Pages

Monday, September 10, 2012

అనుకున్నదొకటి!


అనంతయ్య చాలా సేపు తలుపు బాదాక, అతడి భార్య అరుంధతి ఆవులిస్తూ వచ్చి తలుపు తెరిచి, అరుగు మీద నుంచి ఆకాశం కేసి తొంగి చూస్తూ, ``ఇంత అర్ధరాత్రి వచ్చావేమిటి?'' అన్నది. ఆ ఉదయమే అనంతయ్య పని మీద పొరుగూరు వెళుతూ, మర్నాటిగ్గాని రానని భార్యకు చెప్పాడు. ``పని త్వరగా తెమిలిపోయింది. సాయంత్రమే బాడుగబండిలో బయలుదేరాను.
 
సగం దారిలో బండి బురదలో దిగబడిపోయింది, అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి, ఈ వేళయింది!'' అంటూ అనంతయ్య విసుగ్గా లోపలికి వచ్చాడు. అతను కాళు్ళ కడుక్కుంటూంటే అరుంధతి, ``సాయంత్రం కనకయ్య పెళ్ళాం మన ఇంటి ముందు పెద్ద రచ్చచేసింది! మన పిల్లి వాళ్ళింట్లో పాలు తాగే సిందట. నువు్వ వచ్చాక, కనకయ్యను పంపించి, నీ బుర్ర బద్దలు కొట్టిస్తుందిట,'' అన్నది.
 
అనంతయ్య ఇంటి వెనక వైపు కనకయ్య కుటుంబం వుంటున్నది. ఈ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ``కనకయ్య కోతలకేం గానీ, ముందు నాకు వడ్డనచెయ్యి,'' అన్నాడు అనంతయ్య. అరుంధతి నాలుక కరుచుకున్నది. వండినవంట ఆమె మెతుకు మిగలకుండా తినేసింది. ఆమె ఈ సంగతి భర్తకు చెప్పి, ``నువు్వ రాత్రికి తిరిగివస్తావని అనుకోలేదు. ఇప్పుడేం చెయ్యడం!'' అన్నది. ఆ మాటలు విని అనంతయ్య అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. చాలా దూరం నడిచి రావడంతో, అతడికి ఆకలి కరకరమంటున్నది.

``సోలెడు బియ్యం చప్పునవార్చి తగ లేస్తేపోలా! ఏ ఊరగాయతోనో తినేస్తాను,'' అన్నాడు అనంతయ్య చిరాకుపడుతూ. అరుంధతి తటపటాయిస్తూనే, ``చిన్న జాడీలోకి తీసిన ఊరగాయ అయిపోయింది. పెద్ద ఊరగాయజాడీ అటక మీద వున్నది. దించాలంటే ఈ చీకట్లో తేళూ్ళ, జెర్రులూ, పెరట్లో తోటకూర వుంది, కోసుకురా. ఈ లోపల నేను అన్నం వండుతాను,'' అన్నది. అనంతయ్య విసుక్కుంటూ పెరట్లోని తోటకూర మడి దగ్గిరకు వెళ్ళాడు.
 
అంతా చీకటి. మడిలో అతని కాలి కింద ఏదో మెత్తగా నలిగింది. అనంతయ్య ఉలిక్కి పడి, పరీక్షగా చూస్తే అది పిల్లిపిల్ల! నాలుగు రోజులక్రితమే అనంతయ్య వాళ్ళ పిల్లి నాలుగు కూనల్ని పెట్టింది. అందులో తెల్లపిల్ల అతడి కాలికింద పడిందన్న మాట. అనంతయ్య దాన్ని కదిపిచూసి, చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు. అతడికి ప్రాణం కడబట్టినంత పనైంది. పిల్లిని చంపినపాపం పట్టి పీడిస్తుంది! పాపపరిహారం కోసం చేయవలసిన తంతుతో ఇల్లు గుల్లయిపోతుంది.
 
అరుంధతికి ఇలాంటి వాటిల్లో పట్టింపులు జాస్తి. గుట్టు చప్పుడుకాకుండా మడిలోనే దాన్ని పాతిపెట్టి, చెంపలు వేసుకుంటే, కొంతవరకు పాపపరిహారం అయిపోతుందనుకున్నాడు, అనంతయ్య. అరుంధతి వంటగదిలో వున్నది. అనంతయ్య చప్పుడు కాకుండా తోటకూర మడిలో గునపంతో గొయ్యి తవ్వి, పిల్లి కూనను పాతిపెట్టి, తోటకూర కోసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
 
``తోటకూర కోయడానికి నీకు ఇంత సేపు పట్టింది; నేను మాత్రం వంట చిటికెలో చేసెయ్యాలి!'' అని భర్తను సాధిస్తూ, తోటకూర పులుసుకాచింది అరుంధతి. అయితే, ఆ రాత్రివేళ పెరట్లో ఏదో శబ్దమైతే చూడవచ్చిన కనకయ్య భార్య, చీకట్లో అనంతయ్య తోటకూర మడిలో తవు్వతూండడం చూసి ఆశ్చర్యపోయి, ఈ వార్త చెప్పేందుకు గదిలోకి వెళ్ళి భర్తను తట్టి లేపింది. ``అర్ధరాత్రి ఏం కొంప మునిగిందని నిద్రలేపావు?'' అంటూ కనకయ్య కళు్ళ తెరిచి, ఒళు్ళ విరుచుకోసాగాడు. ``లే, లే మన కొంప నిండబోతున్నది. అనంతయ్య తోటకూర మడితవ్వి బంగారమో, డబ్బో దాచిపెట్టాడు.

వాళు్ళ పడుకోగానే నువు్వ గుట్టుచప్పుడు కాకుండా గోడ దూకిపోయి, ఆ డబ్బు పట్టుకురా. ఈ విధంగా అయినా వాళ్ళకు మంచి శాస్తిచేయాలి,'' అన్నది కనకయ్య భార్య. డబ్బుమాట వింటూనే కనకయ్యకు పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది. అనంతయ్య దాచింది తవ్వి తెచ్చుకోవడానికి అతను చిన్న పెట్టె తీసుకుని బయలుదేరాడు.
 
గోడ దూకి అనంతయ్య తోటకూర మడిలో తవ్విన గుర్తు తెలుసుకుని గునపంతో ఆ స్థలాన్ని తిరగదోడబోతున్న కనకయ్య కంఠానికి చల్లగా ఏదో తగిలింది. అతను ఉలిక్కి పడి తల ఎత్తి చూసేసరికి, పక్కనే నల్లటి దుస్తుల్లో భయంకరంగా వున్న దొంగ కనిపించాడు. ``కష్టపడి గొయ్యితవ్వి డబ్బు దాచడానికి అవస్థపడుతున్నావెందుకు? ఆ పెట్టె నా కిచ్చి, శుభ్రంగా చేతులు కడిగేసుకో!'' అన్నాడు దొంగ కరుకుగా.
 
దొంగను చూసి కనకయ్యకు కాళూ్ళ, చేతులూ ఆడకపోయినా బుర్ర మాత్రం చురుగ్గానే పని చేస్తున్నది. దొంగ, ఈ ఇల్లు తనదనీ, తాను డబ్బు పాతిపెట్టబోతున్నాననీ అనుకుంటున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుని దొంగ చేత అనంతయ్య ఇల్లు దోయించాలనుకున్నాడు, కనకయ్య. అతను మూత తెరిచి, ఖాళీపెట్టెను దొంగకు చూపుతూ, ``నా భార్య, ఈ పెట్టె పట్టేంత గుంట తవ్వమన్నది.
 
తన నగలన్నీ తెచ్చి ఇందులో వేస్తుందట! పోయి తలుపు తట్టి, ఆమెను పిలిచి, గొడవ చెయ్యకుండా ఆ నగలేవో పట్టుకుపో, నన్ను మాత్రం ఏమీ చెయ్యకు,'' అన్నాడు. ``నా గొంతు వింటే తలుపు తెరుస్తుందా? నీ పెళ్ళాన్ని నువ్వే పిలువు. ఆవిడ బయటికి వచ్చాక, ఆ నగల సంగతేమిటో నేనే చూసుకుంటాను,'' అంటూ దొంగ కనకయ్య మెడ పట్టుకుని, అతణ్ణి అనంతయ్య పెరటి గుమ్మం దగ్గిరకు లాక్కుపోయాడు.
 
ఇప్పుడు కనకయ్యకు దొంగభయం పోయింది. పెద్దగా గొంతెత్తి, ``అరుంధతీ, త్వరగా రా!'' అంటూ కేక పెట్టాడు. తలుపు తెరవగానే అతడు భార్యకు ఏమైనా సైగలు చేస్తాడేమో అని అనుమానించి దొంగ, కనకయ్యను పెడగాతోసి, తాను తలుపు దగ్గిరగా నిలబడ్డాడు. కనకయ్య మరొకసారి, అరుంధతీ అంటూ గట్టిగా కేకవేశాడు. 

ఆ కేకకు అరుంధతికి మెలకువ రాలేదు గాని, అనంతయ్య నిద్రలేచాడు. అర్ధరాత్రి ఎవరో కేక వెయ్యడం విని, అతడికి పట్టరాని కోపం వచ్చింది. హఠాత్తుగా అతడికి కనకయ్య భార్య తన భర్తచేత బుర్ర బద్దలు కొట్టిస్తానన్న మాట కూడా గుర్తుకు వచ్చింది. అనంతయ్య పళు్ళ కొరుకుతూ దుడ్డుకర్ర తీసుకుని చప్పుడుకాకుండా పెరటి తలుపు తెరిచి, ఏం జరగబోతున్నదో దొంగ ఊహించేలోపలే, అతణ్ణి కనకయ్య అనుకుని దుడ్డుకరత్రో తలమీద బలంగా కొట్టాడు.
 
దొంగ కుయ్యిమని కూడా అనకుండా కుప్పకూలిపోయాడు. కనకయ్య ఆ దెబ్బ తన నెత్తిన పడినంతగా అదిరిపడ్డాడు. కోపం వస్తే అనంతయ్య ఎంతటి సాహసానికైనా వెనుదీయడని అతడికి తెలిసిపోయింది. అలాంటి వాడితో గిల్లికజ్జాలకన్నా, స్నేహంగా వుండడం తనకు క్షేమం. కనకయ్య ఇలా ఆలోచించి, లేని సంతోషాన్ని కనబరుస్తూ, ``భేష్‌, అనంతయ్యా! గజదొంగ అంతటివాణ్ణి, ఒక్క దెబ్బతో మట్టికరిపించావు.
 
నీకు గ్రామాధికారి నుంచి పెద్ద బహుమానం రాకమానదు,'' అన్నాడు. అనంతయ్య ఈసారి దుడ్డుకరన్రు కనకయ్య కేసి గురిచేసి, ``ఈ వెకిలి కబుర్లు అలా వుంచు. ముందు నే నడిగే దానికి జవాబు చెప్పు. నువ్వనే ఈ గజదొంగ వెంట, నా పెరట్లోకి ఎందుకు వచ్చావు?'' అని అడిగాడు. కనకయ్య వణికిపోతూ, జరిగిన దంతా అనంతయ్యకు చెప్పి, ``ఇలా ఎందుకు చేశావని అడక్కు; దీన్నే బుద్ధిగడ్డితినడం అంటారు! నన్ను క్షమించు. ఈనాటి నుంచీ పాతరోజులు మర్చిపోదాం,'' అన్నాడు.
 
కనకయ్య అన్నట్టుగానే పెద్ద గజదొంగను పట్టినందుకు అనంతయ్యకు గ్రామాధికారి నుంచి బహుమానం లభించింది. ఈ జరిగిన గొడవంతా భర్త చెప్పగా విన్న అరుంధతి నవ్వి, ``ఆ పిల్లిపిల్ల ఏదో జబ్బుతో సాయంత్రమే చచ్చి పోయింది. తెల్లవారి పనిమనిషిచేత గొయ్యి తవ్వించి పాతిద్దాం అనుకున్నాను. దాని వల్లనే నీకు బహుమానం దక్కింది. శత్రువు, మిత్రుడయ్యాడు. మరి, చచ్చిన పిల్లిని ఖననం చేసిన పుణ్యం ఉట్టినే పోతుందా!'' అన్నది.

No comments:

Post a Comment