Pages

Monday, September 10, 2012

నిత్యసంతోషి


ఆస్తి పాస్తుల్లో, తెలివితేటల్లో, పలుకుబడిలో సమఉజ్జీ అయినప్పటికీ పొరుగింటి రామేశం తనకన్నా ఎప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడన్న సంగతి కామేశానికి ఎంత ఆలోచించినా అంతుపట్టేది కాదు. పైగా, దాన్ని గురించి ఆలోచించే కొద్దీ కామేశానికి విచారం కలిగేది. ఒక్కొక్కసారి అసూయతో దహించుకు పోయేవాడు.
 
రామేశం సంతోషాన్ని ఎలాగైనా హరించాలన్న పట్టుదలతో కామేశం ఉపాయం కోసం అన్వేషిస్తూన్న సమయంలో ఆ ఊరికి హిమాలయాల నుంచి జడయోగి వచ్చాడు. అప్పుడప్పుడు జనం మధ్యకు వచ్చే ఆ మునికి జుత్తు జడలు కట్టి ఉండడం వల్ల జడయోగి అన్న పేరువచ్చింది. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పే మేథస్సూ, ఏ జబ్బయినా తగ్గించే మూలికలూ, నచ్చిన వారికి వరాలిచ్చే మహిమా ఆయనకు ఉన్నాయి. ఆయన ఏం చేసినా పరోపకారమే జరుగుతుందని అందరూ చెప్పుకుంటారు.
 
కామేశం జడయోగిని ఇంటికి పిలిచి ఘనంగా ఆతిథ్యమిచ్చాడు. ఆయన సంతోషించి, ``నీకు ప్రయోజనమై, ఇతరులకు నష్టంకాని వరమేదైనా కోరుకో,'' అన్నాడు. ``అన్నింట్లోనూ నేను నా పొరుగు వాడు రామేశం కంటే ఎక్కువగా ఉండాలి,'' అన్నాడు కామేశం. జడయోగి, ``నీ కోరిక ప్రమాదకరం. రామేశానికి ఒక కన్ను పోతే, నీకు రెండు కళూ్ళ పోతాయి. అతనికి వెయ్యి వరహాలు నష్ట మొస్తే, నీకు రెండు వేల వరహాలు నష్టం. నేను అలాంటి వరాలు ఇవ్వను,'' అన్నాడు. ``నా ఉద్దేశం అదికాదు. డబ్బులో, గుర్తింపులో రామేశం కంటే నాదే పైచేయి కావాలి.

అందుకేదైనా మార్గం చెప్పండి,'' అన్నాడు కామేశం. ``అతడికి వెయ్యి వరహాలు పోతే నీకు వందపోవడం ఆధిక్యమే. కానీ అది నీకు మేలు చేయదు కదా. నీ కోరిక సత్ఫలితాన్నివ్వాలంటే, రామేశం కలకాలం పచ్చగా ఉండాలి. అది నీకు సమ్మతమేనా?'' అని అడిగాడు జడయోగి. డబ్బులో, గుర్తింపులో తనదే పైచేయి అయినప్పుడు రామేశం ఎంత పచ్చగా ఉంటే తనకు అంతమంచిదని కామేశం అందుకు ఒప్పుకున్నాడు.
 
అప్పుడు జడయోగి, ``స్వార్థమున్నా, పరోపకారం కూడా జతపడ్డం వల్ల నీ కోరిక మెచ్చతగినదే. డబ్బులో, గుర్తింపులో నీదే పైచేయిగా ఉండాలని వరమిస్తున్నాను. అయితే, ఒక్క విషయం గుర్తుంచుకో. ఒక్కసారి వద్దనుకున్నావో, నావరం శాశ్వతంగా రద్దవుతుంది,'' అన్నాడు. ఆ మరునాడు ఉదయం ఇంటి పెరట్లో తవు్వతుంటే, రామేశానికి ఒక రాగి చెంబు దొరికింది. అందులో ఆయన పూర్వీకులు ముందు తరాల వారికోసం దాచిన పదివేల వరహాలున్నాయి.
 
ఆ విషయం తెలిసి గ్రామస్థులు రామేశం అదృష్టాన్ని పొగిడారు. అది జడయోగి వరప్రభావమేనని గ్రహించిన కామేశానికి మనసు కలుక్కుమన్నది. అయితే, ఆ సాయంత్రమే కామేశం పొలంలో ఆయన పూర్వీకులు పాతి పెట్టిన లంకెబిందెలు దొరికాయి.

లక్ష వరహాలు విలువ చేసే ఆ నిధిని చూసిన గ్రామస్థులు, ``నువు్వ అదృష్టంలో రామేశాన్ని మించావు. ఈ సంతోష సమయంలో నువు్వ మా అందరికీ పెద్ద విందు చేయాలి,'' అన్నారు. కామేశం అందుకు సరేనని, ``ఎవరైనా విందు ఏర్పాట్లు చేయండి. ఖర్చు మొత్తం నేను భరిస్తాను,'' అన్నాడు గొప్పగా రామేశాన్ని చూస్తూ.
 
రామేశం అందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చాడు. రామేశం సంతోషంలో నటన లేదని గ్రహించాక కామేశం మనసు కలుక్కుమన్నది. మరి కొన్నాళ్ళకు రామేశానికి దూరపు బంధువు నుంచి వారసత్వంగా నాలుగెకరాల పొలం సంక్రమిస్తే, కామేశానికి పదెకరాలు వచ్చింది. ఈసారి రామేశమే స్వయంగా కామేశాన్ని విందుకు పిలిచాడు. ఇక కామేశం ఉక్రోషం పట్టలేక, ``నీకు లాభమొచ్చిందని సంతోషం కొద్దీ విందుకు పిలిస్తే అర్థంవుంది. నాకు లాభమొస్తే నీ కెందుకు సంతోషం?'' అని విసుక్కున్నాడు. రామేశం నవ్వి, ``నాకు లాభమొస్తే కలిగే సంతోషం అప్పటికి మాత్రమే పరిమితం.
 
ఆ తరవాత ఉండదు. అయితే, నేను కోరుకునేది నిత్యసంతోషం. రోజూ నాకు లాభాలు రావు. ఊళ్ళో ఎవరో ఒకరు రోజూ లాభపడుతూనే ఉంటారు గనక, అలాంటి వారికి వచ్చే లాభాలను, జరిగే మంచిని చూసి సంతోషించడం అలవరచుకుంటే రోజూ సంతోషమే మరి,'' అన్నాడు. కామేశం ఆశ్చర్యపోయాడు. తనకు పెద్ద లాభం కలిగే ముందు రామేశానికి చిన్న లాభం కలిగితేనే తన మనసు కలుక్కుమంటోంది. మరి రామేశమేమో నిత్య సంతోషి కావాలంటే ఇతరుల సంతోషమే తన సంతోషంగా భావించాలంటున్నాడు. జడయోగి తనకిచ్చిన వరం రామేశం సంతోషాన్ని నలునంత కూడా హరించలేదు సరికదా, అతడికి కలుగుతున్న చిన్న లాభాలు సైతం తన సంతోషాన్ని హరిస్తున్నాయి. అందువల్ల ఆయన జడయోగి ఇచ్చిన వరం పనిచేయకూడదని కోరుకున్నాడు. అలా వరం పొంది కూడా కామేశం, రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.

No comments:

Post a Comment