Pages

Friday, September 14, 2012

వ్యాపారంలో లౌక్యం


ధర్మకటకం చిన్నరాజ్యం. దానికి రాజు ధర్మరాజు. ఆయన ప్రజలను కన్న బిడ్డల్లా పాలిస్తాడని ఇరుగుపొరుగు రాజ్యాలలో కూడా పేరుగాంచాడు. అయితే, ఆయన తన మంత్రులనూ, రాజోద్యోగులనూ అమితంగా విశ్వసించేవాడు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి.
 
రత్నకంబళులు, పట్టుచీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. ఒకరోజు ధర్మరాజు తన పట్టపురాణి ధనలక్ష్మితో రథం మీద నగరవిహారానికి బయలుదేరాడు. నగర ప్రజలు రాజదంపతులను ఘనంగా ఆదరించారు. నగర వీధులలో వెళుతూండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టుచీరలూ, రత్న కంబళులూ రాణిగారిని ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే రాణి, రత్నాచారి అంగడిలోని కొన్ని పట్టుచీరలు, రత్న కంబళులు కావాలని రాజును కోరింది.
 
రాజుగారు తన మహామంత్రిని పిలిచి, రాణిగారి కోరిక వెల్లడించి, ‘‘వెంటనే వాటి ధర చెల్లించి వస్త్రాలను తెప్పించు,'' అని ఆజ్ఞాపించాడు. ‘‘అదెంత పని ప్రభూ! ఘడియలో పూర్తిచేస్తాను,'' అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు. చిటికల్లో చేస్తానని చెప్పి, కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు. వాణిజ్యాధికారి, పన్నులు వసూలు చేసే అధికారికీ, ఆ అధికారి భటులకూ అప్పజెప్పారు.
 
భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు. ‘‘మహారాణిగారికి కావాలంటే అంగడినే తరలిస్తాను,'' అంటూ రత్నాచారి సంతోషంగా ఓ పాతిక పట్టుచీరలూ, పాతిక రత్నకంబళులూ భటులకు అందించాడు. వాటితో పాటు, భటుల భార్యలకు కూడా రెండేసి పట్టుచీరలు తీసుకెళ్ళమని ఇచ్చాడు.

‘‘మాకిచ్చారు బావుంది. మరి మా పైవాళ్ళ మాటేమిటి?'' అన్నారు భటులు. రత్నాచారి చేసేదిలేక వాణిజ్యాధికారికీ, పన్నులు వసూలు చేసే అధికారికీ కూడా పట్టు చీరలు, కంబళులు ఇచ్చిపంపాడు. ఆ రాత్రి రత్నాచారికి ఓపట్టాన నిద్రపట్టలేదు. రాణీగారికి పంపిన పట్టుచీరలు, కంబళులు చాలా ఖరీదైనవి. ఎంత కాదన్నా వాటి ధర లక్ష వరహాల పైమాటే. కొన్ని రోజులు రొక్కం కోసం ఎదురు చూశాడు. ప్రయోజనం లేకపోయింది.
 
ఆ విషయంగా భటులను, అధికారులను అడగడం బావుండదని, రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టుచీరలు, రత్నకంబళుల ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా వినతి పత్రం పంపాడు. కోశాధికారి ఆ వినతిపత్రాన్ని వాణిజ్యాధికారికి ఇచ్చాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు. మరునాడు తన రొక్కం తనకు వస్తుందని ఆశతో ఎదురు చూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా, అవమానం కూడా కలిగింది.
 
వాణిజ్యాధికారి గూఢచారులు వచ్చి, రత్నాచారి అంగడిని శోధించారు. పన్నులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు. అంతేగాక, అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని కనుగొన్నారు. అంతే! రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు. రత్నాచారి భార్యా పిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతికిలోనై ఏం చేయడానికీ దిక్కుతోచక విలవిలలాడసాగారు. సరిగ్గా ఆ రోజు సాయంకాలమే, కాశీయూత్రకు వెళ్ళిన, రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు.
 
జరిగిన దానిని తెలుసుకుని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకుని సంగతి చెప్పాడు. ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్ళి, కోశాధికారిని చూసి తన కొడుకు తరఫున క్షమాపణలు తెలియజేశాడు. తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమనీ, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడనీ తగిన ఆధారాలతో నిరూపించి, అతన్ని బయటకు తీసుకు రాగలిగాడు. ఇవన్నీ జరగడానికి దాదాపు నెలరోజులు పట్టింది. ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్ర పట్టడం లేదు.


‘‘మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను,'' అన్నాడు రత్నాచారి తండ్రితో. ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నిట్టూర్చి, ‘‘నువ్వొక వ్యాపారి కొడుకువై ఉండీ, ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు. లౌక్యం లేకనే గోటితో పోయేదానికి, గొడ్డలిదాకా తెచ్చుకున్నావు.
 
రాణిగారికిచ్చిన పట్టు చీరలు, రత్నకంబళ్ళ గురించి కోశాధికారికి వినతి పత్రం పంపకుండా ఉన్నట్టయితే, డబ్బుపోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది. ఇన్ని తిప్పలు వచ్చేవి కావు,'' అన్నాడు. ‘‘లక్ష వరహాల సరుకు! ఎలా వదులుకో మంటావు? మనకు ఎవరిస్తారు?'' అని అడిగాడు రత్నాచారి బాధగా. ‘‘లక్ష కాదు.కోటి వరహాలు సంపాదించి ఉండేవాడివి, కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే!'' అన్నాడు తండ్రి. ‘‘అంటే, రావలసిదాన్ని అడగడమే అపరాధం అంటావా?'' అని ఎదురుప్రశ్న వేశాడు రత్నాచారి. ‘‘అడగడం అపరాధం కాదు; అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు.
 
అందుకే, ఇంత వ్యాపారనష్టం, పరువునష్టం ఎదుర్కోవలసివచ్చింది'' అన్నాడు తండ్రి. ‘‘నువ్వేం చెబుతున్నావో నాకు అర్థంకావడం లేదు,'' అన్నాడు రత్నాచారి అయోమయంగా. ‘‘రాజుగారు మంచివాడయినంత మాత్రాన ఆయన పరివారమంతా మంచివారనుకోవడం తెలివిగలవాళ్ళ లక్షణం కాదు. అలా అని వారిని పగ చేసుకుంటే మనలాంటి వారికి వ్యాపారం క్షణం సాగదు.

అందుకే, వ్యాపార రహస్యాలు తెలుసుకుని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలంటాను. ముక్కుసూటిగా పోయేవాడికి ముక్కు పచ్చడవుతుంది. ఇంత అనుభవించాక కూడా నీకు తెలివిరాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది,'' అన్నాడు తండ్రి బాధగా. ‘‘సరే, అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు? డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పు,'' అన్నాడు రత్నాచారి. ‘‘నువ్వు మొదటే పెద్ద పొరబాటు చేశావు.
 
రాణిగారు కోరిన చీరలు, కంబళ్ళతో పాటు భటులకు కూడా ఇచ్చావు. పై అధికారులకూ పంపావు. అంటే, వాళ్ళను మంచి చేసుకోవాలనుకున్నావు. నువ్వు చేసిన ఆపని కూడా ఒక విధంగా లంచమే కదా? అదే నీకు బెడిసికొట్టింది. అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకుని వెళ్ళి పది మంది ఎదుట ఇచ్చి ఉంటే, నీకు రావలసిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది.
 
మన అంగడి ముందు ‘రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి' అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది. నీకీ బాధలు, నష్టాలు, కష్టాలు వచ్చేవి కావు. అవునా?'' అన్నాడు తండ్రి. ‘‘అవును, మీరన్నది ముమ్మాటికీ నిజం,'' అన్నది అక్కడే ఉండి మామగారి మాటలను విన్న రత్నాచారి భార్య. తండ్రి లోకజ్ఞానికీ, వ్యాపార తెలివికీ రత్నాచారి అబ్బుర పడ్డాడు.
 
ఇది జరిగిన పదిహేను రోజుల తరవాత, రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసు కున్నాడు. అప్పుడు కోశాధికారి, ‘‘మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకు వెళ్ళాను. ఆయన విచారణ జరిపి, దోషులను శిక్షించి, రత్నాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు,'' అంటూ రెండు లక్షల వరహాలు అందజేశాడు. ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి, ఆయన భార్య, కొడుకు ఎంతగానో సంతోషించారు.

No comments:

Post a Comment