కమలాపురం, రామస్వామి, రంగస్వామి, బంగారు, వ్యాపారం, నగలు, విందులు,
దుకాణం, జమీందారు, వ్యాపారి, జీతాలు, పనివాళ్లు, అమ్మకం, అవమానం కమలాపురం
అనే ఒక చిన్న పట్టణంలో, రామస్వామి అనే పేరు మోసిన బంగారు నగల వ్యాపారి
మరణించటంతో, అతని కొడుకు రంగస్వామి వ్యాపారానికీ, ఆస్తికీ యజమాని అయ్యాడు.
అతడు వ్యాపార వ్యవహారాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఎప్పుడూ విందువినోదాలతో
కాలం గడిపేవాడు. వ్యాపారంలో ఆదాయం, వ్యయంలాంటి ముఖ్య విషయాలు కూడా
పట్టించుకునేవాడు కాదు.
ఒకనాడు రంగస్వామి తన మామిడి తోటలో తిరుగుతూండగా, నగల వ్యాపార
కార్యకలాపాలు చూసే శివావధాని అతణ్ణి సమీపించి, ‘‘అయ్యా! ఎక్కడి నుంచో
వచ్చిన ఒక ప్రముఖ వ్యాపారస్తుడు, ఇక్కడ బంగారు నగల దుకాణం
ప్రారంభించనున్నట్లు సమాచారం అందింది. అతడి పోటీ మన వ్యాపారాన్ని దెబ్బ
తీయకుండా వుండేందుకు ఏం చేయాలో ఆలోచించాలి,'' అని చెప్పాడు.
అందుకు రంగస్వామి హేళనగా నవ్వి, ‘‘మన దగ్గర చేయితిరిగిన
పనివాళ్ళున్నారు. మనం తయారు చేసే నగలు కొనుగోలు చేసేందుకు చుట్టుపక్కల
గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తూంటారు. కాబట్టి, ఈ కొత్త వ్యాపారి గురించి
మనం భయపడవలసిందేమీ లేదు,'' అన్నాడు.
నెల తిరక్కుండానే కొత్త వ్యాపారి పట్టణంలో దుకాణం తెరిచాడు. తర్వాత
నాలుగైదు నెలల్లో బాగా పుంజుకుని నాణ్యమైన నగల దుకాణంగా పేరు సంపాయించాడు. ఈ
కారణం వల్ల రంగస్వామి దుకాణంలో నగల అమ్మకం బాగా తగ్గిపోయింది. మరికొంత
కాలం గడిచే సరికి, రంగస్వామి పనివాళ్ళకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి
వచ్చాడు.
పుట్టిపెరిగిన చోట ప్రముఖ వ్యాపారిగా పదిమంది చేతా గౌరవింపబడే తను, ఇక
అక్కడ వుంటే అవమానాలపాలు కావలసి వస్తుందని ఆలోచించిన రంగస్వామి ఒకనాటి
రాత్రి, ఇంటినీ భార్యాబిడ్డలనూ వదిలి బయల్దేరాడు.
అతడు చీకట్లో తను ఎటుకేసి పోతున్నాడో ఆలోచించకుండా, సూర్యోదయం అయి,
ఎండ తీవ్రమయ్యే వరకూ నడిచి, దారి పక్కనవున్న చెట్టుబోదెకు ఆనుకుని కూర్చుని
కళ్ళు మూసుకున్నాడు.
ఆ సమయంలో తన జమీ పొలాలను పర్యవేక్షించడానికి వెళ్ళి, గురప్రు బగ్గీలో
తిరిగి వస్తున్న పక్క ఊరి జమీందారు రంగస్వామిని ఒకసారి పరీక్షగా చూసి,
‘‘కట్టిన బట్టలవీ చూస్తూంటే, ఇతనెవరో కాస్త సంపన్న కుటుంబీకుడులా వున్నాడు.
దారిలో హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడేమో! దివాణం వసతి గృహంలో చేర్చి
సంగతి కనుక్కోండి,'' అంటూ వెంటవున్న నౌకర్లకు చెప్పాడు.
నౌకర్లు వెళ్ళి రంగస్వామిని ప్రశ్నించారు. కాని, అతడు బాగా శోషలో
వుండడంతో, స్పష్టంగా మాట్లాడలేక పోయాడు. ఇది పనిగాదని వాళ్ళు రంగస్వామిని,
తమ వెంట వున్న ఒక ఎద్దుబండిలో ఎక్కించి తీసుకుపోయి, దివాణం వసతి గృహంలో
దించి, ఆకలి మీద వున్నాడని గ్రహించి భోజనం పెట్టించారు. ఐతే, అతను ఆ తరవాత
కూడా నౌకర్లు ఎంతగా ప్రశ్నించినా తానెవరైంది మాత్రం చెప్పలేదు. మౌనంగా
ఉండిపోయాడు.
ఎవరూ ఊహించని విధంగా, ఆ రోజు రాత్రి దొంగల ముఠా ఒకటి జమీందారు భవనంలో
చొరబడేందుకు ప్రయత్నించింది. కాపలా వాళ్ళ కేకలూ, అరుపులూ విన్న జమీందారూ,
కొందరు నౌకర్లూ చప్పున నిద్రలేచారు.
జమీందారు ఆయుధాలుండే గదినుంచి కత్తులూ, కఠార్లూ తీయించి, నౌకర్లను
హెచ్చరిస్తూ తను ముందుండి దొంగల ముఠాను ఎదిరించాడు. పావుగంట కాలంగడిచీ
గడవకముందే దొంగల్లో కొందరు గాయపడ్డారు. రానున్న ప్రమాదాన్ని గుర్తించి తమ
నాయకుడు వెనుదిరగగానే, మిగిలిన దొంగలందరూ అతడి వెంట అక్కడి నుంచి
పారిపోయారు.
ఈ జరిగినదంతా వసతి గృహం ముందు నిలబడి చూసిన రంగస్వామికి చాలా ఆశ్చర్యం
కలిగించింది. అతడు మర్నాటి ఉదయం జమీందారు దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి
నమస్కరించి, ‘‘అయ్యా! తమ భవన రక్షణకు ఎంతోమంది నౌకర్లు వుండగా, తమరు
స్వయంగా దొంగల నెదిరించి పోరాడడం, తమ హోదాకు తగినది కాదనిపించింది. ఇందులో
తమకేదైనా ప్రమాదం జరిగే అవకాశం వున్నదికదా?'' అన్నాడు.
ఆ ప్రశ్నకు జమీందారు చిన్నగా నవ్వి, ‘‘రక్షణకు నౌకర్లున్నారని
దొంగలనుంచి నన్ను దాక్కోమంటావా? అది పొరబాటు. మన పని వాళ్ళతో పాటు మనం కూడా
ఎంతో కొంత పనిచేయాలి. తర్వాత, వాళ్ళ నుంచి మనం పొందిన ప్రయోజనంలో, కొంత
భాగం వాళ్ళకు అందేలా చూడాలి. ఇది వ్యాపారస్తుడైనా, జమీందారైనా పాటించవలసిన
సూత్రం, నైతిక బాధ్యత!'' అన్నాడు.
ఆ జవాబుతో రంగస్వామికి నగల వ్యాపారంలో యజమానిగా తను చేసిన పొరబాటు
అర్థమయింది. అతడు జమీందారుకు తను ఎవరైనదీ చెప్పి, ‘‘అయ్యా! మీవల్ల ఒక జీవిత
రహస్యం, వ్యాపార సూత్రం తెలుసుకున్నాను. ఇక సెలవు ఇప్పించండి!'' అన్నాడు
వినయంగా.
ఆ మాటలకు జమీందారు చాలా సంతోషించి, రంగస్వామికి కొంత డబ్బూ, బంగారం ఇప్పించి, రక్షణకు ఇద్దరు నౌకర్లను నియమించి గౌరవంగా సాగనంపాడు.
కమలాపురం చేరిన రంగస్వామి, జమీందారు ఇచ్చిన డబ్బుతో మళ్ళీ నగల
వ్యాపారం ప్రారంభించి, స్వయంగా వ్యాపార విషయాలను చూసుకుంటూ, అచిరకాలంలోనే
తండ్రిలాగా సమర్థుడైన వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు.
No comments:
Post a Comment