చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో పరమానందుడు ఒంటరి జీవితం
గడుపుతున్నాడు. అతనికి పూలచెట్లన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టం. అందువల్ల ఒక
అడవి సమీపంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు. అతడు అక్కడ లభించే ఫలాలనూ,
కందమూలాలనూ తిని కడుపు నింపుకునేవాడు. అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు పక్షులను
పట్టుకునేవాడు.
అలా ఒకనాడు అతడు పక్షులకు వల విసిరాడు. వలలో ఒక అందమైన అడవిచిలుక
పట్టుబడింది. అతడు దానిని బయటకు తీసి ఈకలు పీకడానికి ప్రయత్నిస్తూ,
``నువు్వ నన్ను చంపొద్దు. మరెవ్వరికీ అమ్మవద్దు. నీకు అదృష్టం
కలుగుతుంది,'' అన్న చిలుక మాటలువిని విస్తుపోయాడు. ``అలాగే. నిన్ను
ప్రాణాలతో వదిలితే నాకు ఎలాంటి అదృష్టం కలిగేలా చేస్తావు? చెప్పుమరి,'' అని
అడిగాడు పరమానందుడు.
"నన్ను రాజు వద్దకు తీసుకువెళు్ళ. నీకే తెలుస్తుంది,'' అన్నది చిలుక.
పరమానందుడు అప్పటికప్పుడే రాజభవనం కేసి బయలుదేరాడు. ఆ పక్షిని చూడగానే
రాజు, ``ఆహా, ఎంత అందమైన పక్షి!'' అని ఆశ్చర్య పోయాడు. తన కుమార్తె
మోతీరాణిని పిలుచుకు రమ్మని భటుణ్ణి పంపాడు. ఆమెరాగానే, ``చూశావా ఈ చిలుక
ఎంత అందంగా ఉందో!'' అన్నాడు. ``అవును, చాలా అందంగా ఉంది. దాన్ని నాకు
ఇప్పిస్తే చాలా జాగ్రత్తగా పెంచుకుంటాను,'' అన్నది రాకుమారి.
రాజు
పరమానందుడికేసి తిరిగి, ``ఆ పక్షి మాకు కావాలి. నువు్వ దానికి ఎంత
పుచ్చుకుంటావు?'' అని అడిగాడు. యువరాణి అందచందాలను దిగ్భ్రాంతితో చూస్తూన్న
పరమానందుడు రాజు ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. చిలుక దాన్ని
అవకాశంగా తీసుకుని, ``వెయ్యి నాణాలు!'' అన్నది. చిలుక మాటవిని సభలోని
వారందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
రాజు వెంటనే వెయ్యి బంగారు నాణాలు తెప్పించి, పర మానందుడికి
అందించాడు. పరమానందుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు, ఆయన
కుమార్తె కొంతసేపు చిలుక పలుకులు వింటూ ఆనందించారు. ఆ పిమ్మట, రాజకుమారి
చిలుకను అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది. మరునాడే చిలుక కోసం ఒక బంగారు పంజరం
తయారు చేయించింది. కొన్ని రోజులు గడిచాయి.
ఒకనాడు, ``నాకు మా ఇంటి మీద ధ్యాస మళ్ళింది. ఒక్కసారి వెళ్ళి చూసి
రావాలని ఉంది. తమరు అనుమతించారంటే వెళ్ళి తప్పకుండా తిరిగి వస్తాను.
వచ్చేప్పుడు మీకొక మంచి కానుక కూడా తీసుకువస్తాను,'' అని చిలుక రాకుమారిని
వేడుకున్నది. రాకుమారి అందుకు అయిష్టంగానే అంగీకరించింది. చిలుక వెంటనే
ఎగిరివెళ్ళి, కొన్ని వారాల తరవాత తిరిగివచ్చింది.
వస్తూ వస్తూ ఒక అందమైన నీలంపువు్వను ముక్కున కరుచుకుని వచ్చి
యువరాణికిచ్చి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ఆ పువు్వను చూసి రాజకుమారి
పరమానందం చెందింది. అంతటితో ఊరుకోకుండా అందమైన ఆ పువు్వల గుత్తును తెచ్చిన
వారినే వివాహ మాడాలనుకున్నది. కుమార్తె నిర్ణయం విని రాజు దిగ్భ్రాంతి
చెందాడు. వెంటనే ఆయన ఆమె వద్దకు వెళ్ళి, ``నిన్ను వివాహ మాడడానికి ఇప్పటికే
ఎందరో రాజకుమారులు వచ్చారు.
అందరూ కూడా ధైర్యసాహసాలుగల అందమైన యువకులే. ఎవరో ఒక వేటగాడు అడవిలో ఈ
పువు్వలను చూసి, ఒక గుత్తును తీసుకు వచ్చాడే అనుకుందాం. అలాంటి వాణ్ణి
నువు్వ వివాహ మాడగలవా? నిన్ను వివాహ మాడే వాడే మునుముందు మన రాజ్యానికి
రాజు కూడా అవుతాడు. ఆలోచించి చూడు,'' అన్నాడు. అయితే, రాకుమారి అంత సులభంగా
తన మనసు మార్చుకునేలా కనిపించలేదు. దాంతో రాజు, ఏ రాజకుమారుడైనా, అడవిలో
అలాంటి పువు్వను కనుగొని తీసుకురాగలడన్న నమ్మకంతో యువరాణి నిర్ణయాన్ని
చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని పలువురు రాకుమారులు నీలంరంగు పువు్వను
వెతుక్కుంటూ వెళ్ళి అడవులన్నీ గాలించారు. కాని ప్రయోజనం లేక పోయింది.
పరమానందుడు కూడా యువరాణి నిర్ణయం గురించి విన్నాడు. అద్భుత
సౌందర్యరాశి అయిన యువరాణిని చూసిన క్షణం నుంచి అతడి మనసంతా ఆమె మీదే
ఉన్నది. ఎలాగైనా ఆమెను వివాహ మాడగలనని కలలుగనసాగాడు. ఇప్పుడు రాకుమారి
చాటింపు గురించి తెలియగానే అతడి కోరిక మరింత బలపడసాగింది.
ఇంతకూ ఆ విచిత్ర పుష్పాన్ని తీసుకుపోయి రాజకుమారికి ఇచ్చింది తన
చిలుకే అని తెలియడంతో మరింత ఉత్సాహం కలిగింది. అతడికి అడవులన్నిటి గురించీ
క్షుణ్ణంగా తెలుసు. అందువల్ల ఒకనాడు నీలంపువు్వ చెట్టును వెతుక్కుంటూ
బయలుదేరాడు. పొలాలూ, మైదానాలూ, నదులూ, కొండలూ, కోనలూ దాటుకుంటూ అనేక రోజులు
ప్రయాణం చేసి, ఒకనాడు ఒకానొక కొండశిఖరాన్ని చేరుకున్నాడు.
అక్కడి నుంచి అవతలి వైపుకు చూస్తే నీలిపువు్వల సుందర వనం కనిపించింది.
అతడు వేగ వేగంగా కొండదిగి ఆ అడవిని సమీపించాడు. అడవి చాలా అందంగా
కనిపించింది. అక్కడి నుంచి పూలగుత్తును కోసుకుపోవడమా? లేక ఒక చెట్టునే
పెకలించుకుని వెళితే బావుం టుందా? అందుకు ఎవరి అనుమతినైనా తీసుకోవాలా? అని
ఆలోచిస్తూండగా పరమానందుడికి గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. అతడు
వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు.
గుర్రం మీద వచ్చిన ఒక యువకుడు, గుర్రంపైనుంచి దిగి మెల్లగా వెళ్ళి ఒక
చెట్టు నీడలో విచారంగా కూర్చున్నాడు. పరమానందుడు ఆ యువకుణ్ణి సమీపించి, ``ఈ
అడవి ఏరాజ్యం సరిహద్దులోపల ఉందో తెలుసా?'' అని అడిగాడు. ఆ మాట విని
తలెత్తి చూసిన యువకుడు, ``ఇది శ్యామ పుష్ప రాజ్యం. నువ్వెవరు? ఇక్కడికి
ఎందుకు వచ్చావు?'' అని అడిగాడు. ``నా పేరు పరమానందుడు. నీలం రంగు విచిత్ర
పుష్పాన్ని వెతుక్కుంటూ వచ్చి, ఈ వనం చేరాను. అది సరే, నువు్వ అంత విచారంగా
ఉన్నావెందుకు మిత్రమా?'' అని అడిగాడు పరమానందుడు ఆ యువకుడి పక్కనే
కూర్చుంటూ. ``అదొక పెద్ద కథ!'' అంటూ గాఢంగా నిట్టూర్చాడు యువకుడు.
``చెప్పు, వింటాను,'' అన్నాడు పరమానందుడు. ``ఈ రాజ్యాన్నేలే రాజుకు
అద్భుత సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు నీలమణి. సుకుమారి
అయిన ఆమె ఇక్కడికి రాగానే పక్షులు పాడేవి. ఆమె తాకగానే మొగ్గలు పూచేవి. మా
తండ్రి రాజుగారి ప్రధాన మంత్రిగా ఉండేవారు. చిన్నప్పుడు నేనూ, నీలమణీ కలిసి
ఆడుకునే వాళ్ళం. పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేసుకోవాలని ఆశించాం. అయితే,
రాజుగారు తన కుమార్తెను ఒక ధనిక వర్తకుడికిచ్చి వివాహం చేయాలని
అనుకున్నాడు.
అయితే,
బాల్యమిత్రుడైన నన్ను తప్ప మరెవ్వరినీ వివాహ మాడనని నీలమణి తండ్రికి
చెప్పింది. రాజుగారికి ఆగ్రహం కలిగింది. అదే సమయంలో ఒక మాంత్రికుడు రాజ
దర్శనానికి వచ్చాడు. యువరాణి శరీరానికి బంగారపు రంగు తెప్పిస్తానని చెప్పి,
అతడు ఆమెను మంటల మధ్య కూర్చోబెట్టాడు.
మంటలు ఎగిసి పడుతూండగా ఆమెను ఒక బంగారపు మేకుగా మార్చి, ``ఈ మేకును
అగ్నిలో కాల్చినట్టయితే నీ కుమార్తె మళ్ళీ యధారూపంలో వస్తుంది,'' అని
చెప్పి మాంత్రికుడు వెళ్ళిపోయాడు. ``బంగారం మేకు ఏమయింది?'' అని అడిగాడు
పరమానందుడు ఆతృతగా.
``రాజు ఆగ్రహావేశంతో ఆ మేకును తెచ్చి, ఇక్కడున్న చెట్లలో ఒక దానికి
కొట్టి మరీ వెళ్ళాడు. రాజభవనంలోని నీలవేణి చెలికత్తె ద్వారా నాకీ సంగతి
తెలియవచ్చింది. ఆనాటి నుంచి నేను రోజూ ఇక్కడికి వస్తున్నాను. మేకు దించిన
చెట్టుకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇంత వరకు కనుగొనలేక పోతున్నాను. రాజుగారు
కూడా ప్రస్తుతం చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నట్టు చెబుతున్నారు.
ఆ మేకును కనుగొన్నట్టయితే, నేను దానిని ఆయన వద్దకు తీసుకువెళ్ళి,
ఆమెకు పూర్వరూపం తెప్పించగలను. అప్పుడాయన తన కుమార్తెను నాతో వివాహం
జరిపించడానికి తప్పక అంగీకరించగలడు,'' అన్నాడు యువకుడు. ``ఆ చెట్టునూ,
మేకునూ కనుగొనడానికి నేను నీకు సాయపడగలను,'' అన్నాడు పరమానందుడు. ``ఎలా
సాయపడగలవు? ఒక్క చెట్టును వదలకుండా అన్ని చెట్లనూ నేను వెతికాను. ఇంతవరకు
కనుగొనలేక పోయాను,'' అన్నాడు యువకుడు నిస్పృహతో. ``రాత్రి సమయంలో ఇక్కడికి
వద్దాం,'' అన్నాడు పరమానందుడు. ``అద్భుతమైన ఆలోచన! నాకు ఇంతవరకు తోచనే
లేదు. ఇప్పటికి వెళదాం, రా,'' అంటూ ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు యువకుడు.
ఇద్దరూ గుర్రంమీద ఆ యువకుడి ఇల్లు చేరారు. సాయంకాలం కాగానే మళ్ళీ
ఇద్దరూ అడవికి బయలుదేరారు. బయలుదేరే ముందు యువకుడు ఒక కత్తిని
తీసుకున్నాడు. చీకటి అలముకుంటూండగా ఇద్దరూ ఒక్కొక్క చెట్టుబోదెనూ పరిశీలనగా
చూస్తూ వెతక సాగారు. ఉన్నట్టుండి, ``మిత్రమా, అదిగో అటు చూడు! వెన్నెలకు
ఏదో మెరుస్తున్నది. బహుశా అదే మేకు కావచ్చు,'' అంటూ పరమానందుడు ఒక
చెట్టుకేసి చూపాడు.
మంత్రికొడుకు కత్తిని తీసుకుని ఆ చెట్టు వద్దకు వెళ్ళి, మెరుస్తూన్న
వస్తువు చుట్టూ చెక్కాడు. మేకు స్పష్టంగా కనపడసాగింది. అతడు దానిని
జాగ్రత్తగా బయటకు లాగాడు. బంగారు మేకు మునుపటిలాగే నిగనిగలాడుతూ
కనిపించింది. ``రా, రేపు ఉదయం రాజును దర్శించి ఈ మేకును అప్పగిద్దాం,''
అంటూ మంత్రికుమారుడు దానిని దుస్తులలో భద్రపరుచుకుని అక్కడి నుంచి
బయలుదేరాడు.
మరునాడు ఇద్దరు మిత్రులూ కలిసి రాజదర్శనానికి వెళ్ళారు. మంత్రి
కుమారుడు తెచ్చి ఇచ్చిన బంగారు మేకును చూడగానే రాజుగారి ఆనందానికి ఎల్లలు
లేకుండా పోయాయి. ఆ మేకును కనుగొనడంలో తనకు సాయపడిన పరమానందుణ్ణి గురించి
మంత్రి కొడుకు రాజుకు తెలియజేశాడు. రాజు యజ్ఞ గుండాన్ని రగిలించమని చెప్పి,
మంటలు రాగానే రాజు స్వయంగా బంగారు మేకును ఆతృతతో అగ్నిలోకి వేశాడు.
మంటలు ఆరే వరకు ఎలాంటి చలనమూ, మార్పూ కనిపించలేదు. మంటలు చల్లారి
బొగ్గులు, బూడిద మాత్రమే మిగిలాయి. అందరూ ఉత్కంఠతతో చూస్తూండగా
ఉన్నట్టుండి, బూడిదరాసి నుంచి మునుపటిలాగే రాకుమారి నీలమణి లేచి నిలబడింది.
చిరునవు్వతో ముందుకు సాచిన తండ్రి చేయిని పట్టుకుని బంగారు బొమ్మలా
వెలుపలికి వచ్చింది. మరుక్షణమే రాజు, మంత్రి కుమారుడితో తన కుమార్తె వివాహం
జరుగుతుందని ప్రకటించాడు. ఆ తరవాత ఆయన పరమానందుడి కేసి తిరిగి, ``నీకు
ఎలాంటి బహుమతి కావాలి మిత్రమా?'' అని అడిగాడు. అప్పుడు పరమానందుడు తను నీలం
రంగు పుష్పం కోసం వచ్చిన విషయం చెప్పాడు.
అంతా
విన్న రాజు, ``ఒక గుత్తు పుష్పాలెందుకు? ఒక చెట్టునే పెకలించుకుని వెళ్ళి,
మీ రాజుగారి ఉద్యానవనంలో నాటించు. యువరాణి ఆనందించి నిన్ను భర్తగా
స్వీకరిస్తుంది,'' అన్నాడు చిన్నగా నవు్వతూ. అదే విధంగా ఆ రాజ్యపు భటులు
వెంటరాగా, పరమానందుడు నీలంరంగు పువు్వల వృక్షంతో తిరుగు ప్రయాణమయ్యాడు.
రాజధానికి చేరి రాజునూ, రాజకుమారి మోతీరాణినీ సందర్శించి ఆ వృక్షాన్ని
వారికి అప్పగించాడు. రాజు దాన్ని తన ఉద్యానవనంలో నాటించడం చూసి రాకుమారి
పరమానందం చెందింది. రాజు తన కుమార్తెను పరమానందుడికిచ్చి వివాహం
జరిపించడానికి అంగీకరించాడు.
No comments:
Post a Comment