక్క వైద్యానికి పనికిరాదంటారుకదా! నా దగ్గరున్నంతవరకు నా
బిడ్డలకు కష్టించే తత్వంరాదని అర్థమయింది. అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏపనికీ
లొంగరని తెలిసింది. అందుకే ఈ యుక్తిని అమలు చేశాను,'' అన్నాడు
వల్లభశ్రేష్ఠి. తండ్రికి తగ్గ తనయులుగా, అనతికాలంలోనే రామదేవ,
వాసుదేవులిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
No comments:
Post a Comment