Pages

Monday, September 10, 2012

మర్యాదయిన పద్ధతి


కువలయ్య భార్య పేరు ఏదైనా, అందరూ ఆమెను కువలమ్మ అనే అంటారు. ఎందుకంటే, ఆవిడ కూడా భర్తలాగే మహాపిసినారి. ఈ దంపతులకు పొరుగున రామయ్య, రామమ్మ ఉంటున్నారు. వీళ్ళ పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం. రామయ్య, రామమ్మ కూడా జాలిగుండె కలవాళు్ళ. కువలయ్యది వడ్డీవ్యాపారం. వచ్చిన డబ్బు వెనకవేయడమే తప్ప ఖర్చు పెట్టడమంటూ వుండదు.
 
వాళ్ళ దొడ్లో పళ్ళచెట్లున్నవి. ఆ పళ్ళల్లో ఒక్కగా నొక్కటైనా ఇరుగు, పొరుగులకు ఇవ్వకుండా తినేస్తూంటారు కువ లయ్య దంపతులు. ఇంట్లో వంట చేయడమంటూ ఎప్పుడోగాని జరగదు. ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తిని వస్తూంటారు. ఒక రోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూండగా చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద పడి, పొరుగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కళ్ళబడింది.
 
అది చూసి కువలయ్య మనసు పాడైపోయింది. భార్యను పిలిచి, జరిగింది చెప్పాడు. వెంటనే గోడ దూకి పోయి పండు తెమ్మన్నది భార్య. కువలయ్య గోడ దూకాడు. అప్పుడే అతడికి సపోటాపండుతోపాటు కొద్దిగా తెరిచి వున్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనబడ్డాయి. వాళ్ళింకా నిద్ర పోలేదేమో పలకరించుదామని గుమ్మం దాకా వెళ్ళాడు కువలయ్య. అయితే, వంటింట్లో ఎవరూ లేరు. కానీ, వంటకాల వాసనలు ఘుమఘుమలాడుతున్నాయి. కువలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి, అన్నీ చూశాడు. అతడికి నోరూరింది.

వంటకాలన్నీ పంచెలో మూట కట్టి, సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు. జరిగింది విని భార్య, అతడు చేసిన పనిని మెచ్చుకున్నది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందుభోజనం చేశారు. మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమో అని, కువలయ్య దంపతులు ఎదురుచూశారు. కాని, అలాంటిదేం జరగలేదు. ``బొత్తిగా లక్ష్యం లేని మనుషులు! అన్ని వంటకాలు పోతే, పట్టనట్టూరుకుంటారా?'' అన్నాడు కువలయ్య. ``ఇలాంటి వాళ్ళ కొంపలోంచి, రోజూ అన్నం ఎత్తుకువచ్చినా ఫరవాలేదు,'' అన్నది కువలమ్మ. అంతే! ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు.
 
ఈ రోజు వంటింటి తలుపు వేసి వున్నది. కువలయ్య కాస్త తోసి చూస్తే, గడి దానంతటదే విడిపోయింది. కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మూడవ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా, అతడికి అక్కడ వంటకాలే కాక, రెండు పీటలు వేసి వుండడం కనబడింది. వాటి ముందు రెండు విస్తళు్ళ పరిచివున్నాయి. తన సంగతి రామయ్యకు తెలిసి పోయిందా అని, కువలయ్య అనుమానించాడు.
 
చూద్దాం, ఏమైతే అదవుతుందని అతడు వంటకాలను విస్తళ్ళలోకి సర్దుకుని తీసుకుపోయాడు. మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం గుమిగూడారు. విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య అక్కడికి వెళ్ళాడు. రామయ్య అక్కడ చేరినవాళ్ళతో, ``మా ఇంటికి రోజూ భగవంతుడు వచ్చి, భోంచేసి వెళుతున్నాడు. మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే, వాటిని దేవుడు తినేశాడు. నేను కుక్క తినేసిందనుకున్నాను. అయినా, విషయం తెలుసుకుందామని, రెండో రోజు కూడా వంటకాలెక్కువ వండాం.
 
వంటింటి తలుపు వేసేశాం. అయినా, వంటకాలు మాయమయ్యాయి! ఇది కుక్క పనో, దేవుడి పనో తెలుసుకుందామని, మూడో రోజు విస్తళు్ళ కూడా వేశాం. ఈసారి విస్తళ్ళతో సహా వంటకాలు మాయమయ్యాయి. అంటే, ఇది తప్పకుండా దేవుడి పనే అయుండాలి కదా?'' అన్నాడు. జనం అంతా అవునన్నారు.

ఈ వింత చూడ్డానికి రోజూ రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవ సాగారు. వారం రోజులు గడిచినా దేవుడు ఆ చాయల కేసి రాలేదు. ``దేవుడు ఇంతమంది కళ్ళెదుటికి వస్తాడా? రహస్యంగా చూడాలిగానీ,'' అన్నాడు రామయ్య. ఆ రోజు నుంచీ జనం రహస్యంగా చూడడం మొదలుపెట్టారు.
 
పాపం, కువలయ్యకిది చాలా ఇబ్బంది అనిపించింది. రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి, దేవుడొచ్చి తిని పోతున్నాడనుకున్నాడు. అంతవరకూ బాగానే వుంది! కానీ, మధ్య ఇదేమిటి? జనమంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి? దేవుడొస్తాడని, ఏ వెధవ ఎక్కణ్ణుంచి రహస్యంగా వంటగది కేసి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది? ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి, రామమ్మ దగ్గిరకు పంపాడు.
 
ఆమె రామమ్మతో, ``ఏమమ్మా, వదినా! రోజూ దేవుడొచ్చి మీ ఇంట్లో తిని పోతూంటే, ఆ సంగతి ఊరంతాడప్పు కొట్టించాడు అన్నయ్య. ఇప్పుడు చూడుమరి, దేవుడూ రావడం మానేశాడు. అటు అన్నయ్యకూ వెర్రిబాగులవాడన్న పేరు వచ్చింది,'' అన్నది. ``ఆయనేమీ అంత వెర్రిబాగులవాడు కాదమ్మా, ఆయనది జాలిగుండె, అంతే!'' అన్నది రామమ్మ శాంతంగా. ``అంటే?'' అన్నది కువలమ్మ ఆశ్చర్యపోతూ. ``వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదనీ, మనిషేననీ ఆయనకు తెలుసు. కాని, అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయివున్నాడో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి వాడు గర్భదరిద్రుడై వుంటాడు! అన్నార్తుడికి అన్నం పెడితే, అది దేవుడికి పెట్టినట్టే అని, ఆయన అంటూంటారు. అందుకే మేం చక్కగా విస్తరి కూడా వేసి, వాడు తిండి తిని పోయే ఏర్పాటు చేశాం,'' అన్నది రామమ్మ. ``మీ ఆయన జాలిగుండె సంగతి బాగానే వున్నది. వంట ఇంటికొచ్చి తిని పోతున్న వాడు గర్భదరిద్రుడు కాక, ఉన్నవాడేనేమో అన్న ఆలోచన మీక్కలగ లేదా?'' అని అడిగింది కువలమ్మ.
 
ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే, ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కువలమ్మ ఆశ. ``ఉన్నవాడైతే, అలా దొంగచాటుగా వచ్చి తిని పోవడం ఎంత సిగ్గుమాలిన పని! తను చేస్తున్న, ఈ సిగ్గుమాలిన పని బయట పడితే, వాడెంత అవమానం పాలయిపోతాడు. వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టంలేదు. ఆయనది జాలిగుండె అని చెప్పాగదా? అందుకే దేవుడి పేరు చెబుతున్నాడు,'' అన్నది రామమ్మ. ``అలాంటప్పుడు, ఈ ప్రచారమంతా ఎందుకు? చాటుగా తినిపోయే వాడు, ఈ ప్రచారం వల్లనే గదా రావడం మానేశాడు.
 
మీ ఇంటి దొడ్డిని దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో, ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తూండవచ్చునన్న భయంతో, వాడు రావడం మానేసి వుంటాడు మరి!'' అన్నది కువలమ్మ. ``అదే కువలమ్మా మాక్కావలసింది! మేమే వంటింట్లో పొంచి వుండి వాడెవడో తెలుసుకోవచ్చు. కాని, వాడు మాకు స్నేహితుడో, ఏ పొరుగింటివాడో అయుంటే, ఎదటపడి మందలించి, వాణ్ణి అవమానపర్చలేం గదా? రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మానిపించడానికి, మర్యాద అయిన పద్ధతిని ఎన్నుకున్నాం. ఏమంటావు?'' అన్నది రామమ్మ.
 
రామయ్య దంపతులకు తమను గురించి తెలిసిపోయిందనీ, తమ దురలవాటు మాన్పించడానికి మర్యాద అయిన పద్ధతి అనుసరించారనీ కువలమ్మకు అర్థమై పోయింది. ఆమె ఇంటికి వెళ్ళి జరిగింది భర్తకు చెప్పింది. ఆ రోజు నుంచీ కువలయ్య దంపతుల పిసినిగొట్టుతనం క్రమంగా తగ్గసాగింది.

No comments:

Post a Comment