శివపురం గ్రామానికి కొంత దూరాన ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవి మొదట్లో
దట్టంగా ఉన్న చెట్ల మధ్య కొన్ని పిశాచాలు చేరి కాలక్షేపం చేస్తుండేవి.
అక్కడికి కొత్తగా వచ్చిన కిచకిచ అనే పిశాచానికి నిద్రపట్టని జబ్బు
దాపురించింది. తోటి పిశాచాలన్నీ రాత్రంతా జాగారం చేసి పగలంతా హాయిగా
నిద్రపోతూంటే, తనకు మాత్రం నిద్రపట్టక పోవడంతో కిచకిచ దిగులుపడి తన సమస్యను
తనకు అప్పుడే పరిచయమైన కింకిణీ పిశాచంతో చెప్పుకున్నది. అప్పుడు కింకిణి,
``బాధ పడకు. నిద్రపట్టడానికి నా దగ్గర చాలా కిటుకులున్నాయి,'' అంటూ ఒక
కిటుకు చెప్పింది.
దాని ప్రకారం కిచకిచ చింతచెట్టుకు తల్ల కిందుగా వేలాడుతూ నిద్రపోయే
ప్రయత్నం చేసింది కానీ, అది ఫలించలేదు. ఆ తరవాత, కింకిణి, ``బాధపడకు.
శివపురంలో రంగాచారి అనే గొప్ప వైద్యుడున్నాడు. మనిషి రూపంలో వెళ్ళి, అతన్ని
కలిసి నీ జబ్బు గురించి చెప్పు. చిటికలో మాయం చేస్తాడు,'' అని సలహా
ఇచ్చింది. కిచకిచ రైతు రూపంలో వైద్యుడి వద్దకు వెళ్ళింది. దాన్ని చూడగానే
వైద్యుడు, ``నీ ముఖంలో జీవకళలేదు.
జబ్బేమిటో చెప్పు,'' అన్నాడు. కిచకిచ నిద్రపట్టని వైనం గురించి
వివరించడంతో, వైద్యుడు మందిచ్చి పంపాడు. ఆ మందు వాడాక కిచకిచకు
నిద్రపట్టకపోగా, విపరీతంగా కళు్ళ తిరగడం మొదలైంది. దాంతో అది కింకిణీ
పిశాచాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంది. అది విన్న కింకిణీ
పిశాచం, ``నీకేదో మాయరోగం దాపురించింది. ఇక కిటుకులు చెప్పడం నావల్ల
కాదు,'' అని ఆవులిస్తూ ఎటో ఎగిరి వెళ్ళిపోయింది.
కిచకిచ ఏం చేయడానికీ తోచక దిగులుగా తను ఉంటూన్న చెట్టువద్దకు
తిరిగి వస్తూ, ఒక చెట్టు బోదెకు ఆనుకుని ఆదమరచి నిద్రపోతూన్న ఒక
మధ్యవయస్కుణ్ణి చూసింది. అసూయతో ఒక ఎండుపుల్లను విరిచి అతని మీదికి
వేసింది. కళు్ళ తెరిచిన ఆ వ్యక్తి ఎదురుగా పిశాచం ఉండడం చూసి ఉలిక్కి పడి,
ఒక్క క్షణం భయపడ్డాడు.
ఆ తరవాత దాని వాలకం చూసి ధైర్యం కూడదీసుకుని, ``పిశాచ మిత్రమా, నాపేరు
కిష్టయ్య. ఊరు శివపురం. నువు్వ మరీ దిగులుగా కనిపిస్తున్నావు. నీకు వచ్చిన
కష్టం ఏమిటో చెప్పు. తీర్చగలిగినదైతే తీరుస్తాను,'' అన్నాడు అతడు.
కిచకిచకు కిష్టయ్య ఆపద్బాంధవుడిలా కనిపించాడు. తనకు నిద్రపట్టని కష్టం
గురించి చెప్పుకున్నది. అంతా శ్రద్ధగా విన్న కిష్టయ్య, ``కొన్నాళ్ళ క్రితం
నాకూ ఇలాంటి కష్టమే వచ్చింది. నివారణోపాయం కోసం ఎక్కడెక్కడో తిరిగాను.
ఎందరెందరో వైద్యుల్ని చూశాను.
వాళు్ళ
చెప్పిన వైద్యాలన్నీ చేశాను. ఇచ్చిన మందులన్నీ వాడాను. కాని ప్రయోజనం లేక
పోయింది. ఆఖరికి ఒక సన్యాసి చెప్పిన ఉపాయం గొప్పగా పనిచేసింది,'' అన్నాడు.
``ఏమిటది?'' అని అడిగింది కిచకిచ ఆత్రుతగా. ``పగలంతా పాటలు పోడుతూ గడిపితే,
రాత్రి పూట బాగా నిద్రపట్టేది. కాకుంటే నాపాట వినలేక గ్రామస్థులు నన్ను
తరిమి కొట్టారు. అది వేరే విషయం. ఈ రాత్రికి నువు్వ నోరు తెరిచి పెద్దగా
ఆనందంగా పాటలు పాడు. రేపు పగలంతా నిద్రపట్టకపోతే నా మీద ఒట్టు. నీ కష్టం
తీరేవరకు నేను ఇక్కడే ఉంటాను,'' అన్నాడు కిష్టయ్య.
``నువు్వ చెప్పినట్టే చేస్తాను. బాగా నిద్రపడితే నీకు విలువైన
కానుకలిస్తాను,'' అన్నది కిచకిచ. సూర్యాస్తమయమై చీకటి పడగానే కిచకిచ
గొంతెత్తి పాడడం ప్రారంభించింది. ఆ పాట కర్ణకఠోరంగా ఉండడంతో కిష్టయ్య
భరించలేక పోయాడు. దాన్నుంచి తప్పించుకునే మార్గం తోచక భయపడి పోయాడు.
అంతలో అతనికి, తన పాట భరించలేక తనను ఊరి నుంచి తరుమగొట్టిన తన
గ్రామస్థులు జ్ఞాపకం రావడంతో, పగసాధించడానికి చక్కని అవకాశంగా భావించి,
``నీ పాట మధురాతి మధురంగా ఉంది. నీ మధురగానాన్ని శివపుర గ్రామస్థులకు
వినిపించు. పాటను చెట్టు చేమలకు వినిపించడంకన్నా, మనుషులకు వినిపిస్తే,
ఫలితం రెట్టింపుగా ఉంటుంది,'' అన్నాడు పిశాచంతో. మరుక్షణమే కిచకిచగాలిలో
తేలుకుంటూ శివపురం చేరి, గొంతు సవరించుకుని పాడడం ప్రారంభించింది.
అకాలంలో
ఉరుము శబ్దం ఏమిటా అని బయటకు వచ్చి చూసిన గ్రామస్థులు, గాలిలో పల్టీలు
కొడుతూ పాడుతూన్న పిశాచాన్ని చూసి, భయ భ్రాంతులై ఇళ్ళల్లోకి దూరి తలుపు
మూసి గడియపెట్టుకున్నారు. ఆ రాత్రంతా కిచకిచ పాటలు పాడుతూ ఊరంతా చక్కర్లు
కొట్టింది. తెలతెలవారుతూండగా అడవికి తిరిగి వచ్చి, ఒక చెట్టు మీదికి చేరి
గాఢ నిద్రలోకి జారుకుంది.
పొద్దు గూకి చీకటి పడుతూండగా, మెలకువ రావడంతో అది చెట్టు దిగి కిష్టయ్య వద్దకు వెళ్ళి, ``చాలా రోజుల తరవాత కంటినిండా నిద్రపట్టింది.
నీరుణం ఉంచుకోను,'' అంటూ మాయమై, మరు క్షణంలో మూటతో ప్రత్యక్షమయింది.
మూట విప్పి చూసి కిష్టయ్య కళు్ళ చెదిరాయి. మూటనిండా బంగారు నగలు, బంగారు
కాసులు! వాటిని తీసుకుని పిశాచానికి కృతజ్ఞతతో దణ్ణంపెట్టి కిష్టయ్య ఇంటికి
బయలుదేరాడు.
పగలంతా బాగా నిద్రపట్టడంతో కిచకిచ ఆ రాత్రంతా ఆనందంగా గడిపింది.
తెల్లవారాక కూడా దానికి నిద్రపట్టింది. మరునాటి రాత్రి దానికి ఎందుకో
పాడాలనిపించలేదు. పిశాచాలతో కలిసి ఉత్సాహంగా తిరిగింది. పగలంతా చెట్టు
కొమ్మపై కునుకుతీసింది. పిశాచం ఇచ్చిన ధనంతో ఇల్లు చేరిన కిష్టయ్యకు ఆ
క్షణం నుంచి నిద్రకరువయింది. మనసులో ఒక విధమైన వ్యాకులం బయలుదేరింది.
దానికి తోడు రెండు రాత్రులు వరసగా కిచకిచ రాకపోవడంతో దాన్ని
వెతుక్కుంటూ, అడవికి వెళ్ళి, చెట్టు కొమ్మపై కునుకుపాట్లు పడుతూన్న దాన్ని
లేపి, ``రెండు రాత్రులు పాడడానికి ఊరువైపు రాలేదేం మిత్రమా?'' అని అడిగాడు.
``రావలసిన అవసరం ఏర్పడలేదు. అయినా, నాకు నిద్రపట్టక పోవడానికి అసలు కారణం
ఇప్పుడు తెలిసిపోయింది. నా చెట్టు తొరల్రో నేను అన్నాళు్ళ కాపలా కాస్తూ
వచ్చిన ధనం-నేను ప్రాణాలతో ఉన్నప్పుడు బంగారు నగలని చెప్పి నకిలీ నగలమ్మి
అమాయక ప్రజలను మోసం చేసి కూడబెట్టిన పాపిష్ఠి సొము్మ. ప్రమాదవశాత్తు అకాల
మరణం పాలై, పిశాచమైనప్పటికీ; ఆ ధనాన్ని వదలకుండా తెచ్చి, తొరల్రో దాచి
కాపలా కాస్తూ వచ్చాను.
ఆ పాపపు సొము్మ నా వద్ద ఉన్నంత వరకు నాకు నిద్రపట్టలేదు. దాన్ని
నీకిచ్చి వదిలించుకున్నాక, హాయిగా నిద్రపడుతున్నది!'' అంటూ పెద్దగా
ఆవులించి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది కిచకిచ. తన ఆశాంతికి కారణం గ్రహించి,
ఇంటికి తిరిగి వచ్చిన కిష్టయ్య, పిశాచం ఇచ్చిన ధనాన్ని దాన ధర్మాలు
చేసేశాడు. ఆ తరవాత తనకున్న కొద్దిపాటి పొలంలో భార్యాపిల్లలతో కలిసి పగలంతా
కాయకష్టం చేస్తూ, రాత్రుల్లో కంటినిండా నిద్రపోతూ శేషజీవితాన్ని ప్రశాంతంగా
గడిపాడు.
No comments:
Post a Comment