Pages

Monday, September 10, 2012

అన్న- తమ్ముడు


ధర్మపురిలో సోమయాజులు, ఛయనులు అనే ఇద్దరు అన్నదము్మలు ఉండేవారు. అన్న సోమయాజులు గొప్ప వేదపండితుడు. పూర్వాచార పరాయణుడు. దానికితోడు దేవీ ఉపాసకుడు. తెల్లవారు జామున లేచి, నదీ స్నానం చేసి పూజలో కూర్చుంటాడు. మూడు గంటల సేపు పూజాగృహం నుంచి వెలుపలికిరాడు. దేవికి నైవేద్యం పెట్టనిదే పచ్చి మంచినీళు్ళ కూడా ముట్టడు. ఆయన పిలిస్తే దేవి పలుకుతుందని ఆ ఊళ్ళో అందరూ అనుకుంటారు.
 
ఆయన ఆయుర్వేదం బాగా తెలిసినవాడేగాని, ఇంటికి వచ్చిన వాళ్ళకు తప్ప, ఎంతటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఒకరింటికి వెళ్ళి వైద్యం చేసి ఎరుగడు. ఆయన తము్మడు ఛయనులు వేదాలు చదివాడేగాని అన్న అంతటి పండితుడు కాడు. అన్నలాగా ఉపాసనాపరుడు గాక పోయినా, దేవీ భక్తుడు. ఆయుర్వేద వైద్యంలో మాత్రం అన్నను మించినవాడు.
 
దానికి తోడు ఎవరు వచ్చి పిలిచినా, అది ఏ అపరాత్రి వేళ అయినప్పటికీ వాళ్ళ వెంట వెళ్ళి వైద్యం చేసి వస్తాడు. ఒకసారి అర్ధరాత్రి సమయంలో పక్క ఊరి నుంచి ఇద్దరు వచ్చి, పిల్లవాడికి సంధిపాతం వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నాడని మొరపెట్టుకుంటే, ఛయనులు ఇంట్లో భార్య ఒక్కతే ఉందని కూడా చూడకుండా మందులపెట్టె పట్టుకుని వాళ్ళ వెంట బయలుదేరాడు. వాళ్ళ ఊరు వెళ్ళే సరికి కోడి కూసింది. ఇంట్లో జనం అంతా ముగిసిపోయిందని పిల్లవాణ్ణి గడపలో పెట్టి లబో దిబో మంటున్నారు. ఛయనులు వాళ్ళను పక్కకు తప్పించి నాడి చూశాడు. ఆ తరవాత ఏదో పొట్లం విప్పి, అందులోని భస్మాన్ని తేనెలో రంగరించి పిల్లవాడికి పట్టించాడు. గంట తరవాత పిల్లవాడిలో కదలిక వచ్చింది.ఇంట్లో వాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది.

 ఛయనులు రెండు గంటల తరవాత ఏదో కషాయం తయారు చేసి కళు్ళ తెరిచిన పిల్లవాడి చేత తాగించాడు. మరికొంత సేపటికి పిల్లవాడు లేచి కూర్చున్నాడు. ఇంట్లోని వాళ్ళందరూ కృతజ్ఞతతో ఛయనులుకి చేతులెత్తి మొక్కారు. అప్పటికే మధ్యాహ్నం కావడంతో ఛయనులుకి ఆకలి ఎక్కువయింది. ఆ ఇంటి వారు, ``మా ఊళ్ళో పళు్ళ కూడా దొరకవు. పాలు తెస్తాం, తాగుతారా?'' అని అడిగారు.
 
``మీరు వండుకోలేదా?'' అని అడిగాడు ఛయనులు. ``వండుకున్నాం. కానీ... కానీ...'' అంటూ ఆగాడు ఆ ఇంటి యజమాని. ``పదండి. అందరూ కలిసే భోజనం చేద్దాం,'' అంటూ అరుగుపై నుంచి లేచాడు ఛయనులు. అందరితో కలిసి ఆనందంతో భోజనం చేసి వాళ్ళిచ్చింది పుచ్చుకుని సంతోషంగా ఇంటిదారి పట్టాడు. ఈ వార్త ఆనోటా ఈనోటా నలిగి, ఆఖరికి సోమయాజులు చెవినిపడింది.
 
మండి పడ్డాడు. తము్మణ్ణి పిలిచి చీవాట్లు పెట్టి ప్రాయశ్చిత్తం చేయాలన్నాడు. ఛయనులు, ``ఆకలి భరించలేక, మరో మార్గం లేక ప్రాణాలు నిలుపుకోవడానికి వాళ్ళింట్లో భోజనం చేయడం తప్పుకాదనుకుంటాను,'' అన్నాడు వినయంగా. ``చేసిన అపచారం చాలదని పెద్దవాడికి ఎదురు తిరుగుతున్నావా?'' అన్నాడు సోమయాజులు ఆగ్రహంతో. ``అన్నీ తెలిసినవారు. మీకు చెప్పేంత వాణ్ణి కాను నేను. ప్రాణాలు నిలిపే ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నా తప్పులేదు,'' అన్నాడు ఛయనులు మళ్ళీ. ఆ మాటలు సోమయాజులుకు మరింత ఆగ్రహం తెప్పించాయి. ``ఛీ, అప్రాచ్యుడా! అవతలికి వెళు్ళ.
 
ఈ రోజు నుంచి నా తము్మడు లేడనుకుంటాను,'' అంటూ తలమీది నుంచి చేదతో నీళు్ళ కుమ్మరించుకున్నాడు. ఛయనులు అన్నకు బాధ కలిగించినందుకు చింతిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సోమయాజుల ఇల్లు పండితులతో కళకళలాడుతూ ఉంటే, ఛయనులు ఇంటికి సామాన్య ప్రజలు ఎక్కువగా వచ్చేవారు. ఆకలి అని ఎవరు వచ్చినా ఛయనుల భార్య వాళ్ళకింత పెట్టి పంపేది.

ఇలా వుండగా ఒకసారి ఐదారు రోజులపాటు ఎడతెరిపిలేని జడివానతో పెను తుఫాను ఊరిని చుట్టు ముట్టింది. ఛయనులు ఏర్పాటు చేసిన పాకలో బీదా బిక్కీ జనం వచ్చి ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చున్నారు. సోమయాజులు, పూజాసమయం కావడంతో పూజాగృహంలో కూర్చుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. హఠాత్తుగా ఆయన ధ్యానం చేస్తూన్న పూజాగృహం తప్ప, తక్కిన భవంతి, యజ్ఞశాల గోడలు తడిసి భయంకర శబ్దంతో కూలిపోయాయి. సోమయాజులు ఉలిక్కిపడిలేచి, కిటికీలోంచి చూస్తే, తము్మడి భోజనాల తాటిపాక సురక్షితంగా కనిపించింది.
 
సోమయాజులు ఆగ్రహావేశంతో దేవీ విగ్రహం పాదాల ముందు ప్రాణత్యాగం చేయాలని తలమోదుకుంటూ, ``తల్లీ, ఏమిటీదారుణం? నీకు నైవేద్యం పెట్టకుండా నేను ఏనాడైనా పచ్చినీళ్ళయినా ముట్టానా? సదాచారంతో, నిష్ఠతో నిన్ను పూజించిన నా ఇంటిని నేలమట్టం చేసి, ఆచారాలను మంటగలిపి, నీ సంగతే మరిచిన నా తము్మడి తాటిపాకను చెక్కుచెదరకుండా కాపాడావు? ఇది దురన్యాయం కాదా?'' అంటూ విలపించసాగాడు. ``పిచ్చివాడా, ఆగు! ఏమిటి నువ్వంటున్నది? నువు్వ నా భక్తుడివే, నిజం.
 
అయితే భక్తుడినన్న అహంకారంతో, ఆచారాలతో తోటి మానవులకు దూరమై ఒంటరివాడివై పోయావు. నీ తము్మడూ నా భక్తుడే. నువు్వ నీ ఎదుట వున్న విగ్రహంలోనే నన్ను చూస్తున్నావు. నీ తము్మడు ప్రతి జీవరాశిలోనూ నన్ను దర్శిస్తున్నాడు. తనతో పాటు అందరూ బావుండాలని అతడు కోరుకుంటున్నాడు.
 
అలాంటి వాణ్ణీ, అతన్ని ఆశ్రయించిన పేద ప్రజలనూ కాపాడడం నా బాధ్యత కాదా? పైగా ప్రకృతి విలయతాండవం చేస్తూన్న ఇంతటి ప్రళయంలోనూ, నిన్నూ, నీ భార్యా బిడ్డలనూ కాపాడాను కదా! ఆ సంగతి మరిచిపోయి నన్నే తప్పుపడతావా?'' అన్న మాటలు దేవీ విగ్రహం నుంచి గంభీరంగా వినిపించాయి. ఆ మాటలతో తన తప్పు గ్రహించిన సోమయాజులు, ``తల్లీ, నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించు. ఇకపై నీ ఆజ్ఞానుసారం వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడైన నా తము్మడి అడుగుజాడలలో నడుస్తాను,'' అంటూ చేతులు జోడించాడు.

No comments:

Post a Comment