Pages

Monday, September 10, 2012

ఇంటిమీద ప్రేమ


అరవై ఐదేళ్ళ వయస్సులో మల్లమాంబ, భర్త పోవడంతో ఒంటరిదై పోయింది. కొంతకాలం బంధువులు వస్తూ పోతూ, సందడి చేయడంతో దిగులు అనిపించలేదు. కాని క్రమంగా బంధువులు రావడం తగ్గిపోయింది. పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న అల్లుడూ, కూతురూ కూడా రాకపోకలు తగ్గించారు. దానితో మల్లమాంబకు దిగులుపడడం అలవాటైంది. ఒక రోజు మధ్యాహ్నం మల్లమాంబ ఇంటి పనులు పూర్తి చేసుకుని, భోజనం చేసి, పెరట్లో వున్న రేగుచెట్టు కింద నులకమంచం, దాని మీద బొంత వేసుకుని కునుకు తీస్తూండగా, ఒక నెమలి చెట్టు మీద వాలబోయి, మల్లమాంబ మీద పడింది.
 
వెంటనే కళ్ళు తెరిచిన ఆవిడ, నెమలిని పరిశీలనగా చూసి, దాని కాలికి గాయమైందనీ, ఎవరో దాన్ని వేటాడడానికి ప్రయత్నించారనీ గ్రహించింది. నెమలిని ఇంట్లోకి తీసుకుపోయి, దాని గాయం మీద పసుపు వేసి కట్టు కడుతూండగా, బయటనుంచి పెద్దగా, ‘‘ఏవమ్మా ముసలమ్మా! ఇక్కడ చెట్టు మీద నెమలివాలింది. నువ్వేమైనా చూశావా?'' అంటూ ఒకడు కేకవేశాడు. ‘‘లేదు, నాయనా! అయినా, ఊళ్ళో నెమళ్ళు లేవుకదా? నీకు నెమలి కనబడడం ఏమిటి?''
 
అంటూ మల్లమాంబ ఆశ్చర్యం నటించింది. మారుపలక్కుండా వాడు వెళ్ళి పోయూడు. ఆ నాటినుంచీ మల్లమాంబ నెమలి కాలికి కట్టుకడుతూ, వేళకు ఆహారం పెడుతూ జాగ్రత్తగా చూడడంతో, అది క్రమంగా కోలుకుని, అప్పుడప్పుడూ పెరట్లో పురివిప్పి ఆడసాగింది. ఈ సంగతి ఆనోటా ఈనోటా విన్న ఆ ప్రాంతపు జమీందారు, ఒక నాడు మల్లమాంబ ఇంటికి వచ్చి, ‘‘ఏం, మల్లమాంబా! ఇన్నాళ్ళుగా నాకు పెంపకానికి నెమలి దొరికిందికాదు. నీ దగ్గర మంచి పెంపుడు నెమలి ఉన్నదని తెలిసింది.

దాన్ని నాకివ్వు. నీకు ఐదు బంగారు నాణేలు ఇస్తాను,'' అన్నాడు. జమీందారంతటి వాడు తన ఇంటికొచ్చాడని మల్లమాంబ ఏమీ తొణక్కుండా, ‘‘భలేవాడివయ్యూ, జమీందారూ! నువ్వనే ఆ నెమలికి నేను తల్లిని. అది లేకపోతే నేనుండ లేను; నేలేకపోతే అదుండలేదు, నిజం!'' అన్నది నెమలి తల నిమురుతూ. ‘‘అలాగా!'' అని అప్పటికి వెళ్ళిపోయిన జమీందారు, నాలుగు వారాల తర్వాత మళ్ళీ వచ్చి, ‘‘చూడు, మల్లమ్మవ్వా! నువ్వెప్పుడైనా బైట ఊరు వెళ్ళవలసివస్తే, అప్పుడు నెమలి ఆలనాపాలనా చూసేదెవరు?''
 
అని అడిగాడు. మల్లమాంబ ఒక్క క్షణం ఆలోచించి, ‘‘ఆ మాటా నిజమే, జమీందారు బాబూ! అందరిలాగే నాకూ ఏదైనా ఊరు వెళ్ళి రావాలనిపిస్తుంది కాని, అయిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా పట్టుమని పదిరోజులుండేందుకు మనసొప్పదు. ఇక్కడ నెమలితో కాలక్షేపం బాగానే జరిగిపోతున్నది,'' అన్నది. ఆ మాటలతో జమీందారుకు ముసలావిడ మీద జాలికలిగి, ‘‘నా మాట విను! నిన్నూ, నీ నెమలినీ మా ఇంటికి తీసుకువెళతాను. అక్కడ నీకెలాంటి ఇబ్బందీ వుండదు.
 
నీకు ఎన్ని రోజులుండాలనిపిస్తే అన్ని రోజులుండు,'' అన్నాడు. జమీందారు అలా అనగానే మల్లమాంబకు చాలా ఉత్సాహం కలిగింది. జమీందారుతో వాళ్ళ ఊరుకు వెళ్ళి, వారి భవంతిని, అక్కడి మనుషుల్ని చూస్తూ కొంతకాలం హాయిగా గడపాలనుకున్నది. ఐతే, అదే సమయంలో ఆవిడకు తన అందమైన రెల్లుగడ్డి ఇల్లూ, దాని చుట్టూ మట్టి ప్రహరీ గోడ, ఊరి చివర రెండెకరాల పొలం, మొత్తంగా తనున్న ఊరంతా ఒకసారి గుర్తుకు వచ్చి, దిగులు వేసింది. అది గమనించిన జమీందారు, ‘‘మల్లమ్మవ్వా!
 
నువ్వెలాంటి సంకోచాలూ పెట్టుకోకు. మా ఇంటినీ, నెమలినీ చూసుకుంటూ పెద్ద దిక్కుగావుందువుగాని. ఇక్కడ నీ ఇంటిని జాగ్రత్తగా చూస్తూండమని గ్రామాధికారికి చెబుతాను. నీ పొలం నుంచి ధాన్యం, ఆదాయం ఏది కావాలంటే అది, నీకు తెచ్చియిచ్చే ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు. ‘‘సంతోషమే, బాబూ! కానీ....'' అంటూ ఆగింది మల్లమాంబ. ‘‘ఏదో ఆలోచిస్తున్నావు. మొహమాటపడకుండా చెప్పు, '' అన్నాడు జమీందారు.

‘‘ఒక సంగతి, బాబూ! రోజూ మధ్యాహ్నం అన్నం తిని రేగుచెట్టు కింద నులక మంచం వేసుకుని పడుకుంటే, చెట్టు ఆకులు గలగల శబ్దం చేస్తూ నన్ను జోకొడుతుంటవి. ఈ ఇల్లొదిలితే, ఇక ఆ శబ్దం వినబడదుకదా!'' అన్నది దీనంగా. జమీందారు కొద్దిసేపు మౌనంగా వూరుకుని, ‘‘సరే, నువ్వంతగా ప్రేమించే ఇంటినీ, నెమలినీ వదిలి రావద్దు. నీ ఇంటి పరిసరాలు మరింత పచ్చదనంతో కలకలలాడడానికి, నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. నెమలిని చూడాలనుకున్నప్పుడు, నేనే వచ్చి చూసి వెళతాను.
 
నీ ఇంటి మీది ప్రేమ, నెమలి మీద దయ చాలా గొప్పవి!'' అని చెప్పి వెళ్ళి పోయి, అన్న మాట ప్రకారం ఇంటి పరిసరాలను సుందర వనంలా తీర్చిదిద్దాడు. ఒక నెల గడిచింది. ఒక నాటి ఉదయం మల్లమాంబ పళ్ళెంలో అరముగ్గిన జామపండూ, గింజలూ వేసి నెమలి ముందు పెట్టి, ఇంట్లోకి వెళ్ళేందుకు నాలుగడుగులు వేసే సరికి, వెనకనుంచి, ‘‘అమ్మా! ఇక ఈ తిండి తినలేను. అన్నం, ఏదైనా కూరా పెట్టు!'' అన్న మాటలు వినిపించినై.
 
మల్లమాంబ చప్పున వెనుదిరిగి చూసే సరికి, ఒక పదేళ్ళ కురవ్రాడు నవ్వుతూ కనిపించాడు. ఆమెకు ఆశ్చర్యంతో పాటు పట్టరాని కోపం వచ్చి, ‘‘ఒరే, నెమలెక్కడ? ఏం చేశావు? అది నా పెంపుడు బిడ్డ,'' అని చుట్టూ కలయచూడ సాగింది. ఈసారి కురవ్రాడు పెద్దగా నవ్వుతూ, ‘‘అమ్మా, ఆ పెంపుడు బిడ్డను నేనే! భూతదయగల ప్రేమమూర్తివైన నీ ఆదరంతో ముని శాపం నుంచి విముక్తి కలిగింది. ఇదుగో, ఆ రోజు నా గాయూనికి కట్టు కట్టావే - అది మానిన మచ్చ!'' అంటూ కాలిమీది మచ్చను మల్లమాంబకు చూపించాడు.
 
కాలి మీది మచ్చ, ముని శాపం అన్న మాటలు వింటూనే మల్లమాంబకు, కురవ్రాడు చెప్పేదాంట్లో నిజం వున్నట్టుతోచింది. ఆమె, వాణ్ణి దగ్గరకు తీసుకుంటూ, ‘‘ఏరా, నెమలి బాబూ! మునులు శాపాలివ్వగలరు, వరాలివ్వగలరని, చిన్నప్పుడు మా ముత్తవ్వ చెప్పగా విన్నాను. ఇంతకీ ఆ ముని నీకెందుకు శాపం ఇచ్చాడు?'' అని అడిగింది. ‘‘అదంతా పెద్ద కథ, అమ్మా! ఆకలిగా వుంది. నాలుగు మాటల్లో చెబుతాను. నా తల్లిదండ్రులెవరో నేనెరగను. ఊహ తెలిసినప్పటి నుంచీ రామభూపాలయ్యఅనే రైతు ఇంట పెరిగాను.

ఊళ్ళో వున్న మరి కొందరు కురవ్రాళ్ళతో కలిసి యజమాని పశువుల్ని దగ్గర్లో వున్న అడవి ప్రాంతాన మేపేవాడిని. అక్కడి చెట్ల మీద ఎన్నో రకాల పక్షులుండేవి. వాటిలో నెమళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఒక దాన్ని పట్టుకుపోయి పెంచుకోవాలనుకుని ఉచ్చులూ అవీ వేసి ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఒక్కటీ పట్టు బడలేదు. దానితో విసిగి వాటి మీద రాళ్ళు విసర సాగాను. అలా విసిరిన రాళ్ళల్లో ఒకటి, ఆ దాపుల తపస్సు చేసుకుంటున్న ఒక మునికి తగిలింది.
 
ఆయన కోపించి, నన్ను నెమలివై పొమ్మని శపించి - అన్ని జీవులపట్లా ప్రేమాదరాలున్నవాళ్ళ సాయంతో, ఏ నాడో ఒకనాడు తిరిగి మనిషివి కాగలవని శాపవిముక్తి చెప్పాడు. అమ్మా, ఆ శాపవిముక్తి నీవల్ల కలిగింది!'' అన్నాడు కురవ్రాడు. అంతా విని పరమానందం చెందిన మల్లమాంబ, వాడికి అప్పటికప్పుడు భోజనం పెట్టి, ‘‘ఒరే, నెమలిబాబూ! ఈ ప్రాంతాల్లోవున్న జమీందారుకు నెమళ్ళంటే చాలా ఇష్టం.
 
యన నిన్నే ఎత్తుకుపోయి పెంచుకోవాలనుకున్నాడు. ఆయన చలవవల్లే మన ఇంటి చుట్టూ చక్కని చెట్టూ చేమా పెరుగుతున్నవి. ఆయనకేమైనా సాయం చేయగలవా?'' అని అడిగింది. కురవ్రాడు కొద్దిసేపు ఆలోచించి, ‘‘నేను కొంత కాలం నెమలిగా వాటి మధ్య తిరిగిన వాణ్ణి. వాటిలో కొన్నిటిని మన ఇంటి చుట్టూ వున్న చెట్ల మీదికి వచ్చేలా చేయవచ్చు,'' అన్నాడు. ‘‘అలాంటి ప్రయత్నం చెయ్యరా బాబూ! జమీందారు చాలా సంతోషిస్తాడు,'' అన్నది మల్లమాంబ.
 
కురవ్రాడు ఇంటి పెరటిలోకి వెళ్ళి, నెమలిలా కేంకరించాడు. కొంత సేపటికి ఉత్తర దిశనుంచి రెండు నెమళ్ళు ఎగురుతూ వచ్చి, అక్కడి చెట్లపై వాలాయి. కొన్నాళ్ళకు మల్లమాంబ ఇంటి ఆవరణం పచ్చటి చెట్టు చేమలతో పాటు పక్షులూ, జంతువులతో జీవకళ తొణికిసలాడే ఉద్యానవనంలా తయూరయింది.

No comments:

Post a Comment