Pages

Monday, September 10, 2012

మేఘాలను తాకిన ముక్కు


జపాన్‌ ప్రధాన భూభాగం చుట్టూ వున్న దీవుల్లో ఒకదానిలో ఒక కొలను ఉంది. ఆ కొలనుకు అంటూ ప్రత్యేకత లేదుగాని, అందులోని చేపలకు మాత్రం ప్రత్యేకత ఉంది. అలాంటి చేపలు మరెక్కడా కనిపించవు. వాటి ముక్కులు మరీ పొడవుగా ఉంటాయి. ఆ కొలనులోని చేపలకు మాత్రం ఎందుకలా అసాధారణమైన పొడవాటి ముక్కులు ఉన్నాయి? ఈ విషయూన్ని తెలియజేసే వింత పూర్వగాథ ఇది:
 
ఒకానొకప్పుడు ఆ కొలను పరిసర ప్రాంతాలలో డోలువాయించే వాడొకడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో జరిగే పెళ్ళిళ్ళు, ఇతర వేడుకలకు వాణ్ణి డోలువాయించడానికి పిలిచేవారు. వాడు చాలా పేదవాడు. ఒకసారి సంభవించిన భూకంపానికి వాడి గుడిసె కూలిపోయింది. దానిని బాగు చేసుకునే స్తోమతు కూడా వాడికి లేదు. చేసేదిలేక వాడు కొలను సమీపంలోవున్న ఒక కొండ గుహలో తల దాచుకోసాగాడు. కొంత కాలానికి ముసలితనం పైబడడంతో డోలు వాయించడానికి కూడా శక్తిలేక పోయింది.
ఎవరైనా దయతలచి ఇంత తెచ్చి పెడితే, దాన్ని తింటూ కాలం గడపసాగాడు.
 
ముసలివాడు అవసాన దశలో ఉండగా ఒకనాడు ఆకలితో అలమటించి పోవడం ఒక కురవ్రాడు చూశాడు. ఇంటికి వెళ్ళి ఇంత తిండి తెచ్చిపెట్టాడు. దానిని ఆబగా తిన్న ముసలివాడు, ‘‘నాయనా, నీ ఉపకారబుద్ధి దొడ్డది. దానికేదైనా ప్రత్యుపకారం చేయూలి. ఇదిగో ఈ డోలును తీసుకో. దీనిని నా జీవితకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నాను.
 
దానికి సంతసించి అది ఇటీవల నాకో వరం ఇచ్చింది. ఎవరి ముక్కునైనా చూస్తూ, ‘పైకి, పైకి,' అంటూ డోలును వాయిస్తే ఆ ముక్కు పెద్దదవుతుంది. ‘కిందికి, కిందికి,' అంటూ వాయిస్తే ముక్కు చిన్నదవుతుంది. తమ ముక్కులు తమ ముఖానికి తగ్గట్టు లేకుండా చిన్నవిగానో, పెద్దవిగానో ఉన్నాయని వాపోయే స్ర్తీ పురుషులు చాలా మంది ఉన్నారు.

ఈ డోలును తీసుకుని, సక్రమంగా ఉపయోగించుకో. అయితే, కేవలం ఉత్సుకత కొద్దీ డోలు శక్తిని దుర్వినియోగం చేయకూడదన్న సంగతి మాత్రం మరిచిపోవద్దు. అది ప్రమాదకరం. నా అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరగాలని ఆశిస్తున్నాను,'' అంటూ కన్నుమూశాడు. 

గ్రామస్థుల సాయంతో కుర్రాడు ముసలివాడి అంత్యక్రియలను జరిపించాడు. ఆ తరవాత వింత డోలును ఉపయోగించడం ప్రారంభించాడు. గ్రామంలోని గొప్ప భూస్వామి కుమార్తెకు ముక్కు మరీ చిన్నదిగా ఉండేది. కురవ్రాడు డోలును తీసుకుని ఆమె వద్దకు వెళ్ళి ఆమె ముక్కును చూస్తూ, ‘పైకి, పైకి,' అంటూ ముక్కు ముఖానికి తగినంత ప్రమాణం ఎదిగేంత వరకు వాయించాడు. దాంతో ఆ కురవ్రాడి పేరు చుట్టుపక్కల మారుమ్రోగి పోయింది. తమ ముక్కుల పరిమాణాన్ని పెంచుకోవడానికో, తగ్గించుకోవడానికో ప్రజలు తండోప తండాలుగా రాసాగారు. కురవ్రాడు ప్రసిద్ధుడయ్యూడు. దాంతోపాటు అతడి ఆదాయమూ రోజురోజుకూ పెరగసాగింది.
 
రెండేళ్ళు గడిచేసరికి అతడు ధనవంతుడై పోయూడు. ఒకనాడతడు కొలను సమీపంలో కూర్చుని ఉండగా ఒకవింత ఆలోచన కలిగింది. తన డోలు శక్తి ఏపాటిదో, అది ముక్కును ఎంత పెంచగలదో చూడాలనుకున్నాడు. వెల్లకిలా పడుకుని తన ముక్కు కొసను తదేకంగా చూస్తూ ‘పైకి, పైకి,' అంటూ డోలు వాయించడం ప్రారంభించాడు. అతడి ముక్కు డోలువేగంతో పోటీపడి పెరగసాగింది. సంభ్రమాశ్చర్యాలతో అతడు ‘పైకి, పైకి', అంటూ మరింత వేగంగా డోలు వాయించసాగాడు. చూస్తూండగానే ముక్కు వెదురుగడలా అలా అలా పెరుగుతూ మేఘాలను తాకే ఎత్తుకు చేరింది.
 
ఆ వింత దృశ్యాన్ని రెండు డేగలు చూశాయి. డోలు కురవ్రాడు చూస్తూండగానే అతడి ముక్కును రెండుసార్లు చుట్టి వచ్చాయి. అయితే, ఉన్నట్టుండి ఒక డేగ తన ముక్కుతో, వాడి ముక్కును పొడవడంతో కురవ్రాడు జివ్వుమన్న బాధతో కెవ్వుమన్నాడు. ఆ వెంటనే ‘కిందికి, కిందికి,' అంటూ వీలైనంత వేగంతో డోలు వాయించ సాగాడు. అయినా డేగ తన పట్టును వదలలేదు. పైపెచ్చు పైకి ఎగరడానికి ప్రయత్నించ సాగింది. దాని పర్యవసానంగా డోలుకురవ్రాడు కూడా దాంతో పాటు పైకి లేవసాగాడు. అతడు అలా పైపైకి వెళుతూండగానే ముక్కు పొడవు కూడా తగ్గుతూ వచ్చి, అతడి శరీరం డేగ ముక్కును తాకే స్థితికి వచ్చింది. అతడి శరీరం తగలగానే డేగ బెదిరిపోయి వింతగా అరిచింది. డేగ ముక్కు పట్టు సడలగానే అక్కడి నుంచి జారిన కురవ్రాడు వేగంతోవచ్చి దభీమని కొలనులోకి పడిపోయూడు.
 
అంతేకాదు! మరుక్షణమే అతడు పొడవాటి ముక్కుగల చేపగా మారిపోయూడు! కేవలం ఉత్సుకత కోసం డోలు వాయించడం ప్రమాదకరం అని డోలుముసలివాడు చేసిన హెచ్చరికను పెడచెవిని పెట్టడంవల్లే కురవ్రాడికీ దుర్గతి పట్టింది!

No comments:

Post a Comment