ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మడొకడు ఉండేవాడు. అతడు చదువుకోలేదు.
ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయడానికి తగిన పని దొరకలేదు. అందువల్ల
చేసేదిలేక రోజూ ఇంటిం టికీ వెళ్ళి బిచ్చ మెత్తగా వచ్చిన బియ్యూన్ని,
పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండిపెడితే, భార్యా భర్తలూ, నలుగురు పిల్లలూ
తలా కొంచెం తినేవారు. ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది, పిల్లలకు మాత్రమే
సరిపోయేది. అలాంటప్పుడు ఆలూ మగలు ఆకలితోనే పడుకునేవారు.
బిచ్చమెత్తిన దానితో కుటుంబమంతా ఎప్పుడు గాని కడుపు నిండా తిన్న పాపాన
పోలేదు. ఆ సంగతి తెలిసినా, మరో మార్గం కనిపించక బ్రాహ్మడు బాధపడుతూ అలాగే
కాలం గడపసాగాడు. ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య, ‘‘నువ్వు తెచ్చేది ఒక్క
పూటగడవడానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం
ఆలోచించక తప్పదు,'' అన్నది. ‘‘ఆ సంగతి నాకూ తెలుసు లక్ష్మీ. మరో మార్గం
కనిపించడం లేదు.
నన్నేం చెయ్య మంటావో నువ్వే చెప్పు,'' అన్నాడు బ్రాహ్మడు నిస్పృహతో
తలపట్టుకుంటూ. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించింది. ‘‘మన రాజుగారు
దయూస్వభావుడని విన్నాను. నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే, సాయపడగలడను
కుంటాను,'' అన్నది. ‘‘సరే అలాగే వెళతాను. ఆయన నాకేదైనా దానంగా
ఇచ్చినప్పుడు, ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే!'' అన్నాడు బ్రాహ్మడు అను
మానంగా.
‘‘అదేం
పెద్ద సమస్యకాదు. ఆ సమ యంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు,'' అన్నది
లక్ష్మి ఎంతో నమ్మకంతో. మరునాడు తెల్లవారగానే బ్రాహ్మడు రాజ దర్శనానికి
బయలుదేరాడు. రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకు
వెళ్ళారు. అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి విన్నవించాడు. అంతా
విన్న రాజు, ‘‘నీకేంకావాలో చెప్పు,'' అన్నాడు. ‘‘మహాప్రభూ, ఆ సంగతి నా
కన్నా తమకే బాగా తెలుసు. నేనొక నిరుపేద బ్రాహ్మణ్ణి.
అంత మాత్రమే చెప్పగలను,'' అంటూ విన యంగా తలవంచుకున్న బ్రాహ్మడు ఆ తర
వాత కొంతసేపటికి తలపైకెత్తి, ‘‘మంచి ఎప్పుడూ మంచే. చెడు ఎల్లప్పుడూ
చెడుగానే ఉంటుంది!'' అన్నాడు చేయి పైకెత్తి. రాజు మందహాసం చేసి, ఒక చీటీ
తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మడి కిచ్చి, ‘‘దీనిని తీసుకెళ్ళి కోశాధికారికి
చూపించు,'' అన్నాడు. బ్రాహ్మడు దానిని తీసుకుని కోశాధికారి దగ్గరికి
వెళ్ళాడు. కోశాధికారి బ్రాహ్మడిచ్చిన చీటీ తీసి చదివి అతనికొక వెండికాసు
ఇచ్చాడు.
బ్రాహ్మడు ఆ వెండికాసును తీసుకెళ్ళి భార్య కిచ్చాడు. ఆమె దాంతో
కావలసిన వాటిని కొను క్కుని రావడంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా
కడుపునిండా తిన్నారు. మరునాడు కూడా బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళాడు.
రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు. దానినతడు కోశాధికారికి చూపగానే అతడు మరో
వెండికాసు ఇచ్చాడు. ఇలాగే మూడు నాలుగు రోజులు గడిచాయి.
దానిని చూసిన కాపలాభటుడికి బ్రాహ్మడు ఎందుకిలా రోజు తప్పకుండా
వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. ఐదో రోజు భటుడు బ్రాహ్మడి
వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు. బ్రాహ్మడు నాణెం పుచ్చు కుని నగర
పొలిమేరను దాటి, తన గ్రామం దారి పడుతూండగా, వెనక నుంచి భటుడు అతని భుజం
తట్టాడు. బ్రాహ్మడు వెనక్కు తిరిగి చూడగానే, ‘‘అయ్యూ, తమరు రోజు తప్పకుండా
వస్తు న్నారు. రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకుని వెళ్ళి కోశాధికారి నుంచి
కాసు పుచ్చుకుని వెళుతున్నారు.
మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్న నన్ను అసలు
పట్టించుకోవడం లేదు. నాకివ్వ వలసిన.....'' అంటూ భటుడు మాటను పూర్తిచేయక
ముందే బ్రాహ్మడు వెనక్కు తిరిగి, తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయూడు.
మరునాడు బ్రాహ్మడు యథా ప్రకారం రాజును చూడడానికి వచ్చాడు.
అతడు కోశాధి కారి కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే, ‘‘అయ్యూ, కాస్త
ఆగు!'' అంటూ అక్కడికి వచ్చాడు కాపలాభటుడు. ఆగి ఏమిటి అన్నట్టు చూశాడు
బ్రాహ్మడు. ‘‘నీకో సంగతి చెప్పాలి. రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు,''
అన్నాడు భటుడు.
బ్రాహ్మడు కొంతసేపు మౌనంగా ఊరుకుని ఆ తరవాత, ‘‘రాజుగారికి నా మీద కోపం
కలిగేలా నేనెలాంటి తప్పూ చేయలేదే! నా మీద ఆయనకెందుకు కోపం?'' అన్నాడు.
భటుడు అతన్ని సమీపించి అటూ ఇటూ ఒకసారి చూసి, ‘‘నేను రాత్రి అలసిపోయిన
రాజుగారి పాదాలు ఒత్తుతూండగా, ‘నా దగ్గరికి వచ్చి వెళుతూన్న బ్రాహ్మణ్ణి
చూశావుకదా? అతడు దీవించేప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది!'
అన్నారు.
అయినా, రాజుగారితో నిన్ను దగ్గరికి రానీయొద్దు అని చెప్పడానికి
నేనెంతవాణ్ణి!'' అన్నాడు గుసగుస లాడుతున్నట్టు మెల్లగా. ‘‘అవునవును,
నువ్వెలా చెప్పగలవు. అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇకపై
జాగ్రత్త వహిస్తాను. రేపు రాజుగారిని దీవించడానికి ఆయన్ను సమీపించేప్పుడు
నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను,'' అంటూ బ్రాహ్మడు వెళ్ళి పోయూడు.
మరునాడు బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళి నప్పుడు నోటికీ, ముక్కుకూ అడ్డంగా
కండు వాను చుట్టుకుని వెళ్ళాడు.
అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా ఎప్పటిలాగే చీటీ
ఇచ్చి పంపే శాడు. భటుడు తనను ఆరోజు వెంబడించక పోవడం కూడా బ్రాహ్మడికి
వింతగా కనిపించ లేదు. ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు, ‘‘రోజూ
ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మడు మహా పొగురుబోతు ప్రభూ,'' అన్నాడు
యథాలాపంగా. అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ, ‘‘ఎందుకలా చెబుతున్నావు.
ఎంతో వినయం చూపుతూ, భగవద్భక్తిగల మృదు స్వభావిలా కనిపిస్తాడే. రోజూ
నన్ను దీవిస్తాడు కూడా,'' అన్నాడు. ‘‘అతడు ఈ రోజు నోటికి అడ్డుగా కండు వాను
చుట్టుకు రావడం తమరు చూశారు కదా?'' అని అడిగాడు భటుడు తలెత్తకుండా
రాజుగారి పాదాలు ఒత్తుతూ.
‘‘చూశాను. బహుశా పన్ను నొప్పిలాంటిదేదో ఉంటుంది,'' అన్నాడు రాజు
దాన్నంతగా పట్టించుకోకుండా. ‘‘కాదు ప్రభూ. ఎందుకలా చుట్టకున్నావని
నేనడిగితే అతడేం చెప్పాడో తెలుసా? అతడు దీవించడానికి మిమ్మల్ని
సమీంపిచేప్పుడు, మీ చెవినుంచి వెలువడే దుర్వాసనను భరించలేకే అలా
చుట్టుకున్నానని చెప్పాడు ప్రభూ!'' అన్నాడు భటుడు. రాజు ఆ తరవాత మరేం
మాట్లాడలేదు. గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు.
బ్రాహ్మడు రోజూ తనను దీవిస్తూ చెప్పే, ‘‘మంచి ఎప్పుడూ మంచే. చెడు
ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది,'' అనే మాట ఆయన మనసులో కదలాడ సాగింది. మరునాడు
బ్రాహ్మడు నోటికి అడ్డుగా ఎలాంటి కట్టూ లేకుండా రాజభవనానికి వచ్చాడు. అతడు
అక్కడి నుంచి తిరిగి వెళుతూం డగా, భటుడు అడ్డుపడి, ‘‘నాకు ఇవ్వాల్సిన
ఈనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు,'' అన్నాడు. ‘‘నన్ను క్షమించు, ఆ
సంగతే మరిచిపో యూను!''
అంటూ బ్రాహ్మడు కొంతసేపు ఆగి, ‘‘ఈ రోజు వెండికాసును నేను వదులుకుం
టాను. నువ్వు ఈ చీటీని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నాతరఫున వెండికాసును
పుచ్చుకో,'' అని చీటీని భటుడికిచ్చి బ్రాహ్మడు గబగబా వెళ్ళిపోయూడు. భటుడు
ఉత్సాహంగా వెళ్ళి, చీటీని కోశాధి కారికి చూపాడు. దాన్ని చదివిన కోశాధికారి
భటుణ్ణి కాస్సేపు ఆగమన్నాడు. అంతలో రాజ భవనంలోని ఇద్దరు అంగరక్షకులను వెంట
బెట్టుకుని క్షురకుడొకడు అక్కడికి వచ్చాడు.
వాళ్ళు
భటుణ్ణి పెడరెక్కలు విరిచిపట్టుకోగా, క్షురకుడు వాడి ముక్కూ, చెవులూ
కోసేశాడు. నెత్తురోడుతూ, భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయడానికి
రాజభవనానికి పరిగె త్తాడు. ‘‘బ్రాహ్మడికిచ్చిన చీటీ నీ చేతికెలా
వచ్చింది?'' అని అడిగాడు రాజు కటువుగా. ‘‘ప్రభూ, నేను ఈనాము అడిగాను.
దానికి బదులు అతడు ఆ చీటీ ఇచ్చాడు,'' అన్నాడు భటుడు. ‘‘పేద బ్రాహ్మడితో
నువ్వు లేనిపోని అబ ద్ధాలు చెప్పావు. అందుకు తగిన శిక్ష అనుభ వించక తప్పదు
కదా!'' అన్నాడు రాజు.
No comments:
Post a Comment