పేరుమోసిన వడ్రంగి పీయారాంఆచారి ఒక్కగానొక్క కొడుకు సీతారాం. వాడు
చాలా తెలివైన కురవ్రాడు. తండ్రి పనిచేయడం వాడు ఎంతో ఆసక్తితో గమనించేవాడు.
తన బిడ్డ బాగా చదువుకుని, గొప్ప పండితుడు కావాలన్నది పీయారాం ఆశ. అయితే,
సీతారాం బడికి వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉంటూ తండ్రి చేసే అందమైన బొమ్మలు,
కుర్చీలు, మంచాలు, తలుపులు, కిటికీలు మొదలైనవాటిని పరిశీలనగా చూస్తూ
గడపడానికే ఇష్టపడేవాడు.
పీయారాం తయారుచేసే వస్తువులకు మంచి గిరాకీ ఉండేది. వాటిని అమ్మగా
వచ్చిన డబ్బుతో ముగ్గురే వున్న పరిమిత కుటుంబాన్ని ఒకరకంగా నెట్టుకు
రాసాగాడు. అందువల్ల పీయారాం, అతని భార్య పిల్లవాణ్ణి గురించి పెద్దగా
పట్టించుకోలేదు. తండ్రి పనిచేసే చోటు నుంచి కొంచెం సేపు ఎటైనా వెళితే చాలు,
సీతారాం ఉలి, సుత్తిలాంటి పనిముట్లను తీసుకుని అక్కడ పడివున్న
కొయ్యముక్కలతో బొమ్మలు చెక్కడానికీ, వస్తువులు తయారు చేయడానికీ
ప్రయత్నించేవాడు. అలాగే వాడు పెరిగి యౌవనంలో అడుగుపెట్టాడు.
ఇలా
వుండగా పీయారాంకు హఠాత్తుగా జబ్బు చేసి మరణించాడు. కుటుంబంలో పెద్ద దిక్కు
లేకపోయింది. ఇంటి నుంచి వడ్రంగం పనులు చేసే శబ్దం నిలిచి పోయింది. ఆదాయం
లేక పోవడంతో పూట గడవడమే దుర్భరమై పోయింది. మూడో రోజు ఉదయం కొడుకును
నిద్రలేపిన తల్లి, ``మనం, ఇకపై ఎలా బతకడం?'' అని అడిగింది. సీతారాం లేచి
కూర్చుంటూ, ``నేను మా నాన్నలాగే వడ్రంగం పనిచేసి డబ్బులు సంపాయిస్తాను,
విచారపడకమ్మా,'' అన్నాడు. ``మంచిదే. కాని నువు్వ వడ్రంగం నేర్చుకోలేదే,''
అన్నది తల్లి. ``మానాన్న అన్నేసి రకాల వస్తువులు చేస్తూంటే అన్నాళు్ళ
చూస్తూ వచ్చాను కదా? ప్రయత్నిస్తే వాటిలో కొన్నింటినైనా
చేయగలననుకుంటున్నాను,'' అన్నాడు సీతారాం ఎంతో ఆత్మవిశ్వాసంతో.
ఆరోజు నుంచే అతడు పీటలు, తలుపులు, కిటికీలు చేయడం మొదలు పెట్టాడు.
ఇంటి నుంచి మళ్ళీ కొయ్యపనిచేసే శబ్దాలు వినిపించడం ఆరంభమయింది. అటుగా వచ్చే
పోయేవాళు్ళ ఆ శబ్దాలు విని తమకు కావలసిన వస్తువులను సీతారాంతో చెప్పి
చేయించుకోసాగారు.
అతని పనితనం చూసి అబ్బురపడసాగారు. అతడు తయారు చేసే వస్తువులను అమ్మగా
వచ్చే డబ్బుతో తల్లీకొడుకులు తిండికీ, బట్టకూ కష్టంలేకుండా రోజులు
గడపసాగారు. ఊళ్ళో వాళు్ళ చెప్పే వస్తువులను తయారు చేయడానికి పోను,
సీతారాంకు చాలా తీరిక ఉండేది. అలాంటి సమయాల్లో అతడు ఒక కొత్తరకం పందిరిమంచం
తయారుచేయడానికి ఆలోచించడం ప్రారంభించాడు. అతని మనసులో కొన్ని అద్భుతమైన
ఆలోచనలు తోచాయి.
దాన్ని మామూలు పందిరిమంచంలా తయారు చేయకూడదు. పందిరిమంచానికి నాలుగు
వైపులా తెరలు వేలాడదీయడానికి నాలుగు స్తంభాలను ఉంచకుండా సైనికుల్లా
కనిపించే మానవరూపాలను చెక్కి నిలబెట్టాలనుకున్నాడు. అలాంటి మంచాన్ని
రాజువంటి గొప్పవాళు్ళ తప్పక ఇష్టపడతారు. ఇలా ఆలో చించిందే తడవుగా ఆ
మంచాన్ని తయారు చేయడంలో నిమగ్నుడయ్యాడు. కొన్నాళ్ళకు అతడు అనుకున్న రీతిలో
అద్భుతమైన మంచం తయారయింది.
తన మిత్రులకూ, పరిచయస్థులకూ దానిని చూపుతూ, ``ఈ మంచం మీద పడుకునే
వ్యక్తి చాలా అదృష్టవంతుడు!'' అని చెప్పసాగాడు. ఆ మాట ఈనోట ఆనోట పడి రాజు
పరేష్‌నాథుడి వరకు వెళ్ళింది. రాజోద్యోగులలో ఒకడు, రాజుకు దానిని గురించి
చెప్పి, ``ఆ మంచం మీద పడుకుని నిద్రించేవారిని నాలుగు వైపులనున్న నలుగురు
సైనిక భటులు కాపలాకాస్తారు, ప్రభూ!'' అన్నాడు. ఆ సమయంలోనే రాజు రకరకాల
సమస్యలతో సతమతమవుతున్నాడు.
ఒకసారి ఏదో రాక్షసి తనను చంపుతున్నట్టు రాజుకు కలవచ్చింది.
అప్పటినుంచి ఆయనకు సరిగా నిద్రపట్టడం లేదు. మరో మూడు రోజుల తరవాత ఆస్థాన
జ్యోతిష్కుడు వచ్చి, రాజగృహంలోకి కాలసర్పం జొరబడింది; రాజుకు సర్పగండం
ఉందని చెప్పి వెళ్ళాడు. తమ రాజ్యం మీదికి దండెత్తడానికి పొరుగురాజు
ఆయత్తమవుతున్నట్టు గూఢచారులు వార్తను తీసుకువచ్చారు. ఒకనాటి అపరాత్రి
సమయంలో, ఖజానా సమీపంలో కొందరు దొంగలు తచ్చాడుతూ ఉండడం కాపలా భటులు
గమనించారు.
ఒక్కసారిగా ఇన్ని సమస్యలు వచ్చి పడడంతో రాజుకు మనశ్శాంతి కరువయింది.
మంత్రిని సంప్రదించాడు. ``నాలుగు వైపులా కొయ్య సైనిక భటులున్న ఆ మంచం నాకు
కొంత మనశ్శాంతి కలిగించగలదని ఆశిస్తున్నాను.
ువు్వ సీతారాంను రహస్యంగా కలుసుకుని దాని ధర ఎంతో తెలుసుకుని రా,''
అని చెప్పి మంత్రిని పంపాడు. మంత్రి తన వద్దకు రాగానే, సీతారాం ఆశ్చర్య
పోయాడు. తాను ఆ మంచాన్ని అమ్మననీ, రాజుకు కానుకగా ఇస్తాననీ; దానిని
ఉపయోగించాక కావాలంటే రాజు తనకు ఏదైనా పారితోషికంగా ఇవ్వవచ్చుననీ చెప్పాడు.
అయినా, రాజుగారికి ఆ మంచంతో వున్న అవసరం గురించి మంత్రి అతనితో చెప్పలేదు.
మంత్రి ఆ మంచం రాత్రికే రాజభవనానికి చేరే ఏర్పాట్లు చేశాడు. ఆ
మంచాన్నీ, నాలుగు వైపులా అందంగా చెక్కబడిన భటుల బొమ్మలనూ చూసి రాజు పరమానంద
భరితుడయ్యాడు. రాజు దాని మీద సక్రమంగా పడుకునేంతవరకు మంత్రి శయనమందిరంలోనే
ఉండి వెళ్ళాడు. రాజుకు త్వరలోనే సుఖంగా నిద్రపట్టింది. అర్ధరాత్రి సమయంలో,
నాలుగు భటుల బొమ్మలలో ఒక దానికి ప్రాణం వచ్చింది.
ఆ భటుడు రాజుగారి శయన మందిరంలోకి జొరబడుతూన్న రాక్షసిని చూశాడు.
వెంటనే దాన్ని వెలుపలికి లాక్కుపోయి కత్తి దూసి హతమార్చాడు. ఆ తరవాత తన
యధాస్థానాన్ని చేరుకుని తాను చేసిన సాహస కృత్యాన్ని మిగిలిన ముగ్గురికీ
తెలియజేశాడు. ఆ సమయంలో రాజుకు మెలకువ వచ్చి ఆ భటుడి మాటలు విని అలాగే
పడుకున్నాడు.
తెల్లవారాక భవనానికి వెలుపల రాక్షసి శవం పడివున్నట్టు రాజుగారికి
సమాచారం అందింది. ఆ రాక్షసిని ఎవరు ఎప్పుడు ఎలా హతమార్చారన్న సంగతి రాజుకు
తప్ప మరెవ్వరికీ తెలియదు. అతడు మంత్రిని పిలిపించి రాత్రి జరిగిన సంగతి
వివరించాడు. ఒక సంచీ నిండుగా బంగారు నాణాలు ఇచ్చి సీతారాంకు అందజేయమన్నాడు.
కొన్నిరోజులు గడిచాయి. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో మరొక బొమ్మభటుడు సజీవుడై
కాపలా కాస్తున్నప్పుడు పాము బుసకొట్టడం విన్నాడు.
రాజు
మంచం కేసి వస్తూన్న భయంకరమైన సర్పాన్ని చూడగానే, దాని తోకపట్టుకుని చరచరా
భవనం వెలుపలికి లాక్కుపోయి చంపి విసిరి కొట్టాడు. అతడు తిరిగివచ్చి తాను
చేసిన పనిని మిగిలిన భటులకు వివరిస్తూండగా రాజు నిద్రనటిస్తూ ఆ మాటలు
విన్నాడు. తెల్లవారాక రాజును చూడవచ్చిన మంత్రి, రాజభవనం ద్వారానికి అవతల ఒక
చచ్చిన పాము పడివుందని కాపలాభటులు చెప్పిన విషయం తెలియజేశాడు. ఆరోజు
మధ్యాహ్నం రాజు, ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు. అతడు ఏవో లెక్కలు
గణించి, రాజుగారికి సర్పగండం తొలగిపోయిందనీ, ఇన్నాళు్ళ రాజభవనంలో
దాక్కునివున్న సర్పం ప్రస్తుతం అక్కడ లేదనీ చెప్పాడు.
ఆ తరవాతే రాజు అతడికి రాజభవన ద్వారం వద్ద పడివున్న చచ్చిన పామును
గురించి చెప్పాడు. రాజు మంత్రి ద్వారా సీతారాంకు మరో సంచీ నిండుగా బంగారు
నాణాలు పంపాడు. మరికొన్ని రోజుల తరవాత మూడవ మంచం భటుడు ప్రాణాలతో లేచి శయన
మందిరాన్ని వదిలి వెలుపలికి వచ్చాడు. రాజుగారి ఖజానా సమీపంలో ఏవో వింత
ధ్వనులు రావడం గమనించాడు. దగ్గరకి వెళ్ళి చూస్తే ఇద్దరు దొంగలు ఖజానా
తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నించడం కనిపించింది.
భటుడు వాళ్ళను ఒడుపుగా పట్టుకుని కాళు్ళచేతులు బంధించి కిందపడతోశాడు.
భటుడు రాజుగారి శయన గృహానికి తిరిగి వచ్చి, ఖజానా దొంగతనాన్ని తాను ఎలా
అడ్డుకున్నదీ మిగిలిన ముగ్గురు భటులకు వివరించాడు. రాజువాళ్ళ సంభాషణ విని
శయన గృహం నుంచి వెలుపలికి వచ్చి భటులను పిలిచి ఖజానా వద్దకు వెళ్ళి
చూడమన్నాడు. భటులు వెళ్ళి, తిరిగి వచ్చి అక్కడ ఇద్దరు దొంగలు కాళు్ళచేతులు
బంధించబడి ఉన్నారని చెప్పారు. రాజు దొంగలకు కారాగార శిక్ష విధించాడు.
తెల్లవారాక మంత్రి తనను చూడడానికి వచ్చినప్పుడు మంచం భటుడు ఖజానా
దొంగతనాన్ని అడ్డుకున్న వైనం గురించి రాజు ఆయనకు వివరించి, సీతారాంకు మరొక
సంచీ నాణాలు పంపాడు. పొరుగురాజు తమ రాజ్యం మీద దాడి చేయగలడన్న వదంతులు
ఎక్కువయ్యాయి. పొరుగు రాజ్యం సైనికులు మారువేషాల్లో రాజ్యంలో
ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని గూఢచారులు
తీసుకువచ్చారు. అవన్నీ రాజుకు విచారం కలిగించినప్పటికీ తన మంచం మీది భటులు ఈ
సమస్యకు కూడా ఏదైనా పరిష్కారం చూపి సాయపడగలరన్న ఆశ ఆయనలో చిగురించింది.
అందువల్ల రాజ్య రక్షణ గురించి అంతగా దిగులుపడకుండా హాయిగా
నిద్రపోసాగాడు. ఒకనాటి రాత్రి ఏమి జరుగుతున్నదీ రాజుకు తెలియదు. మంచం మీది
నాలుగవ భటుడు ప్రాణాలతో లేచి, శయనగృహం నుంచి వెలుపలికి వచ్చి, మంత్రి భవనం
కేసి నడిచాడు. అనుమానాస్పద స్థితిలో అక్కడ ఒక వ్యక్తి తచ్చాడుతూ ఉండడం
చూశాడు. అతడు పొరుగు దేశపు గూఢచారి.
మంత్రిని హతమార్చినట్టయితే, రాజ్యం అల్లకల్లోలమవుతుంది. ఆ సమయంలో
దండెత్తి వచ్చినట్టయితే, సులభంగా జయించవచ్చన్న పథకంతో పొరుగురాజు ఆ
గూఢచారిని పంపాడు. మంచం భటుడు ఆ గూఢచారిని సమీపించడంతో గొడవ ఆరంభమయింది.
ఒకరినొకరు కొట్టుకుంటూ పెనుగులాడసాగారు. ఆ శబ్దం విని మంత్రి లేచి
వెలుపలికి వచ్చాడు.
మంత్రి అంగరక్షకులు వారిని విడదీశారు. అక్కడి భటుడు తమ సైన్యంలోని
వాడుకాడని గ్రహించి, మంత్రి ఆశ్చర్యపోయాడు. అతడు రాజుగారి శయనగృహం మంచం
మీది కొయ్య భటుడి పోలికతో కనిపించడంతో, ``నువు్వ....'' అని మంత్రి
అర్థోక్తిగా ఆగాడు. ``అవును నేను పందిరి మంచం సైనిక భటులలో ఒకణ్ణి.
పట్టుబడ్డ వీడు శత్రుదేశపు గూఢచారి. మిమ్మల్ని హతమార్చడానికి వచ్చాడు. నేను
నా స్థానానికి తిరిగి వెళతాను. మేము సదా సర్వ వేళలా రాజుగారి సేవకు
సంసిద్ధులమై ఉన్నాం,'' అంటూ వెనుదిరిగి భటుడు మాయమై పోయాడు.
గూఢచారిని కారాగారంలో వేయమని ఆజ్ఞాపించి, మంత్రి రాజును చూడడానికి
హుటా హుటిగా బయలుదేరాడు. మంత్రి చెప్పినదంతా విన్న రాజు, ``మంచం మీది సైనిక
భటులు మన ఇద్దరి ప్రాణాలూ కాపాడారు. మన ఖజానాను రక్షించారు. పొరుగు రాజ్యం
దాడి నుంచి మన రాజ్యాన్ని కూడా కాపాడారు. అలాంటి వారి సాయం వుంటే మన
కెలాంటి ప్రమాదమూ రాదు. కావాలంటే మనమే పొరుగు రాజ్యాల మీదికి దండెత్తవచ్చు.
అయినా, అంతకు ముందు ఆ మంచాన్ని తయారు చేసిన వడ్రంగిని నేను చూడాలి,''
అన్నాడు.
మంత్రి
సీతారాంను పిలిపించాడు. రాజు సంతోషంగా అతన్ని కౌగిలించుకుని సభికులకు అతడు
తయారుచేసిన మంచం గురించి వివరించి, ``నేను ఇతన్ని మన ఆస్థాన వడ్రంగిగా
నియమిస్తున్నాను, ఇకపై ఇతడు సీతారామాచారిగా పిలవబడతాడు,'' అన్నాడు. ఆ మాటకు
సభికులు అమితోత్సాహంతో హర్షధ్వానాలు చేశారు. విలువైన కానుకలతో, భటుల
రక్షణతో ఇంటికి వచ్చిన సీతారామాచారిని చూసిన తల్లి ఆనందానికి అవధులు
లేకుండా పోయాయి. ``అంటే, నువు్వ ఇప్పుడు ఆచారివయ్యావన్న మాట!'' అన్నది
ఆనందబాష్పాలతో.
No comments:
Post a Comment