ఏదో విధంగా తన పొరుగునే వుంటున్న రామేశాన్ని మించిపోవాలనుకునే కామేశం, దూర గ్రామంలో చిత్రకళాభ్యాసం చేసివచ్చి, తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సంవత్సరం ఊళ్ళో దొంగతనాలెక్కువయ్యూయి. పట్టుబడిన దొంగలను సంకెళ్ళు వేసి ఊళ్ళో తిప్పినా, కారాగారంలో వేసి కఠిన శిక్షలు విధించినా, వాళ్ళల్లో సిగ్గు పుట్టడం లేదు, మార్పు రావడం లేదు. గ్రామాధికారి ఊరి పెద్దలను సంప్రదించాడు.
ఆయన వాళ్ళతో, ‘‘ఊళ్ళో సతీసావిత్రి హరికథాకాలక్షేపం ఏర్పాటు చేసి,
ఖైదీలకు వినిపిద్దాం. ఆ కథలో, సావిత్రి, తన భర్త సత్యవంతుడి ప్రాణాలు
తీసుకుని పోతున్న యముడి వెంట పడుతుంది కదా! అప్పుడు యముడు, ఆ మహాపతివ్రతను
భయపెట్టి వెనక్కు పంపాలని, నరకలోకం ఎంత భయంకరంగావుంటుందో వర్ణిస్తాడు.
ఇహానికి భయపడని వాళ్ళుకూడా, పరానికి భయపడతారుకాబట్టి, నరకభయంతో దొంగలు
దొంగతనాలు మానొచ్చు,'' అన్నాడు. కామేశం వెంటనే, ‘‘నరకలోకం బొమ్మను
చూపిస్తే, వాళ్ళు మరింతగా హడలిపోతారు. కాబట్టి నరకలోకం బొమ్మను సహజంగా
వేసినవారికి మంచి బహుమతిని ప్రకటిద్దాం,'' అన్నాడు. ‘‘ఐతే, ఉపాయం బాగుంది
కానీ, బహుమతికి నేనొప్పుకోను,'' అన్నాడు రామేశం.
‘‘ఇలా అభ్యంతరం చెప్పడం సంస్కారం కాదు,'' అన్నాడు కామేశం నిష్ఠూరంగా.
రామేశం నవ్వి, ‘‘బ్రతికున్న వాళ్ళకు నరకం చూపించే బొమ్మవేయడం చిత్రకళ అనీ, ఆ
వేసిన వాళ్ళకు బహుమతి ఇవ్వడం, సంస్కారమనీ నాకు అనిపించదు. ఆపైన ఊరి పెద్దల
ఇష్టం!'' అన్నాడు. అంతా నవ్వారు. కామేశం, రామేశం చేతిలో మరోసారి
భంగపడ్డాడు.
No comments:
Post a Comment