Pages

Monday, September 10, 2012

మంత్రగాడి జీవితం!


హరిపురం చిన్న పల్లెటూరు. అక్కడ వ్యవసాయం చేసేవారూ, కులవృత్తుల్లో నిపుణులూ వున్నారు. ఆయూ పనులకు అవసరమైనవి పట్నంలో మాత్రమే లభిస్తాయి. అందుకని ప్రతివారికీ ఇంచుమించు పట్నం వెళ్ళే పనివుండేది. హరిపురంలో తయూరయ్యే అనేక వస్తువులకు పట్నంలో మంచి గిరాకీ వున్నది. అలాంటి హరిపురంలో సోమన్న ఒక్కడే పేదవాడని చెప్పవచ్చు. అతడికి పొలమూ లేదు; కులవృత్తీ రాదు.
 
నాలుగిళ్ళు తిరిగి తోటపని చేస్తాడు. భార్య సీతమ్మ రకరకాల తినుబండారాలు చేసి ఊరంతా తిరిగి అమ్ముతుంది. పన్నెండేళ్ళ కూతురు రమ ఇంట్లో వుండి వంట చేస్తూ, ఆరేళ్ళ తమ్ముడు గణపతి ఆలనాపాలనా చూస్తుంది. ఇలావుండగా, ఆనందుడనే యోగి శిష్య గణంతో, ఆ ఊరికి వచ్చాడు. ఆయన మంచి వక్త్త. ఆయన చెప్పేది వినడానికి ఊరివారందరూ ఎగబడ్డారు. ఆనందుడు తన ఉపన్యాసంలో, ‘‘ఆరోగ్యం, సంతృప్తి మనిషికి సుఖసంతోషాలనిస్తాయి.
 
ఎవరి పనులు వారు చేసుకుంటూ, ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే భుజిస్తూవుంటే ఆరోగ్యం చక్కగా వుంటుంది,'' అని చెప్పాడు. ఈ మాటలు ఊరివాళ్ళకు బాగా నచ్చాయి. అప్పట్నించీ ఎవరింటి తోటపని వారుచేసుకుంటున్నారు. ఎవరికి కావలసింది వారు ఇంట్లోనే వండుకుని తింటున్నారు. సోమన్నకూ, సీతమ్మకూ ఆదాయం పోయి పస్తులుండే పరిస్థితి ఏర్పడింది.
 
ఇదంతా ఆనందుడివల్లే జరిగిందని గ్రహించిన సోమన్న, ఆయన్ను కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన అతడి వంక అదోలా చూసి, ‘‘ఈ ఊళ్ళో నా మాటలు విని ఎందరో బాగుపడ్డారు. నీకొక్కడికే చెడు జరిగింది. తప్పు నీదంటావా, నాదంటావా?'' అని అడిగాడు.

‘‘స్వామీ! ఇది తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం కాదు. నేనూ, నా భార్యా బిడ్డలూ ఆకలితో మలమల మాడిపోతున్నాం. అందుకు కారణం మీరేకాబట్టి, మా అందరి ఆకలీ తీరే ఉపాయం మీరే చెప్పాలి,'' అన్నాడు సోమన్న దీనంగా. ‘‘చూడు, సోమన్నా! ప్రజల అవసరాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. ఇంతకాలం నీవు ఆలోచించకుండా బ్రతికేశావు. ఆలోచించి చూడు; జీవనోపాధికి కొత్త మార్గాలు కనబడతాయి,'' అన్నాడు ఆనందుడు. దానికి సోమన్న అక్కసుగా, ‘‘కడుపు నిండిన మీలాంటివారు ఇలాంటి కబుర్లే చెబుతారు.
 
వీటివల్ల మా కడుపుమంట చల్లారదు,'' అన్నాడు. ఆనందుడు నవ్వి, ‘‘ఒకప్పుడు నేనూ కాయకష్టంచేసి పొట్టపోషించుకునే వాణ్ణి. క్రమంగా పనులు దొరకడం మానేశాయి. నేను సాధువుల్లో కలిసి పోయూను. ప్రజలకు ఎలాంటి కబుర్లు ఇష్టమో అవి చెప్పి కడుపు నింపుకుంటున్నాను. నాకులాగే నువ్వూ మారాలి,'' అన్నాడు. సోమన్న వెంటనే తనూ యోగికి శిష్యుడుగా చేరిపోతానన్నాడు.
 
ఆనందుడు అంగీకరించక, ‘‘పిడుక్కీ, బియ్యూనికే ఒకే మంత్రం పనికిరాదు. నీకు సంసార బాధ్యతలున్నాయి. నీకు తగిన బ్రతుకుతెరువు వెతుక్కో,'' అన్నాడు. ‘‘ఈలోగా నేనూ, నా భార్యా బిడ్డలూ ఆకలితో మాడిచస్తాం,'' అన్నాడు సోమన్న దిగులుగా. అందుకు ఆనందుడు, ‘‘అలా గాభరాపడకు! నేను ఈరోజే ఈ ఉరువిడిచిపెడుతున్నాను. ఐతే, నా శిష్యుల్లో టోకరుడనేవాణ్ణి, నీకు పరిచయం చేస్తాను.
 
అతడికి మంత్రవిద్యలు తెలుసు. నీకు ఏదో ఒక బతుకుతెరువుదొరికేదాకా, మీ అందరికీ ఆకలి బాధలేకుండా సాయపడతాడు,'' అన్నాడు. సోమన్న సరేననగానే ఆనందుడు, టోకరుణ్ణి పిలిచాడు. టోకరుడు ఏడడుగుల పొడవు, అంతకు తగ్గలావు వున్నాడు. జుట్టు జడలు కట్టివున్నది.
 
ఎరట్రి కళ్ళు, కిందకు వాలిన పొడవాటి మీసాలు, జీబురు గడ్డం, భుజాన్నుంచి పాదాలదాకా అంగీ. అతడు మాంత్రికుడని చూడగానే అనిపిస్తుంది. ఆనందుడు, టోకరుడి భుజంతట్టి, ‘‘నేనీ ఊరు విడిచిపెడుతున్నాను. ఇతడి పేరు సోమన్న. నీవు పక్షం రోజులు ఇతడి కుటుం బానికి సేవచేయూలి.

వారికి ఆకలి బాధలేకుండా చూసుకో. తర్వాత నీ మంత్ర శక్తితో నేనున్నచోటుకు రా,'' అన్నాడు. టోకరుడు గురువుకు నమస్కరించి, సోమన్న వెంట బయలుదేరాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సీతమ్మ, పిల్లలు సోమన్న తినడానికి ఏమైనా తెచ్చాడేమో అని ఆత్రుతగా ఎదురొచ్చారు. టోకరుడు వాళ్ళతో, ‘‘మీరంతా కళ్ళు మూసుకుని, ఎవరికి ఏమేమి తినాలనివున్నదో చెప్పి కళ్ళు తెరవండి,'' అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. సోమన్న పులిహోర, బొబ్బట్లు అన్నాడు.
 
అలా ఎవరికి కావలసింది వారు కోరుకుని కళ్ళు తెరిచే సరికి, వంటకాలు వెండిపళ్ళాలలో వడ్డించివున్నాయి. వాళ్ళు తినడం అవగానే వెండి పళ్ళాలు మాయమై పోయూయి. అందరూ టోకరుణ్ణి మెచ్చుకున్నారు. టోకరుడు వాళ్ళతో, ‘‘నేనిక్కడ పక్షం రోజులు మాత్రమే వుంటాను. ఈలోగా మీరు జీవనోపాధికి కొత్త మార్గాలు వెతుక్కోవాలి,'' అన్నాడు. ఇది విన్న సోమన్నకు బెంగపుట్టింది. అతడు టోకరుడితో, ‘‘నాకూ ఇలాంటి మంత్ర శక్తులు నేర్పి వెళ్ళు,'' అన్నాడు.
 
టోకరుడు నవ్వి, ‘‘మనకు పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి ఆహారం కావాలి. వీటన్నింటినీ పకృతి ద్వారా మనకందిస్తున్న మహామాంత్రికుడు, దేవుడు. మనిషి నేర్చిన మంత్రాల మహిమవల్ల, సుఖసంతోషాలకంటే బాధ, అసంతృప్తులే ఎక్కువ. నీవు నా మాట విని బ్రతుకుతెరువు గురించి ఆలోచించు,'' అని హితవు చెప్పాడు. ‘‘మంత్ర శక్తులవల్ల నీకు కలిగిన బాధ, అసంతృప్తి ఏమిటో చెప్పగలవా?'' అని అడిగాడు సోమన్న చిరాకు పడుతూ.
 
అందుకు టోకరుడు శాంతంగా, ‘‘నా బాధలు ఎవరికీ చెప్పకూడదని గురువాజ్ఞ. నేనిక్కణ్ణించి వెళ్ళేలోగా, ఈ ఊళ్ళో బతుకు తెరువుకు కొత్త మార్గాలు తెలుసుకుని నాకు చెప్పు. నేను నీకు మంత్ర శక్తులు లభించేలా చేస్తాను,'' అన్నాడు. ఈ మాటలకు సోమన్న సంతోషించాడు కానీ, మంత్రం నేర్వడం అంతసులభంకాదన్న అనుమానం కలిగింది.
 
సోమన్న ఇంట్లో అందరికీ మంత్రవిద్య నేర్చుకుంటే బాగుంటుందని వున్నది. కానీ తమలో ఒక్కరికైనా మంత్ర విద్య అబ్బుతుందన్న నమ్మకం వాళ్ళకు కలగలేదు. అందుకని ప్రతిరోజూ తెల్లవారగానే సోమన్న, సీతమ్మ ఊరంతా తిరిగి, ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు.

 రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు సోమన్న, టోకరుణ్ణి, ‘‘మీ గురువు ఆనందుడు పొట్టకూటి కోసం యోగినయ్యూనని నాకు చెప్పాడు. మహా మంత్రవేత్తవైన నీ వాయనకు శిష్యుడివెలా అయ్యూవు?'' అని అడిగాడు. ‘‘ఆనందుడు మహాజ్ఞాని. నీ బుద్ధి వికసించాలని, ఆయన నీకు అలా చెప్పాడు. ఆయన పొట్టకూటి కోసం యోగికావడం నిజంకాదు. మాంత్రికులకు స్వేచ్ఛార్హత వుండదు. అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపాన్ని ఆవహించిన భూతం, పాతాళ భైరవి కథలు వినేవుంటావు.
 
ఆనందుడు జ్ఞాని కాబట్టి నన్ను బానిస అనకుండా శిష్యుడంటున్నాడు. ఇదీ మంత్రగాడి జీవితం!'' అన్నాడు టోకరుడు. సోమన్న ఈ విషయం భార్యకు చెప్పి, ‘‘టోకరుడు మనను భయపెట్టాలని చూస్తున్నాడని, నా అనుమానం. ఒక వేళ అతడు చెప్పేది నిజమే అయినా,నేను మంత్రవిద్యనేర్చుకుని మిమ్మల్నందర్నీ సుఖపెడతాను. నేనొక్కణ్ణీ కష్టపడితే మాత్రమేం?'' అన్నాడు. సీతమ్మ వెంటనే, ‘‘మంత్ర విద్యకు కఠోర సాధన అవసరం అని తెలుస్తూనే వున్నది.
 
అది మధ్యలో ఆపేస్తే ప్రాణ ప్రమాదం కాబట్టి, ఈ ఆలోచన మానుకో,'' అన్నది. చివరకు టోకరుడు వెళ్ళిపోయే రోజు వచ్చింది. అతడు సోమన్నతో, ‘‘నేను వెళ్ళేక మీరెలా జీవిస్తారా అని దిగులు పడుతున్నాను,'' అన్నాడు. అందుకు సోమన్నా అతడి భార్యా, ‘‘మేమీ మధ్య ఊళ్ళో వాళ్ళకు అవసరమైన వస్తువులేమిటో తెలుసుకున్నాం. వాటిని పట్నం నుంచి తెచ్చి ఇక్కడి వాళ్ళకు అమ్మీ, అలాగే ఇక్కడ తయూరయ్యే వాటిని పట్నంలో అమ్మీ సుఖంగా బ్రతకగలం.
 
ఆ మాయదారి మంత్రవిద్యల పట్ల మాకు ఆసక్తి లేదు,'' అన్నారు. ఆ మాటలు విని టోకరుడు చాలా సంతోషించాడు. వారిలో ఆత్మవిశ్వాసం కలిగి, సుఖంగా జీవించాలంటే శ్రమించడానికి మించిన మార్గం లేదన్న జ్ఞానోదయం కలిగినందుకు వాళ్ళను మెచ్చుకుని, గురువు ఆనందుణ్ణి కలుసుకునేందుకు ప్రయూణ మయ్యూడు.

No comments:

Post a Comment