అవంతీ రాజ్యంలో వినోదుడు అనేవాడు రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగంలో
చేరాడు. అతని తండ్రి రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ మరణించడం వల్ల
వినోదుడికి ఆ ఉద్యోగం దొరికింది. కాని ఆ ఉద్యోగంలో అతనికి తృప్తిలేదు. ఒక
పేదరైతు కూతురు చంద్ర అతనికి భార్య అయింది. పేదకుటుంబం నుంచి వచ్చిందేమో,
ఆమెకు పొదుపూ, ఇతరులకు మర్యాద చూపటమూ చక్కగా తెలుసు. ఆమె భర్త దగ్గిరా,
అత్తగారి దగ్గిరా అణకువగా మసలుకునేది.
కాని భార్య దగ్గిర గొప్పలకుపోయి వినోదుడు ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతూ
వచ్చాడు. లేనిపోని గొప్పలకుపోయి అతను అప్పుల పాలయ్యూడు. చంద్రకు తన భర్త
సంపాదన ఎంతో తెలుసు, కాని అతను సంపన్నుడు కాదన్న సంగతి జ్ఞాపకం చెయ్యకుండా,
ఆమె అనవసరపు ఖర్చులు తగ్గించమని భర్తను కోరేది. పొదుపుగా ఉండటం అవమానంగా
భావించి వినోదుడు, ‘‘అంత పీనాసిగా బతకవలసిన కర్మ మనకేం పట్టింది? మన హోదాకు
తగినట్టు ఉండవద్దా?'' అని భార్యతో అనేవాడు దంభంగా.
అయినా అతన్ని అప్పులు బాధిస్తూ ఉండటం వల్ల, ఇంకా మంచి ఉద్యోగం కోసం
ఎంతో ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నాలేవీ కలిసిరాలేదు. ఇలా ఉండగా వినోదుడి
మేనమామ తన చెల్లెలినీ, మేనల్లుణ్ణీ చూడవచ్చాడు. ఆయన రాచకొలువులో పెద్ద
ఉద్యోగి. ఆయన తలచుకుంటే తనకు మంచి ఉద్యోగం ఇప్పించగలడన్న ఆశతో వినోదుడు
ఆయనకు తన గోడు చెప్పుకున్నాడు.
వినోదుడి మాటలు విని మేనమామ ఆశ్చర్యపోయూడు. ఎందుకంటే, వినోదుడి
ఉద్యోగం చచ్చుదేమీ కాదు. అతని అర్హతలకు మించినదే. అంతేగాక వినోదుడి రాబడి
కుటుంబ ఖర్చులకు హాయిగా సరిపోతుంది. అందులో కొంత వెనక వేసుకోవచ్చు కూడా.
అంతేకాదు, ఆ ఉద్యోగంలో సమర్థత చూపితే మంచి భవిష్యత్తు ఉన్నది. ఇది తెలిసిన
మేనమామ వినోదుడి అవివేకానికి జాలిపడ్డాడు.
‘‘చూడు, వినోదా! ముందు నీ ఉద్యోగం మీద గురీ, గౌరవమూ ఉండాలి. అప్పుడే ఆ
ఉద్యోగంలో నువ్వు రాణించగలుగుతావు. పై అధికారులు నీ ప్రతిభ
గుర్తించినట్టయితే నీకు మేలు కలుగుతుంది,'' అన్నాడు మేనమామ. వినోదుడికి ఈ
మాటలు రుచించలేదు. తనకు సహాయం చెయ్యకుండా తప్పించుకోవటానికి తన మేనమామ
ఇదంతా చెబుతున్నాడని అతను అపోహపడ్డాడు. ఈ సంగతి మేనమామ పసిగట్టాడు.
‘‘నువ్వు ఎలాంటి ఉద్యోగం చెయ్యూలనుకుంటున్నావు?'' అని ఆయన వినోదుణ్ణి
అడిగాడు.
‘‘కోశాధికార పదవి గానీ, మండలాధికారి పదవి గానీ అయితే హోదాకు హోదా,
ఆదాయూనికి ఆదాయమూ బాగా ఉంటాయి,'' అన్నాడతను. మేనల్లుడి గొంతెమ్మ కోరికలు
చూసి మేనమామకు నవ్వూ, కోపమూ కూడా కలిగాయి. ‘‘సరే, రేపు నాతో రా. కోశాధికారి
నాకు తెలుసు. అతని ద్వారా ప్రయత్నం చేద్దాం,'' అన్నాడాయన. వినోదుడు
మర్నాడు తన మేనమామ వెంట రాజధానికి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కోశాధికారి
దగ్గిరికి వెళ్ళారు.
కోశాధికారితో ఏకాంతంగా మాట్లాడిన తరవాత, మేనమామ వినోదుణ్ణి ఆయనకు
పరిచయం చేశాడు. కోశాధికారి వినోదుణ్ణి నఖశిఖపర్యం తమూ పరీక్షించి, అతను
చేస్తున్న ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయన వినోదుడితో, ‘‘నీ
ఆశయం మంచిదే. కాదనను. అయితే ఈ కోశాధికారి పదవి నువ్వు అనుకున్నంత
సుఖమైనదేమీ కాదు. కత్తి మీద సాములాంటిది. ధనాగారంతో పని! ఏమాత్రం
తేడాపాడాలొచ్చినా రాజదండన తప్పదు. ఈ పదవి నిర్వహించటానికి తెలివితేటలే
కాదు, గుండె ధైర్యమూ, అనుభవమూ కూడా కావాలి!'' అన్నాడు.
వినోదుడికి ఈ మాటలు ఏమాత్రం రుచించలేదు. కోశాధికారి ఇంకా ఇలా అన్నాడు:
‘‘నన్నీ కోశాధికారి పదవి అకస్మాత్తుగా వరించలేదు. ఈ పదవిలోకి రాకముందు
నేను దివాణంలో గంటలు కొట్టాను; తరవాత ద్వారపాలకుడిగా పనిచేశాను; ఆ తరవాత
కోట కాపలాదారుల్లో ఒకడుగా ఉన్నాను; అటు తరవాత కోశాగార రక్షకుణ్ణి అయ్యూను.
రాజుగారు నన్ను ఎన్నో సార్లు అగ్నిపరీక్షలకు గురిచేసి, అన్నిటికీ
తట్టుకున్నాక, ఈ కోశాగార పదవి అనుగ్రహించారు. ఎన్నో మెట్లు ఎక్కకుండా పై
అంతస్థుకు ఎగరగలమా?'' వినోదుడికి ఇదంతా అధిక ప్రసంగంగా తోచింది. అతని
ముఖకవళికలు మేనమామ గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు.
‘‘ఈయన మాటలకేం గాని, మండలాధికారి నా స్నేహితుడే. అతణ్ణి కూడా కలుద్దామా?''
అన్నాడు మేనమామ.
వినోదుడిలో మళ్ళీ ఆశ చిగురించింది. ఇద్దరూ మండలాధిపతి వద్దకు వెళ్ళే
దారిలో ఒక పదిమంది యువకులు వాళ్ళకు ఎదురయ్యూరు. వినోదుడి మేనమామ వాళ్ళను
ఆపి, ‘‘ఎక్కడికి బాబూ, మీరంతా గుంపుగా పోతున్నారు?'' అని అడిగాడు. వారిలో
ఒకడు ఇలా అన్నాడు: ‘‘మేం నిరుద్యోగులయిన విద్యావంతులం. మా తెలివితేటలూ,
విద్యా మా కింత తిండి పెట్టలేకపోయూయి.
రాజధానిలో కూడా మా విద్యకు గుర్తింపు లేకపోయూక, మేం ఇంకా ఇక్కడదేనికి?
పల్లె ప్రాంతాలకు పోయి భూమి దున్నుకు బతుకుతాం.'' వినోదుడిలో ఆకస్మికంగా
మార్పు కలిగింది. అతని భ్రమలన్నీ ఒక్కసారిగా తొలగిపోయూయి. ‘‘మండలాధిపతి
నివాసం దగ్గిరలోనే ఉన్నది. ఆయనను కలుసుకుందాం, పద!'' అన్నాడు మేనమామ. ‘‘ఇక
ఎవర్నీ కలుసుకో నవసరం లేదు, మామా! నాకు ఉన్న ఉద్యోగం చాల్లే! శక్తివంచన
లేకుండా ఇందులోనే పైకి రావటానికి ప్రయత్నిస్తాను. నీకు అనవసరంగా శ్రమ
ఇచ్చాను,'' అన్నాడు వినోదుడు.
No comments:
Post a Comment