రఘువీరపురాన్ని పరిపాలించే శశికాంతుడు గొప్ప కళాపోషకుడు. ముఖ్యంగా
శిల్పకళలపట్ల ఆయన ఎక్కువ ఆసక్తి కనబరచేవాడు. నయనానందం కలిగించే శిల్పాలతో
ఆలయాలూ, కోటలూ, భవనాలూ నిర్మించడం అంటే ఆయనకు మహా ఇష్టం. ఆయన పాలనలో
ఎప్పుడూ ఏదో ఒకచోట భవనాల నిర్మాణం జరుగుతూనే ఉండేది. శశికాంతుడు కొత్తగా
చేపట్టిన చంద్రభవన నిర్మాణం పూర్తి కావస్తూండగా, భవనం లోపల చెక్క నగిషీలు
చెక్కి, అలంకరించడానికి నిపుణుడైన వడ్రంగి కావలసివచ్చాడు.
రాజు మంత్రి రమానందుడికీ సంగతి చెప్పి మంచి పనితనం గల వడ్రంగిని ఎంపిక
చేసి, ఆ పనిని అతనికి అప్పగించమని ఆదేశించాడు. మంత్రి వాకబు చేయగా రాజధాని
సమీప గ్రామంలోనే చెక్కపనిలో మంచి నిపుణుడైన కుండలుడనే వడ్రంగి ఉన్నాడని
తెలియ వచ్చింది. మంత్రి కుండలుణ్ణి పిలిపించి సంగతి చెప్పాడు. అంతావిన్న
కుండలుడు, ``అయ్యా, తమరు నామీద నమ్మకం ఉంచి నన్ను పిలిపించినందుకు చాలా
కృతజ్ఞుణ్ణి.
చంద్రభవనంలో నగిషీలు చెక్కే అవకాశం రావడం మహా భాగ్యంగా
భావిస్తున్నాను. అయితే, వయసు పైబడడంవల్ల ఇటీవల నాకు చూపు సరిగా ఆనడం లేదు.
కాబట్టి సక్రమంగా పనిచేయలేకపోతున్నాను. మీరిచ్చిన అవకాశాన్ని
ఉపయోగించుకోలేక పోతున్నందుకు క్షమించండి,'' అన్నాడు వినయంగా.
``మరి, ఆ పనిచేయడానికి సమర్థులైన వారు నీ ఎరుకలో ఎవరైనా ఉన్నారా?''
అని అడిగాడు మంత్రి. ``ఉన్నారు, ప్రభూ! ఎవరో ఎందుకు? చారకుడు, సుజాతువు,
ధరణకుడు అనే నా ముగ్గురు కొడుకులూ అందుకు సమర్థులే. ముగ్గురూ మూడు విధాలైన
ప్రత్యేకతలు కలిగినవారు. వారి పనితనాన్ని తమరే స్వయంగా పరీక్షించి ఒకరిని
ఎంపిక చేసుకోవచ్చు. ముగ్గురూ కూడా తమ వృత్తిలో ఒకరినిమించిన వారు మరొకరు.
అయితే, స్పర్థలూ, ఈర్షా్య ద్వేషాలూ లేకుండా కలిసికట్టుగా పనిచేస్తూ,
చేసే వృత్తినే దైవంగా భావించే సాత్విక స్వభావులు,'' అన్నాడు కుండలుడు.
``సరే, ముగ్గురినీ రేపే నా వద్దకు పంపించు,'' అన్నాడు మంత్రి. మరునాడు
వచ్చిన ముగ్గురు అన్నదము్మలకు మంత్రి, విషయం వివరించి ముగ్గురినీ వారు తమ
నైపుణ్యాన్ని చాటే విధంగా తయారు చేసిన వస్తువులను తీసుకురమ్మని చెప్పాడు.
మరో రెండు రోజులలో చారకుడు ఒక కుర్చీనీ, సుజాతువు ఎత్తు పీటనూ,
ధరణకుడు పెట్టెనూ తెచ్చి చూపారు. ముగ్గురు తెచ్చిన మూడు వస్తువులనూ ఒక చోట
ఉంచి పరిశీలించాడు మంత్రి. చారకుడు చేసిన కుర్చీ మంచి పనితనంతో అందంగా
కనిపించింది. తన అభిప్రాయాన్ని రూఢి చేసుకోవడానికి, కొందరు రాజోద్యోగులకు
వాటిని చూపించాడు. వాళ్ళందరూ కూడా చారకుడు చేసిన కుర్చీ మిగతా
రెండింటికన్నా మంచి పనితనంతో ఉందని అభిప్రాయపడ్డారు.
సాయంకాలమే మంత్రి, ఉద్యానవనంలో పచార్లు చేస్తున్న రాజును కలుసుకుని
ముగ్గురు వడ్రంగులు చేసిన వస్తువు లను గురించి చెప్పి, ``తమరు ఒకసారి ఆ
వస్తువులను పరిశీలించి, సమ్మత మను కుంటే, భవనం పనులను చారకుడికి
అప్పగించవచ్చు,'' అన్నాడు. రాజు శశికాంతుడు మరునాడు ముగ్గురు వడ్రంగులు
చేసిన వస్తువులను చూసి, ``ముగ్గురు మూడు రకాల వస్తువులను కాదు. ముగ్గురినీ
ఒకే రకమైన వస్తువుకు నమూనాను తయారుచేయమని చెప్పండి. అప్పుడే చేసిన వారి
ఊహాశక్తి, శక్తి సామర్థా్యల ప్రత్యేకతలు స్పష్టంగా బయటపడతాయి,'' అన్నాడు.
మంత్రి ముగ్గురు అన్నదము్మలను పిలిచి, ఒక తల్పం నమూనా చేయవలసిందిగా
పురమాయించాడు.
మూడు రోజులు ఆలోచించి ముగ్గురు మూడు రకాల నమూనాలు రూపొందించారు.
వాటిలో చారకుడు రూపొందించిన తల్పం, అందంగా ఆకర్షణీయంగా ఉంది. సుజాతువు
చేసిన తల్పం మెచ్చుకునేలా ఉంది. ధరణకుడు తయారు చేసిన తల్పం నమూనాలో పనితనం
లేదుగాని కొత్తగా కనిపించింది. శశికాంతుడు మూడింటినీ కొంతసేపు పరిశీలించి
చూసి, ధరణకుణ్ణి ప్రధాన వడ్రంగిగానూ, చారకుణ్ణి, సుజాతువును అతనికి
సహాయకులుగానూ, నియమించమని మంత్రిని ఆదేశించాడు.
ఆ మాటవిని అక్కడున్న రాజోద్యోగులతో పాటు, మంత్రి రమానందుడు కూడా
ఆశ్చర్యపోయాడు. రాజు మంత్రి కేసి మందహాసం చేస్తూ, ``నా నిర్ణయం మీకు
విస్మయం కలిగించవచ్చు. అయినా, అది సరైనదే. చారకుడు, సుజాతువు అద్భుతమైన
పనితనం కలవారే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ధరణకుడు చేసిన తల్పం నమూనాలో
పనితనం లేదు. కానీ కొత్తదనం ఉంది. చూడడానికి తక్కిన రెండింటికన్నా
వినూత్నంగానూ, విలక్షణంగానూ ఉన్నది. అవునా?'' అని అడిగాడు.
అవును అన్నట్టు తల ఊపాడు మంత్రి. ``అంతే కాదు; అది పవళించడానికి
ఉద్దేశించిన తల్పమే అయినప్పటికీ, దానిలో కొద్దిపాటి మార్పులు చేస్తే
సౌకర్యంగా కూర్చోవడానికి వీలుగా తయారవుతుంది. అలాంటి సదుపాయం మిగిలిన
వాటిలో కనిపించదు. ధరణకుడిలో సునిశితమైన పనితనం అంతగా లేకపోయినప్పటికీ,
వారిద్దరిలో లేని సృజనాత్మకత, ప్రత్యేకత ఉన్నాయి.
అతడు నమూనాలు తయారుచేసి ఇచ్చినట్టయితే, మిగిలిన ఇద్దరూ తమ సునిశితమైన
పనితనంతో వాటికి మెరు గులుదిద్ది అద్భుతాలు సృష్టించగలరు. ఆ ముగ్గురి
నైపుణ్యంతో చంద్రభవనం అత్యద్భుత కళానిలయంగా శోభిల్లగలదు,'' అన్నాడు రాజు.
ఆయన మాటల్లోని సత్యం గ్రహించి మంత్రితో పాటు రాజోద్యోగులు కూడా పరమానందం
చెందారు.
No comments:
Post a Comment