Pages

Monday, September 10, 2012

తెలివి వుండాలి!


నందనపురంలో రత్నాకరుడు పెద్ద వర్తకుడు. అతని ఏకపుత్రుడు అజితసేనుడు. ‘‘కాయం గుల'' పట్టణంలో శీలవతి అనే పిల్ల, ధనికుడి కుమార్తె, చక్కనిదనీ, తెలివిగలదనీ, గుణవతి అనీ నలుగురూ చెప్పగా విని, రత్నాకరుడు ఆమెను అజితసేనుడికి పెళ్ళి చేశాడు. ఆమె తెలివితేటలూ, అందమూ చూసి, అజితసేనుడు ఆమెతో అనుకూలంగా కాపరం చేయసాగాడు. రత్నాకరుడు మాత్రం తన కోడలిని కనిపెట్టి ఉన్నాడు.
 
ఒకనాటి అర్ధరాత్రి వేళ శీలవతి ఒక ఖాళీ కుండను తీసుకుని ఇంటినుంచి బయలుదేరి, చాలా సేపటికి ఆ కుండలేకుండా తిరిగి వచ్చింది. అది మామగారు గమనించి, తన కోడలు సాహసి అనీ, అలాటి మనిషి ఉభయ కుటుంబాలకూ అపకీర్తి తేగలదనీ అనుకుని, మనసులో చాలా బాధపడి, మర్నాడు తన కొడుకుతో, ‘‘కొంతకాలం నీ భార్యను పుట్టింట ఉండి రానీ,'' అన్నాడు.
 
ఆమె ఇక్కడ సుఖంగానే ఉంటున్నది కదా అని కొడుకు అంటే, ‘‘కాదు, ఆమె పుట్టింటికి వెళ్ళితేనే మంచిది,'' అని తండ్రి పట్టుబట్టాడు. తన కోడలిని పుట్టింటికి చేర్చే బాధ్యత తానే తీసుకుని రత్నాకరుడు ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి చేత బట్టుకుని నీటిలోకి దిగమని మామగారు కోడలికి చెప్పాడు. కాని ఆమె చెప్పుల కాళ్ళతో వాగు దాటింది.
 
కోడలు తన మాట విననందుకు రత్నాకరుడు బాధపడ్డాడు, కాని పైకి ఏమీ అనలేదు. కొంతదూరం పోయూక ఒక విరగ పండిన చేను కనిపించింది. ‘‘చక్కని పంట! ఖామందు మంచి లాభం పొందుతాడు,'' అన్నాడు మామగారు. ‘‘తినెయ్యకుండా ఉంటేనూ!'' అన్నది కోడలు.

అంత తెలివితక్కువగా మాట్లాడే తన కోడలుకు తెలివిగలదని ఎలా పేరు వచ్చిందో రత్నాకరుడికి తెలియలేదు. తరవాత వాళ్ళు ఒక నగరం కుండా వెళ్ళటం తటస్థించింది. ‘‘ఈ పట్టణం ఎంత బాగున్నది!'' అన్నాడు రత్నాకరుడు. ‘‘శత్రురాజులు దీన్ని ధ్వంసం చెయ్యకుండా ఉంటేను!'' అన్నది శీలవతి. మరి కొంతసేపటికి తోవలో తగిలిన ఒక మర్రిచెట్టు కింద రత్నాకరుడు విశ్రాంతికి కూర్చున్నాడు. శీలవతి చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చున్నది.
 
‘‘పెంకిమనిషి! మూర్ఖురాలు! పెద్ద వాళ్ళంటే లక్ష్యంలేదు. ఈమెను పుట్టింట వదలటం నా కొడుక్కు పీడ విరగడే!'' అనుకున్నాడు రత్నాకరుడు. తరవాత వాళ్ళు బండిలో కొంత దూరం ప్రయూణించి, ఒక గ్రామంలో ఎరిగినవాళ్ళ ఇంట భోజనంచేసి, బయట విశ్రాంతి తీసుకున్నారు. రత్నాకరుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. శీలవతి బండి నీడలో కూర్చున్నది. అప్పుడు చెట్టుమీద కూర్చున్న కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని శీలవతి, ‘‘ఓసీ, కాకీ! ఎందుకలా అరుస్తావు? ఒక పొరపాటుచేసి నేను ఇల్లు వదిలి పెట్టవలసి వచ్చింది.
 
ఇంకో సారి అలాచేస్తే నా భర్త ముఖం మళ్ళీ చూడలేనేమో!'' అన్నది. ఈ మాటలు విని ఆశ్చర్యపడి రత్నాకరుడు చటుక్కున బండి దిగివచ్చి, ‘‘నువ్వు ఇప్పుడన్న మాటకు అర్థమేమిటి?'' అని కోడల్ని అడిగాడు. ‘‘సువాసన ఉన్నందువల్లనే గంధపు చెక్కను అరగదీస్తారు. రంగు ఉండటంవల్లనే జేగురుగడ్డను చితకగొట్టి పొడిచేస్తారు. నా విశేషగుణాలే నాకు శత్రువులైనాయి. నాకు పక్షుల భాషా, జంతువుల భాషా తెలుసును,'' అన్నది శీలవతి. ఆమెకు పిచ్చేమో ననుకున్నాడు రత్నాకరుడు.
 
శీలవతి ఇంకా ఇలా చెప్పుకుపోయింది: ‘‘కొన్నాళ్ళక్రితం అర్ధరాత్రివేళ ఆడనక్క కూసింది. నదిలో ఒక స్ర్తీ శవం కొట్టుకుపోతున్నదనీ, ఆ శవంమీద ఆభరణాలున్నాయనీ నక్క అంటున్నది. అది విని నేను ఖాళీకుండ తీసుకుని నదికివెళ్ళి, శవాన్ని నీటినుండి ఒడ్డుకు లాగి, ఆభరణాలు వలిచి కుండలో వేసి ఆ కుండను గుర్తుగా ఒకచోట పాతిపెట్టి, శవాన్ని నక్కకు వదిలి, ఇంటికి తిరిగి వచ్చాను.

ఈ చిన్న తప్పు చేసినందువల్ల నేను మీ అనుమానానికి గురి అయి ఈ స్థితికి వచ్చాను.'' రత్నాకరుడికి ఇదంతా విని ఆశ్చర్యమూ, కోడలిపైన జాలీ కలిగాయి. శీలవతి ఇంకా ఇలా చెప్పింది: ‘‘అయితే, నా పైన పశు పక్ష్యాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటినుంచి నాతో చెబుతున్నది, ఆ చెట్టుకింద పెద్ద నిధి ఉన్నదని!'' వెంటనే రత్నాకరుడు ఆ చెట్టుకింద తవ్వాడు. ధనరాశి దొరికింది.
 
అతనికి తన కోడలిమీద అపారమైన విశ్వాసమూ, గౌరవమూ కలిగాయి. ఆయన శీలవతితో, ‘‘నేను నిన్ను సరిగా అర్థంచేసుకోలేక పోయినందుకు విచారిస్తున్నాను. మనం ఇంటికి తిరిగి పోదాం,'' అన్నాడు. తిరుగుప్రయూణం ఉత్సాహంగా సాగింది. దారిలో తాము మొదట సేదదీరిన మర్రిచెట్టు కనబడగానే మామగారు కోడల్ని, ‘‘నువ్వు మర్రిచెట్టు కింద ఎందుకు కూర్చోలేదు?'' అని అడిగాడు.
 

‘‘మర్రిచెట్టు తొరల్రలో పాములుంటాయి. చెట్టుమీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి,'' అన్నది కోడలు. రత్నాకరుడు నవ్వి, ‘‘ఔను, నిజమే,'' అన్నాడు. తరవాత కొంత దూరం వెళ్ళేసరికి నగరం వచ్చింది. ‘‘ఈ నగరంలో బాటసారుల సౌకర్యం కోసం ఒక్క సత్రమైనాలేదు. ఇది తేలికగా శత్రురాజుల వశమవుతుంది,'' అన్నది శీలవతి. 

తరవాత కొంత సేపటికి విరగపండిన చేను వచ్చింది. ‘‘యజమాని ఈ పంటను అమ్మి, డబ్బును సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్టు!'' అన్నది శీలవతి. తరవాత వాగు వచ్చింది. ‘‘వాగులో రాళ్ళుంటాయి, జల జంతువులు ఉంటాయి. నేలమీదలాగా అవి కనిపించవు. అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలుండాలి,'' అన్నది. ఆమె తెలివిని మామగారు ప్రశంసించాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి అజితసేనుడు చాలా సంతోషించాడు.
 
తన తండ్రి ఆమెకు ఇంటిపెత్తనం ఇయ్యటం చూసి, ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలయిందని అతను గ్రహించాడు. ఆ సమయంలో ఆ దేశపురాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి, వారితో గోష్ఠి జరుపుతున్నట్టు జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. దానికి అజితసేనుడు తన భార్యతోసహా వెళ్ళి, రాజుగారి ధర్మశాలలో దిగాడు. ‘‘రాజును కాళ్ళతో తన్నినవారికి ఏమి శిక్షవెయ్యూలి?'' అని అకస్మాత్తుగా రాజు మేధావులను అడిగాడు.
 
రాజద్రోహనేరానికి విధించే శిక్షే విధించాలనీ, కొరత వెయ్యూలనీ, శిరశ్ఛేదం చెయ్యూలనీ, ఒకరిని మించి మరొకరు రాజుగారి మెప్పుకోసం పోటీపడి చెబుతున్నారు. అజితసేనుడు చప్పున ధర్మశాలకు పరుగెత్తి, శీలవతికి రాజుగారి ప్రశ్న చెప్పాడు. ‘‘రాజును ఎవరు తన్నుతారు? శృంగార చేష్టగా భార్య తన్నాలి. లేదా పిల్లలు తన్నాలి. అందుకు శిక్ష ఏమిటంటే ఏమీ శిక్ష విధించక, మరింత ప్రేమగా చూడటం!'' అన్నది శీలవతి.
 
అజితసేనుడు తిరిగి వచ్చేసరికి సభికులు ఇంకా శిక్షలు చెబుతూనే ఉన్నారు. అందరూ మౌనంగా ఉన్న క్షణం చూసి అజితసేనుడు, ‘‘మహారాజా, రాజును కాళ్ళతో తన్నినవారిని మరింత ప్రేమగా చూసి ఆదరించాలి,'' అన్నాడు. అజితసేనుడికి మంత్రి పదవి లభించింది. అతడు శీలవతితోసహా దివాణంలో కాపరం పెట్టి, శీలవతి సహాయంతో రాజుకు అద్భుతమైన సలహాలిస్తూ, గొప్పమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు.

No comments:

Post a Comment