సులేన్, సిదింనీ అన్యోన్యమైన రైతు దంపతులు. తమకున్న కొద్దిపాటి
పొలంలో బంగాళాదుంపలు పండిస్తూ, వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతో హాయిగా రోజులు
గడిపేవారు. ఒకనాడు సులేన్ నేలను తవ్వుతూ ఉండగా బొరియలోని పాము కాటు
వేసింది. అతడు గుడిసెకు పరిగెత్తుకుంటూ వచ్చి అలాగే స్పృహ తప్పి పడిపోయూడు.
హడలిపోయిన అతడి భార్య సిదింనీ లబోదిబోమంటూ వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకు
వచ్చింది. అరచేతిలో నెత్తురు గడ్డకట్టుకు పోయి అచేతనంగా పడివున్న సులేన్‌ను
పరీక్షించి చూసిన వైద్యుడు, ‘‘విషసర్పం కాటేసింది. పరిస్థితి చెయ్యిదాటి
పోయింది,'' అని పెదవి విరిచి వెళ్ళిపోయూడు.
ఆ
తరవాత ఆచారం ప్రకారం సిదింనీ ఇరుగు పొరుగులతో కలిసి భర్తకాయూన్ని తెప్పలోకి
చేర్చి నదీ ప్రవాహంలోకి వదిలింది. అలా వదలడానికి ముందు తెల్లరుమాలుపై అతడి
పేరు, మరణానికి కారణం రాసి అతడి దుస్తుల్లో దాచింది. తెప్ప నీటివాలున
కొట్టుకుపోసాగింది.
ఆ నదికి దిగువ చాలా దూరంలో
అదే నదిలో స్నానం చేస్తూన్న ముగ్గురు యువతులు ప్రవాహంలో తేలుతూ వస్తూన్న
తెప్పను చూసి దాన్ని ఒడ్డుకు లాగారు. అందులో కదలా మెదలక పడివున్న అందమైన
దృఢకాయుణ్ణి చూశారు. అతడికి ప్రాణం తెప్పించడం సాధ్యమౌతుందేమోనని
మాంత్రికుడైన తన తండ్రి వద్దకు వెళ్ళి సంగతి చెప్పారు.
ఆయన హడావుడిగా అక్కడికి వచ్చి ఆ శరీరం దుస్తుల్లోని తెల్లటి రుమాలులో రాసి
వున్న దానిని చదివి, ‘‘పాము కాటు! ప్రాణం తెప్పించగలననుకుంటాను,'' అని
తలపంకించాడు. ఆ తరవాత ఒక చెట్టు నుంచి మూడు పుల్లలను విరిచి తెచ్చి శరీరం
వక్షస్థలంలో త్రిభుజాకారంలో ఉంచాడు.
దాని మధ్య
చిన్న తెల్లరాతిని ఉంచి, ఆకాశం కేసి చూస్తూ గట్టిగా ఏవో మంత్రాలు
వల్లించసాగాడు. కొంతసేపటికి ఆ యువకుడు మెల్లగా కదిలి, నిద్ర నుంచి
మేల్కాంచినట్టు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. అతడు మాంత్రికుడికి
నమస్కరించి, ఆయన కుమార్తెలకేసి చూస్తూ చిన్నగా నవ్వాడు.
అతణ్ణి తండ్రీకూతుళ్ళు తమ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టారు.
యువకుడి మాటలను బట్టి అతడు తన పేరు, అంతకు ముందు జరిగిన విషయూలు సర్వం
మరిచి పోయినట్టు మాంత్రికుడు గ్రహించాడు. ఆయన అతణ్ణి చురూ అని పిలవడంతో అదే
తన పేరని భావించి యువకుడు తలెత్తి చూశాడు. భోజనం చేశాక యువకుడు, ‘‘నాకు
నిద్ర ముంచుకువస్తోంది,'' అన్నాడు గట్టిగా ఆవులిస్తూ.
వెంటనే ఒక యువతి చాప తీసుకువచ్చింది. రెండవ యువతి దిండు తీసుకువచ్చింది.
మూడవ యువతి దుప్పటి తెచ్చి పరచింది. అతడు పడుకుని వెంటనే నిద్రపోయూడు.
ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏముందో సులభంగా తెలుసుకోగల మాంత్రికుడు తన ముగ్గురు
కుమార్తెలూ ఆ యువకుణ్ణి భర్తగా చేసుకోడానికి ఉత్సాహ పడుతున్నట్టు
గ్రహించాడు. ఈ విషయంగా ముగ్గురి మధ్య మనస్పర్థలు రాగలవని అనుమానించాడు. ఆయన
బాగా ఆలోచించి ఒక నిర్ణయూనికి వచ్చాడు. యువకుడు నిద్ర లేచి, ఇంటి
వెలుపలికి నడిచాడు.
అతడి వెంట వెళ్ళిన
మాంత్రికుడు అతడి మెడలో ఒక పసుపు పట్టుదారాన్ని ముడివేశాడు. మరుక్షణమే ఆ
యువకుడు విపరీతంగా ఊగిపోతూ, చూస్తూం డగానే ఎరట్రి ముక్కుగల అందమైన పసుపు
పచ్చ రంగు పక్షిగా మారి తూరుపు దిక్కుగా ఎగిరిపోయూడు. మాంత్రికుడు వెనక్కు
తిరిగి చూశాడు. యువకుడు పక్షిగా మారి ఎగిరివెళ్ళిన దృశ్యాన్ని చూసి,
దిగ్భ్రాంతి చెందిన ముగ్గురు కుమార్తెలతో, ‘‘అతడు ఒకప్పుడు విగత జీవుడు.
అంటే చనిపోయినవాడు. నేను అతనికి ప్రాణం పోసినప్పటికీ, అతడు తన గత
జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేక పోయూడు. అలాంటి వాడికి మీలో ఒకరిని
కట్టబెట్టడం ఇష్టంలేకే పక్షిగా మార్చేశాను. మూడు రోజుల్లోపల తిరిగి వచ్చి,
చురూ అని పిలిస్తే బదులు పలికాడంటే, నేను అతణ్ణి మళ్ళీ మామూలు మనిషిని
చేస్తాను. మీలో ఎవరు అతణ్ణి వివాహమాడాలో అప్పుడు నిర్ణయిస్తాను,'' అన్నాడు.
ఒకరి ముఖాలొకరు చూసుకున్న ముగ్గురు యువతులూ తండ్రితో, ‘‘అలాగే నాన్నా, మీ
ఇష్టానుసారమే చెయ్యండి,'' అన్నారు ముక్త కంఠంతో.
ఒక రోజు గడిచింది. రెండో రోజు వెళ్ళింది. మూడో రోజు తెల్లవారగానే
ముగ్గురు అక్కచెల్లెళ్ళూ పక్షి ఎప్పుడెప్పుడు తిరిగి వస్తుందా అని ఆకాశం
కేసి ఆశతో చూడసాగారు. ఆ రోజు కూడా గడిచి పోయిందిగాని, పక్షి మాత్రం తిరిగి
రాలేదు. ముగ్గురూ తీవ్రమైన ఆశాభంగానికి లోనయ్యూరు.
అదే సమయంలో మూడు రోజుల క్రితం అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిన పక్షి సంతోషంగా
ఆకాశం ఎత్తులు చూస్తూ ఎగిరి ఎగిరి చాలా దూరం వెళ్ళి దిగివచ్చి ఒక చెట్టు
కొమ్మపై వాలింది. అప్పుడే ఉద్యానవన విహారానికి వచ్చిన ఆ దేశపు యువరాణి ఆ
పక్షి అందాన్ని చూసి ముచ్చటపడింది. ఒక చెలికత్తె ధాన్యపు గింజలు తెచ్చి
నేలపై చల్లింది. పక్షి మెల్లగా నేల మీదికి వాలి గింజల్ని తినసాగింది.
కొంతసేపయ్యూక చెలికత్తె వెనకగా వెళ్ళి పక్షిని పట్టుకుని, యువరాణి
చేతికిచ్చింది. యువరాణి దానిని సుతారంగా అందుకుని తన మృదువైన చేత్తో
నిమిరింది. పక్షి అందం చూసి యువరాణి ఎంతో ఆనందించినప్పటికీ దానిని పంజరంలో
బంధించడం ఆమెకు ఇష్టం లేదు. పక్షిని గాలిలోకి ఎగురవేసింది. పక్షి హాయిగా
ఎగురుతూ వెళ్ళిపోయింది. మరునాడు సాయంకాలం యువరాణి ఉద్యానవనంలో తిరుగుతూండగా
మళ్ళీ ఆ పక్షి అక్కడికి వచ్చింది.
యువరాణి చేయి సాచడంతో అది ఆమె చేతి మీదవాలింది. యువరాణి దానిని ఆప్యాయంగా
నిమురుతూండగా అది ‘‘చురూ... చురూ...'' అన్నది. దాంతో కలిసి చెలికత్తెలు
కూడా, ‘‘చురూ... చురూ...'' అన్నారు. అంతే! పక్షి మాయమై దాని స్థానంలో అందాల
యువకుడు ప్రత్యక్షమై, ‘‘నన్ను చురూఅని పిలిచారు కదూ! నా పేరు మీకెలా
తెలుసు?'' అని అడిగాడు వాళ్ళను మందహాసంతో.
విస్మయం చెందిన యువరాణి, చెలికత్తెలు, ‘‘కొంత సేపు క్రితం నువ్వు
పక్షి రూపంలో ఉంటూ చురూ... చురూ... అని అరిచావు. దానిని మేము అనుకరించాము.
అంతే,'' అన్నారు. ‘‘కొన్నాళ్ళ క్రితం నేను నదీ ప్రవాహంలో కొట్టుకు పోతూంటే
ముగ్గురు అక్కచెల్లెళ్ళు గట్టు మీదికి లాగి కాపాడి వాళ్ళింటికి
తీసుకువెళ్ళారు. వాళ్ళ తండ్రి నన్ను ఏవేవో ప్రశ్నలు అడిగాడు. కానీ ఒక్కటీ
నాకు గుర్తులేదు. ఆయనే నన్ను చురూ అని పిలిచాడు. అదే నా పేరనుకున్నాను.
ఆ తరవాత ఆయన నామెడ చుట్టూ పసుపు పట్టు దారం కట్టడంతో నేను పక్షిగా
మారిపోయూను. ఇదిగో ఆ దారమే ఇది. పక్షిగా ఉన్నప్పుడు అది మాయమై పోతుంది,''
అంటూ మెడలోని దారాన్ని చూపాడు యువకుడు. ఆ మాటలకు మరింత విస్తుపోయిన యువరాణి
కొంతసేపటికి తేరుకుని, ‘‘చురూ, మా రాజభవనానికి వస్తావా?'' అని అడిగింది.
‘‘రాజభవనానికా? అంటే మీరు యువరాణి గారా? నా ఇల్లు చెట్టు మీద ఉంది.
అక్కడికి తిరిగి వెళ్ళాలి. అయితే, మిమ్మల్ని చూడడానికి రోజూ రాగలను,'' అంటూ
యువకుడు పక్షిగా మారి ఎగిరి వెళ్ళిపోయూడు. తొలి చూపులోనే ఆ యువకుణ్ణి
వలచిన యువరాణి అతడు వెళ్ళిపోగానే విచారంతో కన్నీళ్ళ పర్యంతమై పోయింది.
చెలికత్తెలు ఓదార్చ లేకపోయూరు. రాజభవనానికి చేరగానే విషయూన్ని మహారాణి
చెప్పారు.
మహారాణి, వృద్ధమంత్రిని పిలిపించి
ఉద్యానవనంలో జరిగిన సంగతి చెప్పింది. అంతా విన్న మంత్రి, కొంత సేపు మౌనంగా
ఆలోచించి, ‘‘ఆ యువకుడి మెడనుంచి పసుపు పట్టు దారాన్ని తొలగిస్తే, అతడు
మళ్ళీ పక్షిగా మారే అవకాశం ఉండదు. యువరాణి కోరిక నెరవేరుతుంది,'' అన్నాడు.
‘‘తమ సలహాకు చాలా కృతజ్ఞతలు మంత్రివర్యా! ఆ దారాన్ని తొలగించే ఉపాయం మేము
ఆలోచిస్తాం,'' అన్నది మహారాణి. మంత్రి వెళ్ళిపోయూక మహారాణి యువరాణి
చెలికత్తెలతో, ‘‘ఆ యువకుడు మళ్ళీ వచ్చినప్పుడు యువరాణి తన మెడలోని బంగారు
హారాన్ని అతడికిచ్చి దానికి బదులు అతడి మెడలోని పసుపు పట్టుదారాన్ని
పుచ్చుకున్నట్టయితే సమస్య పరిష్కార మవుతుంది.
ఆ తరవాత అతణ్ణి రాజభవనానికి తీసుకువస్తే, అతడు యువరాణిని
వివాహమాడడానికి సమ్మతించవచ్చు,'' అన్నది. చెలికత్తెలు వెళ్ళి యువరాణికి ఆ
మాట చెప్పారు. మరునాడు యువరాణి చెలికత్తెలతో కలిసి ఉత్సాహంగా ఉద్యానవనానికి
వెళ్ళింది. కొంత సేపటికి పసుపుపచ్చ రంగు పక్షి వచ్చింది. దానిని చూడగానే
ఒక చెలికత్తె ధాన్యపు గింజలను నేల మీద చల్లింది. అయితే, పక్షి కిందికి
రాకుండా చెట్టు కొమ్మ మీదే కూర్చుని, చు-రూ... చు-రూ... అని అరవసాగింది.
చెలికత్తెలు కూడా దానితో గొంతు కలిపి, ‘‘చు-రూ... చు-రూ...'' అని
పిలువసాగారు. అయినా, పక్షి కొమ్మపై నుంచి కదలలేదు. ఆఖరికి యువరాణి కొమ్మ
కిందికి వెళ్ళి, ‘‘చు-రూ... చు-రూ... నా దగ్గరికి రావా?'' అంటూ చేతులు
సాచింది. వెంటనే పక్షి ఎగిరి వచ్చి ధాన్యం గింజలకు కొద్ది దూరంలో నేల
మీదికి వాలింది. యువరాణి తన మెడలోని బంగారు హారాన్ని తీసి దానికి
చూపించింది. జిగేలుమని మెరిసిన ఆ హారం అందానికి మురిసిపోయిన పక్షి అటూ ఇటూ
గెంతసాగింది. కొంతసేపటికి పక్షి మాయమై దానిస్థానంలో యువకుడు నవ్వుతూ
కనిపించాడు.
అతడు ఒక అడుగు ముందుకు వేసి తన
మెడలోని దారాన్ని తీసి యువరాణి మెడకు చుట్టాడు. మరుక్షణమే యువరాణి తన
బంగారు హారాన్ని అతడి మెడలో వేసింది. చెలికత్తెలు ఆనంద బాష్పాలు రాల్చారు.
‘‘చురూ, రాజభవనానికి వెళదామా,'' అంటూ యువరాణి చేయి అందించింది. ఆమె
వేలుపట్టుకున్నాడు చురు. ఇద్దరూ కలిసి రాజభవనం కేసి నడిచారు.
చెలికత్తెలు అంతకు ముందే ఈ ఆనందకరమైన విషయూన్ని రాజదంపతులకు తెలియ
జేయడంతో, వాళ్ళు భవనం నుంచి ఎదురు వచ్చి ఆప్యాయంగా వారిని రాజభవనంలోకి
తీసుకు వెళ్ళారు. అంతలో అక్కడికి వచ్చిన మంత్రి, సేనాధిపతి మొదలైన వారితో
రాజు, ‘‘ఇతడే చురూ తమచార్! నా గారాల పట్టిని వివాహ మాడబోయే అదృష్ట
జాతకుడు!'' అన్నాడు ఆనందంతో.
No comments:
Post a Comment