Pages

Monday, September 10, 2012

సంగాయ్‌ జింకలు


ఏమండోయ్‌! నేను మీకు తెలుసా? ఒకవేళ తెలిసినా నన్ను ఏ పేరుతో పిలవాలన్నది మీకు పెద్ద చిక్కే! ఎందుకంటే నాకు బోలెడన్ని పేర్లు! మణిపూర్‌ వంకర కొము్మల జింక అన్నది వాటిలో ఒకటి. మీ కోసం దాన్ని సులభం చేసి చెబుతాను. నన్ను సంగాయ్‌ అని పిలవండి చాలు. నిన్నగాక మొన్నేమో ఒకాయన నన్ను చూసి, ``అదిగో వెళుతోంది చూడండి. అది చాలా అరుదైన, నశించిపోయే స్థితిలో వున్న సంగాయ్‌,'' అని పక్కనున్న వారికి చెప్పడం విన్నాను. నేనూ, నా స్నేహితుడూ ఈశాన్య భారతదేశంలో పుట్టి ఒకటిగా పెరిగి పెద్దవాళ్ళయ్యాం.
 
మణిపూర్‌ గురించి మీరు వినే వుంటారు. ఇక్కడ లోక్‌టాక్‌ అనే పెద్ద సరస్సు ఉంది. దీనికి దక్షిణంగానే కీయ్‌బుల్‌ లామ్‌జావో నేషనల్‌ పార్‌‌క ఉంది. ప్రపంచం మొత్తం మీద అదొక్కటే ఫ్లోటింగ్‌ నేషనల్‌ పార్‌‌క. అంటే, తేలే జాతీయోద్యానం అని చెప్పవచ్చు. అదే మా నివాస స్థలం-తేలేస్వస్థలం అన్నమాట. అదేంటి తేలేనివాసం అంటారా? చెబుతాను వినండి. లోక్‌టాక్‌ సరస్సు ఒక భాగంలోనూ, నేషనల్‌ పార్‌‌కలోనూ ఫుమ్‌డీస్‌ అనే దీవులు కొన్ని ఉన్నాయి. ఈ దీవుల ఐదోవంతు నేల మాత్రం పైకి తేలుతూ, తక్కినది నీళ్ళ అడుగున మునిగి ఉంటుంది.
 
అందువల్ల ఈ దీవులు నీళ్ళపై తేలుతున్నట్టు కనిపిస్తాయి. ఈ దీవుల నేలభాగం సారవంతమైనది కావడంతో చెట్టు చేమలు విరివిగా ఉన్నాయి. ఈ ఫుమ్‌డీస్‌లో నేను నడుస్తూంటే, నాట్యం చేస్తున్నట్టు ఉంటుందట. అందుకే నన్ను నాట్యం చేసే జింక అని అంటారు. ఒకనాడు నా మిత్రుడూ, నేనూ కలిసి మా తేలేనివాసస్థానంలో జరుగుతూన్న కొన్ని వింత విషయాలను గురించి చర్చించడానికి సరస్సు సమీపానికి వెళ్ళాం.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ శతాబ్దారంభంలో కీయ్‌బుల్‌ లామ్‌జావో నేషనల్‌ పార్కులో 162 సంగాయ్‌ జింకలు ఉండేవి. అరుదైన ఈ జాతి జింకలు నివసించే విలక్షణమైన దీవులు 40.5చ కి.మీ. విస్తరించి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా 15చ కి.మీ. విస్తర్ణంలోనే ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ దీవులను స్థానికులు `ఫుండీ'లని పిలుస్తారు. ఈ నేషనల్‌ పార్కులోనే కాకుండా ఇంఫాల్‌లోని ఐరోయిషెంబా జూ లోనూ, లాంగోల్‌లోని సంగాయ్‌ కేప్టివ్‌ బ్రీడింగ్‌ సెంటర్‌లోనూ సంగాయ్‌ జింకలు ఉన్నాయిఇక్కడ నిర్మించిన బ్రహ్మాండమైన కాంక్రీటు ఆనకట్ట, కృత్రిమ తటాకాలే వీటికన్నిటికీ కారణం అని నాకు తెలుసు.
 
అవి ఏర్పడ్డాక మా దీవులు సన్నబడి చిక్కి పోయాయని మేము గ్రహించాం. కృత్రిమ తటాకం నుంచి తరచూ వెల్లువలు వస్తూంటే అవి త్వరలో మునిగిపోయే ప్రమాదమూ పొంచివుంది. మేము మాట్లాడుకుంటూన్నప్పుడు కుక్కలు మొరగడం వినిపించింది. దాపులనున్న గ్రామం నుంచి ఆ శబ్దం వస్తున్నదనుకున్నాం. కాని కొంత సేపటికే ఆ శబ్దం మరింత బిగ్గరగా వినిపించసాగింది. ``పరిగెత్తు, పరిగెత్తు, అవి మనల్ని చంపడానికి వస్తున్నాయి!'' అని అరుస్తూ నా మిత్రుడు ముందు పరిగెత్తసాగాడు. నేనూ లేచి పరుగుపట్టాను. క్షణంలో నా మిత్రుడికన్నా ముందుకు వెళ్ళాను. అతడు కొద్దిగా వెనకబడ్డాడు. నేను నా శక్తినంతా కూడదీసుకుని పరిగెత్తుతున్నాను. కానీ, నా వెనకే కుక్కలు మొరగడం వినిపిస్తున్నది. ఉన్నట్టుండి నా తల వాలుగా ఉన్న ఒక చెట్టుకొమ్మకు కొట్టుకోవడంతో దభీమని కిందపడ్డాను. స్పృహ కోల్పోయినంత పనయింది. కొంతసేపటికి లేచి చూస్తే, నా చుట్టూ చాలా మంది జనం ఉన్నారు. తలనొప్పిగా ఉంది. నా మిత్రుడి కోసం చూశాను. కనిపించలేదు. కఠినాత్ములైన వేటగాళు్ళ, వలవేసి సంగాయ్‌ జింకను చంపేశారని నా చుట్టూవున్నవాళు్ళ చెప్పుకుంటున్నారు. నాకు వెంటనే నా మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు.
 
వేటగాళు్ళ చంపింది అతన్ని కాదు కదా! నాకు ఏడుపు ఆగలేదు. చావడానికి ఇప్పుడు నా వంతు వచ్చిందా ఏం? నా కళ్ళల్లో నీళు్ళ నిండాయి. అప్పుడే నా మిత్రుడు నన్ను పిలవడం వినిపించింది. చటుక్కున లేచి నిలబడ్డాను. చుట్టూ ఉన్న జనం ఉలిక్కి పడ్డారు. పక్కకు జరిగి నేను వెళ్ళడానికి దారి ఇచ్చారు. ముందుకు వెళ్ళి నా ముఖాన్ని నా మిత్రుడి ముఖానికి సంతోషంగా రుద్దాను. నేను తప్పించుకుని పారిపోయి వచ్చాక ఏం జరిగిందని అడిగాను.

ఆ కుక్కలు పట్టుకుని దాదాపు తనను చంపేశాయని చెప్పిన నా మిత్రుడు, ``అవి చాలా భయంకరమైనవి, తండ్రీ,'' అన్నాడు. ``మరి, ఇంకా నువ్వెలా ప్రాణంతో ఉన్నావు,'' అని అడిగాను దిగ్భ్రాంతితో. ``ఇదో ఈ సమీపంలో నివసించే కుర్రాళ్ళే కాపాడారు,'' అన్నాడు నా మిత్రుడు. నేనెంతో సంతోషించి, మా ప్రాణాలను కాపాడినందుకు వారికి మేమెంతో రుణపడి ఉన్నట్టు భావించాను.
 
ఇక్కడివారికి సంగాయ్‌ జింకలంటే ఎంతో ఇష్టపడతారని నా మిత్రుడు చెప్పాడు. సంగాయ్‌లను చంపడం క్షమించరాని పాపంగా వాళు్ళ విశ్వసిస్తారట. సంగాయ్‌లను మనుషులకూ, ప్రకృతికీ మధ్య వారథులుగా చెప్పే మణిపురి పూర్వగాథ ఒకటి ఉన్నది. అందువల్ల మమ్మల్ని చంపడం అంటే ప్రకృతితో బంధాన్ని తెంచుకోవడమే అవుతుంది. మాలాంటి జంతువుల క్షేమంపట్ల శ్రద్ధగల వాళ్ళందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారని కూడా నా మిత్రుడు చెప్పాడు. జంతువులను పరిరక్షించే విధానాలను కూడా వాళు్ళ ఇతరులకు బోధిస్తారు.
 
నాలాంటి జింకలనూ, ఫుమ్‌డీస్‌నూ, లోక్‌టాక్‌ సరస్సునూ పరిరక్షించడానికి ప్రజలు తమ శాయశక్తులా కృషిచేస్తున్నారనే వార్త నాకెంతో ఊరట కలిగిస్తోంది. నాలో కొత్త విశ్వాసాన్ని నింపుతోంది. ``వాళ్ళెంత మంచి వాళ్ళో కదా!'' అనుకుంటూ ఉంటాను. సరే, చీకటి పడుతోంది. నేనూ, నా మిత్రుడూ మా మందకు తిరిగి వెళ్ళాలి. మేము తిరిగి వెళుతూంటే మా నాట్యంలాంటి నడక చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందించవచ్చు. మిమ్మల్ని నేను మళ్ళీ కలుసుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. మీరు గనక మరెప్పుడైనా ఇక్కడికి వస్తే, కీయ్‌బూ లామ్‌జావో నేషనల్‌ పార్కులో మనం ఒకటిగా నాట్యం చేయవచ్చు!

No comments:

Post a Comment